Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహంకార మదంగాలు వాయిస్తూ
అధికార మదాంధులు
విధ్వంసపర్వ రచనకు పూనుకుంటూ
నియంత్రణ తప్పిన నియంతలు
పదవీ రుచులకు మరిగి
లాభాపేక్షల వైపుకు మొగ్గి
రాజనీతికి, రణనీతికి నీళ్లు వదిలేస్తూ
విచక్షణ, హేతుబద్ధతలకు తిలోదకాలిస్తూ
ఉగ్రవాదపు కొండచిలువను నిద్రలేపుతున్నారు
క్షిపణి ప్రయోగాలు
బాంబుల మోతలు
భీకర దాడుల పరంపరలు
దుర్మార్గాలు, దుశ్చర్యలు
దురాక్రమణలు, దుర్వినియోగాలు
మానసిక సమతుల్యత కోల్పోయిన నాయకత్వాలు
ఎంత మాత్రమూ ప్రజాక్షేమం పట్టని పరిపాలనా యంత్రాంగాలు
కాలమనే సంద్రంలో ఈదుతున్న సామాన్యులకు
జీవననౌకను ముందుకు నడిపించుకోవడమే నిత్య యుద్ధం
ఇప్పుడొచ్చిపడ్డ ఈ యుద్ధమొక అనూహ్య ఉత్పాతం
ఇప్పుడు వారు నిలుచున్న దేశమే వారికో బలిపీఠం
రెక్కలు తెగిపడ్డ జటాయువులా కొట్టుమిట్టాడుతూ
కోపాగ్ని పాలైన కొంగలా మాడి బూడిదైపోతూ
కళ్ళ ముందే భళ్ళున కూలబడుతోందో దేశం
కబంధ హస్తాల్లో చిక్కి మాంసపు ముద్దలైపోయి
నేల రాలుతున్నాయి స్వేచ్ఛా విహంగాలు
కులం, మతం, వర్గం, వర్ణం
ఆర్థికం, ఆధిపత్యం, విస్తీర్ణం
ఏదో ఒక పేర, ఏదో ఒక వైషమ్యంతో
ఎప్పుడూ దేశదేశాల మధ్య సంఘర్షణలే
ఎందుకు? అసలెందుకు?
ఈ అమానుష చర్యలు..
ఈ అనిమేషాలు..
ఈ అశాంతి గీతాలాపనలు..
ఎవరికెవరి మధ్య శత్రుత్వాలు?
నడుమ అమాయకులకెందుకపసోపాలు?
శాంతి కపోతపు అంగాంగాన్ని ముక్కలుగొడుతూ
జబ్బలు చరుచుకోవడం
విశ్వశాంతిని చావుదెబ్బలు తీస్తూ
మీసాలు దువ్వుడం
ఎంత మూర?త్వం, ఎంత మూఢత్వం
ఓ అభివద్ధి చెందిన దేశ నాయకుల్లారా..
అనాగరికులై వ్యవహరిస్తున్న అమానవీయులారా..
ఒక్కసారిటు వంక తిరిగి మీ చెవులు విప్పార్చి వినండి
మా అగ్నిగొంతుకల నుండి చిమ్ముకొస్తున్న
లావా లాంటి వాక్యాలను
శవాల గుట్ట మీద జెండాలు పాతి ఎగరేస్తే
శిథిలాల దిబ్బ పైన నిలుచొని జాతీయ గీతాలు పాడితే
గెలుపు కానే కాదు.. గెలుపు కానే కాదు!
- కార్తీక రాజు, 8977336447