Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షేక్స్పియర్ 'ఒథెల్లో', 'కింగ్ లియర్', 'టెంపెస్ట్'ల నుంచి అలవోకగా ఆయన నోటివెంట పంక్తులు జాలువారేవి, చిన్న కూతురు ఎలినోరా 'మాక్బెత్' నుంచి పేజీలు కొద్దీ దూసిపోస్తుంటే కాపిటల్ పని కాసేపు పక్కనబెట్టి మైమరచి వినేవాడు! డాంటే 'డివైన్ కామెడీ'లో నుంచి పేరాల కొద్దీ నోటికి చెప్పేవాడు! ఆ మాటకొస్తే గ్రీకు నాటకాలన్నీ ఆయనకు కొట్టిన పిండి! ఈస్కలస్, యూరీపిడస్, సొఫోకిల్స్, అరిస్టోఫెన్స్, హోమర్... ఆయన వదిలింది ఎవరిని? వర్జిల్, ఒవిడ్, గోథే... బాల్జాక్... ఆనాటి ఏ సాహిత్య కారుడూ చదవని సాహిత్య మంతా మార్క్స్ వంటబట్టించుకున్నాడు! 'రూపం' కోసం తాపత్రయపడి, కొన్ని వేల పేజీల సాహిత్యాన్ని సృజించి, చించిపారేసి, అంతకంటే నేనీ మానవ జాతి విముక్తికి చేయాల్సింది చాలావుందని చెప్పి, కాపిటల్ మీద కూర్చున్నాడు.
ఇదంతా ఎందుకంటే, అర్ధశాస్త్రం తప్ప మార్క్సిస్టులు దేన్నీ పట్టించుకోరని 'నమ్మే' వారికోసమే! ఆ మాటకొస్తే మార్క్స్ ఎనిమిది భాషల్ని ఔపోసన పడితే ఎంగెల్స్కు ఏకంగా ఇంచు మించు పంతొమ్మిది భాషల్లో సాధికారికంగా మాట్లాడే నైపుణ్యం ఉండేది. మార్క్స్‌కు గణితంపై మహా ఆసక్తి. ఇన్ఫినైట్స్మల్ కాలిక్క్యులస్ గణితంపై ఏకంగా పుస్తకం రాయడానికి ఉవ్విళ్లూరి కూడా సమయం అనుకూలించక ఆగిపోయిన వాడు! ప్రసూతి శాస్త్రాన్ని కూడా వదలకుండా చదివినవాడు ఎంగెల్స్!
అంటే మానవజాతికి చెందిన యే అంశమూ పరాయిది కాదు, పరిశీలనారం కాకుండా పోదు! మానవ జాతి చరిత్ర గమనంలో, లిపి లేని రోజుల నుంచీ నేటి వరకూ మనిషి సృజించుకున్న సాహిత్యంలో చపలత్వాలూ, అమాయకత్వాలూ, లోతైన భావజాలాలూ, ప్రగతి పథంలో నడిపేవీ, వెనక్కి లాగేవీ యెన్నో తారసపడతాయి. ప్రగతిశీల కాముకులుగా దేన్ని నెత్తి కెత్తుకోవాలీ, దేన్ని తోసి పుచ్చాలో తెలియకపోతే ''పుస్తక'' మైతే చాలు అది గొప్పదనే మహా ప్రమాదకర భావన మస్తిష్కంలో చొరబడుతుంది. సాహిత్యాన్ని వివేచించే భావనలు కొన్ని తెలుసుకోవడంవల్ల యే రకమైన సాహిత్యానికి ఎంత విలువ ఇవ్వొచ్చో మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, ప్లెహనోవ్, లూకాస్, ఆల్తూజార్, బెంజమిన్, లూకాస్, పియర్ మాచరీ, రేమండ్ విలియమ్స్, కాడ్వెల్, థాంప్సన్, బర్తోల్ట్ బ్రెక్ట్ వంటి మరి కొందరి మార్క్సిస్టుల మౌలికమైన భావనల్ని వివేచిస్తూ టెర్రీ ఈగల్టన్ కొన్ని ప్రతిపాదనలు చేసి ఈ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకంలోని అత్యంత క్లిష్టమైన భావనల్ని తెలుగులోకి సరళంగా పరిచయం చేయడానికి గుడిపూడి విజయరావు ఎంతగా శ్రమిం చారో ఈ పుస్తకం చదివిన వారికి ఇట్టే అర్ధం అవుతుంది. పరిచయం కోసం యీ పుస్తకంలో చర్చించిన కొన్ని విషయాలు మీ కోసం.
