Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ పుస్తకానికి ఏ పేరైతే బాగుంటుంది అని చర్చిస్తున్నప్పుడు, యునైటెడ్ కింగ్డమ్కు చెందిన మా ప్రచురణకర్త సైమన్ ప్రోసెర్ ''ఆజాదీ'' అని పేరు సూచించడంలో మీ ఆలోచన ఏమిటి అని నన్ను అడిగారు. ఒక్క నిమిషం కూడా సంకోచించకుండా నేను ''ఒక నవల'' అని జవాబిచ్చాను. ఆ సమాధానమయితే చెప్పాను కానీ, అలా చెప్పినందుకు నాకు నేనే ఆశ్చర్యపోయాను. ఎందుచేతనంటే ప్రపంచాలు, భాషలు, కాలము, సమాజాలు, సమూహాలు, రాజకీయాలు చుట్టి రావడానికి, ఎంత సంక్లిష్టంగానయినా ఉండడానికి రచయితకు నవలలో స్వేచ్ఛ ఉంటుంది. నవల అంతులేకుండా క్లిష్టంగా ఉండవచ్చు, పొరలు పొరలుగా ఒక సంఘటనకు మరొక సంఘటన అంటుకొని ఉండవచ్చు. అయితే అది వదులుగా, వేలాడబడినట్లుగా లేదా యాదచ్ఛికంగా జరిగినట్లు ఉండకూడదు.
నవల అంటే నాకు బాధ్యతతో కూడిన స్వేచ్ఛ. నిజమ యిన, ఏ సంకెళ్ళు లేని స్వేచ్ఛ - ఆజాదీ. ఈ పుస్తకంలోని కొన్ని వ్యాసాలు రచయిత తన నవలా ప్రపంచం నుండి, ఒక నవలా రచయిత్రి దక్కోణం నుండి పరిశీలించి వ్రాసినవి. ఆ నవలలో కొన్ని ఏ విధంగా కాల్పనికత, ప్రపంచంలో చేరిపోయి తానే ప్రపంచ మవుతుందో వివరిస్తాయి. ఈ వ్యాసాలన్నీ 2018 నుండి 2020 వరకు రెండేళ్ల వ్యవధిలో వ్రాసినవి. కానీ, ఆ రెండేళ్లు రెండు వందల సంవత్సరాల వలె గడిచినవి. ఈ కాలంలోనే కోవిడ్19 మనల్ని కాల్చిన చువ్వలతో వాత పెట్టింది. ప్రపంచం అంతా వంచన చెయ్యడానికి సిద్ధంగా ఉన్న ఒక ద్వారం గుండా నడుస్తున్నట్టుగా ఉండింది. వైరస్ అంతర్జాతీయ సరిహద్దులను అర్థం లేనివిగా మార్చింది, అన్ని దేశాల ప్రజల జనాభాలను బందీలుగా చేసింది, ఇంతవరకు ఎవరూ చెయ్యని విధంగా ఆధునిక ప్రపంచం మొత్తాన్ని చలనరహితం చేసింది. ఇంతవరకు మనం గడిపిన జీవితంపై భిన్నమయిన దృష్టిని సారించింది. ఆధునిక ప్రపంచాన్ని నిర్మించటానికి మనం అవలంబించిన విలువలను- మనం ఆరాధించటానికి, తిరస్కరించటానికి ఎంచుకున్న విలువలను - ఈ విలువలను ప్రశ్నించమని ఇది మనలను తొందర పెడుతున్నది. ఈ ద్వారం నుండి మనం మరో రకమయిన ప్రపంచంలోకి ప్రవేశించేటప్పుడు మనతో పాటు ఏది తీసి కెళ్ళాలో, ఏది ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాలో మనలో మనం ఆలోచించుకోవాలి. మన ఎంపిక చేసుకునే అవకాశం మనకు ఎప్పుడూ ఉండకపోవచ్చు కానీ, దాన్ని గురించి ఆలోచించకుండా ఉండే సదుపాయం మాత్రం మనకు లేదు. దీన్ని గురించి ఆలోచించటానికి మనకు గతించి పోతున్న ప్రపంచం గురించి మరింత లోతు అవగాహన కలిగి ఉండాలి. ఈ భూగోళానికి మనం చేసిన విధ్వంసం, తోటి మానవ మనం చేసిన అన్యాయం గురించి మనం నిష్పక్షపాతంగా ఒప్పుకోవాలి. ఈ వ్యాసాలు ఒకటి తప్ప మిగిలినవన్నీ ఈ మహమ్మారి మనపై దాడి చెయ్యక ముందు వ్రాసినవే కానీ, ఈ గందరగోళంలో ఒకింత స్పష్టత రావడానికి కొంతలో కొంతయినా ఉపయోగపడవచ్చు. అలా కాని పక్షంలో, మనం కూర్చున్న విమానం ఊహాత్మక రన్‌వే (ఎగిరే ముందు విమానం నడిచే బాట)లో ఎక్కడికో తెలియని గమ్యం దిశగా ఎగరడం కోసం వేచి ఉన్న సందర్భంలో ఈ వ్యాసాలు చరిత్రలో ఒక ఘట్టాన్ని నమోదు చేస్తూ వ్రాయబడ్డాయని కూడా అనుకోవచ్చు. భవిష్యత్ చరిత్రకారులకు సిద్ధాంత పరమయిన చర్చ కోసం కూడా ఉపయోగపడవచ్చు.
