Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కులదురహంకారం, మతం కట్టుబాట్లు, వంశ ప్రతిష్టలనే వలయంలో చిక్కుకున్న మన భారతీయ సమాజంలో కులదురహంకార హత్యల పరంపర కొనసాగుతూనే వున్నది. నాగరిక సమాజం సిగ్గుతో తలవంచుకొనేలా తలిదండ్రులు లేదా సోదరులు తమ పిల్లలను తామే చంపుకుంటున్నారు. ప్రేమించిన నేరానికి యస్సీ, బీసీ కులాలలోని యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. పరువు హత్యానేరాలపై శిక్షపడిన వాళ్లు కారాగారాల్లో మగ్గిపోతే, తప్పించుక తిరుగుతున్న వాళ్లు లోలోన కుమిలిపోయి జీవిస్తున్నారు.
ప్రస్తుతం పరువు హత్యలనే ఈ అమానుష చర్యల సామాజిక ఇతివృత్తంతో గత సం|| తెలుగులో ''మధులతా'' అనే నవల వెలువడింది. ఐదు దశాబ్దాలుగా కుల నిర్మూలన సంఘం బాధ్యురాలిగా క్రియాశీలంగా వున్న లక్ష్మీ నాగేశ్వర్ నవలను రచించారు. 2018లో మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య వల్ల కలిగిన సంచలనం, తదనంతరం పరిణామాలన్నీ ఈ నవలకు ప్రేరణగా నిలిచాయి.
కుల, మత సంకుచితత్వం ఈ 21వ శతాబ్దిలోని భారతీయ సమాజం, తిరిగి మధ్య యుగాల్లోకి తిరోగమిస్తూ ప్రమాదంలో జీవిస్తున్నామా అనే ప్రశ్న ఎదురవుతున్నది. ఈ దశలో, మధులతా నవల మనందరినీ ఆలోచించమం టున్నది. తల్లిదండ్రులు - సోదరులు విశాల దృక్పథంతో కుల వైషమ్యాలను ధైర్యంగా ఎదుర్కోమని చెబుతున్నది.
ఇక ''మధులతా'' నవల కథా కథనాన్ని పరిశీలిస్తే, మిర్యాలగూడెంలోని అమృత - ప్రణరు వివాహం, తండ్రి మారుతీరావు చేయించిన హత్య తర్వాత జరిగిన సంఘటన లన్నీ గుర్తుకొస్తాయి. క్లుప్తంగా ఈ నవలలోని కథ...
అగ్రకులానికి చెందిన అందమైన అమ్మాయి మధులత- ఆమె చదువుతున్న కాలేజీలో సీనియర్ నవీన్- సామాజిక అవగాహన ఉన్న చురుకైన యువకుడు. ఎస్సీ కులస్థుడు. రిజర్వేషన్లు కొనసాగినపుడే బీసీలు, యస్సీలు బాగుపడతారనే దృష్టితో వాదించే యువకుడు. నవీన్‌తో మధులత పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది.
మధులత తండ్రి సంపన్నుడు. రాజకీయ పలుకుబడి వున్న అగ్రకులస్తుడు. తన కూతురికి అమెరికాలోని స్వకులస్తుడితో వివాహం జరిపించాలనే ప్రయత్నంలో వున్నాడు. నవీన్‌ను తన జీవన సహచరుడని భావించిన మధులతు ''నాన్న, నేను పెద్దదాన్ని అయ్యాను. నాకిష్టమైన వాడిని నేను వెతుక్కోగలను...'' అని తండ్రితో వాదిస్తుంది. అయినా తండ్రి అంగీకరించడు. గత్యంతరర లేని స్థితిలో మధులత నవీన్ రహస్యంగా వివాహం చేసుకుంటారు.
