Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంకలనం నిండా ఉన్నవి రాజకీయ కవితలే అనడాన్ని ఖండించడానికి కొన్ని ఉదాహరణ లున్నాయి. ఉపరితలం మీంచి చూస్తే అవి అలా కనపడతాయి కానీ నిజానికి అవి కూడా సామాజికాలే, రాజకీయ కవితలే. తాముగతంలో చారులు తాగే కెఫే కూలి పోయిందని తెలిసినపుడు రాసిన కవితలో గానీ విభాతను బడికి పంపేపుడు రాసే పద్యంలో కానీ తన సహజ లక్షణాన్ని వేణు వదిలి పెట్ట లేదు. ప్రతి స్ధలమూ సమయమూ ఒక ఆస్తి అంటాడు కెఫే లేని తనాన్ని తలుచుకుని. చరిత్ర తెలిసి, సామాజిక శాస్త్ర అవగాహన ఉండి, ఆర్దిక రాజకీయ అంశాలను క్షుణ్నంగా విశ్లేషించగల శక్తి ఉన్నవారెవరూ కవిత్వం రాయడానికి పెద్దగా ఇష్టపడరు. బహుశా కవిత్వంలో ఉండే దాపరికం లేదా మార్మికత వాళ్లకు నచ్చకపోవడమే కారణం కావచ్చు.
ఎన్ వేణుగోపాల్ ఏది చెప్పినా అందరూ ఔననే అంటారు. అందరూ ఔననేట్టుగానే వేణు ఏదైనా చెప్తారు. అలాగని ఆయన చెప్పేవన్నీ శిలాక్షరాలేనని మనమేం అనుకోనక్కరలేదు. వేణు తనను తాను కవిగా చెప్పుకోరు. నేను కవిని కాదు అని ఆయన తరచూ అంటుంటారు. ఆయన మాట అస్సలు నమ్మొద్దు. అది అబద్దం. అందుకు నిలువెత్తు సాక్ష్యం ఈ రెప్పవాల్చని కాపలా కవితా సంకలనం .
విప్లవ కవిత్వానికి దూరంగా ఉండాలని కవులంతా నిర్ణయించుకున్నాక పూర్తి రాజకీయ కవితా సంకలనంగా ఏ పుస్తకమూ రాలేదు. ఏ కవితా సంకలనంలోనైనా ఒకటో రెండో లేదా మూడో నాలుగో సామాజిక కవితలుండి మిగతావన్నీ అనుభూతి కేంద్రకంగా ఉండే కవితలే ఉండడాన్ని గత మూడు దశాబ్దాలూ చూసాయి. అస్తిత్వవాద ఉద్యమాల నేపథ్యంలో అన్ని ఆయా ఉద్యమతత్వాన్ని ప్రకటించే కవితలున్న సంకలనాలు వచ్చాయి కానీ కేవల రాజకీయ కవిత్వంగా మాత్రం ఏ సంకలనమూ రాలేదు. ఇప్పుడీ వేణు రెప్ప వాల్చని కాపలా పూర్తి స్దాయి నూరు శాతం రాజకీయ కవిత్వం ఉన్న సంకలనం. రాజకీయ కవిత్వం అంటే రొడ్డ కొట్టుడు లేదా ఊకదంపుడు అకవనం ఉండడం అనే ఆనవాయితీని కూడా వేణు తోసిరాజన్నారు. ఈ రెండూ ఈ సంకలనపు ప్రత్యేకతలు. ఈ రెండూ కాక వేణు కవిగా అధిగమించిన మరో విషయం ఉంది. అదేంటంటే...
వేణు ఈ సంకలనానికి రాసుకున్న ముందుమాటలో ప్రతి మానవ మేథా కవిత్వం రాయలిగినదే, కవి కాగలిగినదే. అక్షరాల్లోకీ అచ్చులోకీ రాకపోయినా మనసులో కవిత్వం రాసుకోనివాళ్లు ఎవరూ ఉండరు అన్నారు. ఇది నిజం.
