Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వం రాయడానికి కేవలం భాషాపాండిత్యాలుంటే చాలదు. దానికి ఆత్మౌన్నత్యం కావాలి. అలాంటి వారే కవిత్వాన్ని మాధ్యమంగా చేసుకొని, సమాజ స్థితిగతులను సమర్థవంతంగా వ్యాఖ్యానించ గలుగుతారు. అలాగని కవిత్వం రాయడం కూడా మాటలు చెప్పినంత సులువైన పనేమీకాదు. అది నిరంతర అధ్యయనం, అభ్యాసాల ద్వారా మాత్రమే పట్టుబడే అద్భుతమైన కళ. కవితా వస్తువు ఎంపిక, దానికి సంబంధించిన సమగ్ర సమాచారము కలిగి ఉండటం, ప్రతిభావంతంగా రాయాలనే తపన ఉండటం అనేవి ఏ వ్యక్తినైనా ఉత్తమ కవిగా నిలబెడతాయి. ఇలాంటి ఉత్తమ కవుల జాబితాలో ఎప్పుడో చేరిపోయిన కవి, పరిశోధకుడు డా|| సి.హెచ్.ఆంజనేయులు. ఈయన 1988లో ''అక్షరాలు పూస్తున్నాయి'', 1999లో'' గాయపడిన జాబిల్లి'' అనే అభ్యుదయ కవితా సంపుటాలు వెలువరించారు. ప్రముఖ కవి అనిసెట్టి ''అగ్నివీణ'' పై ఎం.ఫిల్ చేశారు. ''తెంగాణ వచన కవిత్వం''పై పరిశోధన చేసి కాకతీయ యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి పట్టా పొందారు. 2016లో ''దిగివచ్చిన గగనం'' కవితా సంపుటిని వెలువరించారు.
ప్రస్తుతం''దిగి వచ్చిన గగనం'' కవితా సంపుటిలోని కొన్ని కవితా విశేషాలను చర్చించడమే ఈ సమీక్ష ముఖ్యోద్దేశము. ఈ సంపుటిలో 2002-2016వరకు సుమారు దశాబ్దిన్నర కాలంపాటు జరిగిన సామాజిక పరిణామాలు, ప్రజా ఉద్యమాలు, వైయక్తికానుభూతులు, మానసిక సంఘర్షణలు, ప్రపంచీకరణ పర్యవసానాలు, ఆర్తులు, ఆనందాలు, సంవేదనలు కలగలిసి ప్రజాకవిత్వంగా మనల్ని ఆలోచింప జేస్తాయి.
ఈ కవి 'నేపథ్య సంగీతం' అనే చిన్ని కవితను ఎంత వర్ణనాత్మకంగా నడిపించాడో పరిశీలిస్తే అద్భుతం అనిపిస్తుంది.
''కల్మషం లేని కష్టజీవి నవ్వులా నక్షత్రాలు/ కోతకొచ్చిన చేనుపై కొడవలెత్తినట్టు నెలవంక/ అంతులేని విషాదంలా అల్లు కొంటున్న దళసరి చీకటి పొర/రాత్రినుంచి పగలులోకి/ నియతం బలి అయ్యే బ్రతుకు చిత్రానికి/ నేపథ్య సంగీతం వినిపించే కీచురాళ్ళ సంగీతం తప్ప/ ఈ ఘనీభవించిన చీకటి మౌన రాత్రిని/ఏది చలింప జేసేది/విచలింప జేసేది?''
చిమ్మ చీకటి వర్ణించడానికి కవి వాడిన పదచిత్రాలు, ఉపమానాలు, మనస్సును ఆహ్లాదపరుస్తాయి. ఈ కవితలోనే కష్ట జీవుల నవ్వులను నక్షత్రాలతో పోల్చుతాడు కవి. అంటే తమ శ్రమను తాము నమ్ముకునే కష్టజీవులను స్వయం ప్రకాశకాలైన నక్షత్రాలతో పోల్చడం, నెలవంకను శ్రమజీవుల చేతి పనిముట్టైన కొడవలితో పోల్చడం వంటివి కవి దార్శనికతకు నిదర్శనం.
