Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషిని మూఢత్వంలోంచి శాస్త్రీయతలోకి నడిపించే ఓ ఆధునిక వైజ్ఞానిక స్పృహ డాక్టర్ దేవరాజు మహారాజు. మనిషికి చైతన్యాన్నివ్వడం ఒక బాధ్యతగా స్వీకరించిన మానవవాదిగా, కవిగా, రచయితగా, అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, వక్తగా తెలుగు సమాజాన్ని మూడు దశాబ్దాలకు పైగా ప్రభావితం చేస్తున్న ప్రతిభాశాలి అతడు. గతాన్ని వర్తమానంతో అనుసంధానిస్తూ యువతరంలో కొత్త ఆలోచనలు రేకెత్తించే కలం యోధుడ తడు. శాస్త్రవేత్తగానే కాక.. సమకాలీన సాహిత్యరంగంలో తనదైన ముద్రవేసుకున్న సాహితీవేత్తగా ఆయన తెలుగునాట సుప్రసిద్ధులు. ఆయన రచించిన ''నేను అంటే ఎవరు?'' అనే వైజ్ఞానిక వివరణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం తెలుగువారందరికీ గర్వకారణం.
ఎవరికి వారు తమను తాము తెలుసుకోగలిగే చూపునిచ్చే రచన ఇది. ఆధ్యాత్మికత, దేవుడు, దయ్యం అనే కాల్పనికమైన అశాస్త్రీయ భావజాలం నుంచి శాస్త్రీయమైన వాస్తవిక ధృక్పథాన్నిచ్చి మనిషిని పురోగమనానికి నడిపించే సాధనమీ పుస్తకం. పిల్లలకోసం అత్యంత సరళంగా రాసిన ఈ పుస్తకం అనేక వైజ్ఞానిక అంశాల మేళవింపు. నిజానికి యాభైయేండ్ల ఆయన సారస్వత కృషిలో వెలువడిన రచనలన్నీ దేనికదే ప్రామాణికమైనవీ, ప్రగతిశీలమైనవీ. తెలుగులో రచనలు చేయడమే కాదు, మొత్తం భారతీయ భాషల్లో, ప్రపంచ భాషల్లో వెలువడుతున్న విలువైన రచనలనేకం తెలుగులోకి అనువదిస్తూ.. తెలుగు కళ్లకు ఇరుగు పొరుగు దృశ్యాల్ని చూపే ఒక కొత్త కిటికీ ఆయన.
కథ, కవిత్వం, నవల, నాటకం, సినిమా, రేడియో ఇలా ఒకటేమిటి అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ పదునైన సృజన సాగించడం ఒక విశేషమైతే, ఆయన ప్రతి సృజనా సామాజిక బాధ్యతతో కూడినది కావడం మరో విశేషం. సమాజంమీద, సమాజంలోని ఆధిప త్యాలమీద, నిరంకుశత్వ ధోరణులమీద, మూఢ విశ్వాసాలమీద కలాన్ని ఝళిపించే పదునైన కాంక్ష తనది. సునిశితమైన చూపు తనది. అందుకే అనేక సందర్భాల్నీ, సంఘర్షణల్నీ దశ్యమానం చేయడంలో ఆ నిపుణతను అద్భుతంగా ప్రదర్శిస్తాడు. పరిణితి కలిగిన తాత్విక గాఢతతో రంజింప చేస్తాడు. వస్తువులోనూ శిల్పంలోనూ ఆయన చూపిన వైవిధ్యం అద్భుతంగా ఉంటుంది. వస్తువు ఎంపిక పరిధి సంకుచితమైతే ఆ రచన అందించాల్సిన సందేశం పలుచబడిపోతుంది. చాలాసార్లు వస్తువు సామాజికమైనదైనపుడు, విలువల ఆధారితమైనదైనపుడు సహజంగా ఆ వస్తువు పాఠకున్ని ఆకర్షిస్తుంది. ఆలోచనలు రేకెత్తిస్తుంది. గమ్యం వైపుకు ఆలోచింపజేస్తుంది.
ఆయన రచనలన్నిటినీ ఇక్కడ సమగ్రంగా విశ్లేషించడం ఈ శీర్షికకున్న పరిమితుల రిత్యా సాధ్యం కాదు గానీ, శాస్త్ర విజ్ఞానాన్ని సామాన్యుల చెంతకు చేర్చడంలో ఆయన విలువైన కృషి చేసారు. దేవరాజు సారస్వత కృషిపై వెలువడిన స్వర్ణోత్సవ సంచిక 'ఆవరణం' ఆ కృషి ఎంత విస్తృతమైనదో మనకు తెలియజేస్తుంది. అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పరిశోధనా పత్రాలు సమర్పించి ప్రచురించారు. ప్రక్రియ ఏదైనా, వస్తువు ఏమైనా అంతిమంగా ఆయన ప్రతి సృజనా వైజ్ఞానిక వికాసానికే దారులు తెరుస్తుంది. వెలుగును చూడాలంటే చీకటితో యుద్ధం చేయాల్సిందేనని చెపుతుంది. ఒకవైపు వృత్తిరిత్యా జీవం గురించిన పరిశోధన! మరోవైపు ప్రవృత్తిరిత్యా జీవితం గురించిన శోధన!! ఒక తాత్విక భూమికను రూపొందించుకుని ఈ రెండింటి మధ్య వారధిలా నిలిచాడాయన! నిత్య పరిశోధనా యాత్రికుడిగా, బాధ్యత కలిగిన కవిగా, రచయితగా దేవరాజు మహారాజు బహుముఖ ప్రజ్ఞాశాలి.
అందుకే శాస్త్రీయమైన అవగాహనలోంచి పురుడు పోసుకున్న ఆయన రచనలు చదువుతుంటే మానవీయ సమాజం కోసం పరితపించే హృదయ స్పందనలు వినిపిస్తాయి. ఆ అక్షరాలను వెంబడించే కొద్దీ ఆలోచనకూ ఆచరణకూ ఏమాత్రం తేడాలేని జీవితాను భవాలు కనిపిస్తాయి. అవి మన జ్ఞానానికి ఉన్న లోటు పాటులన్నీ పూడ్చేస్తాయి. నిద్రనుండి మెలకువలోకి, తెలి యనితనం నుండి ఏదో తెలు స్తున్న తనంలోకి పరిగెత్తుతోన్న గొప్ప అనుభూతిది కలుగు తుంది. ఆయన రాతలన్నీ నిర్భయంగా మనిషికి మేలు చేయని దేనినైనా ప్రశ్నించమని ప్రబోధిస్తాయి. మనుష్యులను ప్రేమగా గుండెలకు హత్తుకోమని ప్రేరేపిస్తాయి. రాతలెప్పుడూ రాబోయే తరాలకు మార్గదర్శకం కావాలంటాడు దేవరాజు. అవి తరానికీ తరానికీ మధ్య వారధిగా నిలవాలంటాడు. అలా ఆయన భావితరాల కోసం రాసిన 'నేను అంటే ఎవరు' నాటకాన్ని.. ఇప్పుడు కేంద్ర బాలసాహిత్య పురస్కారం వరించడం తెలుగువారందరికీ సంతోషించదగ్గ సందర్భం.
- రాంపల్లి రమేష్,
9550628593