Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌరీ శంకర్ అలా దళిత కవిత్వం రాసుకుంటూ ఉండిపోతే ఎలా ఉండేదో కానీ సతీష్ చందర్ అప్పటిదాకా రేఖా మాత్రంగా చేస్తున్న ''ఎవరి అనుభవాలను వాళ్లే రాసుకోవాలి'' వాదనను లోలోపలికి వెళ్లి చూశాడు. ఫలితంగా వెనుకబడిన కులాలు-వెంటాడే కలాలు అనే సంకలనం వచ్చింది. అలా తెలుగు కవిత్వంలో బి.సి అస్తిత్వ ఉద్యమానికి నాంది పలికాడు. వెంటాడే కలాలకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. రెండు దశాబ్దాల తరువాత ఒక తెలంగాణ కవి సంపాదకత్వం వహించిన మొదటి కవిత్వ సంకలనం అది.
ఆ ఆతరువాత పొక్కిలి. సురవరం ప్రతాప రెడ్డి గోలకొండ కవుల సంచిక తరువాత తెలంగాణా కవుల కవిత్వాన్ని రికార్డ్ చేసిన మొదటి కవిత్వ సంకలనం అది.
''నిశ్శబ్దం అత్యంత మొద్దుబారిన పనికిరాని పనిముట్టు. అది నిను భూమిలోతుల్లోకి దిగగొడుతుంది. అది నీలో లోపలి అపరాధ భావపు అగాధాల్లోకి తీసుకుని వెళుతుంది. నీలో లోపలి శబ్దాలని తప్పు పడుతుంది. బాహ్య విమర్శ కంటే అది విష పూరితమైనది'' ఇది జైలు నుంచి స్నేహలతా రెడ్డి తన భర్త పఠాభి రామి రెడ్డికి రాసిన ఉత్తరంలో ఒక భాగం. ఈ ఉత్తరాన్ని ఆమె మరొక సందర్భంలో రాసింది. కానీ, నిజమైన కవి అన్నవాడు కూడా ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండకూడదు. అతడు నిశ్శబ్దంగా ఉంటే సమాజానికి చెప్పలేనంత నష్టం జరుగుతుంది. అందుకేనేమో ఒక ఆంగ్ల కవి ''కవులు అనధికార శాసన కర్తలు'' అని అన్నది ఎప్పుడూ చలనశీలంగా, ప్రవాహ సదృశంగా, జలపాతోత్తుంగ తరంగ ధ్వనితో మాట్లాడే కవి జూలూరు గౌరీ శంకర్. ఎలియాస్ నుంచి ఇవ్వాల్టి దాకా గౌరీశంకర్ ప్రయాణం కూడా ఒక శబ్దం చూట్టూనే పరిభ్రమించింది
''గౌరీశంకర్ కవిత్వంలో ఏమి ఉంటుంది? ''అని ప్రశ్నించు కుని జవాబుల కోసం వెతుక్కుంటే మనకు జవాబులు దొరకవు. జీవితానికి అర్ధం ఏమిటి అని దయానిధి ప్రశ్నించినప్పుడు చివరకు మిగిలేది నవలలో వైకుంఠం మాస్టారు ఒక సీల్డ్ కవరు ఇస్తారు. ఆ తరువాత ఎప్పుడో కాత్యాయనీ చనిపోయాక దయానిధి ఆ సీల్డ్ కవరు విప్పి చూస్తే అందులో ఉత్త తెల్ల కాగితం ఒకటి దర్శనం ఇస్తుంది. జీవితానికి అర్ధం జీవిచండం తప్ప అది వ్యాఖ్యానాలలోనూ, అభిప్రాయ ప్రకటనలలోనూ, వాద వివాద ప్రసంగాలలోనూ ఉండదని దయానిధి అర్ధం చేసుకున్నాడేమో తెలియదు. ఇప్పుడీ ఉందంతం ఉటంకించడం ఎందుకు అంటే జీవితాన్ని నిర్వచించలేనట్టే గౌరీశంకర్ కవిత్వాన్ని కూడా నిర్వచించలేము. ఒక వాదానికో, వివాదానికో, భావజాలానికో పరిమితం చేయలేము. జీవితం ఎన్నెన్ని అనూహ్య మలుపులు తిరగగలదో. భావుకుడైన కవి వూహ ఎంతెంత దూరం ప్రయాణించగలదో, గౌరీశంకర్ కవిత్వం కూడా అన్ని మలుపులు తిరిగి, అంత దూరం ప్రయాణించింది.
