Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అపరచిత యువతిలా
మృత్యురాణి తారసనడితే
ముద్దు పెట్టుకోవడానికి వెనుకాడనని
ఆమెకెవరైనా చెప్పండి
నాతో లేచిపోయే ధైర్యాన్ని
సంపాదించుకోమని - (చావుని చంపండి)
వర్తమాన ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇంతలోతైన జీవన తాత్వికతతో తన మరణం గురించి మరణానికే సవాల్ విసిరిన కవి ఇంకొకరు ఉండరేమో. సున్నిత సుధామయుడు పండితకవి బహుభాషల్లో పాండిత్యాన్ని స్వయం కృషితో సంపాదించుకున్న దళిత కవులలో ఎండ్లూరి సుధాకర్ అరుదైన కవిగా తెలుగు వచన కవితా ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
90వ దశకం తెలుగు వచన కవితా సాహిత్యవేదిక మీదకు తన విలక్షణమైన అభివ్యక్తి, సహజసిద్ధమైన భావుకత, వస్తు వైవిధ్యంతో తెలుగు పాఠకలోకానికి నిండు గోదావరిలా వర్తమానమై ప్రవహించిన కవి. జీవిక కోసం హైదరాబాద్ వెస్లీ బార్సు హైస్కూల్లో తెలుగు పండితుడిగా జీవనయానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. గత నాలుగు దశాబ్దాల కాలం నుంచి మొన్న శుక్రవారం మరణించే వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సీనియర్ ఆచార్యులుగా అనేక పదవులును నిర్వహించారు. ఇది తన జీవితంలో ప్రధాన స్రవంతిగా కొనసాగినప్పటికీ ఇంతటి స్థాయిని చేరుకోవడానికి ఎక్కడో నిజామాబాద్ పాముల బస్తీ నుంచి జీవితాన్ని భుజానేసుకుని బయల్దేరిన అత్యంత పేద దళితుడు సుధాకరుడు ఆమన మాటల్లో చెప్పాలంటే...
' 'ఆగ్రహం రాని అక్షరం జ్వలించదనీ
ఆర్థ్రత లేని వ్యాక్యం ఫలించదనీ
నా అనుభవం నేర్పిన కవిత్వ పాఠం
నాలుగు మెతుకులే నా అక్షరాలు
నలుగురు మనుష్యులే నేను చదివిన ప్రబంధాలు
నా బాల్య దృశ్యాలే నేను చూసిన అలంకార శాస్త్రాలు
ఆకలి రసం నాలోని రచనా రహస్యం
అవమానం విషం...
నా కంఠంలోని నీలామృత విశేషం
మా బీద బస్తీలే నన్ను కవిని చేశాయి
నాలోని భావుకత్వానికీ బాధల తత్త్వానికీ బాటలు వేశాయి
మా వీధికుక్కలు.. జీవితాన్నీ/జీవించడాన్నీ నేర్పాయి''-
అని సగర్వంగా తన నేపథ్యాన్ని ప్రకటించుకున్న కవి ప్రాచ్యకళాశాలలో బి.ఏ ఓరియంటల్ లాంగ్వేజ్‌ని చదువుకుని హైదరాబాద్ పాత బస్తీలో జరిగే ఉర్దూ ముషాయిరాల ప్రభావంతో ఉర్దూ భాషమీద సాధికారికమైన పట్టును సాధించారు. స్వయం కృషితో, సునిశితమైన పరిశీలన, విపరీతమైన అధ్యయనం వలన ప్రాచీన సాహిత్యం, వ్యాకరణం, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ భాషలను అధ్యయనం చేశారు. విద్యార్థిగా సినారె ప్రభావంతో దొరికిన వేదికల మీద కవితా పఠనం చేసి ఆనాటి మహాకవులను ఆకర్షించారు. అనంతరం 1991లో రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠంలో ఆధునిక తెలుగు అధ్యయన శాఖలో ఆచార్యుడిగా ఆయన జీవితంలో కీలకమైన మలుపు జీవన సహచరి పుట్ల హేమలత అప్పటికే కవయిత్రి, కథా రచయిత్రి ఇద్దరు బిడ్డలు మానస, మనోజ్ఞలతో రాజ మహేంద్రవరం గాంధీపురంలో నివాసం ఏర్పాటు చేసుకుని దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కవిగా, ఆచార్యుడిగా, దళిత కవిత్వ సృజనకారుడిగా, కథకుడిగా ఆయన తెలుగు సాహిత్యంలో విశేషంగా కృషి చేశారు.
