Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లెనిన్ చెప్పినట్టు Read-Read- Read ప్రజల జీవితాల్ని చదవాలి. ప్రాచీన సాహిత్యాన్ని చదవాలి. సమకాలీన పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. పాత రచనల్ని కొత్తగా తిరగరాయాలి. ఎప్పటికప్పుడుUpdateకావాలి More you read- more you write.
ప్రసిద్ద తమిళ కథారచయిత రాజగోపాల్ వీరరాఘవన్ (జననేషన్) కరీంనగర్ వచ్చిన సందర్భంగా వారిని కలిసి మాట్లాడటం జరిగింది. తమిళనాడు రైటర్స్ అసోసియేషన్ సభ్యుడైన వీరు 150కి పై కథలు రాసారు. జననేషన్ (జనం మిత్రుడు) అనే కలం పేరుతో రచనా వ్యాసంగం సాగిస్తున్నారు. తండ్రి రాజగోపాల్ తల్లి సురుళి అమ్మాళ్. తమిళనాడు లోని శివగంగ జిల్లా, కారైక్కుడి పట్టణం స్థిరనివాసం. అలగప్ప గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో లైబ్రేరియన్‌గా పనిచేసి 2014లో పదవీ విరమణ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ఉన్నప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ లోను, లైబ్రెరియన్‌గా పనిచేసినపుడు తమిళనాడు గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్లోను చురుకైన కార్యకర్తగా పనిచేశారు.
కాలేజీ స్థాయి నుంచి కవితలు రాయడం అలవాటు చేసుకున్నారు. 1986లో మొదటి రచన పత్రికలో వచ్చింది. 1993 సం||లో మొదటి కవితా సంపుటి 'ఆలివ్ ఇళై గళైంది' వెలువడింది. ఇక్కడి నుండి వీరి అభిరుచి కథలపైకి మరలింది. ఫలితంగా 1998 నాటికి ''వర్షరు'' (Tradition) కథా సంపుటి వెలువడిది. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. అతని గురించి రాసిన కథే వర్సరు. 2000 సం||లో ''సూర్యనైకిళ్ళి'' అనే హైకూ కవితా సంపుటి ప్రచురించారు. 2004లో మూడవ కవితా సంపుటిగా ''మంజళ్ శిలువై'' (Yellow Cross) వెలువడింది. ఇదే సంవత్సరం శాస్త్రీయ దృక్పథంతో మూఢాచారాలపై వ్యంగ్యబాణల్ని సంధిస్తూ పదిహేను కథలతో ''అళుమై'' (Personality) కథా సంపుటిని తెచ్చారు. 2005 సం||లో ప్రముఖ అభ్యుదయ రచయిత గంధర్వన్ రచనలపై విశ్లేషణాత్మక రచనగా ''గంధర్వన్న పుడై పుళగమ్''' వెలువరించారు. సునామీ వచ్చిన రోజున సముద్ర తీరాన జరిగిన సంఘటనల సమాహారాన్ని ''వాంజై'' కథగా తీర్చిదిద్దారు. ఇదే పేరుతో 2006 సం||లో 17 కథలతో కూడిన కథా సంపుటాన్ని అందించారు. ''కె. ముత్తయ్య వాల్యూమ్ పణియమ్''(LIfe and works of Muthaiah) అనే వ్యాస సంపుటిని 2006లో ప్రచురించారు. తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ స్థాపకుడు కె. ముత్తయ్య ఇతడు ''తిఖదిర్'' (MARXIST PARTY NEWS PAPAR)అనే తమిళ పత్రికకు సంపాదకుడుగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత కె. రాజనారాయణ్ ఇతరులకు రాసిన మూడువందల లేఖలను 2006లో ఒక సంపుటిగా వెలువరించారు. స్వేచ్ఛను కోల్పోతే సర్వం కోల్పోయినట్లేననే విషయాన్ని ''కంగళై విట్రు'' అనే కథగా రాశారు. ఇదే పేరుతో 15 కథలతో కూడిన కథా సంపుటిని 2009లో తెచ్చారు. 