మొదటి వ్యాసం జూన్ 2018లో లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో సాహితీ అనుసజన గురించి నేను చేసిన డబ్ల్యు. జి. సెబాల్డ్ స్మారక ఉపన్యాసం, హిందుస్తానీ అని మనం భావించే భాషను ఏ రకంగా రెండు లిపులుగా, రెండు విభిన్న భాషలుగా గందరగోళ పరచి విభజించామో, ఈ ఉపన్యాసం దాన్ని గురించి. విచారకరంగా, కొంత ఏకపక్షంగా కూడా ఒక శతాబ్ద కాలానికి పైగా హిందూ జాతీయ వాదానికి ముందస్తు తయారీగా ఆ రెండింటిని హిందీ అని, ఉర్దూ అని అంటున్నాము (చాలా తప్పుగా హిందీ భాష హిందువులది గాను, ఉర్దూ భాష ముస్లింలది గాను గుర్తించబడుతున్నది).
2018వ సంవత్సరం నరేంద్ర మోదీ పరిపాలనకు, ఆయన హిందూ జాతీయవాద పార్టీకి చివరి సంవత్సరమే అని మనలో చాలా మందిమి అనుకున్నాము. ఈ సంపుటిలోని ప్రారంభ వ్యాసాలు కొన్ని ఆ అభిప్రాయాన్ని ప్రతిఫలిస్తాయి. 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని సర్వేలు మోదీ, ఆయన పార్టీ నాటకీయంగా ప్రజాదరణ కోల్పోతున్నాయని స్పష్టం చేశాయి. అదొక ప్రమాదకరమయిన పరిస్థితి అని మనకు తెలుసు. ఏదో ఒక ప్రచ్చన్న దాడి జరుగుతుందని లేదా యుద్ధమే జరగొచ్చని దాంతో దేశంలో ఎన్నికల వాతావరణం మారిపోతుందని చాలా మంది ఊహించారు. ఇతర విషయాలతో పాటు ఈ భయం గురించి రాసిందే ''ప్రమాదకర ప్రజాస్వామ్యంలో ఎన్నికల కాలం'' అన్న మరొక వ్యాసం (ఇది 3 సెప్టెంబర్ 2018 నాటిది). మనమంతా సామూహికంగా మన ఊపిరి బిగబట్టి చూస్తున్నాము. ఫిబ్రవరి 2019 నాడు, అంటే సాధారణ ఎన్నికలకు కొన్ని వారాల ముందు, ఆ దాడి జరగనే జరిగింది. ఆత్మాహుతికి సిద్ధపడ్డ ఓ వ్యక్తి బాంబు పేల్చుకుని నలభరు మంది భద్రతా సిబ్బందిని హతమార్చాడు. అది ఎవరి పేరునో చేసి ఉండవచ్చు లేదా కాకపోవచ్చు కూడా, కాని సరి అయిన సమయంలో ఆ సంఘటన జరిగింది. మోదీ, భారతీయ జనతా పార్టీ మళ్ళీ సునాయాసంగా అధికారం చేపట్టారు.
