Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దినామ్ మీ నుదుళ్ల మీన కుంకుమ బొట్లు మొలుస్తున్నపుడూ...
మన అమ్మలక్కల ముఖాలపై ముసుగులేసుకుని నడుస్తున్నపుడూ...
కలుగని నొప్పి
పక్కింటి చెల్లి ''హిజాబ్'' కట్టుకుంటే ఎందుకు కలిగిందో?
సౌకర్యమో..సౌందర్యమో..ఏదైతేనేమి
కురుచవో.. పలుచవో..దుస్తులేసుకున్నపుడు
అంగ ప్రదర్శనని అరిచే నీవు
మా పక్కింటి చిన్నమ్మలు, అత్తమ్మలు
కొసెంటికల నుండి అరికాలి గోటిదాకా
''బురఖా'' తొడుక్కుంటే...
నీ ఆలోచనల ప్రతిరూపమని ఎత్తుకోవాల్సింది పోయి
అసహ్యించుకుంటున్నవెందుకో?
ఆహార్యం పేర బడిలోకి తనని అడ్డుకున్నపుడు
శిన్నపుడు బడిలో ప్రార్ధనేల సదివిన ప్రతిజ్ఞ
''భారతీయులంతా సోదరీ.. సోదరులు'' గురుతొచ్చి
అవమానంతో అవనతమైన త్రివర్ణ పతాకమైంది
నా శిరస్సు
మతం పేర తనని అవమానించినపుడు
బడిలో సాంఘిక శాస్త్రం సార్ చెప్పిన లౌకిక భావన
''ఎవరి మతాచారాలను వారు ఆచరించవచ్చు'' గురుతొచ్చి
పొరుగింటి చెల్లెలి ముందు తెలియకుండానే
నా మోకాళ్ళు నేలను ముద్దాడాయి
అపరాధ భావనతో...
ఎండకు వానకు పుట్టిన అందమైన సింగిడి ఈ నేల
సింగిడిలోని భిన్న రంగుల వారసులమే మేము
మా కలల సింగిడిని చేరిపి నీవు
బలిమిగా నీ రంగు పులుముతానంటే..
చూస్తూ ఊరుకోము మేము...
''జై శ్రీరామ్'' అనే మూడక్షరాల నినాదాలు
త్రిశూలాలై వెంటపడుతున్నపుడు
బురఖా తొడిగిన ఉక్కు దేహమొకటి
నిలువెత్తు నిరసన రూపమై నడిచినట్టుంటది తాను
విష భక్తుల, విద్వేష శక్తుల
విచ్ఛిన్న కుట్రల నుండి
భిన్నత్వంలో ''ఏక''త్వాన్ని కాపాడే
ప్రజాస్వామిక వాదుల ప్రతినిధి తాను
నువ్వు జై శ్రీరామ్ అన్న ప్రతిసారి
హిజాబ్ వర్ధిల్లని గట్టిగా అరుస్తుంది తాను
నేల నుండి ఏరుకు నీరందినట్టు
నిరంతరం మా మద్దతు తీసుకుంటుంది తాను
- దిలీప్.వి, 8464030808