2010 సం||లో ''ముత్తికొళుముదుల్'' (Procurement of wisdom) 15 కథల సంపుటి 2014 సం||లో కేంద్ర సాహిత్య అకాడమీ కోసం“Thamil Literary doen Govardhan” అనే మోనోగ్రామ్ రాసి ప్రచురించారు. 2018 సం||లో పదిహేడు కతలతో కూడిన ''కారణం అడిగలార్'' (కారణం తెలియదు) కథా సంపుటి తెచ్చారు. ఈ సంవత్సరంలో ఇరవై ఒక్క కథలతో ''కార్తిర్పు'' (Waiting for) అనే కథా సంపుటి, ''ఏలోలం'' (యాలకుల తోటలో పనిచేసే వారి జీవితవ్యధల పై వివరణ) అనే నవలను ప్రచురించారు. మొత్తం 150 కథలు ఇంకా పుస్తక రూపం దాల్చని మూడు నవలలు రాశారు. విస్తృతమైన రచనానుభవం, పరిశీలనాసక్తి గల జననేషన్ గారితో ముఖాముఖి.
- మీకు కథ అంటే ఎందుకు ఇష్టం ?
కవిగా మొదలయ్యాను ఫీలింగ్ (Feeling) ను వెంటనే కవితగా మార్చవచ్చును. ఫీలింగ్ (Feeling)అది బాధ, సంతోషం ఏదైనా కావచ్చు, దాని వెనకగల కారణాల్ని, పరిష్కారాల్ని కథలో రాయవచ్చు. కొట్టినప్పుడు వచ్చిన కోపం కవిత. కోపానికి కారణం, పరిష్కారం కథ. విస్తృతమైన అనుభవాల్ని కథగా చెప్పవచ్చు కనుక కథ ఇష్టం.
- తమిళ కథ పరిణామం చెప్పండి ?
వావైసు అయ్యర్, సుబ్రమణ్య భారతి లాంటి వారు ఆదర్శ వాద
కథను అందించారు. పుదుమైపిత్తన్ కథలు Critical Realism ను కలిగి ఉంటాయి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత జయకాంతన్, సుందర రామస్వామి, అళగిరిస్వామి లాంటి వారు కథల్లో Realismను ఆవిష్కరించారు. కె. రాజనారాయణ్, జయప్రకాశం, మేల్మాని పొన్నుస్వామి, లాంటి అభ్యుదయ రచయితలు Regional Dilacticsకు పట్టం కట్టారు. సుకృతరాణి, మాళది మైత్రి మొదలగువారు స్త్రీవాద దృక్పథంతో రాస్తున్నారు. గౌతమన్, అన్ బాగవన్, రవికుమార్ లాంటి వారు దళిత దృక్పథంతో రచనలు చేస్తున్నారు. నాగరత్నం కృష్ణ, తమిళ్మగలన్ మొదలగువారు పోస్ట్ మాడ్రన్ కోణంలో రచనలు చేశారు. కాని వీరు సృజన రచయితగా విఫలమైనారు. పోస్ట్ మాడర్నిస్టులు క్రిటిక్స్‌గా రాణిస్తున్నారు. ప్రజల్ని విడిచి వారి బాధల్ని మరచి రచనలు చేసేవారు ఎక్కువ కాలం నిలదొక్కుకోలేరు. రచయిత పురోగామిగా ఉండాలి. సామాజిక స్పృహ కలిగి, సాంఘిక కారణాలపై రచనల్ని చేయాలి. పోస్ట్ మాడర్నిజం కమ్యునిస్టు వ్యతిరేక ధోరణి, డికన్ట్రక్షన్తో మేలు జరగదు.
- కేవలం వాదం కోసమే రాసే కథ నిలుస్తుందా ?