పసిపిల్లలూ, నిరక్షరాస్య వృద్దులూ, భావ ప్రకటన గురించిన ఏ అవగాహన లేని వారి అనేక చేష్టలలో
మాటలలో బోలెడంత కవిత్వం జలజలా రాలి పడుతూంటుంది. వీళ్లలో తమ భావ ప్రకటనను కవిత్వంగా మార్చే ప్రత్యేకమైన ప్రయత్నమేదీ ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా వెలిబుచ్చడమే ఇక్కడ జీవలక్షణం. అయితే ఎక్కువ మంది కవులలో ఇతి వృత్తాన్ని కవిత్వంగా మార్చే ఒక ప్రయత్నం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అది అద్బుతం అనిపించొచ్చు లేదా చెత్తగా తేలొచ్చు అది వేరే విషయం. ఆ ప్రయత్నంలో భాగంగా పూలూ తేనెలూ నదులూ సరస్సులూ మబ్బులూ వెన్నెలలూ కోకిలలూ అలా అలా వచ్చి చేరిపోతుంటాయి. అక్కడక్కడా వాటిని చల్లందే నిద్రపట్టదు చాలా మంది కవులకు. కొంత మంది విషయంలోనైతే విషయంకంటే ఈ పూలూ తేనెల గొడవే ఎక్కువ. కవిత్వంలో లాలిత్య ప్రదర్శన కోసం కవులు ఈ అరాచకానికి తెగబడతుంటారు. కానీ వేణు అలా కాదు. అదే వేణు అధిగమించిన మూడో విషయం. వేణు తన కవితలలో కవిత్వం చేయడానికి ఎక్కడా చెమటోడ్చి ప్రయత్నం చేయలేదు. అనవసరపు కోకిలలనూ నదులనూ పిల్లగాలి తెమ్మెరలనూ ఎక్కడా ఇరికించలేదు. మనుషులంతా సహజంగా తమ భావాలను ఎలా ప్రకటిస్తారో అలానే తన ఆలోచనలను పుస్తకం నిండా పరచారు. అదే అద్బుతమైన కవిత్వమైంది. కవిత్వం చేయడానికి ప్రయాస ప్రయత్నాలు చేయకుండా కవిత్వం చేయగలగడమే మంచి కవి లక్షణం అని నమ్ముతాన్నేను. ఆ గొప్ప లక్షణం నాకు వేణు కవిత్వంలో కనపడింది. గుర్తున్నాయా పాఠానికీ పాఠానికీ మధ్య రోడ్డు దాటి అవతలి ఒడ్డు చేరి బన్నును రెండు ముక్కలుగా కోసి వెన్నా పంచదార అద్దుకున్న రోజులు అన్నపుడు ఎక్కడా కవిత్వాంగా ఏమార్చే ప్రయత్నం కనపడదు స్వచ్చత తప్ప. నీకు నువ్వే తెచ్చి పెట్టుకున్న ఆధిక్యతనో నువ్వే ధ్వంసం చేయడం నేర్చుకోవాలి. వేదిక మీద కుర్చీని తన్నేయాలి. మొదటి వరుస ఆహ్వానాన్ని తిరస్కరించాలి అన్నపుడు కూడా కవిత్వ ముడిసరుకులను పులిమే ప్రయత్నం కనపడదు ఒక విభిన్నమైన మానసిక ఉన్నత స్థితి ఆవిష్కరణ తప్ప.
వేణు రాసింది సామాజిక కవిత్వమా వైయక్తిక కవిత్వమా అనే చర్చలోకి వెళితే ఆయన రాసింది మనిషి గురించి, కేవలం మనిషి గురించి అని స్పష్టంగా అర్దమవుతుంది. నిజానికి వైయక్తికంగా కనపడే వేణు కవిత్వల్లో ఉన్నది కూడా సామాజికమే. సామాజిక దృష్టికోణం లేకుండా వేణు అక్షరం ముక్క కూడా రాయలేదు. అందుకే మనిషి గురించిన ప్రస్తావన దాదాపు ప్రతి రెండో కవితలో ఉంది. తనే చెప్పుకున్నట్టు వేణుకు మనిషి పట్ల విశ్వాసం ఎక్కువ.
