Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇపుడు
ఆ నాలుగు గోడలు
ఆకాశమయ్యాయి .
నిశబ్ధం గాలివలె ప్రవహిస్తున్నది .
వాళ్ళిపుడు రెండు పక్షులుగా మారిపోయారు .
ఆమె ఇన్నాళ్లు ఎన్నో ప్రశ్నలను మోస్తున్నది.
ఆ ప్రశ్నలన్నింటికి అతడు సమాధానామవుతాడనే నమ్మకం కలిగింది.
అతని ఎదపై మెల్లగా వాలి
కళ్ళలోకి చూస్తుంటే
ఆమె హదయ అన్వేషణను అర్థం చేసుకుంటూ ..
అతను తన కనురెప్పలను ఒంచుతూ నేనున్నాను అన్నట్టుగా ధైర్యమిచ్చాడు .
అంతలో ఆమె
''నాకో సందేహం ...!!?''
ఏంటో అడుగు.
''హక్కులు అంటే ఏమిటి ..!?''
నీ అస్తిత్వం కోసం నువ్వు స్వేచ్ఛగా జీవించగలగడం ...అవి ఇతరుల నుండి పొందేవి కావు .నీలోనే ఉండేవి .
''మరి ఆడవాళ్ళ హక్కులు మగవాళ్ల అధీనంలోనే ఉంటాయా ..!?''
అతనిలో మౌనం ప్రహహిస్తున్నది .....
సిగ్గుతో తల దించుకున్నాడు
ఆమె అతని తలను ఎత్తుతూ
''మరి నేనెందుకు చదువుకోలేదు .''
మగవాడు ఆధిపత్యం చేలాయించేది
ఆడవాళ్ళ బతుకు పైననే కదా ''
కనపడని పంజరంలో
కట్టేయబడ్డ హక్కులెన్నో ...
ఇపుడు
అతను, అతను లాంటి ఎందరో
హదయాలు వర్షిస్తున్నాయి.
ఆమె ఓదార్పు కాదు
ఆమె ఒక సానుభూతి కాదు
ఆమె ఒక నిజం
దోచుకొని దాయబడుతున్న
వెలుగులాంటి నిజం.
- రామ్ పెరుమాండ్ల,9542265831