సూదిమొనంత సూక్ష్మాన్ని ఆకాశమంత విశాలంగా మార్చుకుని మాటలు మాట్లాడుతున్నాయి నోళ్ళకు మాటలు కాదు.. ఇపుడు మాటలకే నోళ్ళొచ్చాయి. ఎప్పటికీ ఎండిపోని నీటిచెలమల్లాగా అవి పొంగుకొస్తున్నాయి.
మాటలు దబాయించేవి కావు. దుడుకుతనాన్ని ప్రదర్శించేవి కావు. దగ్గరికొచ్చి తీయగా పలకరించేవి.. కోపమొస్తే మాత్రం కత్తులు నూరేస్తాయి..
బిగిసిన ఉచ్చు ఇక జడిసిపోయి తన పిడికిలిని విడిచేసిన శబ్దం అంతటా వినిపిస్తోంది.. రోజూ రోజూ రాలిపోయే ఆకులు పచ్చగా విచ్చుకునే తీరు అంతటా కనిపిస్తోంది.. చిన్న చిన్న వాక్యాలకు పెద్ద పెద్ద గొంతులొచ్చి పిలిచినట్టు.. అక్షరాలకు అంతు తెలియని ఆవేశం వచ్చి అరచినట్టు.. అలా.. అలా.. మాటలతో మమేకమై ప్రపంచం ప్రయాణిస్తుంది.
ఇప్పుడు మాత్రం మాటలు యుద్ధం చేస్తున్నాయి. ఎన్నటికీ ఆగిపోని పెద్ద యుద్ధం చేస్తున్నాయి. భయంకరమైన ప్రళయమంతటి మౌనయుద్ధం చేస్తున్నాయి. కనికరాన్ని కాళ్ళతో తన్నేసి, కాసింత కసితో కసరత్తు చేస్తున్నాయి.
ఇక..మాటలతో ప్రపంచం.. మాటల ప్రపంచం.. కాలం వేసుకున్న వంకర వంకర దారులను కూడా సరిదిద్దుతున్న మదువైనజి మాటల ప్రపంచం..