ఒక వైపు గోదావరి జిల్లాల సంప్రదాయ పండితులతో చెలిమి చేస్తూనే తన జాతిని, దుఃఖాన్ని, ఆవమానాల్ని, ఆకలిని మరువని కవిగా 1992లో 'వర్తమానం' కవితా సంపుటిని తీసుకొచ్చారు. 'గూర్కా', 'గ్రీష్మ గోదావరి', 'మైసమ్మ మరణం', 'తెలంగాణ ఉత్తరం', నక్షత్రమాల ఒక సాయంత్రం గోదావరి, 'దొంగ నాన్న' లాంటి కవితలు సాహిత్య లోకంలో గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. గోదావరి మీద ఎండ్లూరి రాసిన కవితలు అప్పటికీ, ఇప్పటికీ నభూతోనభవిష్యత్ అన్నంతగా సాహిత్య పాఠకుల్ని ఆకట్టుకున్నాయి.
ప్రతికవి తనదైన అనుభవిక ప్రపంచం లోకి తలుపులు తెరుస్తాడు. తనకంటే ముందు రాసిన కవుల కంటే భిన్నంగా, అభివ్యక్తి లోనూ, వాక్యనిర్మాణంలోనూ, కొత్త మెట ఫర్లు, సిమిలీలతో ఆకట్టుకుంటాడు వర్తమానం కవితా సంపుటి ప్రత్యేక గుర్తింపుని, అనేక అవార్డులని తెచ్చి పెట్టింది. మరో వైపు సుధాకర్లో పంచభూతాల్లా ఐదు ప్రత్యేకతలు గోదావరి పాయల్లా విస్తరించి ఉన్నాయి. కవిగా, పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, కథకుడిగా, విమర్శకుడిగా అంతకంటే మించి యువ పరిశోధ కులకు... పర్యవేక్షకుడిగా ఆయనిచ్చిన స్ఫూర్తి వందలాది మంది స్కాల్లర్లకు సుపరిచితమే.
సాహిత్య విద్యార్థులుగా సాహిత్య పీఠంలో తెలంగాణ జిల్లాల నుంచి 90వ దశకం చివరిలో అడుగు పెట్టిన నాలాంటి విద్యార్థులను, అంతకుముందు బెల్లి యాదయ్య, ఇక్బాల్చంద్, మధిర సిద్ధన్న, మల్లికార్జున్, ఖాజా, గుంటూరు నుంచి వచ్చిన వినోదిని లాంటి సాహిత్య విద్యార్థులకు బేతవోలు రామబ్రహ్మం, శిఖామణి, సుధాకర్‌లు పాఠలు చెప్పారు. కేవలం వాళ్లకోసమే మేమంతా ఆ సాహిత్య పీఠంలో అడుగు పెట్టాం. ప్రేమతో పాఠాలు, కవిత్వ రచనా పద్ధతులు చెప్పి, దేశదేశాల కవిత్యాన్ని పరిచయం చేశారు. మాకు వారి ఇంట్లోనే అన్నాలు... అక్షరాలు... అన్నీ దొరికారు. హేమమ్మ మాకు మమ్మల్ని కనుగొన్నతెల్లై అందరికీ తన కడుపులో అన్నం తీసిపెట్టేది. వాళ్ళ పిలల్లతోనే డొక్కలో దాచుకున్నారు. కవిత్వం ఎలా రాయాలో? భాషానైపుణ్యం ఎట్లా సాధించాలో మాకు నేర్పిందీ... చెప్పిందీ సుధాకర్గారే. అమర కోశంతో పాటు ప్రాచీన ఆంగ్ల సాహిత్యాలను అధ్యయనం చేయమని తన పుస్తకాల బీరువా తాళాలను మాకే అప్పగించిన నిలువెత్తు గురువు.
