Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊర్లోకి ఎట్లొచ్చిన
తొక్కుడువడ్డ బాట
బొడ్రాయి నుండే....
ఈ తొవ్వనే...
పెండ్లిల్లకు బుక్కసల్లుకొని
కొత్త సుట్టాలను పలకరించిన
ఎదురుకోళ్ళ.... కొత్త బాట
ఈ తొవ్వ
ఊరంతా అంగడిని చూసి
కాలం చేతిలో పండుటాకైరాలితే
దింపుడు కల్లంకు ... నలుగురితో
సావుడప్పై నడ్సింది...ఇది పాత బాటనే...
ఈ తొవ్వలో...
ఏడాదికోసారి ''ఊరు''...
బతుకమ్మనో బోనాలో ఎత్తుకొని
బొడ్రాయి నుండే.. పండుగపాటైతది
ఈ తొవ్వలోనే....
ఆడబిడ్డలు పుట్టినింటి పొత్తిటి వాసనను
పండుగ పండుగకు వెతుక్కుంటరు
ఈ తొవ్వ...
ఊరందరినీ కలిపే కులం తలం లేని చోటు
ఊర్లో ఏకార్యం జరిగిన ఈ తొవ్వలోనే...
నల్గురి ఎతలకు కతలకు ఇది ఓదార్పు....
బొడ్రాళ్ళు...
ఊరంతా నాలుగు చోట్లున్నా
బురుజు కాడనో...
మైసమ్మ గుడికాడనో...
హన్మండ్ల గుడి కాడనో...
ఒక బొడ్రాయి ఊరిని నిలబెట్టే మూలరాయి...
బొడ్రాయి దేవుడో! దయ్యమో?
ఎవరు ఎట్ల నిలిపారో ....!?
బొడ్రాయి నుండే ఊరు సుక్కల ముగ్గైంది
నలుగురు తొక్కుడువడ్డ బాటలో
ఆకారం లేని అప్పటి బొడ్రాయి....
నేడు కొత్త డిజైన్లతో రికార్డింగ్ డ్యాన్సులతో
రాజకీయ రంగులో తనని తాను...
మళ్ళీ ప్రతిష్టించుకుంటుంది......
మరి ఈ కొత్త రంగురాళ్ళు ఎన్నాళ్ళు ఊర్లని నిలుపుతాయో...??
(రాజకీయ నాయకులు వారి నియోజకవర్గంలోని గ్రామాలలో కొత్తగా బొడ్రాళ్ళు నిలుపుతున్నారు)
- దండు వెంకట్ రాములు,
6303163202