Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వలా వచ్చి ఇలా మాయమౌతుంటావ్
మూసితెరుస్తున్న కనురెప్పల్లోంచి
జారిపోతున్న ఆకాశంలో
నిన్ను వెతుకుతూ
స్పర్శాచ్ఛాదనల్లో తచ్చాడుతూ
ఉక్కపోతలో తడిసిపోతుంటాన్నేను
చల్లగాలి వీచినా
స్పర్శకందదు
చినుకులు రాలి
మట్టివాసన కమ్ముతుంటదిగానీ
ఆస్వాదనకు రాదు
ఆకులూ దుమ్మూ
అటూఇటూ మాట్లాడినా
వాటి రంగూ రుచీ ఏదీ పట్టదు
బైటి ప్రపంచమేదీ ఒంటబట్టదు
అప్పుడెప్పుడో
నీకు నీవుగా ఎదురైనప్నుడో
అనుకోకుండా తారసపడినప్పుడో
కావాలని కలగన్నప్పుడో
కళ్ళారా చూసినప్పుడో
అసలెప్పుడో...
మస్తిష్కంలో చొరబడిపోతావ్!
కనీవినని ఊహలచుట్టూ
కొత్తర్థాలై
వెలుగుతూ ఆరిపోతున్న విద్యద్దీపానివై
దశ్యమానమౌతూ
చిత్రాలు గీస్తుంటావ్!
చెట్టు కిందరాలిన పూలరెక్కలై జ్ఞాపకాలు
సున్నితసుగంధాలు వెదజల్లిన గాలి చేష్టల్లో
ఒక్కసారిగా చెల్లాచెదరౌతుంటారు...
నేనూ నాలో ఉండదు!
పూలరెక్కల వెంట పరుగు తీస్తూ!
యుద్ధం ముగియని కలలో
నేనింకా అక్కడక్కడే
ఒంటిస్తంభం మేడనై
నీ రూపానికి నగిషీలు చెక్కుతుంటాను
కేంద్రంలో నిలబడి
వద్దకు మూగే లెక్కకందని సరళ
వక్ర రేఖా నక్షత్రాలను చూసి
కాసేపు కళ్ళు మూసుకుని
ఒకానొక నిట్టూర్పుతో
సిరాచుక్కలు జార్చిన అక్షరాలను
అక్కడే వదిలేసి
ముగింపు తెలియని ఉత్తరంలా
నోట్ బుక్ నుండి
బైటపడిపోతుంటాన్నేను!
ఎందుకు తొంగిచూసి
వెళ్ళిపోతుంటావోగానీ
నిన్ను పూర్తిచేయని చంద్రవంకనై
సగంసగంగా మిగిలిపోతుంటాను
కవితనై!!
- అరుణ నారదభట్ల