Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నికొలారు గొగోల్ గురించి చెప్పమంటే మనకి చటుక్కున ''ది ఓవర్ కోట్'' అనే కథ స్ఫురిస్తుంది. అంతే కాదు ''డెడ్ సోల్స్'' అనే నవల ఇంకా ''ఇన్స్పక్టర్ జనరల్'' అనే నాటకం కూడా గుర్తుకొస్తుంది. ఆ మూడు ప్రక్రియల్లోనూ గొగోల్ విజయవంతమైనట్లు మనకి పెద్ద ప్రయత్నమేమీ లేకుండానే తెలుస్తోంది గదూ..! అయితే కథా రచనలో గొగోల్ ది అద్వితీయమైన స్థానం. దోస్తోవ్ స్కీ లాంటి మహానుభావుడే మేమంతా ఓవర్ కోట్ వంటి కథల నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళమే అన్నాడూ అంటే ప్రపంచ కథా కదనంలో ఆయన తొక్కిన పరవళ్ళు ఎలాంటివో ఊహించవచ్చు.
నికోలారు గొగోల్, 1809 ఏప్రిల్ 1న ఉక్రేనియాలోని సొరొషింట్సి అనే కోసాక్ గ్రామంలో జన్మించాడు. 15 యేటికి తల్లిదండ్రులిద్దరూ మరణించారు. ఉక్రేనియన్ ఇంకా రష్యన్ భాషల్లో సమాన దక్షతతో రాయగలిగేవాడు. తను పుట్టి పెరిగిన ఉక్రేనియన్ వాతావరణం గొగోల్‌ని ఎంతగానో ప్రభావితం చేసిందని ఆయన రచనలు చెప్పకనే చెబుతుంటాయి. ఫేంటసీ, రియాలిటి, హ్యూమర్, సెటైర్ ఇలా అన్ని రకాలు రాశాడు. వాటి అన్నిటి మీద ఉక్రేనియా ముద్ర ఉంటుంది. సెయింట్ పీటర్స్ బర్గ్‌లో బతుకుతెరువు కోసం 1828లో ప్రవేశించినప్పటికీ ఆ తర్వాత జర్మనీ, స్విజర్ లాండ్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో బాగా తిరిగాడు. చాలా ఏళ్ళు ఇటలీలోని రోంలో ఉన్నాడు.
అక్కడి ఒపెరాల్ని, కళల్ని, సాహిత్యాన్ని పరిశోధించాడు. చరిత్ర అంటే వల్లమాలిన ఇష్టం. తన స్నేహితుడైన పుష్కిన్ వంటి వారి అండ దండలతో సెయింట్ పీటర్స్ బర్గ్ విశ్వవిద్యాలయం లో చరిత్ర శాఖలో ప్రొఫెసర్ పదవిని చేపట్టాడు. అయితే దానికి తగిన అకడమిక్ క్వాలిఫికేషన్ లేదని ఫిర్యాదు వెళ్ళడంతో అప్పటి విద్యా శాఖా మంత్రి గొగోల్‌ని తొలగించాడు. కేవలం డిగ్రీలు తెచ్చుకోవడానికి మాత్రమే జ్ఞాన సముపార్జన చేయడం అతనికి చిన్నప్పటి నుంచి గిట్టని విషయం.
మొదటి కథ 'ది ఓవర్ కోట్'. ఈ కథ గొగోల్కి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. ఆయన పేరుకి పర్యాయ పదంగా మారిపోయింది. పఠిత గోగోల్ శైలిని ఆసాంతమూ ఆకళింపు చేసుకోగలిగితే కథని ఎంత అందంగా చెప్పవచ్చునో తెలుస్తుంది. ఆయన విధానం ఎలా ఉంటుందో చెప్పాలంటే ఓ సాదశ్యం చెప్పాలి.ఆవు మేసే సమయం లో ఎంత వేగంగా మేస్తుందో, ఆ మేసిన దాన్ని ఓ నీడ పట్టున మాగన్నుగా పడుకుని ఎంతో సావకా శంగా, మెల్లిగా, హాయిగా నెమరువేసుకుం టూంది. అదే విధంగా గోగోల్ కథని మలిచే తీరు కూడా అంత చక్కగా ముద్ద కలిపి పెట్టినట్లుగా ఉంటుంది.