ఆకాశం ఎలియాస్ అవని, అవని ఎలియాస్ ఆయుధం అన్న గౌరీశంకర్, పాదముద్ర రాసిన గౌరీశంకర్, మాలాకాకి రాసిన గౌరీశంకర్, పొక్కిలి, నా తెలంగాణ, గద్దర్ రాజ్యము మనము, ఇలా గౌరీశంకర్ ఎన్ని కవిత్వ సంపుటాలు వెలువరించాడో అంతమంది గౌరీశంకర్‌లు వున్నారు. అతడు ఏకకాలంలో అనేకుడు, ఒక్కడు. ఒక్కడు అనేకుడులా, అనేకుడు ఒక్కడులా మారడం వెనుక, అలా తాను మారుతూ సమాజాన్ని మార్చడానికి కావలసిన భూమికలు తన కవిత్వం ద్వారా అందించడం ద్వారా అతడు బహుముఖీనుడై చూస్తూ ఉండగానే మంధర పర్వతంలా ఎదిగిపోయాడు
నడిగూడెం వీధుల నుంచి, కోదాడ కాలేజీ దాటుకుని, అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం మీదుగా జర్నలిజంలోకి ప్రయాణించి అక్కడ నుంచి సామాజిక జీవనంలోకి చేసిన అనితరసాధ్యమైన ప్రయా ణంలో పూలదండలో దారంలా కనిపించే కనిపించకుండా కనిపించేది అతడి ఉద్యమ స్వభావం. అతడి చలనశీలత, నిరంతర అధ్యయనము, నిరం తర ఆలోచన ఈ లక్షణాలే గౌరీశంకర్‌ని తెలుగు సామాజిక ముఖచిత్రం ఎలా మారబోతుందో ముందే గమనించి, ఆ మార్పును సులభతరం చేయడానికి కావల సిన తాత్విక భూమికలు తయారు చేసి పెట్టగలిగేలా మలిచాయి. ఆ రకంగా తెలుగు సమాజాన్ని ముందుకు నడిపించే ఒక చోదకశక్తిగా తన కవిత్వాన్ని మలుస్తూ దాన్ని ప్రజాపరం చేయడంలో అతడు సాధించిన పరిణితీ మరొకరికి సాధ్యం కానిది
1991లో తన మొదటి కవిత్వ సంపుటి దీర్ఘ కవిత ఎలియాస్ వెలువరించినప్పుడు అతడు కేవలం ఒక సాధారణ సాదా సీదా వామపక్ష భావజాలం ఉన్న సృజన జీవి. కానీ అతడి చూపు ఎంత నిశితమైనదంటే అది రానున్న మహా మార్పును లేదా మెటామార్ఫాసిస్‌ను ముందే గమనించింది. అలా పాదముద్ర తయారయింది. అది తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన చిక్కనవుతున్న పాటకి నాందీ వాచకం అయింది . దేశీయ మార్క్సిజం, లాల్, నీల్ అనే పదబంధాలకు తాత్విక భూమిక అయింది. దళిత కవిత్వం ఉధృతంగా వస్తున్నప్పుడు అది విప్లవ శిబిరాలను కలుపుకుని పోవాలనే అవగాహనకు దారిదీపం అయింది. కానీ దళిత కవిత్వం దారితప్పుతున్నప్పుడు అంబెద్కర్ రూపంలో ఉన్న ఈ పూలే (ఈ మాట నాది కాదు ప్రసేన్‌ది) బీసీ సూర్యోదయాన్ని ఊహించాడు. మాలకాకి అయి కవిత్వ తీవె మీద కూర్చుని అవిశ్రాంతంగా చేసిన శబ్దాలే ''వెంటాడే కలాలు వెనుకబడిన కులాలు అయింది. విధేయతలు, నిర్ధారణలు చిక్కు ముడుల మధ్య తన సమకాలీన కవులు కొట్టుకుపోతున్నప్పుడు యితడు గద్దర్ రాజ్యం మనము అన్నాడు. నా తెలంగాణ అన్నాడు. ఆధిపత్య భావజాలము, వివక్ష అనే పదాలను నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అనే సూక్ష్మ స్థాయిలో సమాజం చూస్తున్నప్పుడు దానిని రాజ్యానికి, జీవితానికి, రాష్ట్రానికి ముడిపెట్టి వలస పాలన నుంచి విముక్తి అనే విశాలమైన మాక్రో లెవెల్‌కి తీసుకుని వెళ్లినవాడు గౌరీశంకర్.
