Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాది వ్యవసాయ కుటుంబం మా నాయన సాధారణ రైతు మంచి కష్టజీవి. నన్ను వ్యవసాయంలో నలగదీశాడు. వ్యవసాయ జీవితంలో నుంచి సాహిత్య జీవితంలో ప్రవేశించిన నాకు సాహిత్యంలో వ్యవసాయ రంగం ప్రస్తావన వస్తే పరవశం కలుగుతుంది. వ్యవసాయ రంగం ముగ్గురి కలయిక. రైతు,వృత్తికారులు, కూలీలు. ఈ ముగ్గురు కలిస్తేనే వ్యవసాయ రంగం. ఈ మూడు రకాల జీవితాలు సాహిత్యంలో ఎక్కడ కనిపించినా నేను నా అనుభవాలను స్మరించుకుంటాను.
పురాణాలలో గొడ్డళ్ళు, గదలు, అమ్ముల పొదులు ధరించే పాత్రల కన్నా నాగలి ధరించిన బలరాముడంటే నాకిష్టం. మహాభారతంలో సభాపర్వంలో నారదుడు ధర్మరాజుకు బోధించే ప్రజాపాలన సూత్రాలలో రైతు ప్రస్తావన చేస్తాడు. ఎర్రన హరి వంశంలో రేపల్లె ప్రజల జీవిత చిత్రణ ఉంది. పోతన భాగవతంలో గ్రామీణ జీవితం కనిపిస్తుంది. పాండు రంగ మహాత్మ్యం వంటి ప్రబంధాలలో అక్కడక్కడ రైతుల ప్రస్తావన వస్తుంది. ఆముక్తమాల్యదలో రాయలు రైతులను వర్ణించాడు. శుకసప్తతి, హంసవిశంతి వంటి కథాకావ్యాలలో వ్యవసాయరంగ విశేషాలు కనిపిస్తాయి. వేమన శ్రమసిద్ధాంతం చెప్పాడు. పోతులూరి వీరబ్రహ్మం శ్రామికులను గౌరవించ మన్నాడు. ఇవన్నీ చదివినప్పుడు నేను ఎవరి వారసుడనో తెలిసివస్తుంది.
ముసలమ్మ మరణం నుంచి శ్రమకావ్యం దాకా ఆధునిక కాలంలో వ్యవసాయరంగం వస్తువుగా అనేక కావ్యాలు వచ్చాయి. కషీవలుడు, కాపుబిడ్డ, రైతురామాయణం, పరిగ పంట, పైరపంట, క్షేత్రలక్ష్మి, పెన్నేటిపాట, రాయలసీమ రైతు, నాగేటిచాలు, నాగలి, పల్లెకు దండం పెడతా, దుక్కిచూపు వంటి ఎన్నో కావ్యాలు వచ్చాయి. విడి కవితలు వేల కొలది వచ్చాయి. రైతు కవితాసంకలనం తెచ్చాడు పాపినేని శివశంకర్. కరువులొచ్చినా వరదలొచ్చినా సమస్త మానవాళి జీవన సంక్షోభంలో భాగంగా వ్యవసాయరంగం ప్రధాన వస్తువు అవుతుంది. వలసపాలకులు వచ్చి మొదట దెబ్బకొట్టింది వ్యవసాయరంగం చేనేత రంగాలమీద. ఆ దెబ్బ ప్రభావం వలసపాలన కాలంలో స్వతంత్ర భారత కాలంలోను కొనసాగుతూనే ఉంది. ప్రపంచీకరణ ఆ దెబ్బమీద మరో దెబ్బకొట్టింది. రైతును భూమి నుండి దూరం చేసి వర్తకులుగా మార్చింది. భూమి అంగడి సరుకైంది. వ్యవసాయాన్ని నమ్ముకున్న వత్తుల వాళ్ళు, పొలంలో పని చేసేవాళ్ళు కకావికలయ్యారు. ఈ పరిణామాలన్నీ ఆధునిక కవిత్వంలో ప్రతిఫలిస్తున్నాయి. అనేక నవలలు కథానికలు, నాటకాలు వ్యవసాయరంగ పరిణామాలను ప్రతిఫలించాయి. వ్యవసాయ రంగం ఉన్నంత కాలం వ్యవసాయ సాహిత్యం ఉంటుంది. ఈ సుదీర్ఘమైన పడుగులో సరికొత్త దారం సోదరులు ఆచార్య పులికొండ సుబ్బాచారిగారు రచించిన రైతు మహాభారతం వచన కథాకావ్యం.
