Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్ఞాపకాలన్నీ గతాలే కాదు. కొన్ని వర్తమానంలో కూడా మనల్ని వెన్నంటే ఉంటాయి. అలాంటి ఓ సజీవమైన జ్ఞాపకం కాతోజు వెంకటేశ్వర్లు. ప్రజాకళల రాదారిలో విముక్తిగీతమై మారుమోగిన క్షతగాత్రుడు. చీకటి తీరాన నిలబడి రేపటి ఉదయాలను కలగన్న కళాపుత్రుడు. చెరసాలలను ధ్వంసం చేసి స్వేచ్ఛను జనసామాన్యానికి సొంతం చేయాలని తపించినవాడు. ఈ తెలంగాణ నేల మీద మానని గాయాల సంభాషణ అతడు. సాటి మనుషుల కష్టాలకు జీవితమంతా విలపించిన సున్నిత హృదయుడు. ఆ కష్టాల కారకులపై కోపంతో ఎరుపెక్కిన సృజనకారుడు. ప్రధానంగా అతడొక చిత్రకారుడు. ఆ తరువాత కవి, కథకుడు, కళా దర్శకుడు. ఇంకా నటుడూ, గాయకుడు కూడా... అన్నిటికీ మించి సామ్యవాద స్వాప్నికుడు.
కడదాకా విప్లవ రాజకీయాలతో, సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలతో పెనవేసుకుని సాగిన జీవితమతనిది. విముక్తిదారుల వెతుకులాటలో వాన చినుకుల్నీ, మండుటెండల్నీ, లేగదూడల ఆటల్నీ, కూలితల్లుల పాటల్నీ గుండెల్లో నింపుకుని, రంగుల్లోకి అనువదించుకుని, తన కాన్వాస్‌పై అద్భుత దృశ్యాలుగా ఆవిష్కరించినవాడు. సిరిమల్లె చెట్టుకింది లచ్చుమమ్మల్నీ, కొడవళ్లు చేపట్టిన చెల్లెమ్మల్నీ అనేకానేక భావాలకు ప్రతీకలుగా మొలకెత్తించినవాడు. తన కుంచెను కొలిమిగజేసి జీవితాలను నినాదాలుగా రగిలించినవాడు.
అతడికి గమ్యమెంత దూరమో స్పష్టంగా తెలుసు. అది ఎడతెగని ప్రయాణమనీ తెలుసు. నడిచే దారిలో ముళ్లూ రాళ్లూ ఉంటాయనీ తెలుసు. తెలిసీ తనలాగే ఎంచుకున్న మార్గంలో సాగుతున్న వీరుల తొవ్వలకు రంగులద్దిన చిత్రకారుడతడు. నీడలేని పేదలూ, బువ్వలేని మనుషులే ఆప్తులుగా, ఆకలీ కన్నీరన్నవి లేని ఓ కొత్త ప్రపంచాన్ని గానం చేసిన సాంస్కతిక సైనికుడతను. మా భూమి, రంగుల కల, విముక్తి కోసం వంటి చిత్రాలు, కళా దర్శకుడిగా ఆయన ప్రతిభకు తార్కాణాలు. సందర్భానికీ, సన్నివేశానికి ప్రాణం పోసేలా వెండితెర మీద ఆర్ట్ డైరెక్షన్‌కు కొత్త సొబగులద్దాడు. మానవశ్రమలోని విభిన్న పార్శ్వాలను, ప్రకతి పరిణామాలను స్పశిస్తూ చిత్రలేఖనంలో ఆయన సృష్టించిన ఒరవడి తన ప్రజాదృష్టికి ప్రతీక. విస్తతమైన లోకానుభవం, నిశితమైన పరిశీలనతో శ్రామికజన జీవితాన్ని కొన్ని వందల పుస్తకాలపై ముఖచిత్రాలుగా ప్రతిష్టించాడు. నటుడిగా రంగస్థలంపైనా అతడిది అపారమైన అనుభవం. ఇక తన సిరాచుక్కలతో చెమట చుక్కలకు పట్టం గట్టిన అచ్చుకునోచని అభ్యుదయ రచనలెన్నో... తాను పుట్టిన నేల, అనుభవించిన జీవితం, పొందిన జ్ఞాపకాలే అతని ఈ సృజనకు ప్రేరకాలయ్యాయి. సమాజంలో ఏ విద్యనైనా సజనాత్మకం చేయాలంటే దానినొక క్రమ పద్ధతిలో నిర్వహించాలి. ఆ ఒడుపు తెలిసినప్పుడే అదొక సజనాత్మక కార్యకలాపం అవుతుంది. ఇలా ఒక వ్యక్తి ఎన్ని రంగాల్లో ఒకేవిధంగా రాణించగలడన్నది పూర్తిగా అతని సంసిధ్ధత, శక్తిసామర్థ్యాలపైనే కాకుండా అతని మానసిక సహనశక్తిపై కూడా ఆధారపడి ఉంటుందనడానికి అతడొక ఉదాహరణ.
