Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంతొమ్మిదో శతాబ్ది తొలి పాదంలో భారతదేశంలో ప్రారంభమైన సాంస్కృతిక పునరుజ్జీవనం తెలుగునాట కూడా అనేక రంగాల్లో భీజాలు వేసింది. అటువంటి వాటిలో బాల సాహిత్యం కూడా ఒకటి. అన్ని విభాగాల్లో లాగానే తెలుగు బాల సాహిత్యంలోనూ కథలు, గేయాలు, నవలు, కవితా సంకలనాలు, సంపుటాలు విరివిగా వచ్చాయి, వస్తున్నాయి. ఇతర వచన రూపాలైన యాత్రా చరిత్రలు, లేఖలు వంటివి అడపాదడపా వచ్చాయి. బాల సాహిత్య పరిశోధన కొంత వరకు జరిగింది కానీ ఇటీవలి వరకు బాల సాహిత్య విమర్శ అంతగా రాలేదు.
పిల్లలు నాటకాలు చూడటానికి చాలా ఇష్టపడతారు. ''కావ్యేషు నాటకమ్ రమ్యమ్, నాటకాంతమ్ హి సాహిత్యం'' అని అలంకారికులు పేర్కొన్న బాలల నాటకాలు పిల్లల కోసం ఒకటో అరో వస్తే, నాటికలు కూడా బాలల కోసం తక్కువగానే వచ్చాయి. తొలి మలి తరాల్లో న్యాయపతి కామేశ్వరరావు, కామేశ్వరి, ఏడిద కామేశ్వరరావు, ఎ.రమేశ్, నండూరి సుబ్బారావు, అన్నపర్తి సీతా రామాంజ నేయులు, తురగా జానకీరాణి, ఉన్నవసేతు మాధవ రావు వంటి అనేక మంది పిల్లల నాటికలు రాశారు. బాలాంత్రపు రజనీ కాంతారావు, డా.దాశరథి, డా.సి. నారాయణరెడ్డి, బోయి భీమన్న, పైడిపాటి, బి.వి. నరసింహారావు, కొలకలూరి ఇనాక్ మొదలగు వారు చక్కని గేయనాటికలు కూడా రాశారు.
తొంభయ్యవ దశకానికి ముందు పాఠశాల ఉత్సవాలు, వార్షికోత్సవాల వంటి కార్యక్రమాల్లో నాటికలు తప్పని సరిగా వుండేవి, కాబట్టి అచ్చులోనూ అందుబాటులో ఉండేవి. ఇటీవల ఆ కొరత కొంత వుందన్నది నిజం. అయితే ఈ సందర్భంలోనూ పిల్లల కోసం నాటికలు రాసినవాళ్ళు లేకపోలేదు. ప్రముఖ నాటక రచయిత రావుల పుల్లాచారి, ముంజులూరి కృష్ణకుమారి, ఆకెళ్ళ శివప్రసాద్, , డా. సిరి, డా.కందేపి రాణీప్రసాద్, పద్మ త్రిపురారి, డా.వి.ఆర్. శర్మ, డా. పత్తిపాక మోహన్ మొదలగు వారితో పాటు మరికొందరు పిల్లల కోసం నాటికలు వివిధ సందర్భాల్లో రాశారు. డా. వడ్డేపల్లి కృష్ణ వంటి వారు దేశవిదేశాల్లోని పిల్లల కోసం తెలుగు గేయ రూపకాలు రాశారు. ఇదే కోవలో ప్రముఖ రంగస్థల పద్యనాటకాలను పిల్లల కోసం రూపాంతరం చేశారు మధిరకు చెందిన బాబ్లా నాయక్. బాలోత్సవాల్లోనూ పిల్లల నాటికలు ప్రదర్శించబడ్దాయి. కవయిత్రి, కథా రచయిత్రి, విద్యావేత్త, డా. అమృతలత ఈ లోటును కొంత బర్తీ చేస్తూ పిల్లల కోసం చక్కటి నాటికలు రాసి తాయిలంగా అందించింది. అవన్నీ గతంలో ఒక ప్రముఖ పత్రికలో ధారావాహికంగా వచ్చాయి. అమృతలత స్వయంగా కథ, నవలా రచయిత్రి అయినా నాటికలు పిల్లల కోసం రాయడం విశేషం.
