Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందు, వెనక కవిత్వమే నడవాలి. కవి అక్షర యుద్ధాన్ని నడపాలి. కవిత్వం అలనాటి రాజపోషణ నుండి నేడు తాడిత, పీడితుల వైపు నిలుస్తుంది, నిలవాలి. సాహితీ సష్టి మానవ సష్టి కన్న ఉత్కష్టమైనది. తొలి సాహితీ విప్లవకారుడిగా పిలువబడే పాల్కురికి సోమనాథుడి నుండి మొన్నటి కాళోజీ వరకు అన్యాయాన్ని ఎదిరిస్తూ, దోపిడీ దౌర్జన్యాలను, పీడనలను నిరసిస్తూ, తాడిత పీడిత ప్రజల పక్షాన నిలిచి సమసమాజం కోసం పరితపించిన వారి అడ్డాలోనే పుట్టిన వాడుగా వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సమకాలీన సంక్షోభాలను ఈసడిస్తూ పెన్నును గన్నులా మార్చి అక్షర(సాహితీ) తూటాలను పేల్చుచున్నాడు గుండు కరుణాకర్. అలా అభ్యుదయ భావజాలంతో తనదైన శైలితో, పాదముద్రలతో ప్రయాణిస్తూ సాహితీ సమరం కొనసాగిస్తున్నాడు.
''పంచనామా'' తొలి కవితా సంపుటితో సాహితీ లోకంలోకి వస్తూ.. అధికారంలో ఉన్నవారిని అప్రమత్తం చేయాల్సిన బాధ్యతను మరువకుండా తొలి ప్రయత్నంలోనే కవి, రచయితగా తన కవితలతో అక్షర యుద్ధమే చేశాడనిపిస్తుంది.
''అక్షర అస్త్రం'' కవితలో ప్రజా గళాన్ని అక్షర సునామీగా పాలకుల పై ఎక్కుపెట్టాడు. అలాగే కష్టాలను రంగరించి నేర్పుతో చెక్కిన కలానికి పదునెక్కువ/ దిగమింగిన కన్నీళ్లను సిరాగా నింపిన కలానికి ఉరుకెక్కువ(పదునైన కలం) అంటాడు. ఇంకో చోట.. చట్టాలను నోట్ల కట్టల్లో చుట్టి న్యాయ వ్యవస్థ కళ్ళు గప్పుతున్నంత కాలం ''స్వేచ్ఛకు సంకెళ్లు బద్దలయ్యేదెన్నడు?'' అని ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తాడు. మనసుకు ముసుగేసిన మాలిన్యపు గోడను నిలువునా కూల్చేదాకా యుద్ధం చేయాలంటాడు. రాత్రి ముఖం చాటేసింది/ తన నీడ అంతు లేని ఘోరాలకు నిలయంగా మారిందని/ పుడమి కడుపు చించుకుంది/ మగ మగాల భారం ఇక మోయలేనని/ మానవత్వం అగ్ని పరీక్షకు సిద్ధమైంది మనుషుల్లో ఏ మూలకైనా మిగిలున్నానా అని(రాత్రి సిగ్గు పడింది). ఆత్మీయుల మమతాను రాగాల స్మతిలో/ కంటి చెలిమెను సెలయేటిలా పారిస్తుంది (ఒంటరితనం). మనసు గదులు కుచించుకుపోతున్న వేళ ఇంటి గదులు ఎంత విశాలమైతేనేమి/ ఆలోచనలలో అంతరాలు పెరుగుతున్నంత కాలం/ తనువులు ఎంత దగ్గరైతేనేమి/ అశ్లీలమంతా చూపించి/ ఎన్ని నీతి సూత్రాలు వల్లిస్తేనేమి/ పశువులుగా మారుతున్న మగవాళ్లకు ''శీల పరీక్ష పెట్టే రోజులు వచ్చేదెప్పుడో..'' అని ఆవేదన పూరిత ఆవేశాన్ని ప్రకటిస్తాడు. కన్నీరు అలుగులు పారుతున్న ''దశ్యం''/ కొందరికి అమితానందం/ మరికొందరికి అంతు లేని విషాదం/ వరద నీరు ఇంటి సూరును తాకినా/ నోటి దూపను తీర్చలేదు/ మనీ వేటలో కుటిల తూటాలు పేల్చుతూ పోతే/ నీకు నువ్వే షికారివి కాక తప్పదు అని పాలకుల నిర్లక్ష్యాన్ని హెచ్చరిస్తాడు. సంక్షేమం పేరుతో సంక్షోభం/ ప్రజా పాలన ముసుగులో కుంభకోణాలు/ ఏళ్ళు గడిచినా/ పాలకులు మారినా/ తలరాత మారని పాలితుల గోడును (ఆహ్వానంలో) ఉటంకిస్తాడు.
