Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాళ్లు ..
ఊసుబోక ఉత్త కబుర్లు జెప్పుకోరు !
కాలంవాగులో
పారే క్షణాల్ని వధాగా జేసుకోరు లేదా
రంగురంగుల దీపాలమధ్య ..
కల్చరంటూ ఒంటిని దిగంబరంగా ఆరేసుకోరు !
వెలుగునీళ్లతో
అడవి తానమాడకముందే .. వాళ్లు
కొండపోడుమీద తొలిపొద్దుకిరణాలవుతారు !
జిగ్గి పట్టుకొని మొజ్జూ మోడూ నరికీ
పొలాల్ని చదునుజేస్తారు !
ఆ డొంకనడిగీ ఈ డొంకనడిగీ కర్రాకంపా కొట్టీ
పంటకు ఎలుగెడతారు !
కటికచీకటి వేళ
కొండగూటిలో వెలుగవుతారు !
కొండమొగన తునికాకు తుంచి
ఎండగడపలో ఆరెడతారు
విప్పచెట్టుకింద రాతిరి రాలిన
చుక్కల్ని ఏరి గంపలకెత్తుకుంటారు !
పగలంతా .. పోడుమీద
చెమటవాగులై కదలిపోతారు !
వాళ్లు నిర్మల ఆకాశాలు
మకిలమంటని మంచుకొండలు !
పొద్దుగిన్నెలోంచి పసుపురాసుకొని
సూరీడ్ని బొట్టుగా దిద్దుకుంటారు
రాత్రి దండెంమీద మిగిలిన
ఎన్నెలపువ్వుల్ని తురుముకుంటారు !
అంతేనా ..
గెడ్డకెళ్లి కరిమబ్బులు దొంతేసి
మట్టికుదురు మీద కడవల వరసవుతారు !
భుజాలు పుళ్లయిపోయేట్టు
రోట్లో దంచిన కొర్రబియ్యందీసీ
నెత్తళ్లు కూరతో
ఇంటిల్లిపాదికీ ఏడేడి కూడెడతారు !
ఎర్రమట్టితో ఇల్లంతా అలికీ
తమ బతుకు పొడవునా వీడని
చిక్కుల్లాంటి ముగ్గులెడతారు !
తిరగలితో చీకటిని విసిరీ విసిరీ
వెలుగుపిండిని ఎసట్లో పోస్తారు !
నులకమంచాలమీద బతుకుశకలాల్ని
ఎండుగులు జేసీ ఆరబెడతారు !
ఎక్కడ జూడు వాళ్లే ..
సామచేలగట్లమీద ఎగిరే సీతాకోకలు వాళ్లే !
కోయిలమ్మతో కలసి కూసేది వాళ్లే
ఉడతపిల్లతో కలసి పరుగులెట్టేదీ వాళ్లే !
ఒక సాయంకాలంపూట
మందలో పాలకోసం అలమటిస్తున్న
మేకపిల్లకు తల్లిపొదుగునందించేదీ వాళ్లే !
ఇంకా మళ్లా .. వాళ్లు
ఎన్నెలచెట్టు కింద నెగడు చుట్టూరా
చేతులు జట్టుకట్టీ పదం కదుపుతూ
మనసారా ధింసా ఆడతారు !
వెన్నెలగంధం పూసుకొని
సామూహిక బందగానం జేస్తూ
పగలంతాపడ్డ కష్టాన్ని మరచిపోతారు !
ఏడాదికో భూగోళాన్ని కడుపున మోస్తూ
పురిటిసముద్రాలీదుతారు !
కాన్పు కష్టమైనపుడు డోలీ తోవలో
కంపించే కన్నీటితరంగాలవుతారు !
ఆయుధాలు సంఘర్షించేవేళ ..
అడవి లోలోపల్లో
నేల రాలిపోయిన తారకలకోసం
పాక నిట్టకు సేరబడీ
ఇంకా ఎడారికళ్లతో ఎదురుజూస్తుంటారు !
వాళ్లు .. ఆకుచాటు పూవులు
అడవిచాటు బిడ్డలు ! వాళ్లంతే ..!!
-సిరికి స్వామినాయుడు , 94940 10330