Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎందుకు నాన్నా?' కవితలో తండ్రి గురించిన ్ఞపకాలు, జీవనతాత్విక పద బంధాలు, సత్యాలు, అనుభూతులు, నిర్వేదన, నివేదన, ఆత్మక్షోభ, వెలితి, కలత... కవితా పాదాలుగా మారిన వైనం ఈ కవి హృదయాంతరాళ నైర్మల్యతకు, పసితత్వానికి, రుషితత్వానికి, నిర్వ్యాజానురాగ భావాల లహరికి అద్దం పడతాయి. 'ఎందుకు నాన్నా?' ఎలిజీ కవిత. మనసున్న మనిషి గుండెను పిండేస్తుంది.
'కవి పూలతో మాట్లాడుతాడు పూల తోటలతో మాట్లాడుతాడు. మేఘాల సేనలతో పోట్లాడుతాడు. తుపానులతో పోట్లాడుతాడు. పోట్లాట వాడు బతకడానికి పీల్చే ఊపిరి. చేతులు నలపడం, చిత్తం అనడం వాడి పని కాదు' అని అంటారు యుగకవి శేషేంద్రశర్మ. ఈ మాటలన్నీ అక్షరాలా డాక్టర్ ప్రభాకర్ జైనీ పాదముద్రలు కవిత్వానికి, వ్యక్తిత్వానికి సరి పోతాయి.
ఇంగ్లాండ్ కవి ఫిలిప్ లార్కిన్ కవిత్వం గురించి చెబుతూ 'నాకు కవిత్వం గురించి 'ఐడియాలు' లేవు. నాకు సంబంధించినంత వరకు అది వ్యక్తిగతమైంది. సంక్లిష్టమైన అవసరాల ఒత్తిడి నుంచి వచ్చిన భౌతిక విముక్తి లేదా పరిష్కారం' కవిత్వం అంటాడు. సరిగ్గా ప్రభాకర్ జైనీ కవిత్వం అలాంటిదే! అది ఆయన వ్యక్తిగత అనుభూతుల నేపథ్యంలో వచ్చిన సామాజిక చేతన, అంతర్గత జ్వలన, దురన్యాయాలపై ఒక ఖడ్గ చాలన, తన ఆత్మీయులపై చల్లని కృతజ్ఞతల భాష్పధారల కన్నీటి వాన, సుతిమెత్తగా గుండెను కోసే ్ఞపకాల వంతెన. భార్యను ప్రేమించినా... స్నేహితుణ్ణి ప్రేమించినా నిష్కళంక, నిర్వ్యాజానురాగ గంగాంతరంగ పవిత్ర ఉత్తుంగ తరంగ ఉద్వేగ కెరటం జైనీ కవిత్వం. 'నాలో నువ్వు' అన్న కవితలో.
అందాల హరివిల్లును
నా మనోమంజూషలో భద్రపరిచి
మిత్రమా!
నువ్వు కోరుకున్నప్పుడు
నీ మదిలో చీకట్లు ముసురుకున్నప్పుడు
పిసరంత వెలుతురును పంచాలన్నదే నా ఆరాటం అంటాడు .
కరుణతత్త్వం లేనివాడు కవిగా జీవించడానికి అనరుÛ్హడు. మనుషులు నీచులు, స్నేహం, ప్రేమ అన్న పదాలకు అర్థం తెలియని మృగ మనస్తత్వాలు వారివి. అయితే కవులకు స్నేహం, ప్రేమ నిర్వ చనాలు తెలిసినా, స్వార్థపరులై కవితలు రాస్తే వారినేమనాలి?
అందుకే క్యూబా కవయిత్రి 'ఎలెనా' అన్నట్టు
'నేను ప్రవహించే పడవని.. కానీ నన్ను భూమిలో ముంచారు' అంటూ వాపోతుంది. కానీ, జైనీ లాంటి గుండె తడి ఉన్న కవి మనోమంజూషలో అందాల హరివిల్లులను స్నేహితుల కోసం దాచుకుని కవిత్వం రాస్తాడు. 'సౌరభమ్ములేల చిమ్ము.. పుష్ప వ్రజమ్ము, గాడ్పేల వీచు.. ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను....' అంటాడు కృష్ణశాస్త్రి. అలాగే జైనీ తన భార్యపై కవిత రాస్తూ తన ప్రేమను కుమ్మరించాడు.
'ప్రేమంటే' అన్న కవితలో,
నాకు తను లేకుంటే ఏమీ తోచదు
గాలి ఎప్పుడు పీల్చాలో కూడా తెలియదు
కళేబరాన్నై తిరుగుతున్న ఫీలింగ్!