పునాదీ, ఉపరితలమూ
మనిషి తన జీవన సామాజిక ఉత్పత్తిలో కొన్ని నిర్దిష్ట సంబంధాల్ని ఏర్పరచుకుంటాడు. ఈ సంబంధాలే ఆ సమాజ ఆర్ధిక స్వరూపం. యిదే పునాది, దీనిమీదే ఆధారపడి ఉపరితలంలో ఏర్పడేవే చట్టం, న్యాయం, మతం, కళలు. అతని సామాజిక, రాజకీయ, మేధో జీవనం అంతా ఈ పునాది ఆధారం తోనే, అందుకే ప్లెహనోవ్ ''ఒక యుగపు సామాజిక మనస్తత్వం ఆ యుగపు సామాజిక సంబంధాల ద్వారా నిర్దేశించ బడుతుందనీ, ఇది కళా, సాహిత్య చరిత్రలో కనబడినంతగా మరెక్కడా కనబడదనీ'' అంటాడు.
చరిత్రలో ''ఉత్పత్తీ, పునరుత్పత్తీ'' కంటే తుది నిర్ణాయకాలు మరేమీ ఉండవని చెప్పిన మార్క్స్, ఎంగెల్స్‌లు ''ఆర్థికాంశమే'' ఏకైక నిర్ణయాత్మకమైనదని ఎక్కడా వక్కాణించలేదు. సాహిత్యం ఉపరితలంలో భాగమే అయినా క్రియా శీల రహితంగా ఆర్ధిక పునాదిని ప్రతిబింబించదు అంటాడు ఎంగెల్స్. కళలు వాటంతటవే చరిత్ర గమనాన్ని మార్చవనీ, కళలు భౌతిక పునాదికి యెన్నో రెట్లు మించి వుండడాన్ని మనం చూస్తామని కూడా అంటాడు. కళ అనేది రాజకీయ, ఆర్థిక సిద్ధాంతం కన్నా, ఉత్క్రుష్ఠ మైనదీ, అస్పష్టమైనదీ, తక్కువ స్వచ్ఛమైనదీ అని ఎంగెల్స్ ఎందుకంటాడంటే, రాజకీయ, న్యాయ సిద్ధాంతాలు పాలక వర్గ ప్రయోజనాలను నేరుగా ప్రతిబింబిస్తే, కళలు వాస్తవాల జ్ఞానాన్ని పొందకుండా నిరోధిస్తారు. ఈగల్టన్ ఇక్కడ టి.ఎస్. ఇలియట్ రాసిన 'ది వేస్ట్ ల్యాండ'్ గురించి విశ్లేషిస్తూ భావజాల పరంగా సమాజం గురించి వాస్తవ జ్ఞానాన్ని తెలుసుకోని విధంగా మనిషిని ఇదెలా మళ్ళించగలదో ఉదహరిస్తాడు. కళలు ఆయా కాలాలకు సంబంధించిన భావజాలానికి చెందిన కేవల వ్యక్తీకరణ లేనా? ఆధిపత్య భావజాలాల ప్రతిబింబాలేనా? కాదంటాడు ఈగల్టన్! ఎలానో కూడా చెబుతాడు. ఆధిపత్య భావాల్ని దాటి సత్యాల లోతుల్లోకి వెళ్లిన సాహిత్య రచనలు చాలానే ఉంటాయి అంటాడు.
