Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశమంతా ఒకే మార్కెట్ కాబట్టి రైతు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పుతున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుకు గిట్టుబాటు ధర అందకుండ చేయవచ్చు. ప్రభుత్వం కొనుగోలుదారుగా, కనీస మద్దతు ధర ఇచ్చి కొనే పద్ధతి ఉండదు. కార్పొరేట్లు ఆహార ధాన్యాలను అక్రమంగా నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు వ్యవసాయ ఉత్పత్తులను అమ్మే వీలు ఉంది. సామాన్యులకు ఆహార ధాన్యాల లభ్యత ఒక ఎండమావిగా మారుతుంది. రైతు చట్టాలకు నిరసనగా ''ఆకలి ఆలాపనలు'' కవితలో ''పంటల రసం పీల్చే పురుగుల్లా, రైతుల రక్తం తాగే జలగలొస్తాయన్న దిగులు'' తోని రైతులు సంవత్సర కాలంగా ఉద్యమం చేసి ఆ చట్టాలను రద్దు చేయించినారు.
''చుట్టూ చీకటి కొండలు
పల్లేర్లు పరుచుకున్న దారులు అడుగుతీసి అడుగు వేస్తే పాదాలకు చుట్టుకొనే పగల పాములు దూరమెంతో... చేరే తీరమెక్కడో
అంతుచిక్కని అనంత పయనం''
ఇది గాజోజు నాగభూషణం జీవితానుభవం నుంచి పలికిన కవితా పాదాలు. ప్రతి కవి తన జీవితం నుంచి తను జీవించిన పరిసరాల నుంచి గ్రహించిన సంఘటనలను కళాత్మకంగా, తన దృక్పథాన్ని జోడించి వ్యక్తీకరించేదే కవిత్వం.
ఊరు జగిత్యాల. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి ఇల్లాలు. టి.బి. ఊపిరితిత్తులను తింటే చనిపోయిన తండ్రి బ్రహ్మయ్య. తుఫాను వానకు గూడు చెదిరిన గువ్వలైన ఇల్లు. కడుపున కాసిన ''నాలుగు పసికెరటాల''ను భర్త చనిపోయిన తర్వాత గట్టుకు చేర్చే దీక్షలో నిమగమయింది తల్లి... ఆమె మీదరాసిన స్మృతిగీతం ''ప్రాణ దీపం'' ఈ కవితా సంపుటి శీర్షిక.
ఒక ఉద్యోగి సర్వీసులో ఉండగానే తనువు చాలిస్తే కారుణ్య నియామకం ఉంటుందని, ఇంటిలో ఒకరికి ఉద్యోగం వస్తుందని తెలియని ఎడ్జిమాలోకం. తెలిసినా చెప్పని చుట్టుపక్కల శూలాలు. పిల్లల ఆకలిని తీర్చడానికి తవిటి రొట్టెలు, ఆనిగెపు కాయలు ఆసర అయినయి. అంత దుర్భరమైన జీవితం అది.
ఆ కష్టాల కడలిని ఈదడానికి కాసె పోసిన తల్లి కొంగు పట్టుకొని, తల్లి వెంట పిల్లలాగ బయలుదేరిన పిలగాడు నాగభూషణం. ఈ కష్టాలను భరించడం చాతగాని అసహనం. కొందరు స్నేహితులు ఆసరాగా నిలిచిన ఓదార్పు. కొట్లాటలు, అల్లరి చేష్టలు, విపరీతమైన తెగువ, చొరవ. వీటన్నిటిని మించి ఏమి జరిగినా లెక్కచేయని తనం.
సహజంగా పాటగాడు కావడం వలన అక్కడి స్నేహితులను గానమాధుర్యంలో ఓలలా డించే వాడు. ఆ పాటల పాన్పుల మీద వాలి సోయిలేకుండ నిద్రపోయేవారు సహచరులు.