పులికొండ కవి, పరిశోధకుడు, విమర్శకుడు, అనువాదకుడు. ఆయన ప్రధానంగా జానపద విజ్ఞాని. కవిగా ఇదివరికే బాడిశ మొక్కబోయింది, నేటికందాలు, తెలుగుల వైభవం ప్రచురించారు. జాషువా గబ్బిలాన్ని వచనీకరించారు. రైతు మహాభారతం కావ్యాన్ని మనకందించారు. ప్రపంచీకరణ మాయాజాలంలో భారతరైతు విలవిల లాడుతున్న సమయంలో తెలుగు కవులకు రైతు కావ్యవస్తువు కావడం సహజపరిణామం. 2020లో బషీర్బాగ్లో రైతుల కాల్చివేత నుండి దేశ రాజధాని ఢిల్లీలో నల ్లచట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతుల నిరసన కొనసాగుతున్న సందర్భంగా ఇదొక రైతు వ్యతిరేక యుగం. రైతుల కళ్ళతోనే రైతుల కళ్ళు పొడిచే కుట్రను భారతీయ కవులు గుర్తించి రాస్తున్నారు. ఈ నేపథ్యంలో పులికొండ గారి రైతు మహాభారతం కావ్యం రావడం అభినందనీయం.
మహాభారతం రాచరిక వ్యవస్థకు చెందిన ఇతిహాసం. సుదీర్ఘ కాలంలో సాగిన సామాజిక వాస్తవికతను ఇతిహాసం ప్రతిబింబిస్తుంది. మానవ సంబంధాలలోని పరిణామ శీలాన్ని ఇతిహాసం ప్రతిబింబిస్తుంది. పులికొండ రైతు జీవితాన్ని వస్తువుగా రాసిన కావ్యాన్ని మహాభారతమన్నాడు. సుదీర్ఘ కాలంలో సాగిన కర్షక జీవన పరిణామాలను చిత్రించిన కావ్యం ఇతిహాసమవుతుంది. రాచరిక వ్యవస్థను కీర్తిస్తూ ప్రాచీన కవులు ఇతిహాసాలను రాస్తే పులికొండ రాజుల స్థానంలో రైతులను కూర్చోబెట్టాడు. ఇది ఆధునిక ఇతిహాసం.
ఆకలి పుట్టినప్పుడే పుట్టింది
ఆహారం కోసం పోరు
అంటూ మొదలైన ఈ మహాభారతం
ఆకుపచ్చ రథాలు
పొలం దారి పట్టాయి అంటూ ముగిసింది. ఈ రెండింటి నడుమ కొన్ని వేల యేండ్ల పరిణామాలను కవి పేర్కొన్నారు. అందువల్ల ఈ కావ్యం ఇతిహాసమే. మహాభారత యుద్ధం చివరలో శాంతం ఉంది. యుద్ధం శత్రుశిబిరాల మధ్యన. రైతు జీవితం కూడా ఒక సమరమే. వ్యవస్థతో, వ్యక్తులతో, పాలకులతో, వ్యాపారులతో అనేకులతో రైతు చేసిన యుద్ధమే ఈ కావ్యం. అందు వల్ల ఇది ఇతిహాసమే. ఇతిహాసంలో అనంతమైన జీవన వైవిధ్యం ఉంటుంది. అనేక మంది, అనేక రకాల మంది, అనేక కాలాలలో ఇతిహాసంలో తారసపడతారు. ఈ రైతు కావ్యంలో రైతు జీవితంలో రైతు ఒక్కడి జీవితమే కాదు రైతును ఆవరించి సకల మానవజీవితమూ చిత్రించబడింది అందువల్ల ఈ కావ్యం ఇతిహాసమే.