కన్న తల్లిని, పుట్టిన ఊరును, బాల్యాన్ని కవిత్వీకరించని కవి ఉండడంటే అతిశయోక్తికాదు. అలా జీవితంలోని గడిచిపోయిన కాలాన్ని కవిత్వం చేయడం ద్వారా అనుభూతి ప్రధానమైన జీవిత పార్శ్వాలను రికార్డు చేస్తుంటాడు కవి. అలాంటి అనుభూతి ప్రధానమైన కవితే ''ఊహలే ఊపిరులు''....
''ఊహలే అక్షరాల ఊపిరులు/నా దృష్టి సాగినంత దూరం/... /బంగారు మమతలను పంచే మా ఊరు/... /చెరువుల్లో, కాలువల్లో, బావుల్లో కుంటల్లో ఈతలు కొట్టిన మధుర క్షణాలు/ఈ ఊహలు మధుర జ్ఞాపకాల, విషాద వలయాలు/స్మరణీయ అద్భుత ప్రపంచాలు.
ఈ పంక్తుల్లోని కవి సృష్టించిన ప్రతి సందర్భాన్నీ, పల్లెజీవితాన్ని అనుభవించిన ఏ వ్యక్తీ మరచిపోలేడు. ఈ కవిత నిండా తన బాల్యస్మృతులే చెరువులో రాయి విసిరినప్పుడు పుట్టిన గుండ్రటి వలయాల్లా వ్యాపించి ఉన్నాయి. కవిత సాగినంత సేపు మనం కూడా ఒకసారి బాల్యపు మధుర జ్ఞాపకాలను ఆస్వాదించ గలుగుతాము.
'పల్లె వలస' అనే కవితలో కవి ప్రతిభ, సామాజిక బాధ్యత, సమాజ పరిణామాల పట్ల సూక్ష్మ పరిశీలన మనకు అద్దంలో ప్రతిబింబంలా కనిపిస్తాయి. అందుకే ఈ కవిత సంపుటి మొత్తానికీ తలమానికమైనదని చెప్పవచ్చు. 1990 నుంచి మన దేశంలో క్రమంగా విస్తరించిన ప్రపంచీకరణ ఫలితంగా ఈ రోజు పల్లెలు ఉనికిని కోల్పోతున్న సంఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయి. ఏ పల్లెను చూసినా పక్షులెగిరిపోయిన ఖాళీ గూళ్ళే జ్ఞాపకం వస్తున్నాయి. స్వయం ఉపాదిని కలిగించిన చేతివృత్తులు, కులవృత్తులు, కంపినోళ్ళ పదఘట్టనల క్రింద పడి నలిగిపోయిన దైన్యం కనిపిస్తుంది. కూటికెల్లక కూలీలై పొట్టచేత పట్టుకొని నగరాలకు వలసపోతున్న దీన దృశ్యాలే ప్రత్యక్షమవుతున్నాయి. ఇటువంటి దుర్భర పరిస్థితులను చూచి కవి అయిన వాడు స్పందించకుండా ఉండలేడు. ఇలా బిడ్డలు కుటుంబాలతో సహా వలస పోతుంటే, కీళ్ళు సడలిన ముసలి ఒగ్గులు శిథిలమైపోయిన జ్ఞాప కాలను నెమరువేసుకుంటూ బ్రతుకులీడు స్తున్నారు. ఇప్పుడు పల్లెలు కేవలం వృద్ధాశ్రమాలను తలపిస్తున్నాయి. ఈ అనివార్యతను ఎదిరించడానికి పల్లెవలసల ఉదంతాన్ని వస్తువుగా స్వీకరించి కవిత్వీకరించిన కవి నేర్పు హృదయాన్ని చలింపజేస్తుంది.
ప్రపంచీకరణలో భాగంగా బంగారం పండిన చేను, కంపినీలకు ధారాదత్తం చేస్తున్న సంగతిని హృద్యంగా రూపుకట్టించాయి ఈ క్రింది పంక్తులు...