ఇదేనా ప్రేమంటే?
అని తన ప్రేమను వ్యక్తచేశాడు.
జీవరసాయన శాస్త్రానికి కీలకం మూలకం..
నేను మూలకమై రసాయన చర్యను ప్రారంభిస్తే తను ఉత్ప్రేరకమై వేగవంతం చేస్తుంది. అంటూ సరికొత్త ప్రతీకలతో, కవితను రాగరంజితం చేశాడీ కవి. అంతే కాదు,
నేను మనిషిని కావాలంటే.. ఆమె చేతిగాజుల గలగలలు విన్పించాలి. ఆమె నవ్వుల కిలకిలలు విన్పించాలి.
అంటూ ఇలా ఎన్నో మెటా ఫర్లతో.. కవితను నిర్మిస్తూ.. ఆమెనే తన చెలిగా భావిస్తూ, తనే నన్ను లాలించాలి అంటారు. వాస్తవానికి అమ్మకు రూపమైన... అనాలి... కాని... కవితను ఎలా మెరిపించాలో ఈ కవికి బాగా తెలుసు... అందుకే.. చెలికి అని ప్రేమకు లౌకిక ప్రతీకను తగిలించి అలౌకికార్థాన్ని భార్యకు స్ఫురించేలా... కవితను శిల్పీకరించాడు.
'అల్లిగొరి' కవితాశైలిలో సాగిన ఈ కవిత జైని 'పాదముద్రలు' కవితా సంపుటిలో కవి, భార్య ప్రేమ గొప్పదని తెలియజేయడానికి వేసిన బొటనవ్రేలి ముద్ర. ఈ కవిత చదివాక లెబనాన్ కవి 'అడోనిస్' రాసిన
'ప్రేమించడంలో నన్ను నేను కోల్పోయాను' అన్న కవితాపాదం ('దారి' కవిత) గుర్తొచ్చింది. సార్క్ దేశాల్లో పుట్టిన కవుల్లో పల్లెలకు సంబంధించిన నోస్టాలజి ఫీలింగ్స్ పుష్కలంగా ఉంటాయి. అందునా నిష్కల్మషమైన మనసులతో పండుగలను, పబ్బాలను జీవనోత్సాహంతో
పదిమందితో కలిసి పంచుకుని ఆనందించే తెలంగాణా గ్రామీణ ప్రాంతాల మనుషుల ఆత్మలు ఈ కవి హృదయంలో ఇంకా ఆకుపచ్చని జ్ఞాప కాలుగా మిగిలి ఉన్నాయి. ఆ జ్ఞాపకాల తీపి గురుతులను 'ఛలో పల్లె' అన్న కవితలో తన నాన్నను సింబల్‌గా చేసుకుని వర్ణించి పులకించి పోతాడీ కవి.
''వాన కురిస్తే చేను తడిస్తే
భూమి తల్లి కరుణిస్తే
పొలం పండితే
బాపు ఆనందానికి అవధులుండవు
పచ్చని పైరుని చూసుకుని
మురిసే మా బాపుని
చూస్తే నా కళ్ళల్లో ఆనందం ఆర్ణమవుతుంది!''
అంటూ పరవశంతో కవిత్వమై పరవశించి పోతాడు. అంతే కాదు.. అందుకే నా భూమితల్లి, తల్లిదండ్రుల దర్శనం, వారి పాదధూళి స్పర్శ కోసం... పల్లె దారి పట్టిన.. అంటాడు కవి కృతజ్ఞత నిండిన సజల తడి నయనాల కవితాక్షర ధారలతో... కవి హృదయం రసాత్మకమై కవిత్వంగా ద్రవీకరిస్తే గాని ఇలాంటి కవితా వాక్యాలు పెల్లుబికి రావు. నా భూమి తల్లి, తల్లిదండ్రుల దర్శనం అనడంలోనే వాల్మీకి జననీ జన్మ భూమిశ్చ... భావం ప్రత్యక్షంగా ధ్వనించింది. కవిత్వం ధ్వనిపూర్వకంగా ఉండాలన్న (ఆనంద వర్థనుని ధ్వని సిద్ధాంతం) తత్వం నేడు 'బోదలేర్' లాంటి కవులు ప్రతీకవాదంలో ఉండాలని చెప్పారు. జైనీ లాంటి సహజసహృదయ రసావిష్కరణ చలిత లలిత భావకుల్లో.. నిసర్గ ప్రతీకలు, భావ చిత్రాలు అలా అలవోకగా అడవిపిట్టల్లా వచ్చి వాలిపోతాయి. ఒక్కోసారి ఈ కవి కేవలం ప్రతీకల కలనేతగా కవితను నిర్మించగలడు.