కుందుర్తి తెలంగాణ రైతాంగ పోరాటాన్ని 1956లో తెలంగాణ పేరుతో రాశారు. అది కూడా యుద్ధకావ్యమే. అలకాపురికీ అలగా జనానికీ మధ్య సాగిన యుద్ధం ఆధునిక భారత చరిత్రలో అది ఒక ఐతిహాసిక యుద్ధమే. ఆ కావ్యాన్ని కుందుర్తి మహాభారతంగా భావించే ప్రతి అధ్యాయాన్ని పర్వాలు అన్నారు అలా తెలంగాణ కావ్యంలో పద్దెనిమిది పర్వాలు రచించారు. గుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతాన్ని పర్వాలుగా విభజించారు. పులికొండ రైతు మహాభారతాన్ని 18 పర్వాలుగా రచించారు. ఆది పర్వంతో మొదలై విజయ ప్రస్థాన పర్వంతో ముగుస్తుంది. ఈ మధ్యలో రైతు జీవితంలో పర్వాలను ఒక్కో పర్వంలో ఒక్కో జీవితాన్ని రచించారు. కవికి తాను ఒక ఇతిహాసాన్ని రాస్తున్నాను అనే స్పహ ప్రతి పర్వంలోను కనిపిస్తుంది. చారిత్రక పూర్వ యుగంనుండి ప్రపంచీకరణ యుగం దాకా అందులోను కేంద్రం ఇటీవల వ్యవసాయ రంగం పై చేసిన మూడు చట్టాలను ఉపసంహరించుకునేదాకా ఈ కావ్యం ప్రతిఫలిం చింది. ఈ కావ్యం అగ్గిపెట్టెలో అమర్చిన ఆరుగజాల చీర.
రైతు జీవితాన్ని ఇతిహాసంగా రాస్తున్న ఈ కవిలో అక్కడక్కడా సంప్రదాయం కనిపిస్తున్నా తాత్త్విక మౌఢ్యం లేదు. పైగా చారిత్రక పరిణామ దష్టి ఉంది. ఈ కావ్యంలో రైతు అనే మహావక్షం చుట్టూ సకల శ్రామిక వర్గం ఎలా పరివేష్ఠించి ఉంటుందో కవి తన్మయత్వంతోను తార్కిక బుద్ధితోను చిత్రించారు. వ్యవసాయ రంగానికి చెందిన జానపద, ఆధునిక విజ్ఞాన బలం కవికి పుష్కలంగా ఉండడంవల్ల ఇది సాధ్యమైంది.
రైతు అనే మహావక్షాన్ని ఎన్ని రకాల చీడ పురుగులు, వేరు పురుగులు చుట్టుముట్టి హింసిస్తాయో, పీడిస్తాయో, శిథిలం చేస్తాయో పులికొండ అత్యంత అభినివేశంతోనే కాదు అత్యంత నిబద్ధతతో చిత్రించాడు. ఈ సందర్భంలో కవికి గల శ్రామిక నిబద్ధత స్వస్వరూపంతో కనిపిస్తుంది. నిస్సంకోచమే కాదు నిర్భయత్వం కూడా ఈ సందర్భంలో కనిపిస్తుంది. బాడిశ మొక్కబోయింది అనే కావ్యం రాసిన అనుభవంలోంచి పులికొండ తన అనుభవాన్ని విస్తరించుకొని ఈ కావ్యం రచించారు. ఇది ఒక అస్తిత్వమహేతిహాసం. నిబద్ధత రైతు కావ్యంలో కూడా ఉంటుందని పులికొండ ఋజువు చేశారు.