''నేడు నా నేలను, నా బంగారు చేనును నాచేతనే/ ఖరీదు చేసుకున్న కూలోణ్ణి/ నిన్నటి వరకూ మమకారపు తీగలతో/ మనుషుల చుట్టూ అల్లుకున్న పల్లె/నేడేమో నగరం ఎడారి ఆత్మల మధ్య/ ఏకాకిగా మారింది... అంటూ..వాస్తవాన్ని కళ్ళముం దుంచాడు.
ఇదే కవిత ఆఖరి పంక్తులలో... ''దయచేసి నగరానికొచ్చి/మంచి మనిషి గుండెను పోగొట్టుకోకు/నిన్నటి పల్లె పచ్చని పసిడి మనస్సును/పదిలంగా కాపాడుకో...''
ఇక ఈ కవిత ముగింపులో మంచి ఉపదేశాన్ని ప్రభోదించాడు కవి. వర్తమానం, ఒలికిన రంగుల్లో గీచిన చిత్రం, పర్యవసానం, పెద్దబహుమతులు, సంక్షోభాల పోకడ, సన్మార్గులకు చోటెక్కడ తదితర కవితలన్నీ ప్రపంచీకరణ నేపథ్యంలో అత్యంత ప్రతిభా వంతంగా కవిత్వీకరించబడ్డాయి.
మనిషిని ప్రేమించు, మానవత్వమై పరిమళించమని కవి ఆంజనేయులు ప్రతి కవితలోనూ ధ్వని పూర్వకంగా తెలియజెప్పిన తావులు ఈ సంపుటి నిండా మనల్ని పలకరించి, పులకరింపజేస్తాయి. కవి జనం మనిషినని చెప్పుకోవడానికేమో! జనాన్ని పలవరించి, జనాన్ని ప్రేమించి, జనం కోసమై కలం పట్టి, జనంతోనే కవిత్వమై కదిలిపోతూ పరితపిస్తున్నాడు.
ఈ కవి ప్రతి అక్షరానికీ మానవత్వమనే పాలు పట్టించి, మమతాను రాగాల ఊయలలూపి, మనిషి నుంచి మాయమవుతున్న మనిషి చిరునామాను అన్వేషించి కవిత్వీకరించే అక్షర శిల్పి, సున్నిత హృదయుడు.
''బ్రతుకు బడిలో'' అనే కవితలో...
''జనం నీలో నాలో సజీవ దృశ్యాలై ఉన్నారు/జనం ఆకాశాలవుతారు/ జనం రాత్రి నక్షత్ర తోరణాలై మెరుస్తారు.../జనం పడిలేచే కడలి కెరటాలు/జనం సుగంధాలను రంగులు రంగులుగా వెదజల్లే పూలు/జనం ఆగ్రహ మంటల సమూహాలు/జనం చల్లని వెన్నెలై వర్షించే గగనపు చందమామలు''
ఇలా ఈ కవిత నిండా జనాన్ని వర్ణించిన తీరు ప్రసంశనీయంగా ఉంది. కవిలో జనం పైగల సహృదయతను, ప్రేమించే లక్షణాన్ని , సమాజం పైగల నిబద్ధతని, సామాజిక బాధ్యతని అణువణువునా గర్భీకరించుకున్న ఈ కవిత కవిగా తన అరÛతని, సమర్థతని దేదీప్యమానం చేసింది.
డా||ఆంజనేయులు కవిగా ఎంతో అనుభవాన్ని సంపాదించారు. ఈయన కవితలలో ధర్మాగ్రహం ఉంది. నిర్మొహమాటంగా విషయాన్ని వ్యక్తీకరించే లక్షణం ఉంది. కొన్ని కవితలలో వాక్యాలు సుదీర్ఘంగా సాగి ఉద్వేగాన్ని రేకెత్తిస్తాయి. మరికొన్ని కవితలు అద్భుతమైన భావచిత్రాలతో అలరిస్తాయి. కొన్ని కవితా పంక్తులు అస్పష్టత నుంచి స్పష్టతలోనికి అప్రమేయంగా లాక్కుపోతున్నాయి. ఈ కవి సంవేదనంతా వాక్యనిర్మాణంలోనే ఉంది. దిగివచ్చిన గగనం అనే పేరులోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడం ఉంది. ఒక ఆశావాద దృక్పథమూ ఉంది.
- పోతగాని సత్యనారాయణ
9441083763