Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు పద్యనాటకం తెలుగు వారందరి సొత్తు... సినిమారంగం వల్ల అసలే కుదేలైంది నాటకరంగం... ఇలాంటి తరుణంలో 2022 జనవరి 17వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం వందేండ్ల కిందట కాళ్ళకూరి నారాయణరావు రాసిన 'చింతామణి' నాటకం నిషేధించింది, 1919 ప్రాంతంలో వ్యభిచారం, వేశ్యావృత్తి, శృంగారం ప్రబలంగా... కొన్ని వర్గాలలో ఎక్కువ మంది భార్యలు ఉండటం, అదే ధోరణిలో ఉంపుడుగత్తెలుండటం స్టేటస్‌గా ఉన్న ఆకాలంలో జరిగిన కథను ఆధారంగా వేశ్యావృత్తిని వ్యతిరేకిస్తూ, దాన్ని నిర్మూలిస్తూ రాసిన గొప్ప సాంఘింక నాటకం చింతామణి. ఆ రచయిత మధ్యపానంపై నిరసిస్తూ- మధుసేన-వరకట్నాలపై 'వర విక్రయం' నాటకాలు రాసారు. రచయిత గొప్ప సాంఘిక సంస్కరణాభిలాషి, దేశభక్తుడు కూడా.
తనకు వేశ్యవృత్తి ఇష్టం లేదని తల్లి శ్రీహరితో చింతామని చెప్పి వాదిస్తూ-రోదిస్తూవుండే సన్నివేశంతో నాటకం మొదలై వేశ్యవృత్తిని త్యజించాలని సమాజంలో వీధివీధినా ప్రచారం చేస్తే (6 నెలలు) మీ సొమ్ము మీకు వాపస్ ఇస్తున్నట్టు తన విటులైన భవాని, సుబ్బిశెట్టి- బిళ్వమంగళ్‌లకు చింతామణి చెప్పి ఒప్పించి వారిలో మార్పు తీసుకరావడంతో నాటకం ముగుస్తుంది. ఇదే వందేండ్ల క్రిందట రాసిన సంస్కరణవాద నాటకం- చక్కటి పద్యాలున్న గొప్ప నాటకం. వైశ్యులను కించపరిచే సంభాషణలు మూలరచనలో లేవు. ద్వంద్వార్థాలలో, బూతుమాటలతో, శ్రీహరి, సుబ్బిశెట్టి పాత్రల సంభాషలు వల్గారిటి వల్ల కొంత మంది మనో భావాలు దెబ్బతిన్నాయని, మూల రచన చూడకుండా.. మొత్తంగా నిషేధించడం బాగాలేదు. ఓట్ల కోసం, నోట్లకోసమో! ఒకరి భావం కోసమో నిషేధం సరైన చర్య కాదు.
మాలపల్లి, మాభూమి, మరీచిక - లాంటి నవలలు- నాటకాలు నిషేధించడం| తరవాత వెనక్కి రావడం చూసాం... బూతులు-ద్వంద్వార్థాలు- లేకుండా మూల రచనతో యథాతధంగా ప్రదర్శించిన ఇబ్బందులు రావు. సురభి సంస్థ జన్మించిన కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి 'నాటకాన్ని' నిషేధించడం శోచనీయం... దాదాపు నాలుగు సంవత్స రాలుగా 'నంది' నాటకోత్సవాలు లేవు. తెలంగాణలో ఎనిమిది సంవత్సరాలుగా లేవు. తెలుగు నాటక ప్రియులకు ఇరు రాష్ట్రాలలో ఆహ్లాదం, ఆనందం, మృగ్యమైనాయి. ఈ స్థితిలో 'నాటకం' నిషేధం మరింత బాధకరంగా, శోచనీయం. శివరాత్రి, శ్రీరామనవమి-గణపతి ఉత్సవాలు దసరా వేడుకలు.... సంక్రాంతి వేడుకల్లో కళాకారులకు సాంస్కృతిక ప్రదర్శనలు సంబరాల ద్వారా ఒకింత ఉపాది, ఒనగూడే స్థితిలో నాటకం నిషేధం బాధాకరం. పురుషులే స్త్రీ పాత్ర (చింతామణి) ధరించి మెప్పించిన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, రేబాల రమణ, విజయరాజు, శ్రీహరి (చింతామణి తల్లి) పాత్ర ధరించిన నల్ల రామ్మూర్తి, సూరవరపు వెంకటేశ్వర్లు, భవానీపాత్రధారి జి. జైరాజ్, చెంచురామారావు, డి.వి సుబ్బారావు, పులిపాటి వెంకటేశ్వర్లు లాంటి వారి పాత్రలు నాటితరం నాటకాలు చూసిన వారికి కండ్లముందు కదుల్తాయి నేటికి!
సకలశాస్త్ర విద్యాపారంగతుడు బిల్వమంగళుడు భార్యను దేవతగా భావించే గొప్ప మనిషి-చింతామణి అందం చూసి మోహావేశంలో తండ్రిని-భార్యను కోల్పోయి చివరకు మార్పుకు (చింతామణి ద్వారా) లోనైన చక్కటి సన్నివేశబలం గల దృశ్యాలతో 200పైగా పద్యాలతో తెలుగు వారికి అపూర్వ సొత్తుఅయిన గొప్ప సాంఘిక పద్య నాటకాన్ని ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బతిన్నాయని నిషేధించడం అప్రజాస్వామికం, అనాలోచితం. బ్రాహ్మణ కుటుంబ ఛాందస భావాలు.. బాల్య వివాహాల తంతుపై గురజాడ రాసిన 'కన్యాశుల్కం'పైన రేపు ఎవరో గొడవ చేస్తే దాన్ని ఇలానే ప్రక్కన పెట్టే (దు)స్థితి రావచ్చు. ఇబ్బందికర సన్నివేశాలు, సంభాషణలు తొలగించి యధాతధంగా ప్రదర్శన వీలు కల్పించకోరుతున్నాను. ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు. పునరాలోచించాలి!
- తంగిరాలచక్రవర్తి,9393804472