తాను ఈ నాటికలు ఎందుకు రాసిందో చెబుతూ, ''స్కూల్ డే వస్తున్నా, స్కూల్లో మరో ఫంక్షన్ ఏది వచ్చినా ఏం నాటిక వేయాలి అనే ప్రశ్న అందర్నీ వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యకి పరిష్కారమే ఈ 'చుక్కల లోకం చుట్టొద్దాం!' నాటికల సంపుటి'' అంటారు అమృతలత. విద్యావేత్త, వదాన్యులు, విధుషీమణి అయిన అమృతలత అమ్మ... అమ్మమ్మ, ఉద్యోగరీత్యా తొలుత సర్కారు బడి ఉపాధ్యాయిని.. బాలల గురించి, వాళ్ళ మనస్త త్వాలు, వ్యక్తిత్వాలు తెలిసిన బాలల మనస్తత్వ నిపుణురాలు. ఆమె ఇతర రచనల్లో లాగానే బాల సాహిత్యంలోనూ అది అచ్చంగా మనకు కనిపిస్తుంది. 'ఈ చుక్కల లోకం...' లోని ద్రువతారల్లాంటి పదకొండు నాటికల్లో దేని మెరుపు దానిదే!
పైన చెప్పినట్టు రచయిత్రి ఉపాధ్యాయిని కాబట్టి బడిలో జరిగే అన్ని కార్యక్రమాలు, కార్యకలాపాలు తనకు బాగా తెలుసు. మీకు గుర్తుందో లేదో కానీ నా చిన్నప్పటి సంఘటన లన్నీ నాకు బాగా గుర్తు. మా చిన్నప్పుడు స్కూల్ ఇన్స్పెక్షన్ కు నాదిర్సాబ్ (డిప్యుటీ ఈ.ఓ) సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు వచ్చే వారు. ఆయన వస్తున్నారంటే దాదాపు పదిహేను రోజులు బడంతా హడావుడి గా ఉండేది. సార్లు బాగా పద్యాలు చెప్పి, హోంవర్క్ రాసేవాళ్ళను ముందు వరుస లో కూర్చోబెట్టేవారు. అదృష్టం బాగుండి ఆయన అడిగిన ప్రశ్నకు ఎవరైనా సరైనా సమాధానాలు చెబితే వారం రోజులపాటు బడిలో వాడే హీరో!. అటువంటి తతంగాన్ని చక్కగా వర్ణిస్తూ అమృతలత పిల్లలకోసం రాసిన నాటిక 'ఇన్స్పెక్షన్.' 1980-1990ల మధ్య సర్కారు బడుల్లో పదవ తరగతి చదువుకున్న ప్రతి విద్యార్థి ఇందులో తనను తాను చూసుకోగలడు. తరగతి గదుల్లో విద్యార్థులు, వాళ్ళ పెబ్బ (మానిటర్), విద్యార్ధుల మధ్య స్పర్థలు, బాగా చదివే విద్యార్థులు అధికారుల ముందు ఎలా పాఠశాల పరువు నిలబెడుతారో వంటివి ఇందులో రచయిత్రి పిల్లల ద్వారా తెలుపుతారు. కేవలం విషయాన్ని చెప్పి వూరుకోవడం రచయిత్రికి తెలియదు. తన రచన ద్వారా ఏదో ఒక ప్రయోజనం కలగాలన్నది ఆమె తపన. దానిని తాను ప్రతిచోట ఉపయోగించుకుని రాశారు. ఇందులోనూ కేవలం డి.ఈ.ఓ రావడం,పోవడం వంటి విషయా లు చెబితే నాటిక ముగిసేదే. కానీ ఈ నేపథ్యంగా భాష గురించి, పిల్లల స్ఫురదృష్టి గురించి చెబుతుంది రచయిత్రి అమృతలత.
