Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రత్నాకర్ పెనుమాక రాసిన ఈ సంకలనంలో పదకొండు కథలున్నాయి. దేనికదే వస్తువు రీత్యా భిన్నంగా వున్నా ప్రతీ కథలోనూ అంతర్లీనంగా జీవిత పార్శాల్ని తాకే అనుభూతులన్నీ ఇంచుమించు స్థలకాలాల భేదం లేకుండా అచ్చుగుద్దినట్టు ఒకేరకంగా ఫీలవుతాం. గౌతమీ తీరమైనా, పెన్నా నదైనా, నాగావళి వడ్డైనా మనం చూసే మనుషులు వేరైనా, అనుభవాలు భిన్నమైనా; మమతలు, అనురాగాలు, బంధాలు, అనుబంధాలు, రాగ ద్వేషాలు, భావోద్వేగాలు జీవన పర్యంతం నడిపించే ఇంధనాలు మాత్రం ఎక్కడైనా ఒకటే! అందుకే ఇందులో పాత్రలు యానాం చుట్టుపక్కలే కాదు ఎక్కడైనా కనబడతారు. ఇందులో రత్నాకర్ పెనుమాక మారిశెట్టి చెంద్రావతనీ, గారపాటి మధురనీ, వేపాటి సూరిబాబనీ, లంకా చిట్టిబాబనీ, కవులూరి భాస్కరరావనీ యానాం ఎదుర్లంక దగ్గరో, తాళ్లరేవు పోయే దార్లోనో, ఎదురయ్యే మనుషులేమో అన్నంత రియలిస్టిక్ రాయడం భలే గమ్మత్తుగా అనిపిస్తుంది.
''చివరి కోరిక'' అనే కథలో మొదట్లో షోకిల్లాగా వుండే రాఘవులు గారు మన్యం ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా వెళ్లి అక్కడ ప్రజల దయనీయ జీవితాల పట్ల కలత చెంది, కమ్యూనిస్టు భావాల్తో, వారిలో మార్పు తీసుకురావడానికి ముందుగా తన జీవన విధానాలను మార్చుకోవడమూ, వారితో మమేక మౌతూ పేదల పట్లా, వారి సమస్యల పట్లా సానుభూతితో వుంటూ, తన పిల్లల్ని గవర్నమెంట్ బడిలో చదివిస్తూ, మరణించాక అవయవదానం కోసం మెడికల్ కాలేజీకి ఇవ్వడంతో, ఒక ఉదాత్తమైన మనిషిని తీర్చిదిద్దిన కమ్యునిస్ట్ భావజాలం ఎంత గొప్పదో ఇందులో రాఘవులు మేష్టారిలో చూపారు.
మొదట కథ ''సర్'' లో వత్తిని దైవంగా భావించే పోస్ట్ మాన్, కలెక్టర్ కి వచ్చిన రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎకనాలెడ్జిమెంట్ కవర్‌ని కలెక్టర్‌కే ఇస్తానని మంకుపట్టు పట్టి అందరిచేతా తిట్లు తిన్నా, వత్తి పరమైన నిజాయితీని మెచ్చుకునే కలెక్టర్ ద్వారా, మెచ్చుకోలుతో పాటూ క్యాష్ రివార్డ్ అందుకోవడంతో, వత్తి పట్ల అంకితభావం అనేది చాదస్తం కాదు కర్తవ్యం అని చెప్పకనే చెబుతారీ కథలో.
''అమ్మకానికి అమ్మ జ్ఞాపకాలు'' ఈ సంపుటిలో మరో మంచి కనెక్టివిటీ వున్న కథ. ఎంతైనా సంపాదించు కోనివ్వండి, అమ్మా నాన్నలు ఎంత సంపాదించి ఇచ్చినా, వాళ్ళు చివర్లో వుంచుకున్న చిన్న జ్ఞాపకం ఇల్లు. అది పూరిల్లు అయినా సరే, పెద్ద విలువ చేయకపోయినా సరే, తణమో, ఫణమో వస్తే చాలు హక్కుదార్లుగా ఆ యింటి కోసం కొట్టుకునే కొడుకుల కోడళ్ళ నైత్యం రోజూ చూసేదే! ఆ అమాయక తండ్రులు కూడా అంతే! నెలకు లక్ష సంపాదిస్తూ, వూళ్ళలో ఎకరాలు పంచేసుకొని కూడా, తల్లిదండ్రులుండే ఒక వారసత్వపు గుడెసెని కూడా కబళించడానికి వొస్తే, ''ఒరేరు వెధవాయిల్లారా! చచ్చేదాకా అయినా దీన్ని వుంచండిరా'' అని చెప్పుకోకుండా, అమ్మి వాళ్ళ చేతిలోనే పెట్టేసి వుత్తమ ఆస్తి పంపకాల ''అయ్య''లే ఎక్కువ ఈ రోజుల్లో... ఇంటికి తీసుకు రావడం వదిలెయ్యండి, కనీసం పుట్టి పెరిగిన ఇంట్లో అయినా వాళ్ళ ప్రాణాల్ని సుఖంగా పోనివ్వని పుత్రరత్నాలకు బుద్ది చెప్పేలా వుందీ కథ.
ఏ సౌఖ్యాల్నీ ఇవ్వని, ఇవ్వలేని భర్తని గుండెల్లో పెట్టుకొని, బింకంగా బతికే మారిశెట్టి చెంద్రావతి కథ కంటతడి పెట్టిస్తుంది. బడుగుల జీవితాల్లో ఎన్నో విషాదాలూ, వేదనలున్నా గడపదాట నివ్వకుండా, పంటి బిగువున ఇంటి పరువును కాపాడుకునే ఈ మహా పతవ్రతా మూర్తులు లాంటి చెంద్రావతులు మన చుట్టూ ఎందరో వుంటారు.
ఇంచుమించు మిగతా అన్ని కథల్లోనూ ఏదో ఒక జీవితపు పార్శ్వాన్ని తాకుతూ ఒక మెసేజ్‌ను ఇచ్చే ప్రయత్నాన్ని విజయవంతంగా చేశారు రత్నాకర్. ఉదాహరణకు సూసైడ్, ఎయిడ్స్ లాంటి విషయాల పట్ల మానవీయ కోణమూ, బాసిగాడ్ని మనిషిని చేయడంలో విజయకుమార్ అందించిన ఆత్మ విశ్వాసం లాంటి విషయాలు హద్యంగా వర్ణించారు. కొంత రొమాన్సూ, కొంత అపరాధ పరిశోధక రకపు కథలు ఒకటి రెండు వున్నా మొత్తంగా చూస్తే ఈ సంపుటిలో కథలన్నీ హాయిగా చదువుకోవచ్చు. సంపుటి చూడ్డానికి ''వాచకం'' లా అందంగా ముద్రించారు.
- వి. విజయకుమార్,
8555802596