'కూతురు' అనే కవితలో అదే కనిపిస్తుంది.
కువకువలు లేని వనం
గలగలలు లేని నదం
కిలకిలలు లేని హాసం
గుసగుసలు లేని స్నేహం
జీవం లేని జీవనం
కూతురు లేని జీవితం
అంటూ భావోద్వేగపు ఉప్పెనగా ఎగిసి పడతాడు. 'సిల్లోలిజమ్' కవితాశిల్పంలో నిర్మితమైన కవితలు రాయడానికి కవులు ప్రయత్నించరు. పరమ మనోహరమైన ఈ కవితా పాదాల్లో రమణీయార్థాలు, ప్రతీకలు, తటిల్లతల్లా మెరుస్తున్నాయి. పక్షుల కువకువలు లేని వనం చూడలేం కదా? అలాగే గలగలలు లేని నదం (నదిని) ఎలాంటి ఫీలింగును ఇవ్వదు. కిలకిలలు లేని హాసం (నవ్వు) ఆనందం పంచదు. గుసగుసలు లేని స్నేహం.. అందంగా ఉండదు. అలాగే జీవం లేని జీవనం (జీవితం) లాంటిదే కూతురు లేని జీవితం... అనడంలో ఎంతో తాత్వికత, భావుకత, ప్రేమతత్వం, జీవన సౌందర్యం.. అనుబంధాల గాఢానురక్తి, మమకారాల తీవ్రాభివ్యక్తి, ఆత్మీయానురక్తి దాగుంది. కూతురు, కవి తల్లికి ప్రతిరూపం. కళ్ళ ముందు కనిపించే తల్లి ప్రేమకు ప్రతీక. కూతురు ప్రతీ కదలికలో, ప్రతీ మాటలో (కువకువలో) ప్రతి అల్లరిలో (గలగలలు) ప్రతి నవ్వులో (కిలకిలలు) నడకలో, కట్టులో, బొట్టులో అమ్మనే చూస్తాం. ముఖ్యంగా తండ్రికి కూతురంటే... తల్లే.. అలాంటి కూతురు లేని జీవితం.. జీవం లేని జీవనం.. అన్న గాఢాభివ్యక్తితో ఈ కవితను శిల్పీకరిం చడం మహాద్భుత భావుకతకు నిదర్శనం. జైనీ కవితలు సున్నితమైనవి, సుకుమారమైనవి, లయాత్మకమైనవి, మౌలిక ప్రాకృతిక మానసిక అనుభూతుల పూలవనాల్లాంటివి.
ఆతనిలోని రెండో పార్శ్వం. సామాజిక చేతనా రూపమైన కవితాగ్నిజ్వాలా దీపం. నిర్భయత్వం నిండిన ఆగ్రహ భావాభివ్యక్త ధిక్కారస్వర వ్యంజన కవిత్వం.
ఈనాటి పంచరంగుల అద్భుత సుందర దృశ్యాలను
కళ్ళకు కట్టినట్టు చూపించే సినిమాల కన్నా
విలువల వలువలు విప్పి
పచ్చి శృంగారాన్ని విచ్చలవిడిగా
పందేరం చేసే చిత్రరాజాల కన్నా
హడావుడి లేని, ఆర్భాటాలు లేని, ఆడంబరాలు లేని నలుపు తెలుపు చిత్రాలు మేలని 'నలుపు తెలుపుల దృశ్యం' కవితలో వాపోతాడీ కవి. ప్రముఖ నవలాకారునిగా, నాలుగు చిత్రాల దర్శకునిగా.. తన బాధను ఈ కవితలో బొమ్మ కట్టించాడు. జైనీలో... ఒక గజల్ కవి దాగున్నాడని... గజలియత్ లాంటి కొన్ని పాదాలు చూసాక నాకనిపించింది.
కన్నులు ఎర్ర మందారాలు...
నీ వలపు తలపులలో''
కాయానికి సౌఖ్యం పెరిగింది
కానీ గుండెకు గాయమయింది
నువ్వు నడిసే బాటల కన్నుల దారులు పరిచిన
నువ్వు పలికే మాటల కన్నీటి ధారలు మరిచిన
ఇలాంటి కవితా పాదాల్లో గజల్ షేర్లు ఉన్నాయి. శేషేంద్ర కూడా తన కవితల్లో ఇలాంటి గజల్ షేర్లు శిల్పీకరించారు. మునుముందు గజల్స్ రాయాలని ఈ కవికి సూచిస్తున్నా!
