Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వార్థపు సైకత ప్రతిమలను
మదినిండా చిత్రించుకొని చూపరులకు అందంగా దృశ్యమానం గావిస్తావు ..
అహం అంతస్థుల దొంతరలను అలవోకగా పేర్చుకుంటూ ఆద్యంతం సంకుచిత భావాలతో సందడి చేస్తావు ..
సన్మిత్రుల సాహచర్యానికి సలాంకొట్టి
సాంద్రత రహిత సహవాసానికై
అర్రులు చాస్తూ
ఎగిసెగిసి పడతావు ..
ఆధిపత్య అభిజాత్యంతో రంకెలు వేస్తూ కసాయి చూపుతో కఠినంగా మరణశాసనాన్ని లిఖిస్తావు ..
పుడమిని చీల్చుకుంటూ అంకురించే ముక్కుపచ్చలారని మానవీయ మొలకలను
ఛిద్రం చేసి సంతసిస్తావు ..
ఇజాల మాటున నిజాలను దాచేసి
అబద్దాలను అందంగా ముస్తాబు చేసి
ప్రజల ముంగిట
రాశులుగా ఒలకబోస్తావు..
మమతానురాగాలను మంటకలుపుతూ ధనదాహంతో నేలవిడిచి సాముచేస్తూ
దాష్టీకానికి దారులు వేస్తావు ..
ఓ ..మనిషీ !
నీలో నాలో
అనివార్యమే కదా నిత్య సంఘర్షణ ..
అనుక్షణం అంతర్యుద్ధమే ..
అలవికాని యుద్ధ బీభత్సమే ..
మనిషితనం లోపించిన మానవరూపం ..
మగత్వానికి ప్రతిబింబమే సుమా ..
సత్సంబంధాల సుగంధ సహ జీవనమే
సర్వత్రా సమాజహితానికి శుభప్రదం ..
- బాదేపల్లి వెంకటయ్యగౌడ్
9948508939