ఈ పుస్తకంలో చర్చించిన చాలా కదలికల ద్వారా కేవలం ఒక సంవత్సర కాలంలోనే భారతదేశం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. రాజ్యాంగంలో ప్రస్తావించిన లౌకిక, అందరినీ కలుపుకుపోయే గణతంత్ర రాజ్యంగా రూపొందే విషయంలో వైఫల్యం చెందింది. మనలో చాలా మంది స్వప్నించిన ఆ గణతంత్ర రాజ్యం పునాదులే కదిలిపోయే ప్రమాదంలో పడింది (కాని, మనం ఆ స్వప్నాన్ని కలగనడం మానలేదు, మనం కూడా - ఆ విషయం ఈ పుస్తకంలో స్పష్టం చేసాను). ఫాసిజం మౌలిక వ్యవస్థ మన కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉన్నది. కోవిడ్ మహమ్మారి ఊహకందని రీతులలో ఫాసిజం క్రమాన్ని వేగవంతం చేస్తున్నది..
నేను ఈ ఉపోద్ఘాతం వ్రాయడం మొదలు పెట్టే సమయానికి 2020 ఫిబ్రవరి నెల చివరి వారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆయన కుటుంబంతో సహా భారత్‌లో అధికార పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటన కూడా కోవిడ్ మహమ్మారి సింహ ద్వారం గుండానే జరిగింది. 30 జనవరి నాడు భారత్‌లో కోవిడ్-19 మొదటి కేసు బయట పడ్డది. ఎవ్వరూ, ప్రభుత్వంతో సహా ఎవ్వరూ, పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికే జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా కోల్పోయి 200 రోజులయ్యింది. ప్రత్యేకత కోల్పోయినప్పటి నుండీ జమ్మూ కాశ్మీర్ సమాచార దిగ్బంధంలోనే కాలం గడుపుతూ ఉంది. అప్పటికి సరికొత్త ముస్లిం వ్యతిరేక పౌరసత్వ భావనలు చట్ట రూపం ధరించి రెండు నెలలయింది. ఆ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని చాలా మంది ఘోషించారు. ఆ చట్టానికి వ్యతిరేకంగా లక్షలాది మంది ఉద్యమకారులు రోడ్ల మీదికి వచ్చారు. మోదీ, ట్రంప్ మాస్క్‌లు ధరించిన ఒక పెద్ద గుంపు ముందు ఉపాన్యాసం ఇస్తూ డోనాల్డ్ ట్రంప్ భారతీయులు క్రికెట్ ఆడతారని, దీపావళి పండుగ జరుపుకుంటారని, బాలీవుడ్ సినిమాలు తీస్తారని తెలియ పరిచారు. తెర వెనక డోనాల్డ్ ట్రంప్ మూడు వందల కోట్ల (3 బిలియన్ డాలర్లు) విలువ గల ఎంఎచ్ - 60 (వీన- 60) హెలికాఫ్టర్లను అమ్మిపోయాడు. అప్పుడప్పుడూ భారతదేశం అలా బహిరంగంగా కించపరచుకుంటుంది.
ఢిల్లీ హోటల్లోని అధ్యక్షునికి కేటాయించిన విలాసవంతమయిన గదికి, అధ్యక్షునితో మోదీ చర్చలు జరిపిన హైదరాబాద్ హౌస్‌కు సమీపంలోనే ఢిల్లీ మండుతూ ఉండింది. నగరం ఈశాన్యం దిక్కున శ్రామికుల బస్తీలలో నివసించే ముస్లింలపై దాడులు జరుగుతూ ఉండినయి. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొత్త పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత ధర్నా చేస్తున్న ముస్లిం మహిళలను స్పష్టమయిన రీతిలో రాజకీయ నాయకులు బెదిరిస్తూనే ఉన్నారు. తమపై దాడిని వ్యతిరేకిస్తూ ముస్లింలు ఎదురుదాడి ప్రారంభించారు. ఇళ్ళు, దుకాణాలు, మోటారు వాహనాలు దగ్ధమయ్యాయి. ఒక పోలీసుతో సహా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తుపాకీగుళ్ళు తాకి మరెంతో మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇంటర్నెట్లో భయోత్పాతం కలిగించే వీడియోలు చక్కర్లు కొట్టాయి. ఒక వీడియోలో తీవ్రంగా గాయపడిన ముస్లిం యువకులను నడిరోడ్డు మీద ఒకళ్ళ మీద ఒకళ్ళను కుప్పగా పడుకోబెట్టి జాతీయ గీతం పాడమని యూనిఫామ్‌లో ఉన్న పోలీసులు బలవంత పెడుతున్నారు. (తదనంతరం అందులో ఒకరు, ఫైజాన్ అన్న వ్యక్తి చనిపోయాడు. ఆయన్ను పోలీసులు ఎలా చిత్రహింసలు పెట్టింది, ఎలా ఒక పోలీసు తన చేతిలో ఉన్న లాఠీని అతని నోట్లో గుచ్చి చంపాడో హఫింగ్టన్ పోస్ట్ అన్న పత్రిక ఒళ్ళు గగుర్పొడిచే విధంగా వార్తను ప్రచురించింది).