వ్యవసాయమంటే భూమిని కేవలం చేతులో పెట్టుకున్న వ్యక్తికాదు. వ్యవసాయం జరగడానికి వ్యవసాయాన్ని నమ్ముకొని బతికే శ్రామిక వర్గం అని లంకె పల్లె పున్నయనాయుడు అనే ఎకనామెట్రిక్ ప్రొఫెసర్ తన సాహిత్యంలో ప్రతిపాదించారు. పులికొండ తన అయిడియాలజీని ప్రతిపాదించారు. ఇది సమగ్రదక్పథం.
పులికొండ ఈ కావ్యాన్ని చాలా సంబరంగా రాశారు. సంబరంగా రాయడంలోనే రచయిత సంవేదన ప్రధాన సూత్రం. తిండి గింజలు పండించే వాళ్ళ జీవన సమరం పట్ల గొప్ప సానుభూతితో ఈ కావ్యాన్ని రచించారు కవి. ఇప్పటి దాకా రైతు వ్యవ సాయంపై వచ్చిన కావ్యాలను అన్నిటిని గౌరవిస్తూనే ఈ కావ్యం వాటి పరిణత రూపంగా ఉందని నేను అభిప్రాయ పడుతున్నాను. ఆదిమ శ్రామికుని నుండి ఆధునిక రైతుదాకా ఈకావ్యంలో మనకు కనిపించడమే ఈ కావ్యం వైశిష్ట్యం. ఆకలి తీర్చే రైతు ఇవాళ ఆర్తనాదాలు చేయవలసి రావడం పెద్ద విషాదం. ఈ విషాదం పట్ల ఆగ్రహమే ఈ రైతు మహాభారతం. సంస్కతి అనేది ఎవరో ఉన్నత వర్గాలు వారు సష్టించేది కాదు. పులికొండ ఆదిమ రైతు ఆదిమ సంస్కతి అంటున్నాడు. ఆదిమ రైతు ప్రకతితో పోరాటం చేసినా అతడు ప్రకతి విధ్వంసకుడు కాడు అన్న కవి మాట నేటి ప్రకతి విధ్వంసకుల కళ్ళు తెరిపిస్తుంది.
ఒక జీవిని నరికి నందుకు
వేయి ప్రాణాలు పోసేందుకే
బిడ్డల్లా పెంచాడు మొక్కల్ని
వ్యవసాయం అడివిలో మొదలై మైదానాలలోకి నడిచి వచ్చిందనే కవి అభిప్రాయం వ్యవసాయ పరిణామ చిత్రణమే.
ఆదిమ రైతు అడవి రైతు
పల్లెకొచ్చిన రైతు పల్లవించిన రైతు
పల్లెలలో వ్యవసాయం దాని అనుబంధ వత్తులు ఎలా విస్తరించాయో పల్లె పర్వంలో చిత్రించారు. అన్నీ చెప్పి
పల్లె పుట్టింది
కులాలు పుట్టినరు
అని ఒక చారిత్రక విభాతసంధ్యను గుర్తించడమే. విశ్వాస పర్వంలో మానవ పరిణామాన్ని చెబుతూ దైవభావన పుట్టుక మూలాలను చెప్పారు. రైతు నిరక్షరాస్యుడు అనడాన్ని కవి ఆమోదించాడు.
అతను ప్రకతిని చదువుకోవడం
ఎంత గహనమో
వేదాలు వింగడించిన వ్యాసునికేం తెలుసు అన్నది కవి ప్రశ్న. ఆదిమ రైతు నిరక్షరాస్యుడు అనేభావన అక్షర రూపమున్న అవిద్య భావన. అన్నమాట కవినోట నుంచి ఊరికే రాలేదు. పులికొండ చరిత్రను భావుకతను జోడించి సమన్వయం చేశాడు. ఇది ఒట్టి నినాదాల కావ్యం కాదు. ఒట్టి స్టేట్ మెంట్ల కావ్యం కాదు. వస్తుబలానికి ప్రాధాన్యమిస్తూ భావుకతను బజారులో వదలకుండా పగ్గం వేసి నిలిపారు.