మలిదశ తెలంగాణా ఉద్యమానికి '' నేను సైతం'' అంటూ కవిత్వ సమిధలే కాదు తన ప్రసంగాల ద్వారా కూడా తాత్విక భూమికలను తయారు చేసి పెట్టినవాడు గౌరీ శంకర్. స్వరాష్ట్రం సిద్దించాక సకారాత్మక కవిత్వం రాస్తూ ప్రతి సూక్ష్మ విషయాన్ని రికార్డ్ చేస్తూ తానె ఒక డిజిటల్ లైబ్రరీగా మారాడు గౌరీశంకర్ మొత్తం సాహిత్య ప్రయాణాన్ని విహంగ వీక్షణం చేస్తే విప్లవ భావజాలం నుంచి దళిత వాదం మీదుగా, బీసీ అస్తిత్వం వైపు ప్రయాణం చేసి అక్కడ నుంచి వలస పాలన నుంచి విముక్తి గీతం ఆలపించేవరకు నాలుగు దశలు కని పిస్తాయి. ఈ నాలుగు దశలు వేరు వేరు కాదు. నాలుగు దశలూ ఒక అఖండమైన అస్తిత్వంలో భాగాలే. మరొక మాటలో చెప్పాలి అంటే సముద్రంలో నుంచి లేచి పైకెగసిన ఆలా మళ్ళీ సముద్రంలో కలసిపోయినట్టే విభిన్న అస్తిత్వాలు ఒక అఖండతలో కలిసి పోయాయి. అందుకే యితడు ఏక కాలంలో అనేకుడు.
ఇలా పరస్పరం సంఘర్షించుకునే విభిన్న అస్తిత్వాలు ఒకే మనిషిలో ఉండటం, ఆ అస్తిత్వాల మధ్య సాధారణంగా ఉండే ఒక బిట్టర్ నెస్ లేకపోవడం చెప్పుకోదగిన విశేషం. సమాజం మొత్తం ఒక దానవ ఉద్వేగంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు, ఒక సామూహిక హిస్టీరియాలో పడి తనను తాను మరచి పోతున్నప్పుడు ఇలా బిట్టర్ నెస్ లేని సృజన కారులు సమాజ గమ నానికి చోదక శక్తులు అవుతారు దళిత అస్తిత్వ, బీసీ సూర్యోదయ కవిత్వం రాస్తూ సౌందర్య అనే సినీ నటి చనిపోతే లోకతప్త సౌందర్యం అనే కవిత రాయడం వెనుక తెలంగాణా భావోద్వేగాలు శిఖర ప్రాయంగా ఉన్నప్పుడు, అక్కినేని నాగేశ్వర రావు చనిపోతే ''నా తరానికి ప్రేమించడం నేర్పినవాడా'' అనడం ఆ బిట్టర్ నెస్ లేకపోవడం వలననూ, లోలోపల ఒక బాలుడు సజీవంగా ఉండటం మూలంగానూ ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కవికి ? తానూ నడయాడిన నడిగూడెం నేల నుంచి, తన తండ్రి బసవయ్య తన చిన్నతనంలో నేర్పిన పద్యాల నుంచి, తన స్నేహితులు పంచి ఇచ్చిన ప్రేమలో నుంచి, తన గురువులు
నేర్పిన సంస్కారంలో నుంచి. నిజానికి కవి అంటే ప్రత్యేకంగా ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడతాడా ? ఏమి ? సమాజంలో నుండే వస్తాడ. అతడు ఎలాంటి సమాజంలో నుంచి వస్తున్నాడు, ఎలాంటి సమాజాన్ని కలగంటు న్నాడు? అన్నది ప్రధానమైన ప్రశ్న చాతుర్వర్ణ వ్యవస్థలో నుంచి వచ్చిన కవి, వర్ణాశ్రమ ధర్మాలు ఏవీ లేని సమసమాజాన్ని స్వప్నించిన కవి, చివరకు సబ్బండ వర్ణాల అస్తిత్వ చైతన్యం తనతో తాను ఘర్షణపడుతూ ఆ ఘర్షణలు ఫలితంగా ఏర్పడే సమస్యలను పరిష్కరించుకుంటూ ఒక ఏకీకృత చైతన్యం వంక సాగాలని ఆశిస్తున్నాడు. ఆ తాత్విక భూమిక వెనుక ఉన్న ఘర్షణ సామాన్యమైనదేమీ కాదు. గౌరీశంకర్ అంత వేగంగా రాసే కవిని నేనింతవరకూ చూడలేదు . అంత వేగంగా రాస్తున్నప్పుడు సాధారణంగా చాలా తక్కువ మాత్రమే కవిత్వంగా నిలిచే అవకాశం ఉంటుంది. పైగా తనను తాను రిపీట్ చేసుకునే అవకాశమూ ఎక్కువే ఉంటుంది. కానీ ఈ రెండు ప్రమాదాల నుంచీ గౌరీశంకర్ చాలా అలవోకగా బయటపడ్డాడు. అందుకు ప్రధాన మైన కారణం, ప్రతి చిన్న విషయాన్నీ అతడు హృదయంతో చూడటం, అనుభవించడం, కవిత్వీకరించడం. కన్ను చూసే చూపుకి, హృదయం చూసే చూపుకి నడుమ చాలా తేడా ఉంటుంది .