అదే స్థితిలో మనిషి పట్ల భయం కూడా ఎక్కువే. అపనమ్మకం కూడా ఎక్కువే. మనిషి లోపలి అవకరాలను సవరించాలన్న తపన కూడా ఎక్కువే. ఆ ప్రయత్నమే కవిత్వం. అందుకే మనిషి మీద నమ్మకం వల్ల నేను ఓడిపోయినా గెలుస్తాను అంటాడు. మనిషి తనాన్ని వదులుకొమ్మంటే భయం అంటాడు. అదే భయంతో మనిషిగా మిగలడానికేం మిగిలిందని సందేహ పడతాడు. పునరపి జననం పునరపి మరణం అబద్దం అని తెలిసి కూడా పాత మనిషే కొత్త మనిషయి మళ్లీ బతుకు మొదలు..లోలోపలి నుంచి మరో మనిషి స్రుష్టి జరుగుతుందనీ ఆశిస్తాడు. మనిషిని చూడడమంటే ప్రపంచాన్ని చూడడమే. మనిషిని చదవడమంటే కొన్ని మానసిక స్థితులను చదవడమే. మనిషిని అర్దం చేసుకోవడమంటే అనేకానేక సంఘర్షణలను అర్దం చేసుకోవడమే. రెప్ప వాల్చని కాపలానిండా అందుకే మనిషి మాత్రమే కనపడతాడు వినపడతాడు చదివేవాళ్లను వేదనపెడతాడు.
ఈ సంకలనం నిండా ఉన్నవి రాజకీయ కవితలే అనడాన్ని ఖండించడానికి కొన్ని ఉదాహరణలున్నాయి. ఉపరితలం మీంచి చూస్తే అవి అలా కనపడతాయి కానీ నిజానికి అవి కూడా సామాజికాలే, రాజకీయ కవితలే. తాముగతంలో చారులు తాగే కెఫే కూలిపోయిందని తెలిసినపుడు రాసిన కవితలో గానీ విభాతను బడికి పంపేపుడు రాసే పద్యంలో కానీ తన సహజ లక్షణాన్ని వేణు వదిలి పెట్ట లేదు. ప్రతి స్ధలమూ సమయమూ ఒక ఆస్తి అంటాడు కెఫే లేని తనాన్ని తలుచుకుని. చరిత్ర తెలిసి, సామాజిక శాస్త్ర అవగాహన ఉండి, ఆర్దిక రాజకీయ
అంశాలను క్షుణ్నంగా విశ్లేషించగల శక్తి ఉన్నవారెవరూ కవిత్వం రాయడానికి పెద్దగా ఇష్టపడరు. బహుశా కవిత్వంలో ఉండే దాపరికం లేదా మార్మికత వాళ్లకు నచ్చకపోవడమే కారణం కావచ్చు. చెప్పదలచుకున్న అంశాన్ని సూటిగా వచనంలో చెప్పడానికే వాళ్లు ఇష్టపడతారు. వేణుగోపాల్ రెండు కవితా సంకలనాల మధ్య ఎడం పాటించడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు. ఇవన్నీ తెలిసిన వేణుగోపాల్ అనేకానేక విషయాల మీద అవగాహన ఉన్న వేణుగోపాల్ కవిత్వం రాయడం కొత్తగా కవిత్వం రాస్తున్న కవుల అదృష్టం.
ఎలా రాయాలో ఎందుకు రాయాలో ఏ విషయాన్ని ఎలా ఏ మేరకు కవిత్వం చేయాలో నేర్పుతుంది వేణుగోపాల్ కవిత్వం. కొత్త కవులకు అని జనరంజకంగా అన్నాను కానీ నిజానికి చాలా పాత కవులు కూడా వేణు నుంచి చాలా నేర్చుకోవాలి.
వేణుగోపాల్ కవిత్వం చదవడమంటే తెలియని లోకాలను కూడా చుట్టిరావడం. వేణుగోపాల్ కవిత్వం చదవడమంటే కనుపాపల మీది చెమ్మకి కరచాలనమిచ్చి ఆలింగనం చేసుకోవడం. వేణుగోపాల్ కవిత్వం చదవడమంటే మనల్ని మనం పరిచయం చేసుకోవడం. వేణుగోపాల్ కవిత్వం చదవడమంటే చేరాల్సిన గమ్యాన్ని తెలుసుకోవడం.
- ప్రసేన్,9963155524