Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవాళి ప్రయోజనాల కోసం ప్రకృతిని చైతన్యవంతంగా రూపాంతరింపజేస్తుంటాడు మనిషి. ఆవరణ వ్యవస్థలతో మానవ వ్యవస్థలు తలపడే చోటులోనే అటు ఆవరణ వ్యవస్థకు ఇటు మానవ వ్యవస్థకు చేకూరే చేటు దాగి ఉంటుంది. మానవకార్యకలాపం పేరు ఉత్పత్తి, ఉత్పాదన. ఈ ఉత్పాదనకు ఎంతో కొంత పెట్టుబడి అవసరం. అది ఎంతనేది పెట్టుబడి ఆశించే లాభాన్ని బట్టి ఉంటుంది. గోరటి వెంకన్న కవిత్వమంతా ఆవరించి ఉన్న చైతన్యం ఇదే. పర్యావరణానికి మనిషి తలపెడుతున్న పెను ప్రమాదాలను గురించి గొంతెత్తి పాడాడు. బహుశా గాట్ ఒప్పందాల కాలంలోంచే వెంకన్న ఉద్భవించాడు. పెట్టుబడిని ప్రకృతికి ప్రప్రథమ శత్రువుగా భావిస్తాడు వెంకన్న. ఇది అతని అవగాహన అభివృద్ధికి వ్యతిరేకి కాడు. లక్ష్యరహితమైన అభివృద్ధిని ఆధునికతను నిరంతరం పరిశీలనాత్మకంగా చూస్తూనే వ్యాఖ్యానిస్తుంటాడు. 'పల్లె కన్నీరు పెడుతుందో' అని పాటనా 'వాగు ఎండి పోయెరో' అని ఎలుగెత్తినా, భూతాపాలు గురించి మాట్లాడినా, విశ్వరమణీయాల వింత జలచక్రం గురించి గేయం కట్టినా వెంకన్న రెండు విషయాల గురించి మరింత స్పష్టమైన దృక్పథంలోకి పరిణమించాడని ఈ నాలుగు దశాబ్దాల అతని వాగ్గేయం సాక్ష్యమిస్తుంది.
పర్యావరణ తత్వంలో రెండు భావధారలున్నాయి. ఒకటి ప్రాణికేంద్రకంగా విషయాలను చూడటం, రెండోది ధరణి / ప్రకృతి / పర్యావరణ కేంద్రకంగా ఆలోచించటం, అర్థం చేసుకోవటం. వీటినే బయోసెంట్రిక్, ఇకో- సెంట్రిక్ పద్ధతులు అని చెప్పుకుంటాం. మనిషి ప్రయోజనాల కోసం కాకపోతే ఈ సమస్త ప్రకృతి ఎందుకు? ఎవరికోసం ఉన్నట్టు అనే ప్రశ్నతో మొదలై మానవ కేంద్రకంగానే ప్రతిదానినీ చూడటం, ఆలోచించటం జరుగుతుంది. ప్రకృతిపట్ల గౌరవం, విధేయత లాంటివి ఈ వైఖరిలో పెద్దగా ప్రాధాన్యం లేని విషయాలు. వాగు ఎండిపోయిందని వెంకన్న చేసిన ఆర్తనాదంలో ఆ వాగు మీద ఆధార పడిన సమస్త ఆవరణ వ్యవస్థ అంతర్థానమైపోయిందన్న పరివేదన ఉన్నప్పటికీ మనిషి కేంద్రకంగానే ఆలోచన చట్టం ఉండటం వల్ల ఆ పరిధి దాటి రాలేకపోయాం మనం. కాని 'వల్లంకి తాళం' సంపుటి నాటికి వెంకన్న పర్యావరణ తాత్విక రచనా ధారలో ఎంతో మార్పు కనిపిస్తుంది. శుద్ధ ప్రకృతి వాదం, పర్యావరణ తత్వమంటూ ఏమీ లేదు కాని అట్లా అన్వయం పొందింది. కానీ వెంకన్న తత్వంలో తర్వాత తర్వాత వచ్చిన ప్రధాన మార్పు ఏమంటే ప్రకృతిక ప్రయోజనాత్మక విలువకంటే, ప్రకృతికి దానికదిగానే ఒకా నొక అంతర్నిహిత విలువ (Intrinsic Value) ఉందని గుర్తించటం, మనందరికీ ఈ విలువను గురించి చైతన్య, అవగాహనలను ఇవ్వటం ప్రధానమై పోయింది. అందువల్లనే 'వల్లంకి తాళం' లోని గేయాలు గుణాత్మకమైన మార్పును ప్రదర్శిస్తాయి. సామాజిక భావ తీవ్రుతను దాటిన సాంద్రత ఒకటి ఈ గేయాలలో కనిపిస్తుంది.
'ఆదివాసుల మట్టి అడవి సిరుల ఉట్టి' అనడంలో ఆ సిరుల ఉట్టి మీద హక్కులు 'పెట్టుబడికి' కాకుండా ఆదివాసులకు చెందినవనే ఆకాంక్ష ఉంది. ఆ హక్కులు కూడా చాలా సహజంగా సంక్రమించిననే తప్ప ఆధిపత్య హక్కులు కావు. ఇందులోనే అంటాడు 'చెంచులా నవ్వులే చెట్లకు పువ్వులు' అని ఆ అడవి మీద హక్కులు ఆదివాసులతో పాటు ఇంకెవరికి ఉందో సూచిస్తాడు.
''ఇరికి పరికి కలమి జిట్టీత నక్కేరి
బలుసు తునికి మేడి ఉసిరి సిమిటె జీడి
నగరునలుపు తీపి ఫలము లెన్నోమేసి
మెరుపుల మేనితో మెసలె జీవరాశి'' అంటాడు. ప్రకృతిలో అంతర్భాగంగా జీవించాల్సిన మనిషి అధిపతి కావటమనే భావనను గోరటి అంగీకరించడు.
కష్ణశాస్త్రి ''తలిరాకు జొంపముల / సందుల / త్రోవలి నేలవ్రాలు తుహన కిరణ కోమల రేఖలను''. గోరటి చూపించాడు. ''కొబ్బరాకులల్లో వెన్నెల / సిబ్బి గంజోలె రాలించి వెన్నెల''ను కురిపించాడు. వెన్నెల మనమందరమూ ఆస్వాదిస్తాం. ఆనందిస్తాం. గోరటి హృద్యతమే ముచ్చట పడతాం. కానీ, వెన్నెల ఏయే ప్రాణికి ఏమిటో ఇలా చెప్పుతాడు.
''అంజనపు పిట్టకు పంజరము వెన్నెల
పంది కొక్కుకాళ్ళ పగ్గము వెన్నెల
మాటేసి మెకములకు పీటముడి వెన్నెల
కాటేసే విషకొండ కంట నలుసెన్నెల
శిగమూగె సీకటిని వెన్నెల
తరమె పొగలేని సాంబ్రాణ వెన్నెల''
మానవ పరంగా నిర్వచించబడిన ప్రతిదీ పర్యావరణ దృక్పథంలో ప్రాసంగికత లేనిదవుతుంది.
'అవనిపై మాన్యుల అంశల వెన్నెల' అన్న వెంకన్న అపూర్వ కవితా తత్వాన్ని ఆధునిక తెలుగు కవిత్వానికి అందించాడు. ఆ పర్యావరణ వేత్తకు అకాడమి అవార్డు ప్రకృతి ఇచ్చిన కానుక, ప్రకృతి హితంగా మితంగా ఉండమని గోరటి ఉద్బోధ.
- సీతారాం, 9866563519