ఈ తేడా లేదా వివేచన అతడి ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. కవిత్వం రాసే తండ్రులు - కార్పొరేట్ పిల్లలు రాసినా, పొరకల తల్లి గురించి రాసినా, తుఫాను ధాటికి కొట్టు కునిపోయిన ఒక లేత మొక్క గురించి రాసినా ఆ వస్తువుతో మమేకం, తాదాత్మ్యం చెందటం ఉంటుంది. పాఠకుడికి అర్ధం కావడం కోసం విభిన్న రూపాలలో పదచిత్రాలను విరివిగా అతడు గుప్పించడు. అతడు చేసేదల్లా ముడి జీవితాన్ని, ఎలాంటి అలంకారాలు లేకుండా పాఠకుడి ముందు ఉంచడమే. దాని వలన పాఠకుడు ఇదేమి కవిత్వం అనుకునే ప్రమాదం వుంది. కానీ ఇదే కవిత్వమని లోపలి వ్యక్తి స్పష్టం చేస్తాడు. గౌరీ శంకర్‌ను ఎప్పుడు చూసినా నా కెందుకో ఆ భూపేన్ హజారికా గుర్తు కొస్తుంటాడు. పార్లమెంట్ లాబీలలో నడుస్తున్నా, అంతర్జాతీయ వేదికలమీద మాట్లాడుతున్నా, దేశవిదేశాలలో కచేరీలు చేస్తున్నా హజారికా ఎప్పుడూ తన కామరూపను మరచిపోలేదు. తానున్న ప్రతిచోటా ఒక చిన్న కామరూపను సృష్టించాడు. కామరూప సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతిని కలిగించాడు. అతడి లాగే గౌరీశంకర్ కూడా తాను ఎక్కడున్నా అక్కడొక చిన్న నడిగూడేన్ని సృష్టిచుకున్నాడు. అక్కడే ఒక కొలిమి దగ్గర నాగలి కఱును లేచే చేతులను, గాలిలో కెగసె పెద్ద బాడిశను, రాళ్ల బాయిను, ఎర్రటి ఎండలో, జోరు వానలో తడిసి పొలం పని చేసే అమ్మ సక్కుబాయిని, పాండవోద్యోగంలోని పద్యాలని గొంతెత్తి పాడే బసవయ్య మాస్టారును సృష్టించుకున్నాడ. గాలిలోకెగసె పెద్ద బాడిశెకి కావ్య గౌరవాన్ని కల్పించాడు ఆ పల్లెటూరి జీవన విధానాన్ని హృదయంలో నుంచి ఎప్పుడూ తొలగిపోనివ్వలేదు. అందుకేనేమో ఎంతోమంది సృజన కారులను మింగేసిన జర్నలిజం గౌరీశంకర్‌ను ఏమీ చేయలేక పోయింది. జర్నలిజం అనే మహాబిలంలో పడిపోయి తమ కవిత్వ వాక్యాన్ని పోగొట్టుకున్న వాళ్లు ఎంతమందో. చాలామంది జర్నలిస్టులు వాక్యాన్ని ఎంత కవితాత్మకంగా చెప్పి వార్తను రక్తి కట్టించాలా అని ఆలోచిస్తే గౌరీశంకర్ మాత్రం ఒక వార్తను కవిత్వంగా ఎలా మలాచాలా అని ఆలోచిస్తాడు. నేనేదో మర్యాద కోసం ఆలోచిస్తాడు అన్నాను కానీ నిజానికా అవసరమే లేదు. అలవోకగా అది గౌరీశంకర్ అక్షరాలలో అది కవిత్వం అయిపోతుంది
గౌరీశంకర్ కవిత్వ ప్రస్థానం మరొక ప్రధాన భూమిక వహించింది అతడు పుట్టిన నడిగూడెం. నడిగూడెం పేరు చెపితే చాలు అతడి వొళ్ళు పులకరిస్తుంది. నిజానికి తెలంగాణా సాహిత్య, సామాజిక ప్రస్థానంలో మునగాల పరగణాకి అగణిత ప్రాధాన్యం వుంది. జమిందారు నాయని వెంకట రంగారావు చేసిన సాహిత్య కృషి కానీ నడిగూడెం కోటలో నాయని వెంకట రంగారావు దివాన్ జీ గా కొమర్రాజు లక్ష్మణ రావు పంతులుగారు చేసిన సాహిత్య కృషి కానీ ఎనలేనివి. భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జాతీయ పతాక ఆలోచన చేసింది నడిగూడెం కోటలోనే అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ అది వాస్తవం. ఈ నడిగూడెం సాహిత్య వారసత్వమంతా గౌరీశంకర్‌కి, ఆ గాలి, ఆ నేల, ఆ నీళ్లు సంకల్పితంగానో, అసంకల్పితంగానో అందించి ఉంటాయి. అందుకే గౌరీ శంకర్ సాహిత్య, సామాజిక ప్రస్థానం బహు ముఖాలుగా సాగింది .
