Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పటిలాగే రోజు మొదలౌతుంది
అంతా షరామామూలే
మౌనం అర్ధంగీకారమవుతుంది
పాతికేళ్ళ కలలు లిప్తపాటు కాలంలో
దహించబడతాయి
సొంతమంటూ కానీ సమయాలు
వేలు పట్టుకొని కొత్తనడక నేర్పుతాయి
వేడిగాలుల ఉక్కపొతలో
ముక్కలుగా విరిగిన ఆశలు
ఆనవాలు లేకుండా మాయమౌతాయి
పొరలుగా ఏర్పడిన దుఃఖపు సంచి
విడిపోవడం ప్రారంభమవుతుంది
సవ్యాపసవ్యాల ప్రసక్తి లేదు
అంతా సహజంగా జరిగిపోతుంది
అమానుషం అలవాటుగా మారిపోతున్నా
భరించడం ఒక్కటే నేర్పబడుతుందిక్కడ
అంతుపట్టని ప్రయాణంలో
సమాధానం లేని ప్రశ్నలు
విడదీయలేని చిక్కుముళ్ళు
ఆనందం లేని విషాదంతాలు
హారం మాదిరి అల్లుకుపోతాయి
ఆలోచనలకు ఏ విలువా లేదని తెలిసాక
మాటలకూ నిషేధముందని అర్ధమయ్యాక
ఏ వందోసారో రాసుకున్న ప్రేమలేఖ
సెండ్ చెయ్యని మెయిల్లా మిగిలిపోతుంది
రెండక్షరాల వాక్యం నూరేళ్ళ కాలాన్ని
ఆజ్ఞాపిస్తుందని అవగతమయ్యాక
మౌనం తప్పనిసరవుతుంది
- కడెం లక్ష్మీ ప్రశాంతి, 7893399773