Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నీకోసం నేనులేనూ..'. ఈ కథలోని ఎత్తుగడే కరెంట్ షాక్ లాంటి వాక్యంతో మొదలవుతుంది. 'మీకెవరూ చెప్పి ఉండరు, నేను జైలుకెళ్ళానని' అంటూ మొదలవుతుంది. ఉత్తమ పురుషలో ఉండడం వలన రచయితే నేరుగా చెప్పినట్టనిపిస్తుంది. చదివినకొద్దీ వళ్ళు జలదరిస్తుంది. అక్రమ నిర్బంధాలెలా ఉంటాయో చెబుతాడు రచయిత ఈ కథ ద్వారా.
కవిత్వం రాసేవాళ్ళు కథలు రాస్తే కవిత్వంతో నిండి ఉంటుందేమో అనుకుంటాం. కొంతమేర ఆ కవిత్వ ఛాయలు అలరిస్తాయేమో. కానీ కథకు కవిత్వానికి ఉండే విభజనను పాటించిన కవి, కథకుడు దేశరాజు. కథలో వాక్యాల క్లుప్తతను పాటించి తన 'బ్రేకింగ్ న్యూస్' కథలతో ఆశ్చర్యపరిచాడు. ఈ సంపుటిలో ఉన్న పద్దెనిమిది కథలు వివిధ సామాజిక సందర్భాలను గుర్తు చేస్తాయి.
ఈ కథల క్రమానికేమీ ప్రత్యేకమైన వర్గీకరణ పెట్టుకోలేదు. డీమానిటైజేషన్ సమయంలో ఎదురైన కష్టాలను గుర్తుచేసే 'డీహ్యూమనేజేషన్' ఈ సంపుటిలో తొలికథ. 2016నాటి విచిత్రమైన, విపత్కర పరిస్థితిని వివరించే మొదటి కథ రచయిత దృక్పథాన్ని పరిచయం చేస్తుంది. సందర్భం ఏదైనా ప్రజల తమదైన శైలిలో ఎదుర్కొంటారని రచయిత నమ్మకం. ఏ కష్టాన్నయినా తమకు అనుకూలంగా మార్చుకుంటారని రచయిత నమ్మకం. రెండువేల నోటు వచ్చిన కొత్తలో చిల్లర దొరక్క పడే అవస్థలు వంటివి ఆ రోజులను గుర్తుచేస్తాయి.
పేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమంలో భారతీయ పురుషుల కక్కుర్తిని అసహ్యించుకుంటూ రాసిన కథ 'డబుల్ రోస్ట్'. ఇంటా బయటా రోస్టయిన ఓ ఇంటాయన కథ. మునిమాపువేళలో మిత్రులు కనుమరుగవుతుంటే వయసుతో పాటు మనసు కూడా ముడుచుకుపోతుంటుంది. గేటెడ్ కమ్యూనిటీలలో సీనియర్ సిటిజన్లు కలుసుకుని జ్ఞాపకాలను షేర్ చేసుకుంటుండే సన్నివేశాలు మనం చూస్తుంటాం. చాలా సహజంగా రచయిత ఈ కథను సృజిస్తాడు. ఇద్దరు స్నేహితుల్లో ఒకరు నిష్క్రమించగా రెండో మిత్రుడు నిరాశలో కూరుకుపోతాడు. ఆడవారిలో సహజంగా ఉండే శక్తి, ఆటుపోట్లనెదుర్కునే యుక్తి ఆయన అనుభవంలోకి వస్తాయి. ఆ అనుభవం అతనికి జీవితం పట్ల ఆశను పెంచుతుంది. ఆ కథపేరు 'పునరుజ్జీవం'.