గౌరీ శంకర్ ఎలియాస్ 1991లో వచ్చింది. 14 మంది విప్లవకారులను పట్టుకుని ఖమ్మం జిల్లా పగిడేరు దగ్గర చేసిన ఎంకౌంటర్‌కి తక్షణ ప్రతిస్పందన అది. అది కావడానికి తక్షణ ప్రతిస్పందన అయినా దాని వెనుకకే, ఆర్.ఆర్ కాలేజీ కోదాడ జీవితమూ, కోదాడ గోడల మీద జాజుతో రాసిన విప్లవ నినాదాల ఉద్వేగము, అనంతపురం కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయంలో పి.డి.ఎస్.యును ముందుకు నడిపించిన అనుభవమూ అన్నీ కలగలసి ఉన్నాయి. ఎలియాస్ అని దీర్ఘ కవితకు పేరు పెట్టడం ద్వారా తెలుగు కవిత్వంలో తాను కలిగించబోయే సంచలననానికి ఒక నాందీ వాచకం పలికాడు.
ఎలియాస్‌తో దీర్ఘ కవిత గౌరీశంకర్‌కి మాలిమి అయింది. అలా ఎలియాస్, పాదముద్ర, పోలికట్టె, ఊరు చావు, నా తెలంగాణ, కాటు, సిలబస్‌లో లేనిపాఠం, మూడవ గుణపాఠం, ఓమ్ నమః శవాయ, మొగిలిచర్ల, లాంటి దీర్ఘకవితలు చాలా రాశాడు. గౌరీశంకర్ లోని ఆవేశానికి, జలపాత ధ్వనితో ముందుకు దూకే అక్షర ప్రవాహానికి దీర్ఘ కవితలోని లయ, తూగు సరిగ్గా సరిపోయింది. తెలుగు కవిత్వలోకంలో దీర్ఘ కవితకి పర్యాయపదంగా గౌరీశంకర్ మారిపోయాడు. ఒకప్పుడు జాషువా ఎంత అలవోకగా ఖండ కావ్యాలు రాశాడో అంత అలవోకగా గౌరీ దీర్ఘ కవితలు రాశాడు
అతడి పాదముద్ర ఒక సంచలనం. అప్పటిదాకా సతీష్ చందర్ లాంటి కవులు తెలుగు కవిత్వంలో ఒక మెటా మార్పసిస్ కోసం ప్రయత్నం చేస్తూ రేఖామాత్రంగా దళిత కవితోద్యమానికి దారులు వేస్తున్నప్పుడు పాదముద్రతో ఒక ఊపును ఇచ్చి, తెలుగు కవిత్వం ఒక పెద్ద అంగ వేయడానికి కారణం అయ్యాడు. జి లక్ష్మీ నరసయ్య పాదముద్రకి విపులమైన ముందు మాట రాసాడు. త్రిపురనేని శ్రీనివాస్ చొరవ, సలహాతో కోదాడలో జరిపిన దళిత సాహిత్య సదస్సు ఒక పెద్ద ముందడుగు. దాదాపు 150 మంది కవులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలువైపుల నుంచీ పాల్గొనడం దళిత సాహిత్య ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవడం, ఆ ఆతరువాత జరిగింది అంతా ఒక చరిత్ర
గౌరీ శంకర్ అలా దళిత కవిత్వం రాసుకుంటూ ఉండిపోతే ఎలా ఉండేదో కానీ సతీష్ చందర్ అప్పటిదాకా రేఖా మాత్రంగా చేస్తున్న ''ఎవరి అనుభవాలను వాళ్లే రాసుకోవాలి'' వాదనను లోలోపలికి వెళ్లి చూశాడు. ఫలితంగా వెనుకబడిన కులాలు- వెంటాడే కలాలు అనే సంకలనం వచ్చింది. అలా తెలుగు కవిత్వంలో బి.సి అస్తిత్వ ఉద్యమానికి నాంది పలికాడు. రెండు దశాబ్ధాల తర్వాత తెలంగాణ కవి సంపాదకత్వంలో వచ్చిన తొలి సంకలనం ఇది.