''బతుకుతో పోరాటం అమ్మ నేర్పితే.. పోరాటాలను బ్రతుకులో భాగం చేసింది కవిత్వం'' అంటాడు కవి. జీవిత సంఘర్షణ నుంచి సామాజిక సంఘర్షణ వరకు అన్నీ అనుభవించి, ఆ సంఘర్షణల నుంచి మాన వాళికి మంచి భవిష్యత్తు కోసం కలలు కంటున్న కవి, తన కాలంలోని సంక్షోభాలను, సంఘర్షణలను విడిచి పెట్టకుండా రికార్డు చేసినాడు.
ఈ మధ్య కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా. ఇది కంటికి కనిపించని సూక్ష్మజీవి. మానవ నాగరికతలో యుద్ధాల కంటే ఎక్కువ ప్రాణనష్టం జరిగింది పాండమితోనే. మనిషి ప్రకృతిని విచక్షణారహితంగా కొల్లగొట్టడం వలన, అనేక రూపాల్లోని వనరులను విధ్వంసం చేయడం వలన, కాలుష్యం వలన కరోనా వచ్చిందని కొందరు శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు.
''అహంకారమో, అలసత్వమో / అవనిని చెరపట్టిన ఆధిపత్యమో/ అంతా నేనేనని, ఆకాశమెత్తు పెంచుకున్న
శిరస్సుపై శైథిల్య క్రీడతో / పురా జ్ఞాపక పొరల్లోకి నన్ను తొక్కేస్తున్నావు'' అంటాడు కవి ''కరోనా.. హమే చోడకర్ జావోనా'' కవితలో. కరోనా మానవాళి మీద దాడి చేసి ఒక్కొక్కరిని కబలిస్తుంటే దాన్ని ఎదుర్కొనే ఏర్పాట్లు ముఖ్యంగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, పి.పి.ఇ. కిట్లు, మందులు వగైరాల ఏర్పాట్లు చూడలేదు. ఏలినవారు. నమస్తే ట్రంపు కార్యక్రమాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాదులో ఏర్పాటు చేసినారు. మధ్యప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుసటి రోజే దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించినారు. దేశంలోని 14 కోట్ల వలస కార్మికులు, 5 లక్షల మంది భిక్షగాళ్లు, 14 లక్షల మంది ఇండ్లు లేనివారు, 47 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. వీండ్ల గురించి పట్టించుకోలేదు.
ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పనులు, రవాణా సౌకర్యాలు. ప్రాణం ఉంటదో, పోతదో తెలియని స్థితి. అటువంటి విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులు తమ ఊర్లో, తమ వారి దగ్గర ఉండాలని కోరుకుంటారు. అందుకే లక్షలాది మంది వలస కార్మికులు రోడ్లమీద పడి వాళ్ల స్వంత ఊర్లకు కాలినడకన బయలుదేరినారు. ఆ ప్రయాణంలో పిట్టలు రాలినట్టు రాలిపోతున్న వలస కార్మికుల గోసను చూసి ''వాళ్ళు ఇల్లు చేరాలి'' కవిత రాసిండు కవి.
''ఆదిమానవుని ఆకలివేటకాదీ నడక / ఆధునిక అంతరాల కంచెలపై/ పావురాల నెత్తుటి పాదముద్రల పాట''
రాత్రికి రాత్రి మనుషులను దిక్కులేని వాళ్ళను చేసి రోడ్డుమీద వేసిన వైనం. తన చివరి ఊపిరి తనవాళ్ళ మధ్యన, తను పుట్టి పెరిగిన నేలమీద విడిచి పెట్టాలనే మానవాళి కాంక్షనే వలస కార్మికులను ఇంటిదారి పట్టించినది.
కరోనా రోగుల దగ్గర దాదాపు 20 లక్షల దాక వసూలు చేసిన ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ఏ ప్రైవేటు ఆసుపత్రి మీద నియంత్రణ లేదు. దోచుకున్నోడికి దోచుకున్నంత మహాదేవ.
