Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవన సంఘర్షణల్ని ప్రాణవంతంగా చిత్రించి అంతరంగంలోని తడుల్ని, ఒత్తిడుల్ని మంచి కథలుగా తీర్చిదిద్దిన రచయిత డా.రూప్‌కుమార్ డబ్బీకార్. రూప్‌కుమార్ రచించిన పదకొండు కథల సంపుటి 'లచ్చుంబాయి'. ఇది రచయిత తొలి కథల సంపుటి. అయినప్పటికీ రచయిత జీవనానుభవసారస్థుడు. కథలన్నీ విశేషమైనవే. జీవితంలో తడిసి మొలకెత్తినవే. రచయిత కొత్తగా చూడటానికో, కొత్తగా రాయటానికో ప్రయత్నించినవే. తెలిసిన అనుభవాల్ని ఆర్ధ్రంగా చిత్రించాడు.
మనిషిలో నిద్రాణమై ఉండే మానవీయ పార్శ్వాన్ని ప్రేరేపించే శక్తివంతమైన సాధనం సాహిత్యం. ఎప్పటి కప్పుడు మారుతున్న జీవితాన్ని మధించి పౌర సమాజపు సంస్కార స్థాయిని ఉన్నతీకరించే పని సాహిత్యం కొనసాగిస్తుంది. జ్ఞానాన్ని, అనుభవాన్ని, చైతన్యాన్ని వివిధ ప్రక్రియల ద్వారా అంది పుచ్చుకొని సాహిత్యం అనునిత్యం అన్ని వైపులా పరివ్యాప్తం చేస్తుంది. ప్రక్రియ లేవైనా కళారూపాలుగా పండించటం కష్టమైన పని. జీవితాన్ని, మనస్తత్వాన్ని, ఆరాటాల్ని, సంఘర్షణల్ని పలువిధాలా దర్శించి ప్రాణం పోయ గలిగినపుడే సాహిత్యం తాజాగా పరిమళిస్తుంది. ప్రాణ పరిమళాలు రంగరించ టానికి ఏ రచయితయినా జీవితం ముందు మోకరిల్లవలసిందే. ఎంతటి ప్రతిభావంతుడైన రచయిత అయినా జీవన స్పర్శ అంటకపోతే ఆ రచన రాణించదు. కథలయితే పరిసరాల నుంచి పట్టుకొని ప్రాణం పోసి మానవ వాసనలద్దితేనే సహృదయాన్ని ఆకట్టుకుం టాయి. కేవలం వృత్తాంతాలు కథలు కాలేవు. కేవలం కథలు కళారూపాలు కాలేవు. కేవలం కళారూపాలు పాఠకుల్ని ఉద్వేగపర్చలేవు. వృత్తాంతాలు కథలై, కథలు కళారూపాలై, బతుకులో, బాధల్లో, బంధాల్లో తడిసినప్పుడే, తడితడిగా తగిలిన ప్పుడే మనుషుల్ని కదిలిస్తాయి. కలవరపెడ్తాయి. మంచి కథలుగా నిలబడ్తాయి. కథకుడిని సాహిత్యంలో నిలబెడ్తాయి.
జీవన సంఘర్షణల్ని ప్రాణవంతంగా చిత్రించి అంతరంగంలోని తడుల్ని, ఒత్తిడుల్ని మంచి కథలుగా తీర్చిదిద్దిన రచయిత డా.రూప్‌కుమార్ డబ్బీకార్. రూప్‌కుమార్ రచించిన పదకొండు కథల సంపుటి 'లచ్చుంబాయి'. ఇది రచయిత తొలి కథల సంపుటి. అయినప్పటికీ రచయిత జీవనానుభవసారస్థుడు. కథలన్నీ విశేషమైనవే. జీవితంలో తడిసి మొలకెత్తినవే. రచయిత కొత్తగా చూడటానికో, కొత్తగా రాయటానికో ప్రయత్నించినవే. తెలిసిన అనుభవాల్ని ఆర్ధ్రంగా చిత్రించాడు. కల్పించిన సంవాదాన్ని రమణీయంగా తీర్చిదిద్దాడు. రూప్‌కుమార్ శిల్పం కోసం, కొత్తదనం కోసం, బతుకు వాసన కోసం తపన పడిన తీరు తన కథల్లో గమనించవచ్చు.
రూప్‌కుమార్ కథల్లోని పాత్రలు, సంభాషణలు, సన్ని వేశాలు, సంఘర్షణలు జీవితంలో తడిసి వచ్చినం దువల్ల తడితడిగా తగులుతాయి. తెలంగాణ స్వచ్ఛత, మానవీయత కథల్లో ఆకర్షిస్తూనే ఉంటాయి. ప్రధానంగా నల్గొండ పట్టణ పరిసరాలు, అడపాదడపా గ్రామీణ పరిమళాలు, తరచుగా చుట్టూరా కనబడే మనుషులు, లోపల దాచుకున్నా ఒలుకుతున్న దు:ఖాలు, సర్దుకు పోతూనే బయటపడే సంఘర్షణలు, తెగిపో తున్న బంధాల నడుమ సుడివడుతున్న ప్రేమలు, మారుతున్న విలువలు, తిరిగి విలువల కోసం పాకులాడుతున్న మనస్త త్వాలు, సాగనివ్వని కాలం సాగక తప్పని బతుకులు, బరువు బరువుగా సాగే సన్నివేశాలు రూప్‌కుమార్ మన కళ్ళ ముందుంచాడు.
