Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో కథ, నవల వంటి ప్రకియల కంటే కవిత్వం పాలెక్కువ. వందల సంఖ్యలో కవులుంటే, కథా రచయితలు పదుల సంఖ్యలోనే ఉన్నారు. కవిత్వంలో తాము కోరుకుంటున్న ఊహాజనిత ప్రపంచాన్ని, మరో ప్రపంచాన్ని, అనుభూతుల్ని కవులు గొప్పగా చూపిస్తారు. కథల్లోనూ రచయితల ఆలోచనలు, దృక్పథం ప్రతిఫలించినప్పటికీ సమకాలీన వాస్తవికతని శిల్పసమున్నతంగా తీర్చి కళ్లకు కట్టేలా చెప్పగలిగితేనే ఆ రచయిత పాఠకుల్లో నిలుస్తాడు. గురజాడ నించి ఈనాటి పెద్దింటి అశోక్‌కుమార్ వరకు తెలుగు కథకులు కథల్లో వాస్తవికతని చిత్రిస్తూ తమ దృక్పథాన్ని పాఠకుల మన:ఫలకంపై ముద్రిస్తూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన రచయితే రాచమళ్ళ ఉపేందర్. కవిగా, కథకుడిగా వర్తమాన సమాజాన్ని పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ ఆశావహ దృక్పథంతో పయనిస్తున్న కథా రచయిత.
వస్తు వైవిధ్యంతో రాచమళ్ళ ఉపేందర్‌కి ఉన్న అవగాహనను, పరిణతిని చూపించే కథల సంపుటి 'మేడిపండు'. సామాన్యుల సంవేదనలను, ఆర్తిని తనదిగా చేసుకొని కథలుగా అల్లాడు. వేమన పద్యంలోని మేడిపండు మాదిరిగా సమాజం కన్పిస్తున్నా, దానిలోని వాస్తవాలని, సంఘర్షణల్ని, గుండెల్ని పిండిచేసే సంఘటనలని, ఎగుడుదిగుళ్ళని సమర్ధవంతంగా ఈ కథల్లో చూపించాడు రాచమళ్ళ. సామాన్యుల వెతల్ని కథలుగా మలిచిన ఈ కథలు, పాఠకుల మనసుకి పట్టిన మురికిని వదిలించి మానసిక స్వచ్ఛతని పెంచేవి. కథల మాష్టారు మధురాంతకం రాజారాం సూచించినట్లు కథా రచయిత ''ముందు సమాజాన్ని శ్రద్ధగా పరిశీలించాలి. నిజమైన ప్రేమ జనం మీద వుంటేనే కథ రాయగలుగుతారు. వాళ్ళు ఎదుర్కొనే సమస్యలకు కారణాలు వెదకాలి. కాలానికి ముందుగా నడవాలి. రచన అనేది పవిత్ర కర్తవ్యంగా భావించాలి. రాసేది కక్షలకు దారి తీయకూడదు. సమాజ కళ్యాణానికి ఉపయోగపడాలి'' ఈ సూచన రాచమళ్ళ ఉపేందర్ అక్షరాలా పాటించాడు.
కథలో వస్తువు, రూపం అనే రెండు భాగాలుంటాయి. వస్తువుకు అనుగుణమైన రూపం కుదిరినప్పుడు మాత్రమే మంచి కథ రూపొందుతుంది. రూపం ద్వారానే పాఠకుడు కథా వస్తువును అర్థం చేసుకొని అనుభవిస్తాడు. వస్తువు ఏదైనా బాగా చెప్పగలిగినప్పుడు మాత్రమే పాఠకున్ని కదిలిస్తుంది. ఆలోచింపజేస్తుంది. 'మేడిపండు' కథల సంపుటిలోని పద్నాలుగు కథలూ సాంద్రత, సంక్లిష్టత లేకుండా సాఫీదనంతో ఉన్నాయి. సాదాసీదాగా ఉండే కథనరీతి ప్రతి కథని చదివిస్తుంది. 'చేదెక్కిన తీపి' గుండెను బరువెక్కించే చేదు పాట. ఈ కథలోని ''గడ్డు పరిస్థితులు పలకరించినపుడు ప్రతిభను వెలికితీసి గెలుపు కోసం ప్రయత్నించాలి. ఓటమి లోతుల్లో ఉదయించే గెలుపు కిరణాలను ముద్దాడాలనే తపన ఆమెలో రగులుతుంది'' వంటి వాక్యాలు రచయిత దృక్పథాన్ని తెలుపుతవి.