వాదం కోసమే రాసే కథ నిలువదు. మనుషుల జీవన విధానం, అందులోని సుఖదుఃఖాలు, జీవిక కోసం సాగించే ప్రయత్నాలు, జయాపజయాలు అన్ని కలిస్తేనే కథ. అలాంటివే నిలబడతాయి. నేను దళిత కథ కూడా రాసాను. (Progressive) దృష్టి కలిగి ఉండాలి.
- వస్తుశిల్పాల్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి ?
అవి రెండూ విడదీయరానివి. మట్టి ఒకటే కాదు, మనుషులు ఉంటేనే దేశం. కేవలం శిల్పం ఉంటేనే కాదు, దానికి జీవితం జతకూడాలి. అప్పుడే కధ.
- మీ రాష్ట్రంలో పుస్తక ముద్రణ పంపిణి ఎలా ఉంది ?
ఈ బాధలు రచయితకు తప్పవు. సాహిత్యానికి ఆదరణ కేరళలో గొప్పగా ఉంది. కర్ణాటకలో ఆశాజనకం, తమిళనాడులో ఒక మోస్తరుగా ఉంది. రచయితల సంఘాలే ప్రచురణ, పంపిణీ బాధ్యతల్ని వహించాలి. అప్పుడు రచయితకు కొంత బరువు తగ్గుతుంది. సహకార పద్దతిని సంఘాలు అవలంభించాలి. ప్రభుత్వాలపై ఆధారపడడం ఉచితం కాదు. కరోనా తరువాత సాహిత్యం మరింత బరువైంది. పత్రికల్లో స్థలం కుదించబడింది. ప్రచురణ వెనకబడింది.
- మీ రాష్ట్రంలో మాతృభాష ఏ విధంగా నిలదొక్కుకుంటుంది ?
మాది ద్విభాషా సూత్రం. తమిళం, ఆంగ్లం రెండే భాషలు, మాకు భాషాభిమానం ఎక్కువ. ఇది సాంకేతిక యుగం. ఏదైనా కొత్త సాధనం వస్తే మాతృభాషలో దానికి పేరు కనిపెట్టాలి. ఉదాహరణకు సెల్‌ఫోన్ (Cellphone) దీన్ని తమిళంలో ''కైపేషి'' (చేతిలో పెట్టుకొని మాట్లాడే పరికరం) అంటాము. దృశ్యం (కన్ను) శబ్దం (చెవి) కలిస్తే వీడియో, కనుకనే తమిళంలో వీడియోను ''కాన్ఊళి'' అంటాము. కంప్యూటర్ను ''కణిని'', వాట్సప్‌ను 'పొలనం' అని అంటాము. కొత్త పదాలు తయారు చేసుకోవడం వల్ల భాష విస్తృతి చెందుతుంది. దాదాపుగా ఇంగ్లీషు పేర్లకు సమానార్థకాలుగా తమిళ భాషలో పేర్లు ఉన్నాయి.
సింగిల్ పేజీ కథలే కాదు ''పోలింగ్ బూత్ నెం 108'' ఇరవై ఒక్క పేజీల కథ రాసిన అనుభవం జననేషన్ గారిది. రచయితల సంఘాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రైతు సమస్యను సమర్థించాలని, ఆహార విహారాదులపై ఆంక్షలు ఉండకూడదని అభిప్రాపడ్డారు.
- వర్తమాన పరిస్థితుల్లో రచయితలకు మీరిచ్చే సలహా ఏమిటి?
లెనిన్ చెప్పినట్టు Read-Read- Read ప్రజల జీవితాల్ని చద వాలి. ప్రాచీన సాహిత్యాన్ని చదవాలి. సమకాలీన పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. పాత రచనల్ని కొత్తగా తిరగరాయాలి. ఎప్పటికప్పుడు Update కావాలి More you read- more you write.
డా|| బి.వి.ఎన్.స్వామి 9247817732