ఆ తరువాత పొక్కిలి. సురవరం ప్రతాప రెడ్డి గోలకొండ కవుల సంచిక తరువాత తెలంగాణా కవుల కవిత్వాన్ని రికార్డ్ చేసిన మొదటి కవిత్వ సంకలనం ఇది. ఆ తరువాత సుంకిరెడ్డి మత్తడి వచ్చింది. పొక్కిలితోనే తెలంగాణ భాషలో కవిత్వం రాయవచ్చు అనే ధైర్యం సగటు తెలంగాణా కవికి కలిగింది. పొక్కిలి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక లైట్ హౌస్. ఆ వెలుగులో తెలంగాణా అస్తిత్వ కవిత్వం కొత్త పుంతలు తొక్కింది.
1997 నాటికి రాష్ట్రంలో పరిస్థితులు కొత్త మలుపులు తిరిగే సూచనలు ఏవో కనిపించి, కంపించసాగాయి. సరిగ్గా అప్పుడే గౌరీశంకర్ ''నా తెలంగాణ'' అన్న దీర్ఘ కవితతో అస్తిత్వ ఉద్యమాలలో మరొక కొత్త అధ్యాయానికి తలుపులు తెరిచాడు. చిన్న పుస్తకమేకాని పెద్ద ప్రభావాన్ని చూపింది. అంతకు ముందు కుందుర్తి రాసిన తెలంగాణ వేరు. ఇప్పుడు గౌరీశంకర్ చూసిన, చూపించిన తెలంగాణ వేరు. నూతన ఆర్ధిక విధానాలు దేశంలో మొదలు అయి అర్ధదశాబ్దం గడిచాక, ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు ఆ సంస్కరణలను అమిత వేగంతో అమలు పరచడం మొదలు పెట్టాక తెలంగాణ ఒక ప్రయోగశాల అయింది . ఆర్ధిక సంస్కరణలకు మూల విరాట్టు అయిన పివి నరసింహారావు సైతం ''ఆర్ధిక సంస్కరణలకు మకర ముఖం తప్ప మానవ ముఖం లేదు. నేను ఆశించిన సంస్కరణలు ఇవి కావు'' అని లోగొంతుకతో అయినా కన్ఫెషన్ ప్రకటించాల్సినంతగా అవి మిస్ ఫైర్ అయ్యాయి. ఆ సంస్కరణల తూటా దెబ్బ మొదటగా తెలంగాణానే చవి చూసింది.