రూపమూ, సారమూ
జార్జ్ లూకాస్, సాహిత్యంలో నిజమైన సామాజిక అంశం 'రూపమే' అంటాడు! మార్క్స్ సాహితీ రచనని 'రూప సారాల ఏకత్వం' అంటాడు! రూపాన్ని సారమే సృష్టించి అదే వెనక్కి వెళ్లి సారం మీద ప్రభావం చూపించే double-edged knifeగా భావించాడు మార్క్స్. ''సారం యొక్క రూపం'' అయితేనే రూపానికి విలువ అంటాడు మార్క్స్! సారం రూపం లోకీ, రూపం సారంలోకీ పరస్పర పరివర్తన చెందడాన్ని హెగెల్ చెప్పిందే మార్క్స్ తీసుకున్నట్టు అనిపించినా, వాస్తవానికి మార్క్సిజం 'రూపాన్ని' నిర్దేశించడంలో అంతిమంగా ''సారమే'' ప్రాధమికం అని చెబుతుంది. ట్రాట్స్కీ అన్నట్టు కళలకు ఒక ఉన్నత స్థాయి ప్రతిపత్తి వుంటుంది. కళ భావజాల పరిధిలో వున్నా, అదేసమయంలో కొంత దూరాన్ని పాటిస్తుందంటాడు ఆల్తూజర్. సాహిత్యం కూడా భావజాలానికి చెందినది కావడంవల్ల వాటిని కూడా శాస్త్రీయంగా విశ్లేషించవచ్చని అంటాడు.
పాత ఆర్థిక రూపం ఎలా కొత్త ఉత్పత్తి విధానంలోకి మారాక కూడా తన ఆనవాళ్లు ఉంచుకుంటుందో, సాహిత్యం కూడా తన పాత రూపపు ఆనవాళ్లను కలిగివుంటుంది. ఈగల్టన్ రూపాన్ని 3 అంశాల సంక్లిష్ట సమ్మేళనంగా చెబుతాడు. 1. అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రూపాల చరిత్రతో రూపు దాలుస్తుందనీ, 2. ఆధిపత్య భావజాల నిర్మాణాల చేత స్పష్టతని తెచ్చుకుంటుందనీ, 3. రచయితకూ పాఠకుడికీ వుండే కొన్ని నిర్దిష్టమైన సంబంధాల మొత్తంగా వుంటుందనీ చెబుతాడు.
రచయితా, నిబద్ధతా
కళాకారుడు శ్రామికవర్గ ప్రయోజనాలకు నిబద్ధుడై ఉండాలని మార్క్సిస్టు సాహిత్య విమర్శ చెబుతోంది. ఈ చాప్టర్లో స్టాలిన్ హయాంలో వచ్చిన డిక్రీలు సాహిత్య గమనాన్ని నిర్ధేశించాయని 1925,1928,1940 నుంచీ 1950ల డిక్రీలన్నీ ఇంచుమించు ఎలా సాహిత్య రంగాన్ని 'భ్రష్టు' పట్టించాయో చెబుతాడు ఈగల్టన్.
కానీ లెనిన్ ''సోషల్ డెమాక్రసీ అనే ఒకే మహాయంత్రంలో సాహిత్యం అనేది నట్టూ, బోల్ట్ లాగా ఇమిడిపోవాలి'' అన్నాడనీ, గోర్కీతో వాదిస్తూ, 'కళాకారుడు అనేవాడు అన్ని రకాల తాత్వికతల నుంచి తనకి పనికి వచ్చే అంశాల్ని యేరుకోవాలనీ, ఆ తాత్వికత తను చెప్పాల్సిన కళాత్మక సత్యానికి వ్యతిరేకంగా
వున్నా, అతడేమాలోచించాడో కంటే ఏం సృష్టించాడో అన్నది ప్రధానమైందని' అన్నాడనీ చెబుతాడు ఈగల్టన్. పెట్టుబడి దారీ వ్యవస్థ నుంచి వారసత్వంగా సంక్రమించిన విలువైన సాహిత్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం గురించి లెనిన్ మాట్లాడిన విషయాన్ని కూడా పేర్కొంటాడు. టాల్ స్టారు, పెటీ బూర్జువా రైతు ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించాడనీ చరిత్ర గురించి అతనికి లోపభూయిష్టమైన అవగాహన ఉందని లెనిన్ అభిప్రాయ పడడాన్ని ఈగల్టన్ ఈ సందర్భంలో ఉటంకిస్తాడు.
