Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సున్నితమైన హాస్యం ఆరోగ్యానికి మంచిది. అట్లాగే జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా పెదాలపై నవ్వు మొలవడం కృష్ణ స్వామి రాజు గారి కథల గొప్పతనం. నిత్య జీవితంలో హాస్యం జోడిస్తే బ్రతుకు నందనవనం. పెదాలపై కదలాడే నవ్వు, చుట్టూ నలుగురు మనుషులు ఇంతకంటే ఏం కావాలి?! నవ్వించేవాడంటే ఎవరికిష్టముండదు?
సరదా సరదా సన్నివేశాలతో కథను రక్తి కట్టించడం ఆయనకే తెలుసు. ''సాదాగా చెబితే మజా ఏమి ఉంటుంది? కొంచెం మసాలా వేసి చెబితేనే కిక్కు''అని ఆయన అన్నట్లుగానే కథను కథలా కాకుండా హాస్యస్ఫోరక గుళికలా మన చేత నవ్విస్తూ మింగిస్తాడు. కథలన్నీ అమాంతం చదవదగ్గవి.
భాష భ్రష్టుపట్టి పోతున్న నేటి రోజుల్లో సామెతల్ని అల్లుకుంటూ కథ రాయడం నిజంగా మన అదష్టం. కథలు చిన్నవే కావచ్చు కొంత స్ఫూర్తీ, కొంత ఆలోచనతో పాటు కొత్త విషయాల్ని పరిచయం చేస్తాయి. నేటి సమాజపు చిత్రాన్ని కళ్ళకు కడతాయి.
''పొట్టి మొగుడు'' కథలో చిన్న సంభాషణను హాస్యంగా చిత్రించారు. ''ముదురు'' కథలో పెళ్లీడుకొచ్చిన అబ్బాయికి సంబంధం చూడకుండా పెంపుడు కుక్క పిల్ల కోసం రాజారెడ్డి పడే ఆరాటాన్ని నవ్వులో కొంత బాధ కలిపి తాగిస్తారు.
''ట్రిమ్మింగ్'' అంటే తప్పుగా అర్థం చేసుకున్న నాగ సుబ్బడి పరిస్థితి మనల్ని కథంతా నవ్విస్తుంది. చిత్రాణి ఇచ్చిన ఒక ఐడియా గౌరి జీవితాన్ని ఎలా మార్చిందో ''ఐడియా'' కథలో చూడొచ్చు.
స్కానింగ్ కథలో డాక్టర్ చేతిలో మోసపోయిన నారాయణ స్వామినీ, డాక్టర్లనూ, హాస్పిటల్లనూ స్కానింగ్ చేసి మరీ మనకు చూపిస్తారు.
బాబా దర్శనానికి వెళ్లిన సూర్యప్రకాష్‌కు తిరుపతి లోని తన ఇంటిలోపడ్డ దొంగతో సంభాషణ, దొంగ లోని నిజాయితీ మనల్ని నవ్విస్తూనే ఆకట్టుకుంటాయి.
''శల్య వైద్యుడు'' కథలో రాజుగారికి మోకాళ్ల నొప్పుల వైద్యం చేసే వైద్యుడు ప్రతి పౌర్ణమి రోజు అందుబాటులో ఉండకపోవడానికి గల అసలు కారణం మనల్ని కడుపుబ్బ నవ్విస్తుంది.
''మిక్చర్ పొట్లం'' కథలో స్వీటు హాటు ప్యాకెట్ల వెనుక ఉన్న కరెన్సీ కవరు మర్మాన్ని చక్కగా చూపించారు కష్ణ స్వామి రాజుగారు.
మన పనులు మనం చేసుకోవడం సులభం. ఇతరుల చేత పనులు చేయించడం కష్టం అంటూ ''మ్యాచింగ్'' అనే కథలో పనిమనిషి హైక్లాస్ జీవనాన్ని దానికి సరిపడేలా లేని తమ ఆర్థిక పరిస్థితిని
''ఇల్లు కట్టకముందు వారానికి రెండుసార్లు ఆంజనేయ స్వామి గుడి చుట్టేది. ఇల్లు కట్టాక నాలుగు సార్లు చుడుతోంది.'' అంటూ నర్మగర్భంగా చెబుతారు రాజుగారు.
అమాయక లెక్చరర్ బాలఫణి ప్రశ్న, ఎనిమిదో తరగతి చదివే సుశీల సమాధానంతో ''ఓటు నోటు'' కథతో ప్రస్తుత ఎలక్షన్లను కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు.
మారిన భర్త ప్రవర్తనపై బాలజ్యోతి చేసిన మొబైల్ ప్రయోగం ''దూరపు కొండలు'' కథలో చదవదగ్గది.
''లేవలేని అత్తకు వంగ లేని కోడలు''
''ఉడుతకెందుకు ఊర్లో పెత్తనాలు''
''కోరు గింజలు కొంగులోకే సరి''
''ఎగిరి దంచినా ఎగరక దంచినా అంతే కూలి''
''పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు కదా''
లాంటి సామెతలు సందర్భోచితంగా కథల్లో చోటు చేసుకొని నవ్వు తెప్పిస్తాయి.
నవ్వు నలభై విధాల లాభం. కష్ణ స్వామి రాజు ముప్ఫై కథల ''మిక్చర్ పొట్లం''చదివి తనివితీరా నవ్వండి, చెప్పి మనసారా నవ్వించండి.
- రాజేశ్వరరావు లేదాళ్ళ 9441873602