ఇలాంటి వైద్యశాలలు కొన్నైతే, వృత్తి నిబద్దత, నైతిక విలువల వెలుగులో పనిచేసే వైద్యులు కొందరు. వీరి సంఖ్య తక్కువనే కావచ్చు కాని వీరు కారుచీకటి అలుముకున్న నిషిరాత్రిలో దారిదీపం లాంటివారు. వారే రాత్రి ''సూర్యులు - పగటి చంద్రులు''
''నిద్రల్ని ఇంటి గుమ్మాలకు వేలాడదీసి / సంతోషాల్ని కత్తి వేటుకు గురి చేసి / పడమటి పొద్దుల్ని పడకేయించి / పాలు తాగే దూడల్ని పొదుగుకు దూరం చేసి / పులికిచ్చిన మాటను నిలబెట్టుకున్న ఆవులా/ బుసకొట్టే విషనాగుల కీకారణ్యంలోకి వాళ్ళు వస్తారు'' అని డాక్టర్లు ఇంటి నుంచి ఆసుపత్రికి చేరే క్రమాన్ని ప్రతీకాత్మకంగా చెప్పిండు కవి. కార్యక్షేత్రంలో చేరినంక ఒక ఆఖరి శ్వాసను గెలిపించేందుకు మరల మరల మరణిస్తూ బతుకుతారు. వైద్యులు తమ స్వంత ఇంటికి చేరే వరకు భయం భయంగానే ఇంటిలోనివారు ఉంటారు.
భూమి మీద మనుషులు పిట్టలు రాలినట్టు రాలిపోతుంటే, అందరు కలిసికట్టుగా ఎదుర్కో వలసిన సంక్షోభ సమయంలో కొందరు మనుషులు రక్తం తాగే జలగల అవతారం ఎత్తినారు. ఇలాంటి అమానవీయ సంఘటనలను చూసిన కవి ''మహానిర్మాణ వేదిక'' కవిత రాసిండు. ''మనిషి ఉనికే ఊపిరందని ఉత్తి తిత్తని తేలాక కూడా, మనసు కిటికీ మరి కొంచెం తెరుచుకోకుంటే ఎలా'' అని ప్రశ్నిస్తున్నాడు.
ఇది మరణ దూత తీక్షణ దృక్కులోలయ, అవని పాలించు బస్మ సింహాసనంబు'' అని గుర్రం జాషువా గారు రాసిన శ్మశాన వాటిక పద్యాన్ని గుర్తుకు తెస్తుంది ఈ కవిత.
''నడిసంద్రంలోని నావ / చిల్లుపడిన చివరి క్షణాన సైతం / సైతానుదూతలా సందడి చేస్తున్న / ధన దాహ, నిర్లజ్జ, వ్యాపార, వ్యామోహి/ మునిగిపోతున్న నావలో నువ్వూ మునగబోతున్న ముసాఫిర్ వే'' చావు సమీపించినా అక్రమంగా సంచుల ముల్లెలు కట్టుకొనే వారి మీద ధర్మాగ్రహాన్ని ప్రదర్శిస్తాడు కవి. నువ్వు మునిగిపోయే నావలోనే ప్రయాణిస్తున్నావని గుర్తు చేస్తున్నాడు.
అంతా చావు వార్తలే. వాటి మధ్యలోనే ఎవరి దృష్టికి రాకుండా ఉండేందుకే ప్రభుత్వం రెండు నల్ల చట్టాలను తీసుకువచ్చింది. అవే వ్యవసాయ చట్టాలు, కార్మిక చట్టాలు.
వ్యవసాయరంగంలోకి పెట్టు బడులు ఆహ్వానించడానికి కంట్రాక్టు పార్మింగును ముందుకు తీసుకు వచ్చినారు, రైతులు పెట్టుబడిదారులతో ఒప్పందం కుదుర్చుకొని వారు చెప్పిన పంట పండించాలి. దీనిలో రైతుకు స్వేచ్ఛ ఉండదు.
