Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనించిన ప్రతి మనిషి అనుభవాల ప్రవాహమే. అనుభూతుల డోలికే. ప్రతి వ్యక్తి జీవితం పూల మేళా... పూల గోపురం కావాలని, నవ్వుల వెన్నెల వన్నెల పరిమళాల ముంచిన తూలిక కావాలని అనుకుంటాడు. కాని అలాంటి జీవనం ఎంత మందికి లభ్యమౌతుంది?. అసలు లభ్యమయ్యేనా? అసలు తమ అనుభవాల అనుభూతులను, హదయ స్పందనలను విప్పి చెప్పగలిగే వారెంత మంది? అందునా కవితాశ్రయంగా, కవితాత్మకంగా చెప్పగలిగే దెంతమంది?
జీవితాన్ని కవితా రూపకంగా మార్చుకోగలిగిన వారు, జీవితం ఎన్ని ఇసుక తుఫానుల్ని మోసుకొచ్చినా మనసులో వసంతాన్ని వీడిక రంగు పూలు ప్రవాహాల్లా సాగిపోయే వారు, సహజత్వాన్ని కోల్పోక జననం నుండి మరణం దాకా భావ సౌరభం.. రస సారం.. రసానందం కోల్పోని వారు, ప్రకతినారాధించాలనే. భావననందరిలో పెంచాలనే ఆరాటం ఆశయం కలవారెంరుంటారు?. అలాంటి వారే శేషేంద్ర. శ్రీశ్రీ శేషేన్ అని సంబోధించిన శేషేంద్ర వారి గురించెంత చెప్పినా తక్కువే. వారి గంభీర సౌమ్య మనో భావ నిధియైన మనసును విప్పగలమా!
ఎంత మందిలో ఉన్నా ఒక్కోసారి మనిషి మనసు ఏకాంతమై. నిశ్శబ్దమై.. వర్షానికి తడుస్తూ కిటికి అంచున ముడుచుకునున్న గువ్వలా.. కాలానికి తడుస్తూ తాననుభ వించిన నిర్లిప్తతా నిర్వేదాలు, అవమానాలు, ఆవేశాలు, ఆశాభంగాలు, ఎవరికి చెప్పుకోలేక..ఎవరితో పంచుకోలేక ఆ ఏకాంతం. కుడ్యాలకి స్వగతాలు (సాలిలాక్వీలు)గా వినిపిస్తూ ఉంటాడు.
అదే కవైతే పైన చెప్పుకున్న వాటి తాలూకా భావనలను అనుభూతులను తన అక్షరాలలో వాక్యాలలో నిక్షిప్తం చేస్తాడు.
సున్నిత మనస్కుడే కవి కాగలుగుతాడనే మాటకు నిలువెత్తు నిదర్శనం అని శేషేంద్ర రాసిన కొన్ని కవితా వాక్యాలను చదివినపుడు. అవి వారి స్వగతాలుగా అనిపించాయి నాకు ఒక దేశపు జండాకున్నంత పొగరున్న శేషేంద్ర స్వగతాల ఆహ్వానందుకుని వాటిలోని కళితే... ఆ గాఢంపు వ్యక్తీకరణల లోతులలోకెళితే..
నేనొక వ్యక్తిని కాదు. ఉద్యమాన్ని... అనే శేషేంద్ర తన జననం గురించి చెప్తూ...
''నేను పువ్వుల్లో ఉంచి, నిశ్శబ్దంలోంచి పుట్టాను'' అంటూ ఓ ఆహ్లాదకర సౌందర్య చిత్రాన్ని మన ముందుంచారు. అంతే కాదు... ''అక్టోబరులో నేను పుట్టాను
అక్టోబరులోనే విప్లవం పుట్టింది
అందుకే భయపడుతోంది తిమిరం'' అంటూ తన జననం ఓ విప్లవ ప్రతీకగా అభివర్ణించుకున్నారు శేషేంద్ర. నిజమే... తెలుగు సాహిత్యాన ఓ విప్లవం ఆయన జననం. ఎందుకంటే ఆయనెన్నో భాషలు నేర్చి, మరెన్నో శాస్త్రాలు చదివి జ్ఞానం నిధై సాంప్రదాయ కవిత్వం నుండి ప్రజా స్వామ్య ప్రతీకగా చెప్పుకునే వచన కవిత దాకా రచనలు చేశారు.