సరే... కథలోకి వెళదాం. Akakii Akakievich అనే అతను మన హీరో. అయితే ఏ హీరోయిజం లేని సామాన్యుడు సుమా. అతను ఓ ప్రభుత్వ శాఖలో క్లర్క్‌తో సమానమైన ఓ ఉద్యోగం చేస్తుంటాడు. అక్కడి పరిభాషలో Titular Councillor అంటారు. ఏ శాఖ అని అడక్కండి, ఆ రోజుల్లో అన్ని శాఖల వ్యవహారాలు ఒకేలా ఉండేవి, అంటూ రచయిత ముందే మనకి చెబు తాడు..! ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగం. పై అధికారి చెప్పిన వాటిని రాయడం, కాపీ చేయడం అదే అతని లోకం. లౌక్యంతో జనాల్ని మాయచేసే తెలివితేటలు లేవు. కనుక తోటి ఉద్యో గులు కూడా అతని మీద జోక్‌లు వేసి కుతి తీర్చు కుంటూంటారు. అయినా మన Aసaసఱఱ వాళ్ళని పట్టించుకోడు.
అతను ఈ ఉద్యోగంలోకి ఎప్పుడు వచ్చాడో ఎవరికీ తెలీదు. తన ముందే ఎందరో అధికారులు వస్తున్నారు, పోతున్నారు. కాని అతను మాత్రం అదే సీటులో ఉన్నాడు. బయట వీధిలో ఏమి జరుగుతుందో అతను పట్టించుకోడు. తను పుట్టిందే ఈ డ్యూటీకి అన్నట్లు ఉంటాడు. లంచాలు తీసుకోడు కనుక ఆదాయం అంతంత మాత్రమే. క్యాబేజీ సూప్, కొద్దిగా బీఫ్ ముక్కలు, ఉల్లిగడ్డలు ఉంటే చాలు, తినే విషయంలో రుచి కూడా తనకి తెలియదు.
పాపం, అలాంటి ఆ చిరు ఉద్యోగికి అనుకోని రీతిలో ఓ కష్టం వస్తుంది. అదేమిటంటే తను రోజు వేసుకునే ఓవర్ కోట్ శిథిల దశకి వచ్చి బాధ పెడుతూంటుంది. ముఖ్యంగా భుజాల దగ్గర ఇంకా కొన్ని చోట్ల. ఆ చలిదేశంలో అది లేకుండా బయటకి వస్తే ఆ మంచుకి గడ్డ కట్టి చావ వలసిందే. మరి ఎలా..? కొత్తది కొనాలంటే కనీసం ఆరు వందల రూబుళ్ళు కావాలి. అంత డబ్బు తన దగ్గర లేదు. ఆ ఓవర్ కోట్ని చూసి తోటి ఉద్యోగులు కూడా గేలి చేస్తున్నారు, కపోటాలా ఉన్నదే అంటూ. కపోటా అంటే స్త్రీలు ధరించే కోటు.
తనకి తెలిసిన ఓ టైలర్ ఉన్నాడు. పేరు పెట్రోవిచ్. అతగాడి దగ్గరకి వెళ్ళి తన ఓవర్ కోట్కి కొద్దిగా మరమత్తులు చేసి ఇవ్వమంటాడు. దీని బదులు కొత్తది కుడతాను, ఇది కుట్టినా ఎంతో కాలం ఉండదు అంటాడు టైలర్. నేను డిబ్బీలో దాచుకున్న డబ్బులన్నీ కలిపినా అరవై రూబుళ్ళు ఉండవు ఎలా అంటాడు కథానాయకుడు.
