Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లె పొలిమేరన తుప్పుపట్టిన
కరెంటు స్థంభంలా వున్నాను
ఫ్యూజు కాలిపోయి వాడిన బల్బును
మార్చి చాలా రోజులే అయింది
...
చూస్తూ ఉండగానే
పల్లె పొలిమేర పొలమారి కదిలి పోయింది
పల్లె పట్నాల నడుమ గట్టు కూలి పోయింది
గుడిసెలూ ఇండ్లకప్పులూ రాలి
కుప్పలు కుప్పలుగా పోగు పడ్డాయి
వాకిళ్ళు పొక్కిలి పోక్కిలయి
పొర్లుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాయి
గడపలన్నీ గిడసబారి ముక్కలు ముక్కలయి
స్మశానం పక్కన కట్టెల మండీని చేరాయి
పొలాలు ప్లాట్లయి విస్తరించాయి
ఎకరాలు గజాలుగా ఎదిగాయి
...
పల్లె పట్నంలో కలిసిందా?
పట్నం పొలాన్ని మింగిందా?
జవాబు తెలిసీ ప్రశ్న అడిగితే
బదులేమిచ్చేది ఎట్లా సచ్చేది
చెరిగిపోయిన పొలిమేర గట్టు మీద
తుప్పట్టి వంగిపోయిన స్తంభాన్ని నేను
నేడో రేపో నన్నూ
మూలాలతో సహా పెకిలించి
ఏ పాత సామాన్లకిందో అమ్మేస్తారు
ఏముందిక
పల్లె పురావస్తువు
పట్నం నయా బజార్
- వారాల ఆనంద్