Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ కథలలోని వస్తువును, ఆ వస్తువు నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రేమల్లో దాగిన వైయక్తిక పరిధిని అర్థంచేసుకోవాలి. సొంతం చేసుకోవాలి, కట్టిపడేయాలి అనే స్వభావాల్లోంచి, స్వేచ్ఛలోని కసిని, కర్కశ స్వభావాన్ని నిగూఢంగా ఎవరికి వాళ్లు అధిరోహించే స్థాయికి చేరుకోవాలి. ప్రతి మాట, చర్య వెనుక ఉండే ప్రాపంచిక స్వార్థం, బానిస మనస్తత్వం, పట్టాల మీదే మనిషిని నడిపించాలన్న ఒంటెద్దు పొకడల్లో దాగిన పరఫెక్ట్ అనేదాన్ని సవాల్ చేయడం ఎలాగో తెలు సుకోవాలి. ఈ కథల్లో ముఖ్యంగా ఎవరికోసం వాళ్లు చేయాల్సిన పోరాటం కనిపిస్తుంది. అబద్ధాల వెనుక దాగే ముఖాల పరాదాలు చించే స్వాభావిక సంగతుల్ని చూడాలి. వ్యక్తిగత స్వేచ్ఛకు, సమాజ మను గడకు మధ్య ఉన్న బలమైన బంధాన్ని కూల్చే పోరాటాలే ఈ కథలు. అక్కడక్కడా కవిత్వ వాక్యాలు సూక్తులై పలకరి స్తాయి. లోపలున్న వేడిని ఆర్పేస్తాయి. చలిని వేడి చేస్తాయి.
ఈ ప్రపంచాన్ని ఎవరో సృష్టించారు. అచ్చు తప్పులు సరిదిద్దాలి. ఈ విలువలు, నీతి నియమాలు ఎవరో తయారు చేశారు. వాటిని మార్చాలి. మనుషుల భావాలు, ప్రవర్తనను ఎవరో నియంత్రిస్తున్నారు. బయట పడాలి. లోపలి ఆలోచనలకు, బయట జీవితాలకు పొంతన కుదరడం లేదు. నటించటాన్నే నిజమనుకుంటున్నారు. ముఖానికున్న మాస్క్ లు తొలగించాలి. ఇదంతా అబద్దపు, అసందర్భపు లాలూచి. కొందరి కోసం, కొందరు కల్పించిన దానిలో ఎదగడానికి, ఇంకాస్త సౌకర్యవంతంగా, సుఖవంతంగా జీవించడానికి ఏర్పాటైన అసంపూర్ణ సంకల్పిత మానవ నాగరికత. ఇక్కడ నీడలు, జాడలే కాదు ఎవరికి వాళ్లు దొరకరు. వైయక్తిక ఉనికి పెద్ద సవాలు. సమాజానికి, వ్యక్తికి మధ్య తరతరాలుగా సాగుతున్న పోరాటంలో వ్యక్తి ఓడిపోతూనే ఉన్నాడు. నిర్మాణ సమాజానికి దాసోహం అంటున్నాడు. తనలో తాను దాక్కొని, తనను తాను నిర్మాణం చేసుకొంటూ పతనమవుతూనే ఉన్నాడు.
