Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఉదయాన్నే ఎర్రశాలువా కప్పుకొని మా ఇంటికో రివాల్వర్ వచ్చింది' అని శ్రీశ్రీ ఖడ్గసష్టిలో అన్నట్లు.... ఓ శుభోదయాన నాకు కలం యోధుడు కపిల రాంకుమార్ కవిత్వ కలకలం సష్టించి నాకు పంపించాడు. ఎక్కడ ఏ సభలో ఆయన్ని చూసినా మెడను చుట్టేసుకున్న ఎర్ర కండువాతో గుబురు మీసాలమధ్య గుంభనంగా నవ్వుతూ పలకరింపులోనే పెనవేసుకుంటాడు. కవులన్నా, కవిత్వమన్నా, ముఖ్యంగా అభ్యుదయ కవిత్వమంటే ఎంత ప్రేమో ఆయనకు.
కవిసమ్మేళనాల్లో ఖనేల్మనే ఈ ఖమ్మం గొంతుకను ఇట్టే గుర్తించవచ్చు. నా కంటే పెద్దవారైనా వారి పెద్దరికం గుర్తుకు రాని ప్రేమతత్వం రాంకుమార్ ది. మూడు దశాబ్దాల సాహితీ రంగంలో వీర విహారం చేసిన, చేస్తూ ఉన్న గొంతుకలోంచీ వొలికిన అక్షరాల్ని ఒడిసిపట్టి కలం కలకలం పేరుతో తెలంగాణా సాహితీ మువ్వల్ని ఘల్లుఘల్లు మనిపిస్తున్నారు.
''ఎవరికి వారు నిర్లిప్తత నుండి బయట పడి
సమైక్యంగా నడవందే
విష సంస్కృతి పోదు'' (పుట12)
మాట నిలపలేని వారు ఓటమినీ ఓర్వ లేరని వీరి భావన.
పంట పురుగులను చంపలేని
(కల్తీ) మందులు
రైతు శవాలను పులుగులకు
విందు చేస్తున్నాయి (పుట:21) అంటూ పాలక వర్గ తీరు పట్ల రైతు నిస్సహాయతను ప్రకటిస్తున్నారు. చావుకు భయపడకూడదని భరోసా ఇస్తూ..
బుద్ధుడెందుకు పుట్టాడో ఈ నేలలో
మర్చిపోదామా
గాంధీ ఎలా చచ్చాడో ఆ ద్రోహం ఏమర్చి ఉందామా (పుట:25) అని ప్రశ్నిస్తున్నారు.
ఇవాళ మనుషుల్లో అధరాల చివర ప్రేమ పలకరింపులే గానీ రుధిరంలో చైతన్యపు చిహ్నాలుండవని బాధపడుతున్నారు. ఇంత దూరం ప్రయాణించినా వెనుదిరిగి చూస్తే ప్రగతి శూన్యమని, నీతి చీకటి రాజ్యంతో చేతులు కలిపి సాగుతోందని, పత్రికలు పెట్టుబడి దారుల విష పుత్రికలై వంతపాడుతున్నాయని బాధ పడుతున్నారు.
ప్రతియేటా వచ్చే ఉగాది హైటెక్ ఫెస్టివల్గా మారిందని, రైతులంతా కూలీలు మారిపోయిన దుస్థితిని
ఒక్క పూటైనా అన్నం పెట్టలేని స్థితిలో ఇవాళ
అన్నదాత ఉన్నాడని
ఈ స్థితిలో ఎవరిని నిందించాలి
రాజ్యాంగాన్నా?,
రాజ్యాధినేతలనా?
ఎన్నాళ్ళని, ఎన్నేళ్ళని
ఈ కన్నీళ్లను భుజాన మోయాలి?
ఎవరో ఒకరు ఇంకొకరికి తోడై
పూనుకోవాలి ప్రజల నాదుకోవాలి
(పుట:60) అని పిలుపునిస్తున్నారు
జనసామాన్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారినప్పుడు ప్రజలు మౌనంగా ఉండకూడదని గళాలు సవరించుకుని తిరుగుబాటు చేయాలని పిలుపునిస్తున్నారు కవి.
పాపికొండల నడుమ గోదావరి అందాలను కాపాడుకో మంటున్నారు. విద్వంస కారులకెదురు నిల్చి గిరిజనుల సంస్కృతినీ, వారసత్వాన్నీ పరిరక్షించుకొమ్మని మనల్ని హెచ్చరిస్తున్నారు.
అమ్మతనం అద్దె ఇల్లు కాబోతున్న సంస్కృతిని తీవ్రంగా నిరసిస్తున్నారు. తెలంగాణా పోరులో నేలకొరిగిన అమర వీరులందరు తెలుగుతల్లి కన్నబిడ్డలేనంటున్నారు. బతుకు మీద ఆశ చచ్చి శవమౌతున్న వ్యవసాయానికి పిండం పెట్టలేని అభాగ్యుడు రైతు
అప్పుల ఊబిలో
కూరుకుపోతున్న వాడికి
ఎప్పుడూ కూలి (కే) పోతున్న
వాడికి బతుకు పచ్చదనం
బొగ్గు బూడిద అవుతుంటే
మెతుకు వెచ్చదనం
ఎప్పుడూ దక్కనిదే.. (పుట:106) రక్తం చిందించిన ముదిగొండ స్మరించుకుంటారు బడుగు జనాలను అండగా నిలిచి, వెలుగు చూపిన యోధులను గురించి జనగానం చేద్దామంటారు. సుందరయ్య మార్గంలో ఉప్పెనలా కదిలిరండి అంటూ పిలుపునిస్తున్నారు కవి.
ప్రపంచ రంగస్థలంలో సంభవించే ప్రతిదీ కళాత్మకమే చావైనా బతుకైనా ప్రపంచీకరణ వచ్చాక ప్రతిదీ పోరాటమే.. (పుట:120) నంటారు.
నా కలాన్ని శూలంగా మార్చి
శతఘ్నలు పేల్చాలని ఉంది అంటూ ఆవేశపడి పోతారు.
ఎగిరిపడే జండాలెన్నున్నా
ఎజెండా లేక కూలునన్నా
జనం కొరకు పోరు చేసే
ప్రభంజనానిదే గెలుపన్నా.. (పుట:145) అంటారు
మన ఇల్లాలిని గురించి అద్భుతమైన నిర్వచనమిస్తూ..
పని గంటలు ఆమెకు వర్తించవా
ఈ పనియంత్రానికి కనీస వేతన చట్టం వర్తించదా.. అంటూ మనపై ప్రశ్నల కొరడా ఝుళిపిస్తారు.
ఈ సీనియర్ కవి కామ్రేడ్ కపిల రాంకుమార్ గారి కవిత్వంలో కలం కల కలమే కాదు. ప్రతికవితా అగ్నికణమే, సూటి బాణాలున్నారు, చురకలున్నారు, హెచ్చరికలున్నారు. పాఠకుల్లో ఆలోచనల్ని చైతన్యపరిచే మాటల తూటాలున్నారు.
నా చిరకాల కవిమిత్రుని కవిత్వ కల కలం నన్నెంతగానో ఇంప్రెస్ చేసింది. ఆవేశం, ఆగ్రహం కలగలిసిన ఉద్యమ స్వరాలు ఈ కవితలు. ఈ సందర్భంగా కామ్రేడ్ కపిల రాంకుమార్ను మనసారా అభినందిస్తున్నాను..
- డా.ఉమ్మడిశెట్టి రాధేయ