సరే... చవకలో వచ్చే వస్త్రాన్ని కొని కుడతాను. మామూలు ఖరీదైన ఫర్ కాకుండా పిల్లి బొచ్చుని దాని స్థానంలో కాలర్కి కుడతాను. చూడటానికి చాలా గొప్పగా ఉంటుంది. అయితే కనీసం 150 రూబుళ్ళు ఈలోపు చూసుకో అంటాడు టైలర్. ఎన్ని రకాలుగా చెప్పినా టైలర్ అంతకి తగ్గనంటాడు. చేసేది లేక సాయంత్రాలు టీ మానేసి, కొవ్వొత్తులు వెలిగించడం తగ్గించి, లాండ్రీ కర్చులు తగ్గించి ఇలా అన్ని పొదుపు చర్యలు చేపట్టి మొత్తానికి ఓవర్ కోట్ని కుట్టించుకుంటాడు కథా నాయకుడు.
అది వేసుకుని ఆఫీస్ కి రాగానే అందరూ అతని చుట్టూ చేరి కోటు భలే బాగుందని అభినందిస్తారు. నిజం చెప్పాలంటే ఆ కొత్త కోటు వేసుకోవడంతో Aసaసఱఱలో ఏదో తెలియని మార్పు వస్తుంది. వీధిలో వేగంగా నడుస్తుంటాడు. అందరూ తనని చూడాలని కోరిక ఉదయిస్తుంది. ఆడ వాళ్ళతో కూడా ఇదివరకటిలో లేనివిధంగా ఎక్కువగా మాట్లాడు తుంటాడు. బట్టలు ఇంత మార్పు తెస్తాయా అని తనలోతను అను కుంటాడు. ఈ కొత్త కోటు కొన్న సందర్భంగా ఓ ఆఫీసు మిత్రుడు పార్టీ ఇస్తాడు. దానికి వెళ్ళి వస్తుండగా మన హీరోకి కొందరు ఆకతాయిలు ఎదురయి గొడవ పెట్టుకుని, బాగా కొట్టి ఓవర్ కోటుని లాగేసుకుంటారు.
ఇంతలో ఓ స్త్రీ వచ్చి వెంటనే మీరు వెళ్ళి పోలీస్ ఉన్నతాధికారికి కంప్లైంట్ ఇవ్వండి అంటుంది. ఆ తెల్లారి ఎంతో ప్రయత్నం మీద ఆ అధికారిని కలుస్తాడు. ఇంత చిన్న విషయానికి నన్ను డైరక్ట్‌గా కలుస్తావా... నీ ముందు ఎవరు ఉన్నారో తెలుస్తోందా అని ఆ అధికారి చిందులు వేస్తాడు. ముందుగా ఓ ప్రముఖుడిని కలిసి, ఆ తర్వాత కార్యదర్శిని కలిసి, ఆ తర్వాతగా నన్ను కలవాలి అంటాడు. హీరో బాగా అలిసిపోయి ఉంటాడు. ఇంటికి వచ్చి బెంగ పెట్టుకుని జ్వరం పాలవుతాడు. ఆ తర్వాత 36 గంటల్లోపు తను మరణిస్తాడు.