మధులత తండ్రికి తెలియకుండా దూరంగా జరిగిన ఈ కులాంతర ప్రేమ వివాహానికి ముందు, మాధవరావు అనే విద్యావేత్త నవీన్‌ను హెచ్చరిస్తాడు. ప్రపంచంలోని వాస్తవాలను గ్రహించకుండా వ్యామోహంతో ఆవేశంతో స్వంత కుటుంబాలను ధిక్కరించి పెళ్ళి చేసుకుంటే అనేక రకాల కష్టనష్టాలను ఎదుర్కోవలసి వుంటుందని చెబుతాడు. అయినా భవిష్యత్తు ఎలా వున్నా ఎదుర్కోగలమని, తమకు వెంటనే ఆశ్రయం రక్షణ కల్పించమని నవీన్ ప్రాధేయపడతాడు. చెన్నైలోని డి.యం.కె పార్టీ మిత్రుల సహాయంతో మాధవరావు తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తాడు.
ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల వివరాల్లోకి వెళితే... మధులత - నవీన్ వివాహం అనంతరం తిరిగి తమ సొంత పట్నానికి చేరుకుంటారు. నవీన్ తలిదండ్రులు ధైర్యంగా కోడలు మధులతను స్వీకరిస్తారు. వారంతా దళిత వర్గానికి చెందిన విద్యావంతులు - సంస్కారవంతులు. అదే టవున్లో వున్న మధులత తండ్రికి భయపడకుండా నూతన రక్షణగా వుంటారు. కాని అగ్రకులస్తుడు - ధనికుడైన పూర్ణచంద్రరావు (మధులత తండ్రి) ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతాడు. తన బంధువర్గంలో అప్రతిష్టపాలైపోయానని, తన కూతురుని లేవదీసుకుపోయి కులాంతర వివాహం చేసుకున్నాడని, నవీన్‌పై కక్ష పెంచుకుంటాడు.
ఆ క్రమంలోనే నవీన్ సామాజిక వర్గం వారు - ఇతర కులాల మిత్రులు ఒక విందు ఏర్పాటు చేసి, మధులత - నవీన్‌లను సత్కరించిన సందర్భంలో స్థానిక టీవీ ఛానల్లో ఆ దృశ్యాలను ప్రసారం చేసారు.
''పుర ప్రముఖులలో ఒకరైన పూర్ణచంద్రరావు ఏకైక కుమార్తె మధులతకు, దళిత యువకిశోరం నవీన్‌కు హైదరాబాద్‌లోని ఆర్యసమాజంలో వర్ణాంతర వివాహం జరిగిన సంగతి ప్రేక్షకులందరికీ తెలిసినదే...'' అనే వ్యాఖ్యానంతో టి.వి. ప్రసారం ఆ టవున్లో అందరు చూసారు. ముఖ్యంగా ఆ ప్రసారాన్ని చూసిన పూర్ణచంద్రరావు కులస్థులు- బంధువులు తమ పరువే పోయినట్టు విమర్శి స్తారు. తన ఏకైక కుమార్తెను ఎంతో గారాబంగా పెంచి, ఏ లోటు లేకుండా చూసిన తర్వాత కూడా ఇలా ఒక దళిత యువకుడిని పెళ్లి చేసుకోవడం తన కులానికి - వంశానికి తీరని అప్రతిష్ట అని పూర్ణచంద్ర రావు రగిలిపోతాడు. ప్రతీకార చర్యగా ఒక రోజు బాహాటంగానే రోడ్డు మీద మధులత సమక్షంలోనే నవీన్‌ను కిరాయి హంతకుల చేత హత్య చేయిస్తాడు.
ఒక దళిత యువకుడికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ, అభ్యుదయ వాదులతో పాటు దళిత సంఘాలు, కుల నిర్మూలన సంఘాలు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాయి. చివరికి అధికారంలో వున్న రాజకీయ వేత్తలు కూడా సానుకూలంగా స్పందించారు.
