Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెల్లారకముందే
చీకటిని చీపురుతో ఊడ్చేస్తూ
పొద్దును మేల్కొల్పుతుంది అమ్మ
రోజూ తను నిద్రను చంపుకుంటుందని
మేము ఏనాడూ తెలుసుకోలేదు!
వాకిట్లో కల్లాపి చల్లుతుంటే
మా కలలో చినుకులు పడినట్లు
గిలిగింతలు పెడుతుంటాయి,
అమ్మ చేతులు వణుకుతున్నాయని
మేము ఏనాడూ గ్రహించలేదు!
నిద్రకళ్ళతో పొయ్యిదగ్గర కూర్చున్నామా
రొట్టెలు కొడుతుంటే జో కొట్టినట్లే,
పిండిని బంతి చేసి తిప్పినప్పుడు
తానొక భూగోళమై
అందరి చుట్టూ తిరుగుతుందని
మేము ఏనాడూ అనుకోలేదు!
మండుతున్న పొయ్యి
మా కంటికి వెలుగుదీపం,
ఆ మంటసెగలో అమ్మ దేహం
రోజూ కొద్దికొద్దిగా కరిగిపోతుందని
మేము ఏనాడూ ఊహించలేదు!
అమ్మచేతి కమ్మటి వంటకు
ఖాళీ కడుపులు సిద్ధంగా ఉంటాయి,
ఉన్నదాంట్లో కొంత చేసినా
ఇంటిల్లిపాది ఆకలికనీ తీర్చుతుంది,
మా ఆకలినంతా
తన కడుపులో దాచుకుంటుందని
మేము ఏనాడూ తెలుసుకోలేదు!
పనులవెంట పరుగెత్తుతూ
తన గురించి మరిచిపోతుంది
ఎవరికేమైనా విలవిలలాడిపోతుంది,
చేతులు రెండే కానీ
పది చేతుల పనులు చేస్తుంది,
అమ్మ విశ్రాంతి తీసుకున్నట్లు
ఏనాడూ కనబడదు
అలసట వచ్చినా వాయిదా వేస్తుంది!
బాధ్యతలన్నీ తీరాక
గాలి పీల్చుకుందామనుకుంటే,
ముసలితనంలో రోగాలన్నీ
కట్టగట్టుకొని చుట్టాల్లా వస్తాయి,
తన దేహంతో పోరాటం మొదలవుతుంది,
కంగిపోతున్న ఒక్కో అవయవంతో
ఇప్పుడు కూడా అమ్మకు విరామం లేదు!
ఎన్నో జీవితాలకు జీవమిచ్చి
అమ్మ తన జీవితాన్ని కోల్పోయింది,
ఎన్నో జీవితాలను నిలబెట్టి
అమ్మ ఒక జీవితకాలం అలిసిపోయింది!
- పుట్టి గిరిధర్, 9491493170