Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీత ముంతాజ్ మేరీ
ఒకే ఆత్మ గౌరవం మాది
ఒకే ఆత్మ నిబ్బరం మాది
ఒకే గర్భాశయం
ఒకే గర్భ ద్వారం మాది
హిజాబ్
కొంగు
కాళ్లకు పసుపు
నువ్వెవరు నన్ను శాసించడానికి
నా కప్పు కోతలను నీ చెప్పు చేతుల్లో పెట్టుకోడానికి
నేను హిందూ
నేను ముస్లిం
నేను క్రిస్టియన్
అయితేనేం
మతాన్ని మునివేళ్లపై మోయలేను
ఉన్మాదాన్ని ఉచ్చరిస్తూ
సాటి దేహాలను అగౌరవించలేను
అయినా....
నీకై నువ్వే నా శీలానికి పరీక్ష పెడుతూ
అగ్ని ప్రవేశపు ద్వారాలు తెరచావ్
నీకై నువ్వే నా అందానికి సమాధి కడుతూ
పాలరాతి పరదాల కింద తొక్కిపెట్టావ్
నీకై నువ్వే కరుణా జాలి ఊబిలో నన్ను ముంచేస్తూ
నా కన్యత్వానికి కొడుకును కానుక చేశావ్
నీకై నువ్వు చెక్కుకున్న చరిత్రలో
నా అస్తిత్వానికి సమాధులు కట్టేశావ్
పో...పో...
పోయి
నీ మాటలు నువ్వు వదిలిన గాలిలోనే కలిపేసెరు
నీ బూర్జువా చేతలు నీ ఆలోచనల కింద నలిగిన నీ తడబడే అడుగుల ముద్రల్లో వదిలేసెరు
నీ మురికి ముసుగు కప్పి
నా అభిమానాన్ని వివస్త్రను చేయకు
నా మనసుకు అజమాయిషీ నేర్పకు....
మనిషిగా బతికుంటే
సిగ్గంటూ మిగిలుంటే
కనిపెంచిన
కనిపించిన
తల్లుల పాదాలపై పడి మరకంటిన రక్తాన్ని మార్చుకో
తల్లీ నీకీ ఆంక్షలు
నా కల్పితాలని లెంపలేసుకో....
- సుధా మురళి