ఆ తర్వాత మధులత తండ్రి పూర్ణచంద్రరావుతో పాటు అతనికి సహాయంగా నిలిచిన ప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేయగా- హత్యానేరంపై పూర్ణకు కారాగార శిక్ష - తదుపరి శిక్ష ముగించుకొని బయటకి వచ్చాక- సామాజికంగా తాను హత్యా నేరాన్ని మోస్తూ, చివరికి భార్య మీనాక్షి తిరస్కార భావాన్ని భరించవలసి వస్తుంది. మధులత గర్భవతి. తన ప్రియమైన భర్త నవీన్‌ను పోగొట్టుకుని తీరని వేదనలో వున్నదనే వాస్తవాన్ని తెలుసుకుంటాడు. పశ్చాత్తాపంతో ఒంటరితనంతో తన కులదురహంకార అపరాధాన్ని గ్రహిస్తాడు. చివరికి తన సంపాదనంతా ధన రూపేణా సూటుకేసులో పెట్టి, మధులత ఇంటికి వెళ్ళి ఆమె నిరాకరించినా, ఆ సూటుకేసును అక్కడే వదిలివెళ్ళిపోతాడు.
తరతరాలుగా జీర్ణించుపోయిన మూఢాచారాల మధ్య, ఈ దేశ పౌరులు కులాలు - మతాల ఆంక్షలకు లోనై జీవిస్తున్నారు. ఉపరితలానా అవసరం కొద్ది, వృత్తుల మూలంగా సహజీవనం సాగిస్తున్నప్పటికీ, మానసికంగా సంకోచిత ధోరణిలోనే ఆలోచిస్తున్నారు.
తన ఉన్నత కులానికి చెందిన అమ్మాయిని అట్టడుగు వర్ణానికి చెందిన దళితుడు పెండ్లి చేసుకొని గౌరవ ప్రతిష్టలను మంటగలిపితే ఆ అవమానాన్ని భరించగలమా అని ఈ నవలలోని తండ్రి పూర్ణచంద్రరావు, పోలీసు అధికారుల ముందు వాపోతాడు.
ఆ సందర్భంలో వర్తమాన సామాజిక పరిణామాన్ని అర్థం చేసుకున్న ఆ పోలీసు అధికారి ఇచ్చిన సమాధానం-
''పూర్ణ గారు రోజులు మారాయి! ఒక అమ్మాయిని యుద్ధంలో ప్రత్యర్థిని ఓడించి స్వంతం చేసుకునే రోజులు కావివి. ఆ నాటి ఆయుధ పోటీలో కూడా కొన్ని పద్ధతులుండేవి. ఇక ప్రస్తుత కాలంలో మన రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి వల్లనైనా మాకు మానసిక క్షోభ కలిగినా, అతన్ని చంపించే అధికారం మీకు లేదు. సాక్ష్యం, న్యాయం అన్నీ మీకు ప్రతికూలంగా వున్నాయి. నేనిందులో మీకు ఎలాంటి సహాయం చేయలేను''
17 ఉపశీర్షికలతో 160 పుటలతో లక్ష్మీనాగేశ్వర్, తనదైన చక్కని శైలిలో ఆకట్టుకునే భాషలో ఈ నవలను రచించారు. కులాల పేర్లను బాహాటంగానే పేర్కొన్నారు. కులాల మధ్య వున్న తారతమ్యాలను, సంపన్న వర్గాల ఆధిక్యధోరణిని ఆయా పాత్రల ద్వారా చిత్రించారు. శిల్ప పరంగా కొంత డాక్యుమెంటరీ వివరణగా నడిచినా ఆయా పాత్రల మనోభావాలను వ్యక్తి చేసారు. పరువు హత్యలనే అనాగరిక దారుణ చర్యలను ఎండగట్టగలిగారు. కులం, మతం, వర్గం, లింగ వివక్షతలను ఛేదించవలసిన అవసరాన్ని గుర్తు చేసారు.
- నిఖిలేశ్వర్, 9177881201