ఒకవైపు తల్లితండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేయడం, మరో వైపు ఉమ్మడి కుటుంబాలకు దూరంగా, గ్రామాల్ని విడిచి తప్పనిసరి పరిస్థితుల్లో నగరాలకు వలస పోవడం, ఇంకోవైపు బాల్యంలోనే పిల్లలకు ఐ.ఐ.టి వంటి పరీక్షల ఫౌండేషన్ కోసం అంటూ పిల్లల్ని హాస్టలో వేయడం చేస్తున్నాం. అమృతలతకు ఇవన్నీ బాగా తెలుసు. తాను స్వయంగా కె.జి నుండి పి.జి వరకు విద్యా సంస్థలను నడుపుతోంది. అందులోనూ హాస్టల్లో వుండి చదువుకునే విద్యార్థుల కథలు వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలకు ప్రతి బింబంగా వుంటాయి కూడా. 'స్టడీ అవర్స్' అటువంటి నాటిక. ఇందులో రచయిత్రి 'పాంచాలి' వంటి పదాలకు పిల్లలు చెప్పే విగ్రహ వాక్యాలు, కొత్తకొత్తగా వాళ్ళు కనిపెట్టే పదాలు వివరించడం నాటికను రక్తికట్టించడమే కాకా చాలా సరదా కలిగిస్తాయి కూడా.
రచయిత్రికి నిజామాబాద్ గ్రామాలతో, గ్రామీణ జీవితాలతో, అక్కడి ప్రజలతో అమెకు పరిచయమే కాక సన్నిహిత సంబంధముంది. పాఠశాలు, విద్యా సంస్థలు, దేవాలయం వంటి అనేక సంస్థలను నిర్వహిస్తోంది. టీ.వి.లు వచ్చిన తొలినాళ్ళలో టీ.వి. వున్న వారి ఇండ్లల్లోని సందడి, ఇబ్బంధి ల్యాప్‌టాప్‌లలో, మొబైల్‌లలో, బెడ్రూమ్లే కాక ఇంట్లోని ప్రతి రూంలో ఒక టీ.వి.పెట్టుకుని చూసే ఈ తరానికి అంతగా తెలియదు. అది తెలుసుకోవాలంటే అమృతలత రాసిన నాటిక 'టీ.వి. న్యూసెన్స్' చదవాలి లేదా ప్రదర్శన చూడాలి. తొలి నాళ్ళలో వాడలోనో, ఊరిలోనో ఏ ఒక్కరి ఇంట్లోనో టీ.వి వుండేది. రోజూ ఆ ఇంట్ల్లో జాతర సాగేది. అదంతా రాస్తే వంద నాటకాలవుతాయి. ఈ 'టీ.వి. న్యూసెన్స్' నాటిక చివరి సంభాషణలు ''... పిక్చర్ సగంలో వదిలి మేం ఎలా వెళ్లేది మీరే చెప్పండి? మీకు అభ్యంతరం లేకపోతే- ఆ తాళంకప్పా, తాళం చెవీ ఇలా ఇవ్వండి! టీ.