మార్క్స్ ఎంగెల్స్‌లు కళా, సౌందర్య రీత్యా అద్భుతంగా వున్న రచనల్తో, 'రాజకీయ పరంగా సరిగ్గానే' ఉన్న రచనల్ని పక్క పక్కనే పెట్టి మరీ మొరటు పద్దతిలో చూళ్ళేదు. ఎంగెల్స్ అయితే, 1885లో కాట్ స్కీ అనే ఆవిడకి రాసిన ఉత్తరంలో, 'రాజకీయపరమైన ధోరణితో వున్న రచనలకు తాను వ్యతిరేకం కానప్పటికీ, రచయిత బహిరంగంగా ఒక పక్షం వహించడం సరికాదనీ, రాజకీయ ధోరణి రచయిత జోక్యం కలిగించుకోని రీతిలో నాటకీయంగా పుట్టుకురావాలని' రాయడాన్ని ఈగల్టన్ ప్రస్తావిస్తూ కాల్పనిక సాహిత్యంలో 'బహిరంగ రాజకీయ నిబద్ధత' అవసరం లేనిదనే మార్క్స్ ఎంగెల్స్‌లు భావించినట్టు చెబుతాడుటెర్రీ ఈగల్టన్.
ఉత్పాదకుడిగా రచయిత
సాహిత్యం కూడా ఒక పరిశ్రమే! పెట్టుబడిదారు నియమిం చుకునే రచయితలు, దర్శకులు- ప్రేక్షకులు ఆస్వాదించే, తనకు లాభాలు తెచ్చిపెట్టే సరకును ఉత్పత్తి చేస్తారు. విమర్శకులు రాజ్యం కిరాయికి నియమించుకునే విద్యా వేత్తలు. మార్క్స్ ఒకచోట, 'రచయిత భావాల్ని ఉత్పత్తి చేసేటప్పుడు కార్మికుడ వ్వడనీ, ప్రచురణ కర్త లాభం కోసం, వేతనమిచ్చినప్పుడే అవుతాడనీ' అంటాడు.
కళ ఒక సామాజిక ఉత్పత్తి అనేది నిజమేనా అనే చర్చని లేవనెత్తిన ఈగల్టన్ బెంజమిన్, లూకాస్, బ్రెక్ట్ల విరుద్ధ భావనల్ని ఇక్కడ క్రోడీకరిస్తాడు. విప్లవాత్మక కళాకారుడు కళాత్మక 'వస్తువు'నే కాకుండా ఉత్పత్తి చేసే 'పద్ధతి'ని కూడా పట్టించుకుంటాడంటాడు బెంజమిన్. ఈ ప్రపంచం స్థిరమైందీ, ఒక్కసారిగా సృష్టించబడిందీ, మార్పు చేయలేనిదీ అనే భావజాల విశ్వాసాన్ని బూర్జువా కళా సౌందర్యం ప్రతిబింబిస్తుందనీ, కానీ వాస్తవం ఏమిటంటే అది మార్పు చెందుతూ, మధ్యలో ఆగుతూ, కొనసాగుతూ వుండేదనీ, వాస్తవాన్ని మనిషే నిర్మిస్తాడనీ తానే మార్పుచేయగలడని బర్టోల్ బ్రెక్ట్ తన 'ఎపిక్ థియేటర్' గురించి చెప్పేటప్పుడు చెప్పేమాటల్ని ఇక్కడ ప్రస్తావిస్తాడు.