షోడశి (రామాయణ రహస్యాలు), స్వర్ణ హంస (శ్రీహర్షుని శంగార నైషధంలోని యోగ శాస్త్ర ప్రాముఖ్యత గురించి) రాయటం ఒక ఎత్తైతే ఆధునిక మహా భారత రచన మరో ఎత్తు. అంతేకాదు ప్రాచ్య పాశ్చాత్య కవితా రీతులను గ్రహించి యువ కవుల కోసం ''కవిసేన మానిఫెస్టో'' ను రచించి కవిసేనను నిర్మించి, నోబుల్ బహుమతి గడప తొక్కిన ప్రథమ అద్భుత కవిగా (తెలుగు భాషలో) నిలిచారు శేషేంద్ర.
తన గురించి తాను చెప్పుకొంటూ...
''ఎక్కడి నుండో వచ్చి
నేను ఈ లోకంలో నా
మొదటి అడుగు పెట్టిన
నాడు నన్నడగకనే నా
పేరు పెట్టింది లోకం.
అప్పట్నుంచి నా కష్ట
సుఖాల బరువును
మోసుకుంటూ ఈ భూమి మీద
నేను వేసిన అడుగులన్నీ...
నా పేరు నేను పెట్టుకోడానికి చేసిన యాత్ర'' అంటూ తన స్వేచ్ఛాయుత. స్వీయ వ్యక్తిత్వం కోసం చేసిన అన్వేషణను వెలిబుచ్చారు.
''నేనో బాధల బస్తీ'' అని చెప్పుకొన్న శేషేంద్ర... చెట్టయి, కొమ్మల్లో కలై, పాటై అడవిలో సరిగమలల్లుతూ ముత్యాల గుంపుల్లా పరుగెత్తే వాగై... జేబులో ఏ జ్ఞాపకాలు వేసుకొచ్చానో ఎవరికి తెలుసు. పళ్ళు తిన్నట్టు దినాలు తిన్న నేను ద్రాక్షపళ్ళంత కన్నీటి బిందువులు తింటున్నాను'' అంటూనే...గుప్పెడు మెతుకులక్కూడా నోచుకోని వారి గుడిసెల్లో నడిచిపోతూ..
ఓ శేషేన్! నీవు పీడిత ప్రజలకే చెందుతావు.
అక్షరమై అందరికి అందుతావు....అంటూ
తన సున్నిత హదయాన్ని నిరాడంబరతను స్వగతంగా చెప్పుకున్నారు. ఔను ఐక్షరాల ప్రవాహమై ప్రతీకలు, ఇమేజెస్ ఇత్యాది కవితా సామగ్రితో తన వాక్యాల్ని కవితాత్మకం రసాత్మకం చేసి ఓ ప్రత్యేక శిల్ప సొగసులతో సింగారించి మన ముందుంచారు.
శాశ్వత కీర్తినందే రచనలు చేయని వారి గురించి, తన ప్రతిభను గుర్తించని వారి గురించి, అసూయా పరుల గురించి.... ప్రతిభ అనే నేరం చేస్తే మీరు క్షమించరని నాకు తెలుసు. కాని నేను పుట్టే ముందు నిర్దోషిగానే (ప్రతిభ లేని వానిగా) పుట్టమని నాకెవరు చెప్పారు. కవిగా మెరిసిన దొరికిన నాలుగు సెకండ్లే జేబులో వేసుకొనిపోయే మీరెంత మంచివారు? కాలాన్ని మార్చాలని ఖడ్గమై ఇంకా ఊపిరి పీలుస్తున్న నేనెంత చెడ్డవాణ్ణి'' అంటూ నిట్టూర్పయారు తన ప్రతిభకు విలువివ్వని వారివి గురించి.అంతే కాదు.. గాలివానల్ని, గ్రహణాల్ని గుర్తించి పంచాంగాలు చెబుతాయి. కాని నీ (నా) గాలివానల్ని, నీ (నా) గ్రహణాల్ని చెప్పే పంచాంగాలు లేవు.'' అంటూ నిర్వేదమౌతారు.