వి. చూశాక మేమే తాళం వేసి, మీరు వచ్చాక- మీ తాళం చెవి జాగ్రత్తగా అప్పగిస్తాం, సరేనా?'' అనే పొరుగింటి సూర్యకాంతమ్మ మాటలు టీ.వి. ఉన్నవాళ్ళ పాట్లను చక్కగా తెలుపుతుంది. 'ప్రెజంటేషన్స్' నాటికలో రచయిత్రి మనస్తత్వ నిపుణురాలుగా కనిపిస్తే, 'హాలిడే' నాటికలో తల్లితండ్రులుగా మనం మనకు కనిపించేట్టు రాశారు అమృతలత. 'ప్రెంజటేషన్స్' నాటికలో రచయిత్రి విభిన్న మనఃప్రవృత్తుల స్త్రీలను మనకు చూపిస్తారు. అంతేకాక వివిధ ఫంక్షన్లలో బహుమతుల తేవడం వంటి ప్రహసనాలు ఎలా ఉంటాయో వివరిస్తారు. ఆడంబరాలు చూపించి, అంతస్తుల గొప్ప కోసం, వ్యాపారదృష్టితో ఫంక్షన్లు, గెట్టుగెదర్లు నిర్వహించే వాళ్ళకు ఇది అచ్చంగా చెంపపెట్టే కాకుండా ఎలా ఉండకూడదో కూడా ప్రేక్షకులకు తెలుపుతుందీ నాటిక. పైన చెప్పనట్టు 'హాలీడే' కూడా ఇందులోని మంచి నాటికల్లో ఒకటి. ఇది సంభాషణల పరంగానే కాక తల్లితండ్రుల మనస్తత్వాలకు చిత్రిక పడుతుంది. మనం ఐదారేళ్ళు వచ్చేవరకు ఆటపాటలతో గడిపి బడికి వెళ్ళాం. 'పిల్లపుట్టక ముందె కుల్ల కుట్టినట్టు' అన్న తెలుగు సామెత లాగా పుట్టే వారికోసం కూడా బడుల్లో సీట్లు రిజర్వేషన్ చేసుకోవడం మనం చూస్తున్నాం. ఒక రకంగా వీటన్నింటికి చెంపపెట్టు లాంటి నాటిక ఇది. పిల్లల అల్లరి భరించలేక రెండు మూడేళ్ళకే బడిలో వేసే అనేక మంది మన ఇరుగు పొరుగులు మనకు ఇందులో కనిపిస్తారు. ముగింపులో రచయిత్రి ఇందులోని రజని పాత్రతో చెప్పించిన మాటలు నాటికకు హైలైట్. ''యురేకా! ఇప్పుడు అర్థమైంది. అసలు ఈ సెలవులు మీకూ కాదు... మాకూ కాదు మమ్మీ... మమ్మల్ని భరిస్తున్న మా టీచర్స్‌కి!'' అనడం నిజం కదూ! మొత్తం నాటికల్లో పాత్రల సంఖ్య ప్రదర్శనా సౌలభ్యం కోసం తక్కువగా ఉన్నప్పటికీ ఇందులో మాత్రం విభిన్న వయోవర్గాలకు చెందిన అనేక పాత్రల్ని పిల్లలకు పరిచయం చేస్తారు రచయిత్రి.
