Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇదివరకు చాలాసార్లు ఆ దారిగుండా వెళ్లొచ్చాను
ఊర్లకు చూపుడువేలవుతూ
నాతో ముచ్చటించిన పచ్చని పొలిమేరలు
చెరువు కత్వ మీది వెచ్చని స్నేహాలకు కనువిందుగొలిపే పరికిపిట్టల ఆహార విహారమూ అప్పటిలా లేవు
ఇప్పుడక్కడ-
మనుషులు జతలు జతలుగా పుష్పించి
ప్రతిధ్వనించిన పాటల కవాతు
పొడవాటి గుత్తాధిపత్యపు కాలాంతానికి
ప్రజానాటకం ధరించిన తెరచీరల అంతరంగ మంతనాలూ
వెలిగే కాగడాల కూడళ్లూ అప్పటిలా లేవు
ఇప్పుడక్కడ-
రహస్యోద్యమంలా వాలి సీతాకోకచిలుకలు
పూలరెమ్మలపై చేసే చిత్రమైన గమకాలు
నిర్మలాకాశం ప్రసవించే ఏ సవ్వడినీ చెవిన పెట్టని
పొద్దుటి తెలిమంచు సూర్యోదయాలూ
కొండ పొలమూ అప్పటిలా లేవు
ఇప్పుడక్కడ-
చినుకుల దండతో ఎదురొచ్చి
వెండి మొలకలకు ఆహ్వానం పలికే మట్టి ప్రియత్వపు
మబ్బుతునకల మహాసంకల్పం
నాగలికి దోస్తులై పంటల సిపాయిల్లా కోండ్రేసే దుక్కిటెడ్లూ
వసంతాన్ని గొంతున దాచిన మామిళ్లూ అప్పటిలా లేవు
ఇప్పుడక్కడ-
కాలువలు కడిగే వరిమళ్ల బురద
కడుపార పొదుగిచ్చే పాడిగేదెల మంద
అది ఏ వారమైనా పనివారమే అంటూ రేఖలువారంగ మతిని పనులకు అదిలించే తొలికోడి కూతా
కార్తె ఏదైనా కర్తవ్యమే మేలిమి వంగడమనే
తాతల చేతాళమూ అప్పటిలా లేవు
ఇప్పుడక్కడ-
గంగ ఉంది
తాబేలు లేదు
గనుమ ఉంది
గరిసెలేదు
రాసులున్నాయి పుట్లకు పుట్లు
శిఖరాన అందమైన గణాలపతి లేదు
కొలత ఉంది
ఆడబిడ్డను యాజ్జేసే మమతల కొలకుండే లేదు
గౌడు దించుతున్న లొట్టి వుంది
సై చూసి నపరి కొంచెం వొంపే తలాపు లేదు
ఇప్పుడక్కడ-
నిన్నమొన్నటివే త్యాగాలు
విస్మృతి శిలాన్యాసం కిందనుంచి లేచి
స్తూపాలకింత రంగద్ది కైవారమవగల నెలబాలుడూగే ఊయలేదీ కనిపించట్లేదు
ఇప్పుడక్కడ
మీ పూర్వీకులేం చేసేది అంటే
యుద్ధం చేసేటోళ్లనేది వాళ్లు
చరిత్ర చిత్రపటాన్ని బతుకుచివరకంటా మోసే భూవిజ్ఞానపు దిగ్భుజమొక్కడు మచ్చుకైనా లేడు
ఇప్పుడక్కడ-
దాపున ఎవరాగినా
చేతబావై దూపదీర్చిన ఆ ధర్మతోవ
దరికోసం ఎవరొచ్చినా
నీతిచంద్రికై ఓదార్చిన ఆ నిండుదారి
మాయ రహదారిగా మారి
ఇప్పుడు
అడుగుకో రేటుతో అగ్గై మండుతోంది
ఘడియకో తగువుతో కురుక్షేత్రమై రగులుతోంది.
- డా||బెల్లి యాదయ్య,
9848392690