ఆధునిక వచన కవితా నిర్మాణాలు అనేకం. ఒకే వస్తువును వివిధ దేశాల కవులు అనేక కవితా నిర్మాణ రూపాల్లో అభివ్యక్తీకరించారు. డెన్మార్క్ కవి 'హెన్రీక్ నార్డ్'
'కష్టకాలంలో నిన్ను వదిలిపోలేదు.... అప్పుడూ అవ్యాజానురాగం పంచాను' అని అన్నాడనీ వర్ణించి ఈ కవి మురిసిపోయారు, 'పాదముద్రలు' అన్న కవితలో. 'ఎందుకు నాన్నా?' కవితలో తండ్రి గురించిన ్ఞపకాలు, జీవనతాత్విక పద బంధాలు, సత్యాలు, అనుభూతులు, నిర్వేదన, నివేదన, ఆత్మక్షోభ, వెలితి, కలత... కవితా పాదాలుగా మారిన వైనం ఈ కవి హృదయాంతరాళ నైర్మల్యతకు, పసితత్వానికి, రుషితత్వానికి, నిర్వ్యాజానురాగ భావాల లహరికి అద్దం పడతాయి. 'ఎందుకు నాన్నా?' ఎలిజీ కవిత. మనసున్న మనిషి గుండెను పిండేస్తుంది.
మళ్ళీ మనిషి నిటారుగా నిలబడాలంటే
ఆశయాల జెండా మోస్తూ ఆనందగీతం
పాడాలంటే
ఓడిపోయిన ప్రతీసారీ, మరింత తెలివితో
మరిన్ని జీవన పాఠాలు నేర్చుకుని
మరింత కసి నింపుకుని...
అప్పుడు.. అప్పుడు కదా
లోకం మొత్తం నిబిడాశ్చర్య చకితులై
నిశ్చేష్టులై, నిర్నిమేషులై చూస్తుండగా
నింగికెగురుతాడు.
అంటూ. ఆశావాదం మానవతా పతాకమై ఎగిసిపడతాడీ కవి. ఈ కవిత చదివాక శ్రీశ్రీ
'నిప్పులు చిమ్ముకుంటూ... నింగికి నేనెగిరిపోతే.. నిబిడాశ్చర్యంలో వీరూ... 'అన్న కవితా పాదం చప్పున గుర్తొస్తుంది. జైనీ ఇంకాస్త ముందుకెళ్ళి, నిబిడాశ్చర్య చకితులై, అన్న పదబంధంతో పాటు, నిశ్చేష్టులు, నిర్నిమేషులు... అన్న ఉత్ప్రేక్షలు ఉపయోగించి కవిత్వపు ఉద్వేగాన్ని పెంచారు. అలాగే మరొక చోట,
సామాన్యులకు జీవనమే శాపం
అసమాన్యులకు మరణం కూడా ఉత్సవమే!''
అంటాడీ కవి. కొన్ని బరువైన పదాలను కొన్ని కవితల్లో రత్నాలుగా మెరిపించిన జైని, వాటిని తేలి కగా మార్చడానికి చాలా శ్రమించాడనిపిస్తుంది. ఈ కవి కవిత్వపు శైలి అచ్చం పోలెండ్ కవయిత్రి 'విస్లావా జింబోర్ స్కా' కైతల శైలిలా ఉంటుంది. ఆమె కూడా జైనీ కవిలా విస్తృత అనుభూతులను కవిత్వం చేసింది.
జైనీ 'పాదముద్రలు' లోని ప్రతి కవిత వైవిధ్యంతో సాగింది. 'వీడ్కోలు', 'చెదిరిన గుండె', 'నర్సులు శ్వేత దేవతలు', 'సహచరి', 'సినారె', 'సోల్ మేట్', 'అగ్ని విహంగాలు', 'దిలోత్సవం'... ఇలా ప్రతీ కవితా ఓ ఆణిముత్యమే, నగ సత్యమే! జీవనసార సంగ్రహ శ్లోకమే! ఓ కరుణాంతరంగుడైన కవి శోకమే!
'కలతలు లేని... మోసాలు, ద్వేషాలు లేని మమతలు, ప్రేమలు పల్లవించే సుందరలోకం కోసం.. విలువలు భూమిక అయిన మనుషుల కోసం.. పరితపించిన ఓ స్వచ్ఛమైన కవి అంత ర్మథనం 'పాదముద్రల' కవితల నేపథ్యం'
జైనీలో కవితలకై తపించే శిశువున్నాడు. కావ్యమైపోయే రస హృదయమున్న రుషి ఉన్నాడు.
- కళారత్న కృష్ణ బిక్కి,8374439053