కానీ, ఎంతటి బహుముఖమైన కృషి చేసినా రావలసినంత పేరు రాలేదు. ఎందుకంటే, ప్రజలకు నిత్యనూతనమైన చైతన్యాన్ని అందించాలన్న తపనే తప్ప, తన ప్రతిభను ప్రచారం చేసుకోవాలన్న యావకు దూరంగా బతికిన ప్రజాకళాకారుడు కాతోజు వెంకటేశ్వర్లు. సర్కారువారి పురస్కారాల కోసం కాకుండా, శ్రామిక ప్రజల సంకెళ్లను తెంచాలన్న లక్ష్యంతో సాగాడు. తన చుట్టూ అలుముకున్న జనజీవితంలోని దుఖాన్ని చూసి చలించాడు. తన కళద్వారా ఆ దుఖితులకు ఓదార్పును, చైతన్యాన్ని అందించాడు. శ్రామికజన సౌందర్యాన్ని, చెమటచుక్కల పరిమళాన్ని తనివితీరా ఆస్వాదించాడు. అందుకేనేమో...! అతని రంగులనిండా కన్నీటి జలపాతాలే. అతడు గీసిన ముఖచిత్రాలన్నీ రగిలే రణ నినాదాలే.
ఆయన కన్నుతెరిచింది కృష్ణా, మూసీ సంగమక్షేత్రం వాడపల్లి(నల్లగొండజిల్లా)లో. కన్ను మూసింది రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లో. ఈ జనన మరణాలకు మధ్య ఆయన ఎంతమందిని కవులుగా, కళాకారులుగా తీర్చిదిద్దారో..! ఎంతమందిని మానవతావాదులుగా మలిచారో..!! విప్లవ సాహిత్యంతో ఎక్కువ సాన్నిహిత్యం ఉన్నా, అభ్యుదయ శక్తులందరినీ ఆలింగనం చేసుకున్నాడు. ఉద్యోగరిత్యానైతేనేమీ, ఉద్యమ కర్తవ్యంలో భాగంగానైతేనేమీ ఆయన నడయాడిన ప్రతిచోట సహచరులను సంపాదించుకున్నాడు. ప్రతిభ ఎక్కడ ఉన్నా తట్టిలేపడం, ప్రోత్సహించడం ఆయనలోని ఓ గొప్ప లక్షణం. ఆ లక్షణం వల్లనే ఆయన తన సృజనను కొనసాగించడం కంటే, ఎందరినో తీర్చిదిద్దడంలోనే ఎక్కువ కాలాన్ని వెచ్చించారంటే అతిశయోక్తి కాదు. అలా ఆయన చేతుల్లో తయారైన సృజనకారులెందరో...! వారిలో అనేకులు నేడు కళాసాహిత్య రంగాల్లోనే కాదు, పత్రికారంగంలో వ్యాసకర్తలుగా, సినీరంగంలో కళాదర్శకులుగా, గేయరచయితలుగా రాణిస్తున్నారు. తనకు వచ్చిన అవకాశాలను కూడా వారికి అందించి అండగా నిలిచిన సందర్భాలెన్నో...!