'ఆకుపచ్చ పురుగు' కథలో టీనేజ్ పిల్లలు మాదకద్రవ్యాలకి బానిసలవుతున్న తీరుని, తల్లిదండ్రుల ఆవేదనని, పట్నాల్లోని హాస్టళ్లలో చేర్పించి పిల్లల చదువుకై పల్లె ప్రజలు చూపే ఆతృతని, కుదేలవుతున్న రైతుల జీవితాన్ని, ఆర్థిక సంక్షోభావన్ని, భూమిపై రైతు మమకారాన్ని సహజంగా చిత్రించాడు రాచమళ్ళ. నేటికీ పల్లెల్లో కనీస వైద్య సదుపాయలు, ప్రయాణ సౌకర్యాలు లేని దుస్థితిని, సామాన్యుల నిస్సహాయతని, దు:ఖాన్ని 'కన్నీటి ప్రవాహం'లో ఆర్ధ్రంగా కనిపిస్తుంది. మహిళ తెగువ చూపి ఎదురు తిరిగితే ఫలితం ఎలా ఉంటుందో చూపిన కథ 'శివంగి'. 'సరి చేయగలిగిన మనుషులున్నంత కాలం... సమాజం కాంతులీనుతూనే వుంటుంది' అన్న వాక్యంతో ముగిసే కథ 'కలుపు మొక్క' సినిమాటిక్‌గా సాగిన దీనిలో కథనం ఉంది.
సరైన గూడు లేని, శ్రమజీవులైన కొడుకు కోడలుకి ఏకాంతాన్ని సమకూర్చడానికి ముసలి తండ్రి పడే యాతనే 'తోవ' కథ. వాస్తవాన్ని కథగా అల్లి బీదవారైనా వారి మనసెంత విశాలమో చూపిన కథ ఇది. ప్రపంచీకరణలో మారిన కాలంలోనూ భూమిపై ప్రేమ తగ్గని రైతు జీవితాన్ని, పల్లెపై మమకారాన్ని, భూమిని వ్యాపార దృష్టితో చూస్తున్న నేటి తరానికి - నిన్నటి తరానికి ఘర్షణని ఆకర్షణీయంగా చిత్రిస్తూనే మానవత్వం మిగిలే ఉంది ఇంకా అనే తీరుతో 'తడిసిన గుండె' కథని రాచమళ్ళ మలిచాడు. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొనే సమస్యని, సంక్షోభాన్ని చూపుతూ మానవీయకోణంలో పరివర్తన దిశగా చక్కటి ముగింపుతో సాగిన కథ 'ముసురు'
బడుగు జీవులకు సొంత ఇల్లు లేకుంటే ఎంత కష్టమో, కిరాయి ఇంట్లో ఎటువంటి అవమానాలు భరించాలో 'మెరిసన ఇల్లు' కథ చెప్తుంది. 'ప్రకృతి ముందు ఏ మనిషైనా తాలుగింజే' అన్న రచయిత ఓ వర్షపు రాత్రి ఇంటి ఓనరమ్మలో వచ్చిన మార్పుని కన్నులకు కట్టించి మనిషితనానికి మెరుగులు పెట్టాడు. 'శృతి చేసిన రాగం' కథలో చింతను గెల్చినోడే సిరిగల్లోడురా' అని స్నేహ బంధానికి వెలుగులు అద్దినాడు రాచమళ్ళ.
రచయితగా రాచమళ్ళ ఉపేందర్ జీవితంలోని సంఘటనలను, సమస్యలను ఉన్నవి ఉన్నట్లు చిత్రిస్తూనే, చాలా కథల్లో పరిష్కారం చూపించే ధోరణితో రాయడం కనిపిస్తుంది. ఇదే రచయితగా ఆయన బలమూ బలహీనత. తన అనుభవంలో నుంచి, నమ్మిన దానిలో నుంచి సమాజాన్ని పరిశీలించడం, తన భావాలను జోడించి కథా రచనలో కుదురుగా అమర్చడం అనే పనిని రాచమళ్ళ సమర్థవంతంగా నిర్వహించాడు. ఈయన కథల్లో మానసికాంశాల కంటే సామాజికాంశాల స్పృహే ఎక్కువ.
- డా|| కొల్లు వెంకటేశ్వరరావు,
9866485039