సాహిత్య పీఠంలో ఎం.ఏ తెలుగు విద్యార్థుల కంటే పరిశోధకులు ఎక్కువ సందండిగా ఉండేవారు. ఎండ్లూరి గారి దగ్గర 70 మంది ఎం.ఫిల్, 60 మంది పిహెచ్.డి పరిశోధనలు విభిన్న అంశాలపై చేశారు. ఒక వైపు సృజనాత్మకంగా కవిత్వ రాస్తూనే బోధకులుగా, పర్యవేక్షకులగా ఇతర విశ్వ విద్యాల యాలకంటే సాహిత్యపీఠంలో దళిత కవిత్వం కథ, నవల నాటకాలపై ఎక్కువ పరిశోధనలు జరగడంతో ఆయన కృషి మరువలేనిది. కవిగా ఆయన ఏది రాసినా పాఠకలోకాన్ని, సరికొత్తగా ఆలోచింపజేశారు. 'ఆటాజనికాంచె', 'వర్గీకరణీయం', 'మల్లెమొగ్గల కథలు', 'నల్ల ద్రాక్షపందిరి', 'గోసంగి', 'కొత్త గబ్బిలం', 'నా అక్షరమే నా ఆయుధం' కవితా సంపుటాలతో పాటు రుబాయీలు, గజళ్లు, అనువాదాలు చేశారు. మరాఠి దళిత కవి శరణ్‌కుమార్ లింబాలేను తెలుగువారికి పరిచయం చేసింది ఆయనే. దళిత కవిత్వ తాత్వికతకు సరికొత్త భూమికనిచ్చారు.
'రేపటి చరిత్రకు ముందు మాటను నేనే'' అని సగర్వంగా ప్రకటించిన కవి ఎండ్లూరి 'సుధాకర్ ఒక్కరే.
'మా డప్పు విన్నాడా
శివుడు చిందేయాల్సిందే
మా చెప్పు కొన్నాడా
కుబేరుడు పాదాభివందనం చేయాల్సిందే
మా కిన్నెర మోత విన్నాడా
నారద మహర్షి, మహతిని మర్చిపోవాల్సిందే
మా గోంగూర మాంసం తిన్నాడా
ఇంద్రుడు ఇంటి భోజనం విడిచిపెట్టాల్సిందే '' (గోసంగి)
పరిశోధకుడిగా జాషువ సాహిత్యం- 'పరిణామదృక్పధం' మీద సాధికారికమైన సిద్ధాంతగ్రంధాన్ని వెలురించారు. అద్భుతమైన వాచస్పతిగా, సభారంజకుడిగా అసంఖ్యాక శోత్రల్ని తనదైన ప్రాసలతో గొప్ప ప్రాసంగికుడిగా సాహితీ సహృదయాలను అనునిత్యం అలరించారు. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ కరోనా కాలంలో మా ఎస్‌ఆర్‌బిజిఎన్‌ఆర్ ఖమ్మం కళాశాల తెలుగు విభాగం నిర్వహించిన వెబినార్లలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని 'గజల్ ప్రక్రియ' మీద కాళోజీ జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రసంగాలు చేశారు. నాలాంటి పరిశోధకులకు పర్యవేక్షకులుగా ఉండి 'విమర్శకుడిగా చేరా పరిశోధన పూర్తి చేయడానికి, కవిగా నాలుగు కవితలు రాయడానికి వారి ప్రోత్సాహం మరువలేనిది హేమమ్మ తనకి ఇద్దరు మగపిల్లలున్నారని అందరికీ చెప్పేది. అందులో ఇక్బాల్చంద్ పెద్దకొడుకైతే, చిన్న కొడుకుగా నన్ను అమితమైన ప్రేమతో చూసేవారు. మేమేకాదు. ఆ పీఠంలో చదువుకున్న ప్రతి ఒక్కరి అనుభవం అనుభూతి ఇదే. చివరగా 'సుకవిగా జీవించు ప్రజల నాలుకయందు' వారి సాహిత్య మార్గాన్ని దళిత బహుజనుల ముందుకు తీసుకుపోవాలి. మానసకు, మనో జ్ఞలకు అండగా నిలవాలి ఎండ్లూరి లేనిలోటు తెలుగు సాహిత్యానికి ఎప్పటికీ తీరనిలోటు.
- డా|| ఎం.వి. రమణ,9989000265