Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉన్నట్టుండి ఒక రోజు
నీవైన అడవుల్నీ అంతరిక్షాల్నీ
వెంటేసుకుని వచ్చి నీ గుమ్మం ముందు నిలబడతా
నువ్వు మూసిన తలుపులు తీసి
నన్ను కాకుండా
నా వెనకాల నీ కోసం తెచ్చినవన్నీ చూసి కేరింతలు పెడతావు
చకచకా ఆ కొండల్ని చివరికంటా ఎక్కేసి శిఖరాగ్రపు చల్లగాలి పీల్చి తేలికపడతావు
ఆ జలపాతం కింద ఆసాంతం తడిసి కొత్తగైపోతావు
అడవుల్లో చెట్లను పూలను ఆప్యాయంగా తాకుతూ కన్నీరవుతావు
పాలపుంతల్లో ఊరేగుతూ పరవశించిపోతావు
ఆడి పాడి అలిసిన కళ్ళు
సంతప్తితో తడిసిన కళ్ళు
అప్పుడు నా కోసం అటు ఇటు చూసి
అంతలోనే నిద్రలోకి జారిపోతాయి
గడప దాటి నీ నుండి నువ్వేసిన అడుగులే నేనని
కలలో తెలిసి లీలగా నవ్వుకుంటావు
-ప్రమోద్ వడ్లకొండ, 9739422236