మనిషి నిజం, విలువలు, మంచి అనే సమాజ కల్పిత అభూత కల్పనల మాటున దాక్కొని గొప్పతనం కోసం, కీర్తి కోసం, గౌరవం కోసం, హోదా కోసం మోసం చేసుకుంటూనే ఉన్నాడు. తెలియకుండానే, తెలుసుకోకుండానే లోలోపలి పొరల్లో ప్రకంపనాలై ప్రజ్వరిల్లుతున్నాడు. వీటన్నింటితోపాటు ప్రభుత్వ అధికారాల్ని, సంఘ నియంత్రణ సూత్రాలను, సాంస్కృతిక వారసత్వాలను, అబద్దపు నైజాలను బద్దలు కొడుతూ వైయక్తిక ఫిలాసఫీతో, అబ్జెక్టివిజంతో కథలు సృష్టిస్తు న్నారు మోదుగ శ్రీసుధ. ''డిస్టోపియ'' వీరి కథల సంపుటి. ప్రతి కథ అలా ఎందుకు మొదలవుతుందో, అలా ఎందుకు పూర్తవుతుందో ఆలోచనలకు అందదు. కానీ ప్రతి కథా వస్తువు వెనుక, పాత్రల వెనుక, వాటి ప్రవర్తనల వెనుక, ఆలోచనల వెనుక పాఠకుల మెదళ్లను స్కాన్ చేసి, అసత్యాల్లోని సత్యాలను చూపే మెస్మరిజం ఉంది. సెల్ఫిష్, హిపోక్రసి, ఇగో, స్వార్థం, స్వేచ్ఛల్లోంచి మాట్లాడుతున్న వాస్తవిక మనో సంచలనం ఉంది.
''అట్రిబ్యూట్'' కథలో నస్రీన్ పేదరికంతో బ్యూటిపార్లర్లో పనిచేయడానికి వచ్చి మాటలకి, చిన్నపాటి ఇగోలకు తృప్తిపడే మనుషుల స్వభావాలను, బలహీనతలను పట్టుకుంటుంది. క్రూరమైన స్వేచ్చతో మనుషులను, వాళ్ల మనసుల ద్వారా లొంగదీసుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా చేసేందుకు అవసరమైన ఎత్తుగడలు వేస్తుంది. నస్రీన్ తన అస్తిత్వ పెనుగులాటలో, ఎదుగుదలలో మోసం, కుట్ర లాంటివి తప్పులు కావని నిరూపిస్తుంది. వాటిని మనిషి స్వేచ్ఛాభివృద్ధికి అడ్డుపడే సమాజం కల్పించిన అవరోధాలుగా మాత్రమే చూడాలన్నదే నస్రీన్ పాత్ర చెప్పే నయా సత్యం.
''అన్ వాంటెడ్ అరైవల్'' కథలో పెళ్లైన మాజీ ప్రియుడ్ని కలిసేందుకు ఇండియా వచ్చే ప్రయాణికురాలి ఆలోచనలన్నీ ఆమె కోణం నుంచి కనిపిస్తాయి. ఇవన్నీ పాక్షిక సత్యాలే. ఆమె వ్యక్తిగత అనుభవాలు, ఆలోచనల్లోంచి సందర్భానుసారంగా లోచూపులోంచి బయటపడే సాపేక్షాలను ఈ కథ రూడి చేస్తుంది.
''జనరల్ కంపార్ట్ మెంట్'' కథ నీతి, న్యాయం, విలువలు వంటి వాటిలోని మరో కోణాన్ని చూపెడుతుంది. చిన్నోడికి మంచితనం అంటగట్టి పెద్దోడికన్నా తక్కువ ఆస్తి ఇచ్చే న్యాయ సూత్రం, లోపల కోరికతో ఫ్రెండ్‌లా నటించే మగవాళ్లు, మగవాళ్ల మాటల్లో బూతులుగా మారే స్త్రీలు, ఆ స్త్రీలకోసమే ఆరాటపడే మగవాళ్ల మానసిక, శారీరక స్థితులు... ప్రతి మనిషి తనలో ఉండే అనేక నెగెటివ్ షేడ్స్ కనపడకుండా నటించడాన్ని ఎలివేట్ చేస్తుంది. నిూaస్త్రవర షఱ్‌ష్ట్ర వీaఅఱు కథలో మాజీ ప్రియుడి భార్యకు సేవలు చేయడానికి వెళ్లే స్త్రీ విరుద్దమైన పరిస్థితులు ఎదుర్కొన్నా చివరకు సొంత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకుం టుంది. ఆ క్రమంలోనే దయలో, ప్రేమలో హింసను ఎలా దాచుకుంటారో చూపెడుతుంది. అవసరాల చాటున నిలబడే వ్యక్తులు పరిధులు దాటకుండా, లోపలికి ఎవ్వరూ రాకుండా తలుపులు వేసుకునే స్వభావాలనూ వెల్లడిస్తుంది.