దేశమంతా ఒకే మార్కెట్ కాబట్టి రైతు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పుతున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుకు గిట్టుబాటు ధర అందకుండ చేయ వచ్చు. ప్రభుత్వం కొనుగోలు దారుగా, కనీస మద్దతు ధర ఇచ్చి కొనే పద్ధతి ఉండదు. కార్పొరేట్లు ఆహార ధాన్యాలను అక్రమంగా నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు వ్యవసాయ ఉత్పత్తులను అమ్మే వీలు ఉంది. సామాన్యులకు ఆహార ధాన్యాల లభ్యత ఒక ఎండమావిగా మారుతుంది. రైతు చట్టాలకు నిరసనగా ''ఆకలి ఆలాపనలు'' కవితలో ''పంటల రసం పీల్చే పురుగుల్లా, రైతుల రక్తం తాగే జలగలొస్తాయన్న దిగులు'' తోని రైతులు సంవత్సర కాలంగా ఉద్యమం చేసి ఆ చట్టాలను రద్దు చేయించినారు.
కార్మికుల ఎనిమిది గంటల పని విధానానికి చరమ గీతం పాడేలా కొన్ని రాష్ట్రాలు యత్నించాయి. యూపీ లాంటి రాష్ట్రాలు చట్టాలు చేశాయి.
నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ఏ దేశంలో అమలు జరిగినా వాటి అమలులో రెండు పద్దతులు అనుసరిస్తారు. ూబతీరబa్‌ఱశీఅ aఅస షశీవతీషఱశీఅ 1991 నుంచి మధ్య భారతంలోని అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టి, అక్కడి ఆదివాసులను విస్థాపనకు గురిచేస్తున్న దానికి వ్యతిరేకంగా, వాళ్ళకు సంఘీభావంగా నిలబడ్డ జి.ఎస్.సాయిబాబ లాంటి మేధావులను జైల్లో పెట్టినారు. ఆయన 90శాతం అంగవైకల్యం ఉన్నవాడు. అయినా రాజ్యం విడిచి పెట్టలేదు. ఈ సంఘటన మీద ''వీల్ చైర్ విస్పోటనం'' రాసిండు కవి. ''జైళ్ళున్నాయని, కొన్ని భావాలు భయం ముసుగులు కప్పుకోవు, సంకెళ్ళున్నాయని, కొన్ని వేళ్ళు పిడికిల్లె బిగియక గిడసభారిపోపు, ఉరికొయ్యలున్నాయని, కొన్ని కంఠాలు మౌనగీతాలై మూగబోవు''.
జి.ఎస్. సాయిబాబా కేసుకు, ఇటాలియన్ మార్కిస్టు నాయకుడు, తత్వవేత్త ఆంటోనియో గ్రాంసీ కేసు మధ్యన సారూప్యత ఉంది. ఇటలీ నియంతను చంపడానికి కుట్ర పన్నినాడని ఆయనను జైల్లో పెట్టినారు. ఆయన కూడ సాయిబాబ లాగానే పూర్తిగా వికలాంగుడు. ''ఆయన మెదడు ఇరవై సంవత్సరాలు పని చేయకుండ ఆపాలని'' ఆదేశించినారు. కదలలేని స్థితిలో, అనారోగ్యంతో జైల్లోనే చనిపోయినాడు.
అమెరికా దేశంలో జాతివివక్ష, భారతదేశంలో కులవివక్షకు కొన్ని తేడాలున్న మనుషులను మనుషులుగా చూసే స్వభావం లేకపోవడం సమాన లక్షణం. 20 డాలర్ల దొంగనోటు ఉన్నందుకు జార్జ్ ప్లాయిడ్ అనే నీగ్రో జాతి పౌరుని అమెరికాలో తెల్లపోలీసులు మెడమీద బూటుకాలుతోని తొక్కిపట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపినారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన మీద కవి ''నలుపు సుగంధం'' కవిత రాసిండు.
''ఐ కాంట్ బ్రీత్ ఐ కాంట్ ట్రే నిమిషాలు- సెకండ్లుగా విలవిలలాడిన నీ ఊపిరి కోట్ల ఉచ్ఛ్వాశ నిశ్వాసల ఉప్పెనై వాడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది'' అమెరికాలో అక్కడి స్థానిక ప్రజలు ఉన్నారు. యూరోపియన్ దేశాల నుండి వలస వచ్చిన తెల్లవారు, ఆఫ్రికన్ దేశాల నుండి బానిసలుగా తీసుకువచ్చిన నల్లవారు ఉన్నారు.