సంపుటిలో మొదటి కథ 'జానిమాజ్', చివరి కథ 'తల్లు' రెండూ ముస్లిం దీన జీవితాల్ని చిత్రించాయి. స్థానిక జీవితాల్ని దయనీయంగా మార్చే విదేశీ ప్రభావాల్ని ఆర్ద్రంగా చిత్రించిన కథలు. 'జానిమాజ్'లో అరబ్‌షేక్‌ల ఎరలకు బలయిపోతున్న (నాదిరా) పేద ముస్లిం పసిబాలికల జీవన విషాదాన్ని రూప్‌కుమార్ చిత్రించాడు. యాజ్దానిది సైకిల్ పంక్చర్లు అతికే వీధి దుకాణం. పెళ్లి వేళ కూడా జరుగుతున్న ఘోరం తెలుసుకోలేని స్థితి, మెహందీ పైనే దృష్టి పెట్టే పసి మనసు 'నాదిరా'ది. ఎవరికీ ఇష్టం లేకపోయినా పరిస్థితులు నలిపి వశపర్చుకునే వైనాన్ని ఈ కథ వివరిస్తుంది. అట్లాగే తల్లు పెద్ద కథ. కులవృత్తి కునారిల్లు తున్న దశలో దీనంగా బతుకు గడిపే వృద్ధాప్యం. చదువుకొని ఉపాధి కోసం అమెరికాలో స్థిరపడిన వార సత్వం, రెంటి నడుమ వారధి రంజాన్ పండుగ. అడుగడుగునా అనుబంధం, తప్పనిసర యిన ఎడబాటు, నడుమ నలిగే భావోద్వే గాలు శిల్ప సమన్వితంగా తీర్చిదిద్దాడు రచయిత. హసన్సాబ్ తోలు వ్యాపారి. వ్యాపారం చూసుకొంటూ కొడుకు 'మునీర్' తమ దగ్గర ఉండాలని లోపలి కోరిక. మునీర్ న్యూజెర్సీలో స్టోర్స్ దుకాణంలో ఉద్యోగి. భవిష్యత్తు అక్కడ బంధాలన్నీ ఇక్కడ. రంజాన్ కోసం కుటుంబంతో వచ్చినప్పుడు ఎదురైన అనుభవాలు ముఖ్యంగా తండ్రి అబ్బుజాన్కు గుండెకు రంధ్రం. అమ్మే తోలుకు రంధ్రం రెండు రంధ్రాల్ని సమాంతరంగా వర్ణిస్తూ కథ నడిపిన పద్ధతి రూప్‌కుమార్ శిల్ప నైపుణ్యానికి మంచి ఉదాహరణ. ముస్లిం కుటుంబాల మీద, బంధాల మీద, ఆధారాల మీద రచయితకెంత పట్టుందో 'తల్లు' చాలు. 'తల్లు' అంటే రంధ్రం. తల్లు బతుక్కి పడింది, బంధాలకు పడింది. మంచి కథ తల్లు.
మర్కపిల్ల-దాగ్, లచ్చుంబాయి ఆరెకటి కల జీవితాన్ని చిత్రించిన కథలు, మేకలు పెంచుకొని యాట మాంసం అమ్ముకొని బతికే కులవృత్తి, సరదాగా సాగ వలసిన 'బద్రి' బాల్యం ఎట్లా అవస్థ పడుతుందో మర్కపిల్ల -దాగ్ చిత్రించింది. చదువుకొని సౌకర్య జీవితం గడు పాలనుకున్న లక్ష్మి 'లచ్చుంబాయి'గా యాట మాంసం కౌసు పనిలో ఎన్ని బాధలు పడిందో 'లచ్చుంబాయి' కథ తెలుపుతుంది. వొద్దను కున్న జీవి తమే ఎదురైనపుడు అను భవించిన హింసను రచయిత ఆర్ద్రంగా శిల్పీకరించాడు. ఆరెకటికల జీవితాల్లోని విషాద మంతా, బాల్యమయినా, స్త్రీత్వమ యినా ఆరడి పడిన తీరు హృదయాలు కరిగించేలా వర్ణించాడు రూప్‌కుమార్.
'వేపచెట్లు' మరో మంచి కథ. ముసలి తనాన్ని, వేప చెట్లనూ పోల్చి కథ నడిపిస్తాడు రచయిత. వేపచెట్లు, అరుగు, రాజమ్మ వృద్ధాప్యానికి గుర్తులు. కోడలు చేతిలో రాజమ్మ-చెట్ల అంతిమ దశ, అంతరించిన తీరు తెలిపే కథ.