''అదృశ్యం'' కథలో నమ్మకం వెనుక ఉండే ఖాళీని చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. దేన్నీ అంటుకోకుండా మనిషి మనిషిలా నిలబడే సాధారణ తత్వం ఇది. చిన్ని చిన్ని సరదాలకోసం
జీవితాన్ని త్యాగం, బలి చేయడం అనేది వైయక్తిక ప్రాంగణాన్ని వదిలేయడమే అంటుంది ఇందులో పాత్ర. ''అస్తిత్వ న్యాయం'' కథ కొన్ని ప్రశ్నలను పాఠకులపై వదిలేస్తూ- 'మనం రూమ్ లో కలిసి ఉండాలంటే ఒకరికొకరం మన బలహీనతల్ని నిజాయితీగా చెప్పుకోవాలి' అంటూ మనుషుల్లోని బలహీనతలకు, బంధాలకు మధ్య సాగే పోరాటాన్ని కళ్లకు గంతలు విప్పి చూపెడుతుంది. తన ప్రమేయం లేకుండా మనిషి తననుతాను కోల్పోవడంలోని అనిశ్చితిని కళ్లకు కడుతుంది. ఇక ''ఆమెనవ్వు'' కథ మనుషులని అహం, అధికారంతో కట్టిపడేస్తే బంధాలు ఉల్లిపొరల్లా ఎలా విడిపోతాయో, దూరమవుతాయో చూపెడుతుంది. ఇతరుల స్వేచ్ఛను గొప్ప అనే హిపోక్రసీతో నిర్లక్ష్యం చేస్తే ఏకాకిగా ఎలా మిగులుతారో చెప్తుంది. జీవిత నిర్ణయాల వెనుక కాలం, పరిస్థితుల ప్రభావం ఎంత ఛేతనతో ఉంటుందో కూడా ఈ కథలోని పాత్ర ద్వారా వెల్లడవుతుంది. ''డైలాగ్ విత్ శశి'' కథ మనిషి గీసుకునే గీతలు, పెట్టుకున్న షరతుల వెనుక ఉన్న అందరు, అందరం అనే సామాజిక సంఘటితాన్ని బద్దలుకొట్టడానికి ప్రయత్నిస్తుంది. సొంత కాంక్షతో ప్రేమను కోల్పోకుండా, కోరికను జయించకుండా జీవించే అసామాన్య సూత్రాన్నీ అందిస్తుంది.
''ఆట'' కథలో ఒక మనిషి క్రూరత్వంగా మారి, మరొకర్ని కత్తితో పొడవడానికి మరో మనిషిలోని స్వార్థం, కుయుక్తి కారణమంటుంది. ''విజ్జి'' ప్రపంచం నిర్ణయించే హద్దుల్లో పడి
మనిషి, తన లోపలి మనిషిని మర్చిపోతున్న వైనాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. ''అపరిమితం'' కథ 'ఎవరి ఉనికిని వాళ్లు అనుభవిస్తున్నంత సేపే వాళ్లు ఉంటారు' అనుకునే సెల్ఫిష్ క్యారెక్టర్, వదిలించుకున్న మనుషుల కోసం చేసే ప్రయాణంలో మరణం అంచునున్న మనిషి బాధ్యతను భుజానికెత్తుకుంటుంది. ''అసంగతం'' కథ. సమాజం నిర్ణయించిన నియమాలకు భిన్నంగా నడవడం చీకటిని కోసే వెలుగుతెరగా రచయిత్రి ఇందులో సత్యం దాచుకున్న టామ్ సాయర్ అడ్వెంచర్స్ పుస్తకాన్ని ప్రస్తావిస్తుంది.