నెమ్మదిగా ప్రత్యేక రాష్ట్ర భావన మళ్ళీ రగుల్కొన సాగింది. 1997 మార్చిలో నా తెలంగాణా వచ్చి మలిదశ తెలంగాణా ఉద్యమానికి తెలంగాణా సాహిత్య పరంగా ఒక సంసిద్ధతను వెల్లడి చేసింది. ఆ తరువాత నాలుగేండ్లకు తెలంగాణా రాష్ట్ర సమితి ఏర్పడటం ఒక ప్రధానమైన ఘట్టం. తెలంగాణా ఆకాంక్ష ఎంత బలంగా ఉన్నప్పటికీ తెలంగాణాలోని కవులే గట్టిగా తెలంగాణా వాదం వినిపించడానికి సందేహం వ్యక్తం చేస్తున్న దశలో 2004-2005లోనే కానీ తెనాలిలో జరిగిన ఒక సాహిత్య సభలో తన దీర్ఘ కవిత నా తెలంగాణా వినిపించి మీరు తెలంగాణా ఉద్యమాన్ని ఎందుకు బలపరచరు ? అని గట్టిగా నిలదీశాడు. పిఠాపురంలో తెలంగాణా సాయుధ పోరాటం మీద వజ్రాయుధం రాసిన సోమసుందర్‌ను, గాజువాకలో జరిగిన ఒక సాహిత్య సమావేశంలో కాళీపట్నం రామారావు మాస్టారిని తెలంగాణా ఉద్యమం పట్ల సానుకూల ప్రకటన చేయించేంతవరకు సీమాంధ్ర కవులను నిలదీస్తూనే ఉన్నాడు.
ఇది తెగతెంపుల సంగ్రామం // ఇక తెగిస్తేనే తెలంగాణా సాధ్యం అన్న గౌరీ శంకర్ కవిత్వ వాక్యాలు తెలంగాణా గోడల మీద అరుణారుణ అక్షరాలుగా నిలబడి తెలంగాణా సాధారణ ప్రజానీకంలో నిరంతర ఆలోచనకు ప్రేరకాలుగా నిలిచాయి . తెలంగాణా ఉద్యమంలో గౌరీ శంకర్ కవిగా, ఉద్యమకారుడిగా నిలబడి, మేధోపరంగా కలబడి ఆనాటి దాశరథి, సర్వదేవభట్ల నరసింహమూర్తి (కవిరాజమూర్తి) వారసత్వాన్ని కొనసాగిం చాడు. సకల జనుల సమ్మె కాలంలో తెలంగాణాలోని అణువణువునా, ప్రతి నిమిషం ఏమి జరిగిందో, ఎలా జరిగిందో ఆ నలభరు రోజలు అంటూ రెండు సంపుటాలలో రికార్డ్ చేశాడు. ఒక చారిత్రిక ఘట్టం నడుస్తున్నప్పుడే రికార్డ్ చేయడం బహుశా తెలంగాణాలో తప్ప మరొక చోట ఇంతవరకూ జరిగివుండదు .
ఆ తరువాత 2004లో గౌరీశంకర్ తాను రాసిన దీర్ఘ కవితలను మినహాయించి ఇతరత్రా రాసిన కవిత్వమంతా ముండ్ల కర్ర పేరుతో 250 పేజీల ఒక బృహత్ సంకలనంగా తీసుకునివచ్చాడు. కదిలితే నీళ్లు, కాళ్ళ సందులలో నీళ్లు, కేరింతలకు నీళ్లు, కౌగిలింతలకు నీళ్లు, ఎక్కడో నాసికా త్రయంబకంలో పుట్టి పరుగులు తీసి అలసి సొలసి సముద్రపు వొడిలో గోదావరి సేద తీరే చోట పుట్టిన సతీష్ చందర్ అనే కోస్తా ఆంధ్ర కవి చేత ''వంద నదులకు ఒక్కసారిగా గండి కొట్టాలనిపించింది. ఒక్కసారైనా తెలంగాణలో గంగమ్మను దర్శించాలనిపించింది'' కన్ఫెషన్ లాంటి అభిప్రాయ ప్రకటన చేయించడం ముండ్ల కర్ర విజయం. అంతే కాదు, మలిదశ తెలంగాణా ఉద్యమం లో ఐకానిక్ నినాదాలు అయిన ''నీళ్లు, నిధులు, ఉద్యోగాలకి సాహిత్య పరంగా విస్తృతమైన ఆమోదాన్ని సాధించడంలో ముండ్ల కర్ర పాత్ర చిన్నదేమీ కాదు