జార్జ్ ప్లాయిడ్ హత్యకు నిరసనగా ఉద్యమం దీశ్రీaషస శ్రీఱఙవర వీa్్వతీ మొదలైంది. అది అధ్యక్ష భవనం వరకు ఊరేగింపుగా సాగింది. అధ్యక్షుడు ట్రంపు బంక లో దాక్కున్నాడు.
ప్రతి కవికి కొన్ని మానసిక స్థితులు, అభిమాన విషయాలు ఉంటాయి. ఇష్ట మైన వ్యక్తులు ఉంటారు. గౌరీలంకేషను హత్య చేసినపుడు ''అక్షరాన్ని కూల్చగలరా?'', మచ్చ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నపుడు ''
జ్ఞానవృక్షం'', తౌటు నాగభూషణం మీద ''అక్షర నక్షత్రం'', సినారె మీద ''ఆ కలం'', యన్.శ్రీనివాస్ మీద ''శీతల పవనం'', బాల సుబ్రహ్మణ్యం మీద ''పాటకు మరణముంటుందా?'' మొదలైన వారి మీద ఎలిజీలు రాసిండు.
నలిమెల భాస్కర్ గారికి (14) భాషల్లో పరిజ్ఞానం ఉంది. మూల భాష నుంచి లక్ష్యభాషకు అనువాదం చేయడంతో పాటు ఆయా భాషలను అలవోకగా మాట్లాడతారు. ఇంత పాండిత్యం ఉన్నా నిండుకుండ ప్రచారం కోసం పాకులాడని తత్వం. అందుకే ఆయన మీద ''భాషల చెట్టు'' కవిత రాసిండు. ఈ కవితలో ఆయన వ్యక్తిత్వానికి చిత్రిక పట్టిండు.
పిల్లనిచ్చిన మామ బ్రహ్మయ్య మరణశయ్య మీద ఉన్నపుడు ''మూసిన కనురెప్పల్ని తెరుచు కుంటానంటే, కాళ్ళు కడిగిన నీ చేతుల్ని, కన్నీటితో అభిషేకిస్తాను, అంపశయ్య పై నుండి లేచి వచ్చావంటే, ఆశగా నీ ఒడిలో, మూడో కొడుకునై ఓలలాడుతాను'' అంటాడు. వరవరరావు గారిని ప్రభుత్వం నిర్బంధించి జైల్లో పెట్టినపుడు ''అతని రాక కోసం, అక్షరం రొమ్ము దొరకని పసిపాపై రోదిస్తుంది, అడవి ఆకులన్నీ రాలి అల్లాడుతోంది, సాగరం కల్లోల కెరటాల పల్లవెత్తుకుంది'' అంటూ రిలీజ్ ద పోయెట్, రిలీజ్ ద పోయెట్ అని విజ్ఞప్తి చేసినాడు. తన సహచరి శోభ మీద ''దయా పారవతం'' రాసిండు కవి. స్త్రీ పురుష సంబంధాలు సహజత్వాన్ని కోల్పోయి కృతకమై పోతున్న కాలంలో ప్రేమబంధం పంచిన తల్లితోని సమానంగా సహచరిని పోల్చడం కవి ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. ఇది సభ్య సమాజానికి ఆదర్శం.
''పేగు బంధంతో పెనవేసుకున్న అమ్మ ఒకరైతే/ప్రేమ బంధంతో చేరువైన ఆమె నాకు మరో అమ్మ / బతుకు బండిని సమంగా మోస్తూ బాధల్ని మునిపంటిన భరిస్తున్న కన్నీటి చెమ్మ'' ''దయాపారవతం'' పదబంధం పాతదైనా దేవరకొండ బాలగంగాధర తిలక్ ఖాయం చేసిందైనా, ఆయన అక్షరాలకు ఉపయోగిస్తే, ఈయన తన సహచరికి వాడిండు. యాభైఆరు సంవత్సరాల తర్వాత రాసిన కవిత్వం రాసిలో తక్కువైనా వాసిలో ఎక్కువేనని చాటింది.
- కందుకూరి అంజయ్య
9490222201