వాస్తవికవాదమా, ఆధునిక వాదమా అని చర్చ కొచ్చి నప్పుడు లూకాస్ కూ, బ్రెక్ట్ కూ మధ్య జరిగిన రసవత్తరమైన చర్చను ప్రస్తావిస్తూ ఈగల్టన్ లూకాస్ విమర్శను పరిశీలనాత్మక ఎకడమిక్ తరహా విమర్శగా భావిస్తూ ఆధునిక పద్ధతులను సందేహ దృష్టితో చూస్తే, బ్రెక్ట్ అవాంట్-గార్డ్ (Aఙaఅ్-+aతీసవ) లాంటి ఆధునిక రూపాలకు ప్రాధాన్యత నివ్వడాన్ని పేర్కొంటాడు.
పెట్టుబడి దారీ సమాజం అన్ని సామాజిక ఉత్పత్తులనూ మార్కెట్ సరుకు చేస్తుందనీ, ఇటువంటి విద్వేష పూరిత ఆత్మరాహిత్యం కళకు శత్రువు అంటాడు మార్క్స్. ఎకనామిక్ అండ్ ఫిలసాఫికల్ మాన్యుస్క్రిప్ట్స్‌లో ఒకచోట ఇలా రాస్తాడు, సామాజిక పరాయీకరణల్ని అధిగమించాకే ''మనిషి ఇంద్రియాభిలాషా, సంగీతం పట్ల అనురక్తీ, క్లుప్తంగా చెబితే, మానవుడి సంతోషాభిలాషను పెంచే జ్ఞానేంద్రియాలు... పాక్షికంగా అభివృద్ధి అవుతాయి... పాక్షికంగా ఆవిర్భవిస్తాయి'' అని రాసినట్టుగా ఈగల్టన్ పేర్కొంటాడు.
ఇదే విషయంపై చెబుతూ, మానవుడి శక్తియుక్తుల్ని వ్యక్తీకరించగలిగే కళకి వుండే సామర్థ్యం చరిత్ర వస్తుగత చలనంపై ఆధారపడుతుందనీ అంటాడు. సమాజాభివృద్ధి ఒకానొక దశలో భౌతిక శ్రమ నుంచి, మానసిక శ్రమని విడదీసిన పనివిభజన పర్యవసానాల్లో ఒకటి కళ అంటాడు మార్క్స్! ట్రాట్ స్కీ 'సంస్కృతి' ఒక విధమైన 'అదనపు విలువ' అనీ, అది ఆర్థికసారంపై ఎదుగుతుందనీ, సమాజంలో 'భౌతిక మిగులు' దాని అభివృద్ధికి అవసరమనీ, కళ, సౌఖ్యాన్నీ, సంపదనీ కోరుకుంటుందనీ చెప్పినదాన్ని ఇక్కడ ఉటంకిస్తాడు ఈగల్టన్. గత సాహిత్యాన్ని పరోక్షంగా నైనా దోపిడీకి వ్యతిరేకంగా స్త్రీ పురుషులు చేసిన పోరాటంతో అనుసంధానించి చూడకపోతే, వర్తమానాన్ని అర్ధం చేసుకోలేక పోవడమే కాకుండా దాన్ని మార్చలేమనీ, సాహిత్యాన్ని చదవలేమనీ, మెరుగైన కళను సృష్టించలేమనీ, ఫలితంగా మెరుగైన సమాజాన్నీ సృష్టించలేమని చెబుతూ సాహితీ విమర్శపై తన పుస్తకాన్ని ముగిస్తాడు.
మూలం: టెర్రీ ఈగల్టన్ అనువాదం: గుడిపూడి విజయరావు
-వి.విజయకుమార్
8555802596