అన్యాయమే చట్టమైనప్పుడు ఎదురిం చడం కవి ప్రథమ కర్తవ్యమని విశ్వసిస్తాడు కరుణాకర్. దోపిడీ సమాజం ఉన్నంత కాలం అభ్యుదయ సాహిత్యం సంకెళ్లను ఎదురించైనా ముందుకు నడవాలని నమ్ముతాడు. సమాజంలోని సమకాలీన సంక్షో భాన్ని సూటిగా, స్పష్టంగా ''పంచ నామా'' చేశాడు. స్వార్థం వికత రూపం దాల్చి మానవత్వాన్ని నామరూపాలు లేకుండా చేస్తుంది. ఇందువల్లే నేటి సమాజంలో వింత పోకడలు, వికత చేష్టలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమానవీయ పోకడలు, బాధ్యతారాహిత్య ప్రవర్తనలు, తాడిత పీడితులైన వారి ఆక్రందనలే కరుణాకర్ సాహిత్యానికి ఆజ్యం పోశాయనిపిస్తుంది. హక్కులు, బాధ్యతలు తాను ఎంచుకున్న ఉద్యమా(పోరాటా)నికి నేత్రాలుగా భావించాడు. ఆలోచనల యుద్ధంలో శాస్త్రీయ, ప్రగతిశీల సాహితీ పుస్తకాలే అసలైన అస్త్రాలని నమ్మి ''పంచనామా''ను తెస్తున్నాడు.
కరుణాకర్ మితభాషి. వత్తిని, ప్రవత్తిని అమితంగా ప్రేమిస్తాడు. ''పంచనామా''లో 69 కవితలున్నాయి. ఇవే కాకుండా వ్యాసాలు, కథలు, సమీక్షలు రాయడంలో మంచి నైపుణ్యం ఉంది. ఇతడు అభ్యుదయవాది, శాస్త్రీయ వైఖరి మెండుగా ఉంది. తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, ముక్కు మీద గుద్దినట్లుగా, హదయాన్ని తాకేటట్లుగా చెప్పడం, చైతన్యవంతంగా స్పందించడం, ప్రశ్నించడంలో దిట్ట. సమసమాజం కోసం పరితపించే కవి. వైవిధ్యభరితమైన అంశాలను వస్తువుగా ఎంచుకొని స్పందించడమంటే.. హదయాన్ని పోగులుగా మార్చి సమాజం కోసం వస్త్రాన్ని నేయడం. ఈ కార్యాన్ని కరుణాకర్ ఆత్మవిశ్వాసంతో చేస్తున్నాడు. ''పంచనామా'' పాఠకుల నుండి మానవత్వాన్ని, సామాజిక బాధ్యతలను వెలికితీస్తుందన్నది కాదనలేని నిజం. వీరుడా.. నీ మరణం అజరామరం/ కల్మషం లేని పల్లె/ అమ్మ భాషను ప్రేమిద్దాం/ బాల్యం బాధలు/ యువ భారతం ఎటుపోతుంది/ సిగ్గు పడాలె/ చుక్కానివి నీవే/ భరోసా ఏది?/ ఎందుకింత ఆపేక్ష.?/ పోరాటం ఆగదు/ లడాయికి దిగుదాం/ మేలుకో/ విచక్షణతో ఓటేద్దాం/ ప్రజాయుద్ధం/ చైతన్య గీతం/ రైతుల దండు/ అద్భుత శక్తులే అదశ్య అంగాలు/ సైన్సే వెన్నెముక/ చెమట సంతకం లాంటి కవితా పరంపరలతో మీ ముందుకు వస్తున్నాడు. ఇందులోని అన్ని కవితలు వివిధ పత్రికల్లో అచ్చు కాబడినాయి, ఎందరినో చైతన్యపరిచి ఉంటాయి, పాలకులను ఆలోచింపజేసి ఉంటాయి. పదునైన కరుణాకర్ కలం కాలానుగుణంగా ఇంకా ఎన్నో రచనలు చేయాలి. సమాజంలో మార్పు రావాలనే సదాశయంతో కొనసాగిస్తున్న సాహితీ ప్రయాణంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపిన తను ప్రజాకవి బాధ్యతను మోస్తున్నాడు.. మోయాలి. అతని ఆశయం నెరవేరాలని ఆశిద్దాం. కరుణాకర్ సాహితీ ప్రయత్నం అభినందనీయం.
- మేకిరి దామోదర్, 9573666650