ఇలా జీవితంలో ఆయన ప్రయాణమంతా అరుణకాంతులమయం. పుట్టిన ఊరు వాడపల్లి, పక్కనేవున్న దామరచర్లలలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగించి, ఉన్నత విద్యకోసం నల్లగొండకు చేరే క్రమంలోనే తనను తాను తెలుసుకోవడం మొదలు పెట్టాడు. చదువు ముగిసేనాటికి, నడవాల్సిన దారినెంచుకున్నాడు. అనేక రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల ద్యారా, వామపక్షభావాల అధ్యయనం ద్యారా, మార్క్సిస్టు ప్రాపంచిక ధృక్పథాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆ వెలుగులోనే ప్రజాపక్షం వహించే సృజనకారుడిగా, అంతకుమించిన మానవతావాదిగా ఉనికిలోకొచ్చాడు. కాబట్టే, ముందు టీచర్‌గా, ఆ పైన లెక్చరర్‌గా ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు ఉద్యమకారుడిగానూ జీవితాన్ని ఉజ్వలంగా కొనసాగించగలిగాడు. ప్రజా పోరాటాలకు, సామాజిక ఉద్యమాలకు అండగా తన కళను పదునైన ఆయుధంగా సంధించగలిగాడు. మనుషుల మధ్య మొలిచిన అడ్డుగోడల్ని కూల్చే విధ్వంసి అతడు. బతికినంతకాలం అతని తపనంతా మనుషుల్ని సంఘటితం చేయడమే. హక్కుల పోరాటాలను అక్కున చేర్చుకోవడమే. తను నడయాడిన నేలమీదే కాదు, ఈ అనంత విశ్వంలో నిర్విరామంగా పరిభ్రమించే సమస్త భూగోళం మీదా అంతులేని ప్రేమ తనది. విశ్య మానవాళికీ దోపిడీ నుండి విముక్తి కావాలన్న విప్లవ కాంక్ష తనది. అందుకే అతని జీవితమంతా అలజడే. ఎక్కడా నిలువనీయని ప్రవాహమే.
''సమాజం పట్ల బాధ్యత మనిషికొక వివేచనని స్తుంది. జీవితానికో లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. కళా సాహిత్య వ్యాసంగం మన ఏకాగ్రతకు తీక్షణతనిస్తుంది. మన అనుభవాలనూ, భావాలనూ స్పష్టంగా వ్యక్తపర్చటానికి కావల్సిన తర్ఫీదునిస్తుంది.'' అని చెప్పటమే కాదు, చేసి చూపించిన ధన్యజీవి ఆయన. అందువల్ల, కాతోజు వెంకటేశ్వర్లు ఎప్పటికీ గతం కాదు. నెత్తురు కారుతున్న వర్తమానాన్ని రేపటితో గుణించి, భవిష్యత్తుకు కొన్ని ఆశలను, ఆశయాలను మనచేతుల్లో పోసి మన ''దారి''ని సజీవం చేసిపోయాడు. కులమూ, మతమూ, పెట్టుబడీ, మార్కెట్టూ, రాజ్యమూ... దేనిచేతా పీడింపబడని ఓ కొత్త మనిషిని నిర్మించే కర్తవ్యాన్ని మన ముందు ప్రతి పాదించి పోయాడు. ఆ కర్తవ్య సాధనలో అతనెప్పుడూ వర్తమానమే. అతని జ్ఞాపకాలెప్పుడూ స్ఫూర్తిదాయకమే. అయితే, తెలంగాణా మాగాణంలో ఇంతగా రాణించినా అతడు విస్మరణకు గురికావడం విచారకరం. ఆయన విలువైన కృషిని వెలుగులోకి తేవడం, ఆయనను స్మరించుకోవడం నేటి మన కర్తవ్యం.
(జులై 2 జయంతి సందర్భంగా...)
- రమేష్ రాంపల్లి 9550628593