ఈ చనిపోయిన హీరో తన ఓవర్ కోటు మీద గల ప్రేమ తో దెయ్యంగా మారి, ఓవర్ కోటు వేసుకు వెళుతున్న అనేక మందిని చికాకు చేస్తుంటాడు. ముఖ్యంగా తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని. రాత్రిళ్ళు కలింకిన్ బ్రిడ్జ్ దగ్గర చరిస్తూ వాళ్ళ ఓవర్ కోట్లని చింపి వేయడం లాంటివి చేస్తుంటాడు. తనని ఇబ్బంది పాలు చేసిన ప్రము ఖుడిని కూడా చికాకు చేసి కోటుని లాక్కుంటాడు. పోలీస్‌లు కూడా పట్టుకోవడంలో విఫలమవు తారు. ఇప్పుడు నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆ దెయ్యం తిరుగుతూ కోటు తొడుక్కున్న వాళ్ళని టెర్రర్ చేస్తోంది. చివరిగా ఓ వాచ్‌మేన్ పట్టుకోవాలని ప్రయత్నించినా ఓ పంది వచ్చి గుద్దేయడంతో పడిపోయాడతను. చీకట్లో ఉbబసష్ట్రశీటట bతీఱసస్త్రవ వైపు వెళ్ళిపోయింది ఆ దెయ్యం అని చెబుతుండగా కథ ముగుస్తుంది.
తరచి చూసినట్లయితే కథలో రచయిత అనేక విషయాలు వ్యంగమూ, హాస్యమూ కలిపి చెప్పి నట్లు గమనిస్తాము. ముఖ్యంగా ఆనాటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తక్కువగా ఉండడం, వాళ్ళు సుఖంగా జీవించడానికి సరిపడా ఉండేవి కావని తెలుస్తుంది. ఆఫీసులు అన్నీ కూడా లంచాలు, అక్రమ వ్యవహారాల్లో మునిగి తేలుతు న్నట్లు తెలుస్తుంది. సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని సాంఘిక వ్యవహారశైలిని ఈ కథ విప్పిచెబుతుంది.
ఆఫీసులోని కార్యక్రమాలు ఎలా జరుగు తాయి, బ్యూరోక్రసీలోని నిచ్చెన ఎలా పని చేస్తుంది అనేది విశదీకరించాడు. ఇంకా రష్యన్లు, ఉక్రేనియాని ఎలా చూస్తుంటారు అనేది కూడా కథలో వచ్చే కొన్ని వర్ణనల ద్వారా తెలుస్తుంది. మొత్తం 24 పేజీల్లో సాగిన కథ ఇది.
ఆ తర్వాత ''ఓల్డ్ ఫేషండ్ ఫార్మర్స్'' అనే మరో కథ గూర్చి కూడా చెప్పుకుందాం. దీన్ని గొగోల్ 1835లో రాశాడు. ఈ కథ చదువు తుంటే మన తెలుగులో ఒక చక్కని చిత్రం ''మిథునం'' గుర్తుకు వచ్చింది. అంత మాత్రం చేత మనం కాపీ అనుకోరాదు. బహుశా మన రచయితకి ఈ కథ ఇన్స్పిరేషన్ ఇచ్చి ఉండవచ్చును.
అది ఉక్రేనియాలోని ఓ గ్రామం. ఆ గ్రామంలో ఓ పాత కాలపు భవనం. దాంట్లో ఇద్దరు వద్ధ దంపతులు. వాళ్ళకి పిల్లలు ఎవరూ ఉండరు. జీవిత చరమాంకంలో అక్కడి ప్రతి చిన్న విషయాన్ని చిన్న పిల్లల్లా ఆస్వాదిస్తూ ఒకరికొకరు మంచి స్నేహి తుల్లా జీవిస్తుంటారు. అతని పేరు Aటaఅaరy ×ఙaఅశీఙఱషష్ట్ర, ఆమె పేరు ూబశ్రీషష్ట్రవతీఱa ×ఙaఅశీఙa.