అంతలోనే ..''రేపటి వాళ్ళు అర్థం చేసుకునే గ్రంథం నీ జీవితం. ఇవాళ మాత్రం నీవు ఏకాకివి'' అని తనకు తానే చెప్పుకుంటూ రానున్న తరాల్లో తన రచనలు, స్మతులు నిలబడతాయనే విశ్వాసాన్ని, తప్తిని వెల్లడించిందీ స్వగతం.
ఎన్నో ఆశానిపాతాల గాయాలను ఓర్చినందుకో .. మోసినందుకో ఏమో.. ''నీ గుండె ఓ గాయాల లైబ్రరీ శేషేన్'' అనే స్వగతమయారు.
చిక్కు బడిన దారాలు జీవన మార్గాలు.. అనే శేషేంద్ర...'' నీ వాళ్ళెవరు కారో నీవు తెలీనీవు. నీవు నిలబడ్డ భూమి కూడా నిన్ను వంచించిందని చెప్ప లేవు'' అని తన నిస్సహాయతకు తానే స్వగతమయారు.
''ఎంత విడివిడిగా నడిచినా (ఎన్ని ఉత్తమ గ్రంథాలు రచించిన) ఎప్పుడూ దూరం (తన పట్ల ఇతరుల తీరు) అంతే'' అనుకున్నారు.
''ఆముదపు చెట్టు నీడల్లో (మేథస్సు, విజ్ఞానం, విజ్ఞత లేని వారితో) నిద్రిస్తున్న ఈ దేశానికి జ్ఞాన చైతన్య మందించాలని యత్నించి.... నేనొచ్చింది మీకు తేలీదనీ కాదు. నాకు తెలుసనీ కాదు. మనమందరమూ కలిసి ఒక దిక్కుకు నడుద్దామని'' అని ఎలుగెత్తిన గళ గీతం ఆయన.
చుట్టూ ఉన్న వారివలన మనసు నదిగి నలిగి కలిగిన బాధతో... ఇవన్నీ నేను చూచిన రాస్తాలే (మనుషులే) ఇవన్నీ నేను చేసిన రాస్తాలే. ఒంటరి తనంలో ఖైదీ ఐ ఆర్తనాదం చేస్తున్న ఈ నాడు నా అలసి పోయిన అడుగుల్ని ఆహ్వానించే రాస్తానే లేదు. కాలానికి ముందు పుట్టి కాలానికి బలై అలసి పోయాను'' అని ఆత్మ అనుభవించిన విషాదాన్ని ఎంత కవితాత్మకంగా ఆవిష్కరించారో.. ఆ ఒంటరి తనాన్ని ''చుక్కల గుంపులో ఉన్నా జాబిల్లి ఒంటరి బాటసారి'' అని తన చుట్టూ ఉన్న వారంతా తననెరిగిన వారే.తన కవిత్వాన్ని దాని గొప్పతనాన్నెరిగిన వారే ఐనా తాను ఒంటరినని ఇలా చెప్పారేమో.