ఇప్పుడీ చరిత్రను అంతా చెప్పడం ఎందుకు అంటే గౌరీ శంకర్ అనే కవి నెపంగా కవులు ఒక చరిత్రను ఎలా సృష్టిస్తారు? చరిత్ర తిరిగే మలుపులకు ఎలా చోదక శక్తులు అవుతారు ? తామే ఒక చరిత్రగా మారిపోతారు అనే విషయం సూక్ష్మంగా అయినా వివరించడానికి నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా వివేచన చేస్తే తెలుగు అస్తిత్వ కవిత్వం తిరిగిన ప్రతి మలుపులో గౌరీ శంకర్ చేతిలో ఒక టార్చ్ పట్టుకుని దారి దీపమై నిలిచాడు . చారిత్రక గమనాన్ని వేగవంతం చేసాడు . నడిగూడెం నట్టనడుమ పసుపు కుంకుమ లతో నిండి కనిపించే బొడ్రాయి లా గౌరీశంకర్ తెలుగు కవిత్వం నట్ట నడుమ నిలబడిపోయాడు ఒక విషయం గురించి, ఒక సంఘటన గురించి, మన మనసుకు తోచిన విధంగా అక్షరాలు ఎట్టా వస్తే అట్లా పరిచెయ్యాలి. ఇందులో ఎట్లాంటి మొహమాటాలు వుండకూడదు. అసలు మనం ఏమి అనుకుంటామో అదే కవిత్వం. కానీ ఇట్లా రాస్తే కవిత్వం అంటారా అనుకుని పదాలు అల్లుకునేవాడు కవి కాలేడు. సహజంగా మనం నడుస్తున్నప్పుడు ఒక ప్లాన్ లేకుండా అడుగులు ఎలా వేస్తామో, అదే కవిత్వ మనుకుంటా. అట్లా కాకుండా ఇట్లా ఏస్తేనే అడుగులంటే అది ఫ్యాషన్ షో అవుతుంది
ఇది గౌరీశంకర్ ముండ్లకర్రకి రాసుకున్న ముందుమాటలో కవిత్వం గురించి చెప్పుకున్న మాటలు. ఆ సంకలనం వచ్చి దాదాపు దశాబ్దంన్నర గడచిపోయింది. ఇప్పటికీ కవిత్వం విషయంలో గౌరీశంకర్ అభిప్రాయాలూ ఏమీ మారలేదు. ఒక విషయాన్ని అనుకున్నప్పుడు మనసులో అక్షరాలు, పదాలుగా, వాక్యాలుగా ఎలా మారి కాగితం మీదకు దూకుతాయో వాటిని యథాతథంగా అలాగే వుంచేస్తాడు. ఎక్కడా అమరశిల్పి జక్కన్న లాగా అక్షరాలను చెక్కఁడు. అలవోకగా సందర్భానికి తగినట్టు వాక్యాలు వాటికీ అవి పడవలసిందే తప్పిస్తే పెనుగులాట ఉండదు. అందుకే ఆ అక్షరాలకు బొడ్డు తాడు కోసినప్పటి పరిమళం .
గౌరీశంకర్ కవిత్వం వెన్నెల్లో ఆడపిల్లలు ఆడుకున్నంత సున్నితంగా నెమలీకలతో బుగ్గల మీద స్పర్శించినట్టుగా ఉండదు. చెంప మీద ఛెళ్ళున కొట్టినట్టు ఉంటుంది. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించడం కాదు రెండు చెంపలు నేనే వాయిస్తా అన్నంత పదునుగా ఉంటుంది. వాక్య నిర్మాణంలో ఎలాంటి శషభిషలు ఉండవు. అదేదో ప్రకటనలో సుత్తి లేకుండా సూటిగా అన్నట్టుగా, పాఠకుడి గుండెలల్లోకి సూటిగా దూసుకుని వెళ్లేట్టు ఉంటుంది.
కవిత్వాభివ్యక్తి కంటే విషయ ప్రసారణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. కవిత్వం ఒక అభూత కల్పన కాదు గౌరీశంకర్‌కి. అది కణ కణ మండే నిప్పుల జడివాన. ఆ వానలో తడిపేస్తూనే, తనలోని ఆవేశాన్ని పాఠకుడిలో కూడా అలవోకగా కలిగించగలడు ఎలియాస్ నుండి ఇప్పటిదాకా. అదే ఆవేశం, అదే ఉత్తేజం. తన లోపల అగ్ని సరస్సులు ఉన్నాయి కనుక అతడి అక్షరాలకి అంత పదును గౌరీశంకర్ కవిత్వం ఒక తుదిలేని వాక్యం. ఎప్పటికీ ముగింపుకు రాని ఒక ఆత్మశోధన. కార్యాచరణ.
(తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడుగా
జూలూరు గౌరీశంకర్‌ను నియమించిన సందర్భంగా)
- వంశీకృష్ణ,9573427422