రోజువారి జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ, జరిగిపోయిన వాటిని సరదాగా మాటాడుకుంటూ తమదైన లోకంలో జీవిస్తుంటారు వాళ్ళు. పుల్చేరియాకి ఓ పెంపుడు పిల్లి ఉంటుంది. దాని మీద అఫనాసి ఎన్నో జోకులు వేయడము, దాన్ని ఆమె సమర్ధించు కోవడం వారి దినచర్యలో ఓ భాగం. అలాగే అతని మీద ఎన్నో వ్యాఖ్యానాలు చేయడం ఆమెకి పరిపాటి. ఏదీ సీరియస్‌గా ఉండదు సుమా. ఉన్నట్టుండి పిల్లి కనిపించకుండా పోతే ఆమె ఎంతో బాధ పడు తుంది. ఏదో చెడుకి ఇది సంకేతం అని ఆమె అంటుంది.అలా ఎందుకు అనుకుంటావు. ఏదో రోజు వస్తుంది మళ్ళీ.. అంటాడతను. అన్నట్టుగానే ఆ పిల్లి తిరిగి రావడంతో ఆమె ఎంతగానో సంబర పడుతుంది.
వాళ్ళ గ్రామం, ఇంకా ఆ పాత భవనం, దాని పెరటిలో ఉండే రకరకాల మొక్కలు ఇంకా చెట్లు అంటే ఆ వద్ధ దంపతులకి ఎంతో ఇష్టం. అలాగే ఒకరికి ఒకరూనూ..! ఆ పచ్చటి చెట్ల మధ్య పిల్లలతో తిరిగే తల్లి బాతు, ఎలాంటి బంధనాలు లేకుండా తిరిగే పశువులు, నీడలో తాపీగా నెమరు వేసుకుంటూ ఉండే ఆవులు ఇవన్నీ వారికి మరీ ఇష్టం. ఆ ఇరువురికి వాటి అన్నిటిలో ఏదో స్వచ్ఛత, ఆనందమూ కనిపిస్తుంటాయి.
ఆ ముసలాయనకి ప్రతి దానిలోనూ చిన్న పిల్లాడిలో ఉండే ఆసక్తి, అనుమానము ఉంటాయి. ఉన్నట్టుండి మన ఇల్లు కూలిపోయిందనుకో... అప్పుడు ఎలా మనకి అంటాడతను. నీ పిచ్చి కాకపోతే ఇల్లు ఎందుకు కూలి పోతుంది... ఎక్కడి లేని సందేహాలు నీకు అని ఆమె అంటుంది. ఇలా వాళ్ళ సంభాషణలు ఉంటాయి. తినే ఆహారం గురించి కూడా అలానే ఏవో మాటాడుకుంటారు.
మళ్ళీ యుద్ధ రంగంలోకి వెళ్ళాలని ఉన్నదోరు అంటాడు ముసలాయన. ఒకసారి వెళ్ళి వచ్చా వుగా. అయినా ఇప్పటి ఆయుధాలు చాలా మారి పోయాయి తెలుసా అంటుందావిడ. ఆ... ఇంకొకటి, ఆ టర్కిష్ మహిళలు పుట్టకొక్కులతో పచ్చళ్ళు భలే పెడతారంటూ ఆమె తన కబుర్లు చెబుతుంది. ఆ పచ్చడి పెట్టే విధానాన్ని పూర్తిగా వివరిస్తుంది.
పిల్లి వెళ్ళి మళ్ళీ వచ్చిందంటే నాకెందుకో మరణం దగ్గరకి వచ్చినట్లు అనిపిస్తున్నది, నేను కనకపోతే చర్చ్ గోడలకి ఆనుకుని పూడ్చిపెట్టాలి, అలాగే నాకు ఇష్టమైన బూడిద రంగు డ్రెస్‌ని సమాధిలో పెట్టాలంటుందామె ఒకసారి..! అలాం టిదేమీ జరగదు, ఎప్పుడూ అలా అనకు, నువ్వు పోతే నేను ఎందుకు ఇక్కడ, అక్కడకే వస్తాను నేను కూడా అని తనూ రోదిస్తాడు. అవును, నువ్వు చిన్న పిల్లాడి కంటే అన్యాయం, నిన్ను ఎవరికి అప్పగిం చాలో నాకు తెలియడం లేదు అంటుందావిడ.
