ఒక మూలకు ఒదిగిన పూలకుండి గదిని కంటి చూపుతో అలంకరిస్తుంది! తలుపు తెరచినంతనే తొలినాటి ప్రేయసిలా పరిమళంతో తనువంతా అల్లుకపోతుంది! ఫ్యాను గాలిని సైతం అన్నమయ్య కీర్తనను చేసి రాగయుక్తంగా తలలూపుతుంది! గది ఎంత గందరగోళంగా ఉన్నా పూలకుండి స్థిత ప్రజ్ఞతను కోల్పోదు ! పిడికెడు మట్టి దోసెడు నీళ్ళు మనిషిని ప్రేమించడానికివి చాలంటుంది! నువ్వో నేనో ప్రేమగా తల నిమిరితే దాని తనువంతా పారవశ్యంతో ఓలలాడుతది! గదిలోని పూలకుండీ సిసి కెమేరా ఒకటి కాదు ఒకటి మౌనసాక్షి మరోటి భద్రతద్రకు భరోసా! ఎంత ఒత్తిడిలో ఉన్నా పూలకుండిని స్మరిస్తే మనసు నిండా చంద్రోదయ అనుభూతులే! కొండ అద్దంలో ప్రతిఫలించినట్లే దశ్యాన్ని మినిమైజ్ చేసుకుంటే ఉద్యానవనమే! ఉద్వేగంతో పూలకుండిని ధ్వంసం చేసే చోట రాతి మనుషుల జాడ లేకుంటే బాగుండు !!