'ఎదురు ప్రవాహాలు' 'అతడు, నేను - రెండు తీరాల నడుమ' రెండు కథలు భిన్నమైనవి. ఒకటి సమస్య ప్రధానం కాగా మరొకటి సంవాద ప్రధానం. 'గే' సమస్యను సాహసంగా చర్చించిన కథ 'ఎదురు ప్రవాహాలు'. నీరజ్, భార్గవ్ సన్నిహిత స్నేహితులు. నీరజ్ బాహ్య శరీరం పురుష రూపమైనా లోపలి ప్రవాహ మంతా మరో పురుష సాహచర్యం కోరుకుం టుంది. హార్మోన్ల కదలిక, మానసిక స్థితి లోతుగా రచయిత వర్ణించాడు. యువకులు పరస్పర అంగీకారంతో జీవించాలనుకోవడంలోని, దైహిక కలయిక లోని సామంజస్యాన్ని తెలిపే ప్రయత్నం సాహిత్యంలో సాహసమే. సరికొత్త చర్చ. సరికొత్త వస్తువు 'అతడు, నేను - రెండు తీరాల నడుమ' శిల్పపరంగా భిన్నమైన కథ. మత బోధకుడికి, రసభావుకుడికీ నడుమ జరిగిన సంవాదం. రచయిత కవి గనుక భావోద్వేగాలు జోడించి కథలు నడిపించటం విశేషం. 'తోట పంజరమా? తోటలో పంజరమా? పంజరంలో పరజరం. ఎన్ని బంధి ఖానాలు. తోటకు ప్రహరీ గోడలేమిటి? చైతన్యానికి ద్వారబంధ మెందుకు, ఒక వైపు తాత్వికంగా, మరో వైపు కవితాత్మకంగా, చిత్రంగా సాగుతుందీ కథ. అయితే రూప్‌కుమార్ కవి పక్షపాతి గనుక కవిత్వ మార్గాన్ని ఉన్నతీకరించాడు. 'కవిత్వ మార్గంలో రాజకీయాల్లేవా? శత్రువుల్లేరా? కూటము ల్లేవా?' అని బౌద్ధ తాత్వికుడడిగితే, ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అన్నిటినీ మించి కవిత్వం ఉన్నది అని నిర్ధారి స్తాడు కవి. రూప్ కుమార్ సాదాసీదాగా కనబడుతాడు గానీ - హృదయపునాదుల్లో ఇంత తాత్విక భావుకత్వం నిండి ఉన్నదా? అనిపించేలా ఉంది ఈ కథ. రచయిత అంతర్మధనానికి అద్దం పట్టిన కథ.
రూప్‌కుమార్ రచనాశైలి విశేషమైంది. హృదయంగమం గా సాగుతుంది. జీవితాన్ని, వివరాల్ని చిత్రించినంత బలంగా లోపలి అనుభవ సాంద్రతను తాత్విక కోణాల్ని చిత్రించటం మరో నైపుణ్యం. కథను ప్రతీకాత్మకంగా నడిపే పద్ధతి రచయిత సాధించిన ప్రత్యేక శిల్పం.
రూప్‌కుమార్ వాక్యాల్లో జీవితానుభవం వ్యక్తమై కథకు ప్రాణం పోస్తుంది. జీవితం వడబోసిన సారమంతా, తాత్వికతంతా చిన్న చిన్న సాధారణమైన మాటల్లో రూపు కడుతుంది.
సాహిత్యం సాధించవలసిన ప్రయోజనమేమిటో అవగాహన చేసుకొన్న రచయిత రూప్‌కుమార్, ప్రతికథలో మానవీయ కోణాన్ని బలంగా చిత్రించాడు. డబ్బు, సంపద ఎంత గొప్పవైనప్పటికీ మానవ సంబంధాలముందు విలువలేనివని స్పష్టపరుస్తాడు.
రూప్‌కుమార్ తెలంగాణకు కలిసివచ్చిన మంచికథా రచయిత. మనలో మగతలో జోగు తున్న మానవీయ పార్శ్వాల్ని మేల్కొల్పుకోవటం కోసం రూప్‌కుమార్ కథలు చదువుకుందాం. బాధ్యతెరిగిన రచయితలు ఎదుటి వాళ్ల బాధ్యతను ప్రేరేపించటానికి రచనలు చేస్తారు. అభి రుచులు కోల్పోతున్న తరానికి, స్పందనలు కొరవడుతున్న సమాజానికి రూప్‌కుమార్ రచనలెంతో అవసరం. మనుషుల్లో సంస్కారాన్ని, సంఘంలో చైతన్యాన్ని పెంపొందించటానికి రూప్‌కుమార్ కథలు దోహదం చేస్తాయి.
- నందిని సిధారెడ్డి