అనుకున్నట్లుగానే ఆ ముసలావిడ ఒకరోజు చనిపోతుంది. ఆ రోజు నుంచి ఆ ముసలాయన మతిపోయినట్లు అయి పోతాడు. ఆహారం తినమని ముందుపెడితే నోట్లోకి బదులు చెంప ల్లోకి చెయ్యి పెడుతుం టాడు. అప్పుడప్పుడు ఓ పని మనిషి వచ్చి అతడిని చూసుకున్నా తను ఈ లోకంలో ఉండడు. పిస్టల్‌తో పేల్చుకోబోయి గాయం చేసుకుంటాడు. ఇంటి చుట్టూతా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఇంట్లో ఉండే కుక్కకి ఓ కాలు విరిగిపోయింది. ఆ ముసలాయన జీవితం అస్తవ్యస్తమయిపోతుంది. తర్వాత ఆయన ఎక్కువకాలం బతకలేదు. చనిపోయే ముందర ముసలావిడ గొంతు వినబడినట్లవు తుంది తనకి, ఇదిగో నేనూ వస్తున్నా అని మరణిస్తాడు.
ఆ ముసలామె సమాధి పక్కనే ఈ ముసలా యన సమాధిని నిర్మిస్తారు. ఇల్లు అంతా పాడుబడి పోయింది.ఇంట్లో సామాన్లు ఊరిలో వాళ్ళు పంచు కున్నారు. ఆ ఊరి పెద్ద ఆ ఏర్పాట్లు చూశాడు. కొన్ని రోజుల తర్వాత ఈ వద్ధ దంపతుల దూరపు బంధువునంటూ ఒకాయన వచ్చి ఇంటిని, చుట్టు ఉన్న ఎస్టేట్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అతను ఓ లెఫిట్నెంట్, ఇక్కడ ఉండబోయేది లేదు... కాని ఆ పాత ఇంటిని పడగొట్టి ఆ పరిస రాల్ని వాటిని అన్నిటినీ బాగు చేయించాడు. చూసుకోవడానికి ఓ ట్రస్టీని ఏర్పాటు చేశాడు. ఆ బంధువు చాలా అరుదుగా ఇక్కడికి వస్తుంటాడు. అదీ ఈ ప్రాంతంలో జరిగే సంతల్లో చవకగా ఏమైనా దొరికితే హౌల్సేల్గా కొనడానికి వస్తుం టాడు. అలా శుభం కార్డ్ వేసుకుంటుంది కథ.
ఈ కథలో గోగోల్ జీవిత అనుభవాలతో పండిపోయిన రెండు హదయాల సవ్వడిని మన ముందు పెడతాడు. ఉక్రేనియాలోని గ్రామీణ సొగసుల్ని, అక్కడి జీవన సరిగమల్ని మనకి పరిచయం చేస్తాడు. కథ మొత్తం కూడా రచయిత తాను ఆ ఊరికి వెళ్ళినట్లుగానూ, సంచరించినట్లు గానూ చెబుతూ ప్రతి సూక్ష్మ వివరాన్ని అక్షరబద్ధం చేశాడు. కథలు రాయదలుచుకున్న వాళ్ళు తప్పనిసరిగా చదవవలసినవి ఇవి.
నికొలారుగోగోల్ కథలు రమారమి 135 వరకు వివిధ సినిమాల రూపంలో బయటకి వచ్చాయి. మాస్కోలోనూ, ఉక్రేనియాలోని అనేక పట్టణాల్లోనూ ఆయన పేరుని వీధులకి పెట్టారు. ప్రపంచ కథాసాహిత్యాన్ని సుసంపన్నం చేసిన నికోలారుగోగోల్ చిరస్మరణీయ కషిని సాహితీ ప్రియులు ఈనాటికీ కొనియాడుతుంటారు.
- మూర్తి కెవివిఎస్, 7893541003