విత్తనం పగిలి
మొలక తొంగి చూచే దశ్యం
పురిటి గదిలోంచి
కెవ్వుమన్న కేకని
ముఖంలో దాచుకుంటూ
మంత్రసాని నవ్వుతూ వచ్చే
దశ్యంలా ఉంటుంది ఇలాంటి భావుకతా దశ్య విశేషాలు ఈ కావ్యంలో చాలా ఉన్నాయి. ఈ కావ్యం మొత్తం నాకు మా నాయయన జీవితాన్ని గుర్తుచేస్తుంది. ప్రత్యేకించి దళారి పర్వం చదువుతుంటే దళారుల చేతిలో చితికి పోయిన మానాయన కనిపించి కన్నీళ్ళు కారాయి.
సింగమనేని నారాయణ అడుసు కథలోను, దళారి కథలోను ప్రతిపాదించిన ఒకఅంశం పులికొండ ఈ కావ్యంలో ప్రతిపాదించడం విశేషం. కొన్ని ఉత్పత్తుల ధరలను ఉత్పత్తి దారులే నిర్ణయిస్తారు. కానీ తన ఉత్పత్తి ధరను నిర్ణయించుకో లేనివాడు ఒక్కడే అతడు రైతు. ఈ విషయాన్ని పులికొండ లేవనెత్తడం ఈ కావ్యానికి ప్రాణమైంది.
ఎవరి సష్టిని వారమ్ముకుంటారు
ఎవరి కళను వారు సొమ్ము చేసుకుంటారు
ఎవరి శ్రమకు వారు లెక్కలు కడతారు
అతను పండించిన శ్రమకు మాత్రం
ఖరీదు కట్టే షరాబు అతను కాదు
అతని శ్రమని కొనేవాడు.
ఇది నేటి భారతీయ రైతాంగం ఎదుర్కుంటున్న సమస్య. ప్రైవేటీకరణ వ్యవస్థ దళారీ వ్యవస్థగా మారి రైతు రక్తం పీలుస్తున్నది. రైతుల ఆత్మహత్యలను అందుకు కారణాలను పులికొండ వాస్తవికంగా కవిత్వీకరించారు. దళారి తాకట్టు వంటి సమస్యలతోపాటు రైతు ఎదుర్కొంటున్న కరెంటు సమస్య వంటి వాటిని కూడా వదిలిపెట్టలేదు కవి. రైతు బిడ్డలు ముఖ్యమంత్రులైనా రైతుల కష్టాలు తీరలేదన్న కవి అభియోగం అందరూ ఆలోచించవలసిందే. అనావష్టి ఒకవైపు, అతి వష్టి ఒకవైపు రైతును పీడిస్తున్నదని అందరూ అంటాము. పులికొండ గ్లోబల్ వార్మింగ్ దష్టి కోణాన్నుంచి ఈ సమస్యను చూడడం విశేషం.
రైతు వ్యతిరేక నల్ల చట్టాల మీద ఏడాదికి పైగా ఢిల్లీ పరిసరాలలో రైతులు చేస్తున్న తిరుగుబాటును దాని పేరుమీద నడిచిన రాజకీయాలను ఆఖరికి రైతుల ఉద్యమానికి తలవంచి కేంద్రం తాను చేసిన చట్టాలను విరమించుకోవడం ఈ పరిణామాలను కవి సుదీర్ఘంగా వర్ణించారు. దీంతో ఆ కావ్యానికి తాజాతనం అబ్బింది.
ఉత్పత్తి చేతులకు
ఉద్యమమే మిగులుతుంది
ములుగర్రలు జెండాలౌతాయి.
ఇంత మంచి కావ్యం రాసిన పులికొండకు మరోసారి శుభాకాంక్షలు.
- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, 00000000