నేను ఘనీభవిస్తే
ఒక నామాత్మక దేహం
నేను ద్రవీకరిస్తే
ఒక జ్ఞాపకాలు ప్రవాహం
..అంటూ తనని తాను నిర్వచించుకున్న శేషేంద్ర ఇంకా... నేను కిరణాల్లో స్నానం చేసి మదు మధుర స్మరణాల్లో గానం చేసి నన్ను నేను తెలుసుకున్నా...అని తన గురించి తానే చెప్పుకున్నారు. ఔనుగా. ఆయన ''ఎన్ని జిహ్వలు, ఎన్ని యుగాలు తిరుగుతూ వచ్చారో. ఎందరిని కలసి ఎన్నెన్ని చదివి ఎవరు పొందలేనంతగ ఎంతటి జ్ఞానాన్ని సంపాదించాలో. అందుకేనేమో అందరు.. ఇవాళ నన్ను మా ఊరి వాడుకుంటున్నారు... అని, అలా అన్నవారిని గురించి చమత్కరించిన స్వగతమిదేమో.
నేను పాట కాలేకపోయిన స్వరాన్ని.. అని తనకి తానే చెప్పుకున్న శేషేంద్ర మాటలలోని విషాదం అక్కడితో ఆగలేదు.
''అడుగవద్దు నేను జీవితంలో ఎలా దోచుకోబడ్డానని. నేను హదయమిచ్చి ప్రేమించే ఎండ మావుల్ని అడుగు. నేను నా సర్వస్వాన్ని రాల్చుకున్నాను చెట్టు పువ్వుల్ని రాల్చుకున్నట్టు. చెట్టు ఉంటే ఏడాదికొక వసంతం వచ్చేది. మనిషినై అన్ని వసంతాలు పోగొట్టుకున్నాను.. అంటూ ఆవేదనయ్యారు.
నా పుస్తకం నీ చేతుల్లో ఉంటే నేను నీ చేతుల్లో ఉన్నట్టే .. అనే శేషేంద్ర ''నా హదయాన్ని ఆకాశ వీధుల్లోకి ఎగరేసి నన్నొక జండాగా ప్రతిష్ఠించుకున్నాను... అని శేషేంద్ర తన స్వంత స్వగత సంతాపాన్నున్నా కాని ఎంత ఆత్మ స్థయిర్యాన్ని ప్రదర్శించారో.. ''నేను మళ్ళీ రాక పోవచ్చు కాని నా జ్ఞాపకాల. బాధనించి తప్పించుకోలేరు మీరు.. అవి ఈ దేశపు గాలుల్లో పక్షులై పాడుతుంటాయి. కిరణాలై అల్లుకుంటాయి.. అని ఆత్మీయంగా అంటూ అందమైన శాపాన్నిస్తూ తానెక్కడికి పోనని ఆహ్లాదకరమైన అభివ్యక్తి నందించారు.
''ఒక్క నింద లేదు. ఒక్క నిట్టూర్పు లేదు. ఆయన రాస్తారో వీస్తున్న చలిగాలి తప్ప. వీధి లాంతరు ముద్దులు ముద్దలుగా కురుస్తున్న గుడ్డి కాంతి తప్ప'' ఆయనకు ఏం మిగిలిందో.... మరి.
''నిశ్శబ్దంగా కురిసే వెన్నెల్లో నిశ్శబ్దంగా తడిస్తే అడవిలో నుల్థొని'' ఎన్నెన్ని స్వగతాల మయమైందో ఆయన జీవితం.. హదయం...
ఏది ఏమైనా.. అదిగో చూడుడి గాలిలో ఎగురుతున్న ఆ రంగులు పేలిక. (అది ఆయన అద్భుతమైన అమోఘమైన అపూర్వమైన అనూహ్యమైన కవిత్వం). ఇది ఈ యుగానికి చాలిక.. అని అనుకున్నారేమో. ''ఒక అశ్రువు తనని మోసం చేసిం''దనేమో.. సూర్యుడిలో కలం ముంచి రాస్తున్న రాతను ఆపేశారేమో.. ఏమో... మరి...
(నేడు వర్థంతి సందర్భంగా...)
- రాజావాసిరెడ్డి మల్లీశ్వరి