ఒక వాదానికి కట్టుబడిన రచయితలు, కాలం మారే కొద్దీ ఆలోచనలు పలుచనవ్వగా, మార్కెట్ ఎకానమీ వేవ్‌లో ఎలా కొట్టుకుపోతారో కూడా చెబుతాడు రచయిత. బహుశా సాహిత్యాన్ని అభిమానించే వారికి ఎదురయ్యే సంఘటనే ఇది. ఈ మెటామార్ఫసిస్ని అంగీకరించక తప్పట్లేదన్న ఆవేదనను వ్యక్తం చేస్తాడు 'అనేకానేక బల్లులు-ఒకేఒక్క ఫ్లాష్ బ్యాక్' కథలో. మనమందరం భయపడి పారిపోయే బల్లులమే. అదే సాహిత్యంలోనూ ప్రవేశించిందని రచయిత అనుమానం. ఆ అనుమానాన్ని కథగా మలిచాడు.
'బ్రేకింగ్ న్యూస్' కథలోని సినిమాటిక్ ట్విస్ట్ పక్కన పెట్టేస్తే, చాలా సంసారాల్లో ప్రేమ అండర్ కరెంట్‌గా ఉండి సమయం వచ్చినప్పుడు తెరచాపలా సంసార నావను ఆదుకుంటుందని రచయిత ఉద్దేశం. అదే చెబుతాడు కూడా. వైద్య రంగంలోని చీకటికోణం కథాంశం. కానీ భార్య ప్రేమని శంకించే మగవాళ్ళకు కనువిప్పు కలిగించే కథ ఇది.
మొత్తం అన్ని కథల గురించి చెప్పను కానీ, నక్సలైట్ ఉద్యమం అని పేర్కొనకపోయినా వామపక్ష భావజాలాన్ని నింపుకున్న రెండు కథలున్నాయి. అందులో ఒకటి 'నీకోసం నేనులేనూ..'. ఈ కథలోని ఎత్తుగడే కరెంట్ షాక్ లాంటి వాక్యంతో మొదలవుతుంది. 'మీకెవరూ చెప్పి ఉండరు, నేను జైలుకెళ్ళానని' అంటూ మొదలవుతుంది. ఉత్తమ పురుషలో ఉండడం వలన రచయితే నేరుగా చెప్పినట్టనిపిస్తుంది. చదివినకొద్దీ వళ్ళు జలదరిస్తుంది. అక్రమ నిర్బంధాలెలా ఉంటాయో చెబుతాడు రచయిత ఈ కథ ద్వారా.
రచయిత రాసిన తొలి కథలో తప్ప మరే కథలోనూ పాత్రలకు పేర్లుండవు. అదేమీ పాఠకుడికి ఇబ్బంది కలిగించదు. భర్త భార్యను నువ్వన్నట్టే భార్యా భర్తను నువ్వు అనే అంటుంది. అది రచయిత పాటించిన సమధర్మమనిపిస్తుంది. కథలన్నీ చిన్నచిన్న వాక్యాలతో సాగుతాయి. చాలావరకు మధ్యతరగతి జీవితాలు ఎత్తుపల్లాలపై సాగించే ప్రయాణాన్ని ఈ కథలు చూపుతాయి. ఆడవారి పట్ల సహానుభూతిని ప్రకటిస్తాడు చాలా కథల్లో రచయిత. పాత్రల ఊకదంపుడు ఉపన్యాసాలు లేవు. రచయిత చొరబాటూ లేదు. అందువలన కథలు ఏకబిగిని చదివిస్తాయి.
పుస్తకాన్ని శ్రద్ధతో డిజైన్ చేసిన అక్షర క్రియేటర్స్ నీ, ముద్రించిన ఛాయా రిసోర్స్ సెంటర్ వారిని అభినందించాలి. అంతే కాకుండా ప్రతి కథకు ఇచ్చిన ఇలస్ట్రేషన్స్ పుస్తకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. పేర్లు లేకపోయినా కొన్నిపాత్రలు గుర్తుండిపోతాయి. మనిషి ఆలోచనలకు రచయిత దేశరాజు అల్లిన ఊసుల చిత్రాలీ కథలు.
- సి.యస్. రాంబాబు