తన చుట్టూ సుళ్ళు తిరుగుతున్న ఈ ఘోరాలను గురించి ట్రంప్ ఒక్క మాట మాట్లాడలేదు. పైగా, నరేంద్ర మోదీకి ''జాతి పిత'' అని బిరుదు ప్రదానం చేసాడు. ఇంతవరకు ఆ బిరుదు గాంధీకి ఉండేది. .
ట్రంప్ వెళ్లిపోయిన తర్వాత కూడా హింస ఆగలేదు. మరికొన్ని రోజులు కొనసాగింది. యాభయి మందికి పైగా ప్రజలు మత్యువాత పడ్డారు. తీవ్రమయిన గాయాలతో 300 మందికి పైగా ఆసుపత్రులలో చేరాల్సిన పరిస్థితి. వేలాది మంది ప్రజలు కాందిశీకుల శిబిరాలకు తరలించబడారు. పార్లమెంట్లో హోమ్ శాఖా మంత్రి తన మీద తాను ప్రశంసా జల్లులు కురిపించుకున్నాడు. అలాగే పోలీసులను కూడా పొగిడాడు. ముసిముసి నవ్వులు నవ్వుతున్న వారి మద్దతుదారులు ఉత్సాహ పరుస్తూ బల్లలు చరుస్తుండగా ఇతర రాజాకీయ నాయకులు ఉపన్యసించారు. వారి ఉపన్యాసాలలో హింసను ప్రేరేపించినందుకు ముస్లింల పైనే నిందారోపణ చేశారు. అంటే ముస్లింలు వారిపై వారే దాడి చేసుకున్నారన్న మాట! వారే వారి ఇళ్లను, దుకాణాలను దగ్ధం చేసుకున్నారన్న మాట! వారి బస్తీలలో పారే మురికి నీటి గుంటలలో వారి శరీరాలను వారే పారేసుకున్నారన్న మాట! ప్రధాన జన జీవన స్రవంతిలో పలుకుబడి గలిగిన ప్రసార సాధనాలు ఆ హింసను ''హిందూ ముస్లిం కొట్లాట''గా చిత్రీకరించడానికి తమ వంతు కషి చేశాయి. నా ఉద్దేశ్యంలో అది సాయుధ ఫాసిస్ట్ ముఠా ప్రణాళికాబద్ధంగా ముస్లింలకు వ్యతిరేకంగా, ముస్లింలను మూకుమ్మడిగా హతమార్చడానికి చేసిన ప్రయత్నం.
ఒక పక్క మురికి గుంటల్లో మత దేహాలు బయట పడుతుండగా భారత ప్రభుత్వ అధికారులు కోవిడ్-19 వైరస్ గురించి తమ మొట్టమొదటి సమావేశం నిర్వహించారు. మార్చ్ 24న మోదీ దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించాడు. అదే సమయంలో ఘోరమయిన రహస్యాలు ప్రపంచం అంతా చూస్తుండగా భారత దేశం నుండి పొంగి పొర్లాయి.
ముంగిట ఏం పొంచి ఉన్నది?
ఏమున్నది! భవిష్యత్ జగత్తు గురించి మన కల్పనాత్మక ఊహలు తప్ప!
(ఆజాదీ పుస్తక ఉపోద్ఘాతం నుంచి)
- అరుంధతీరాయ్