''గాయం'' కథలో యాక్సిడెంట్ అయిన స్త్రీని రక్షించ ేక్రమంలో ఓ వ్యక్తి చేయి ఆమె గుండెలను తడుముతుంది. అంతాబాగానే ఉన్నట్లు నటించలేనప్పుడు, సమాజం, ప్రభుత్వం, అధికారం వ్యక్తి స్వేచ్ఛను హరిస్తున్న ప్పుడు, మనిషి అస్తిత్వాన్ని అణచివేస్తున్నప్పుడు, భయం, బాధ, నైతిక సూత్రాలు, నమ్మకాలు వంటి వాటితో జనాల్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు వాటన్నింటిని వ్యతిరేకించడం సహజం. ఇలాంటి సహజత్వం లోంచి పుట్టినవే శ్రీ సుధ కథలు. అందుకే ఈ కథల్లో అదృశ్య శక్తులు, గొప్పదైన కథా నిర్మాణం, సూపర్ నాచురల్ పవర్స్, ఊహాజనిత కల్పనలు లేవు. గిరిని దాటే మానవ సంబంధాలు, అసాధారణ జీవితాలు, వాటి ఫలితాలు, స్పందనలు, ప్రతి స్పందనలు ఉన్నాయి. అలాగే అన్నీ కచ్చితంగా, ఇలానే ఉండాలన్న నియమాలేవీ కనిపించవు. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, వారసత్వ బలహీనతల గురించి మాట్లాడతాయి. మనుషుల స్వభావాల్లోని సహజాతాల గురించి చర్చిస్తాయి. అసమానతలను, అపోహలను చీల్చి చెండాడతాయి. మనుషుల్ని ముసుగులు తొలగించి జీవించాలంటాయి. సర్వైవల్ కోసం గుర్తింపును పోగొట్టుకోవద్దు అంటాయి. కనిపించే వాస్తవాల వెనుక ఉన్న కనిపించని వాస్తవాలను చూపెడతాయి. అబద్దాలలో బతికే మనుషులకు అవి అబద్ధాలని తెలియని దయనీయతని వ్యక్తం చేస్తూనే, వాటిలో జీవిస్తూ గొప్పతనాన్ని మూటగట్టుకుంటున్న వారి నటనల్ని బహిర్గతం చేస్తాయి.
''డిస్టోపియా'' థియరీలోని కొన్ని లక్షణాలకు ప్రతిరూపాలు ఈ కథలు. అందుకే ప్రతిబంధక జైళ్ల ఊసలను విరగ్గొడుతూ హాయిగా ఊపిరిపోసుకుంటాయి. ఎవరిని వాళ్లు ఎలా ప్రేమించుకోవాలో నేర్పుతాయి. మనసుపై రుద్దిన అబద్దపు అన్యాక్రాంత బతుకులకై జీవించే తత్వాన్ని ఛేదించడాన్ని నేర్పుతాయి. ''ఆశలు, అవసరాలు పెరిగేకొద్దీ అవకాశం దొరికితే మనుషులు పరిధులు దాటతారని, అలాంటప్పుడే వ్యక్తిగత సేఫ్ జోన్'' అవసరమంటాయి. ''కలర్ లేని వాళ్లందరినీ కళ కింద చేరుస్తారు'' అని రంగుతో కించపరడాన్ని వ్యతిరేకిస్తాయి. ''యజమాని'' అనే పదాన్నే కాదు, దాని వెనుకున్న భావజాలాన్నీ దండిస్తాయి. ''ఆత్మ కప్పబడ్డ ఆత్మకథల్లో సత్యం దొరికే దారుల్ని'' వెతుకుతాయి. ''ఈ ప్రపంచంలో ప్రతిదీ వ్యూహాత్మకమే''నని నిరూపిస్తాయి. ''నిశ్శబ్దంలో కూడా పెద్దపెద్ద శబ్దాలు ఉంటాయి కదా'' అని మనం గుర్తించని, పట్టించుకోని జీవిత రహస్య నిజాల ఎడారులపై నడిపిస్తాయి.
- డా|| ఎ. రవీంద్రబాబు 8008636981