అప్పట్లో మా ఇంటికి సుట్టపొల్లు చూన్నీకొస్తే గారోజు పండగే మా పిలగాండ్లకి ఎవ్వలింట్లనైన గట్లనే ఉండేదనుకో అప్పట్లో.. ఎంత చేతగాకున్న నడికట్టు బిగించుకొని అన్ని రకాల వంటలు చేసేది మా అమ్మ ఎప్పుడు అప్పలు చేయమన్న చేతకాట్లే అనే అమ్మ ఆ రోజు మాత్రం బలం యాన్నించి ఒచ్చేదో గాని చుట్టపొల్ల కోసం కొత్తపానం పోసుకొని అప్పలు సేసేది.. అందుకే అప్పుడు మా ఇంటికి చుట్టపోళ్లెప్పుడొస్తరా అని ఎదురుసూసేటోళ్లం *** *** మా నాయనా మాత్రం తక్కువనా! చుట్టాల్ని చూడంగానే చేస్తున్న పుస్తెమెట్టెలైనా ! ఎంత పెద్ద నగనైనా సగంలో ఆపేసి కుంపట్లో మండుతున్న సూర్యుళ్లను బొగ్గుల మబ్బులతో కప్పేసి పనిముట్లకు జోలపాడి దూకాణంలోంచి జింకపిల్లోలే సప్పున లేసి చుట్టపోళ్ళతో మంచి చెడ్డ మాట్లాడుకుని బజారికి పోయి యాట మాసమో కోడికూరో ఎగురుకుంటూ తెచ్చేటోడు *** *** పైసలున్నా లేకున్నా అప్పోసప్పోసేసి అన్ని సరుకులు తీసుకొచ్చోడు చీకటి పడంగానే మాత్రం సార డిపోలు దగ్గరకు చుట్టపాయన్ని తీసుకెళ్లి సారాయి పోయించేటోడు గా రోజుల్లో రాకపోకలట్లుండే ప్రేమాభిమానాలు గట్లుండే ఊర్లల్లో మర్యాదలట్లుండేవి *** *** గిప్పుడు చూడు చుట్టాలేర్ పక్కాలేర్ ఇప్పుడు మన ఇండ్లకు ఎవ్వలు వచ్చుడు లేదు మనం ఎవ్వల ఇండ్లకి పోవుడులేదు ఒకేళ పోవాల్సి వస్తే ఫోన్చేసి పోవాలంట ఎవ్వలన్నా మనింటికొచ్చినా ఫోన్ చేసి రావాలంట ఏం మాయకాలమో ఏమో గానీ ఎవరిండ్లల్ల వాళ్ళం గానుగెద్దుల్లాగా తిరగబడితిమి *** *** బయటికి పోవాల్సివస్తే... ముక్కుకు మూతికి మాస్క్ పెట్టుకోవాల్సి వచ్చే మాస్కులతోటి మనుషుల్ని గుర్తుపట్టలేక పోతుంటిమి పేరు చెబితేగాని గుర్తుపట్టే పరిస్థితి లేదాయే మనిషిని చూత్తెనే భయమేత్తాంది మాట్లాడాలంటేనే వణుకు పుడతాంది గదేదో సోషల్ డిస్టెంసింగట.. బౌతికాదూరం పాటించాలట గప్పుడు కింది కులపోల్లని అంటరానివాల్లనిరి ఇప్పుడు అందరూ అంటరాని వాళ్ళొలే దూరం పోబడితిమి అందరం అంటరాని వాళ్ళం అయినంక మనిషికి మనిషికి మధ్య దూరం పెరిగినంక ఇంకా మాటలెక్కడయి... ముచ్చట్లెక్కడియి ఏం మాయకాలమో ఏమోగానీ బతుకంటేనే యాస్టోస్తుంది తలుచుకుంటేనే దుఃఖమోస్తుంది ఎమున్నాగా సెల్ఫోన్లల్ల మాట్లాడుకోటం వాట్సాప్ లల్ల ఫేస్బుక్ లల్ల ఫోటోలు పంపుకోవడం లైకులు కొట్టుకోవడం ... మేసేజ్లు పెట్టుకోవడం *** *** ఏం కొనుక్కునా పైసలిచ్చుడు లేదాయే అన్ని గూగుల్ పేలు ఫోన్ పేలాయె ఆన్లైన్ మార్కెట్లాయే అమెజాన్ అయితే కాష్ ఆన్ డెలివరీలాయే అంతా ఆన్‌లైన్ మయం... అంతటా ఇంటర్నెట్ మాయాజాలం *** *** మనుషులంతా మరమనుషుల్లాగా కదులుతుండ్రు ముందు ముందు ఇంకెంత దుర్భరంగా ఉంటదో బతుకు... ఇంకెన్ని అనర్ధాలు చూడాల్సొస్తదో ఎట్లాంటి పీడకలలు కనల్సోస్తదో... ఊహించుకుంటేనే ఊపిరాడకాపాయే ఎన్ని దుఃఖనదుల్ని అశ్రుపడవల్లో దాటాల్నో ఇంకెన్ని ఊహించని విపత్తుల్నెన్ని ఎదుర్కోవాలో... ఇగ...