సున్నితమైన అనేక అంశాలను పిల్లల కోసం రాస్తున్న క్రమంలో అంతకు సున్నితంగా, పిల్లల మనసుకు హత్తుకునేలా చిత్రించే ప్రయత్నం చేసిన అమృతలత అవసరమైన చోట హాస్యాన్ని, వ్యంగ్యాన్ని కూడా చొప్పించి చదిy ేప్పుడు లేదా ప్రదర్శనప్పుడు సూటిగా టార్గెట్ గ్రూప్ అయిన పిల్లలకు చేరేట్టు చేశారు. 'ఇన్విజిలేషన్' అటువంటిదే. అన్ని నాటికల్లో మనకు కనిపించినప్పటికి ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం కూడా పాఠకులు లేదా ప్రేక్షకుల దృష్టిలోకి వస్తుంది. అది సంభాషణల పట్ల రచయిత్రి చూపించిన ఔచిత్యం. ఈ నాటిక జరుగుతున్నది ఇన్విజిలేషన్ హాలులో కాబట్టి అక్కడ మాట్లాడడం నిషేధం కాబట్టి, పాత్రలతో సంభాషణను అతి క్లుప్తంగా, సూటిగా చేయించడం అమృతలత సునిశిత పరిశీలనకేకాక, పాత్ర, కాల, స్థలాల పట్ల ఆమె గల అవగాహనను తెలుపుతుంది. ఇవే కాక చక్కటి హాస్యాన్ని పండించిన నాటికలు కూడా ఇందులో ఉన్నాయి. 'స్కూల్ డే' నాటిక చూసినట్టయితే నీతిని చెప్పేదిగా కాక తమ తప్పులు తాము తెలుసుకునేట్టు, అల్లరి పిల్లలకు తెలిసివచ్చేట్టు రాసిన నాటిక. ఇందులోని హాస్యం నాటకాన్ని మరింతగా రక్తికట్టించడమే కాక ఆలోచన కలిగించే దిశగా పిల్లలను మలుపుతుంది. 'బస్టాండ్' మరో మంచి నాటిక. ఇందులోని సంభాషణలు ఆలోచనాత్మకంగానే కాక ఆసక్తికలిగించేలా రాయడం రచయిత్రి కౌశలానికి నిదర్శనం.
నిజానికి పిల్లల కోసం రాయడం కష్టమైన పనైతే, అందులోనూ సంభాషణలు వారి స్థాయిలో ఎదిగి రాయడం మరింత కష్టం. ఇది అందరికీ సాధ్యమమయ్యే పని కాదు కూడా. రచయిత్రి అమృతలత చేయి తిరిగిన రచయిత్రే కాక బాలలలోకం తెలిసిన వారు. అందువల్లె ఇందులోని ప్రతి నాటిక చక్కని రచనగా అలరారుతోంది. రచయిత్రి ఈ నాటికల్లోని ప్రతి పదాన్ని పిల్లల స్థాయిలో రాయడం వల్లనే ఇప్పటికీ 'ఈ చుక్కల లోకం చుట్టొద్దాం!' వెలుగులను విరజిమ్ముతోంది. 'పవర్‌కట్', 'బి వేర్ ఆఫ్ మైక్స్' మరియు 'ట్యూషన్స్' ఇందులోని ఇతర నాటికలు. ఇవి కూడా అటువంటి నాటికలే. వీటిలోని ఒక నాటిక వాతావరణ కాలుష్యాన్ని గురించి తెలిపితే, మరొకటి వ్యంగ్యంతో పాటు 'పవర్‌కట్' వల్ల ఇబ్బంధులు పడే మహిళల గురించి చూపుతుంది.
పిల్లల కోసం కాదు కానీ పిల్లలే ప్రధాన ఇతివృత్తాలుగా అమృతలత రాసిన మరో సంపుటి 'గోడలకే ప్రాణముంటే...' ఇందులో కూడా రచయిత్రి సమకాలీన సమస్యలను, అంశాలనే కాక తెలంగాణ భాషలో సంభాషణలు రాశారు డా.అమృతలత. కవయిత్రి కిరణబాల అన్నట్టు ''...పెద్దలు పిల్లలతో ఎలా వ్యవహరించాలో... పిల్లలు పెద్దలతో ఎలా నడుచుకోవాలో... సూచిస్తూ సరదాగా సాగిన పిల్లల నాటికల సమాహారమే 'చుక్కల లోకం చుట్టొద్దాం!' ప్రముఖ నాటక ప్రయోక్త కె.ఎల్. నరసింహరావు, ''నాటకమన్నాక పసందైన విందు భోజనంలా ఉండాలి. చమత్కార సంభాషణలు, అభినయాని కవకాశం కల్పించే సన్నివేశాలు, కడుపుబ్బ నవ్వించే హాస్యం ఉండాలి'' అంటారు. ఈ మాటలు అమృతలత రాసిన ఈ నాటికలకు వర్తిస్తాయి.
- డా.పత్తిపాక మోహన్