Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను బయటకు వెళ్తున్నాను
నన్ను ఏ క్షణమైనా దేశద్రోహినని ప్రకటించొచ్చు
శవమై తిరిగి రావచ్చు, గుర్తు తెలియని శవం కావచ్చు
లేదా ఏ మంటల్లోనో నేను తగలబడి పోవచ్చు
నేను వస్తేనే తిరిగి వచ్చాననుకో
కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూడకు
నేను ముస్లింనని వాళ్లకు తెలియదు
నా నెత్తి మీద టోపీ, గడ్డం రెండూ లేవు
ఒంటిమీద లాల్చీ పైజామా లేదు
నాలుక మీద సూరా లేదు
చివరాఖరికి వాళ్లు నా పేరు అడగొచ్చు
అబద్ధం చెప్పి తప్పించుకుందామనుకుంటాను
వాళ్లు ప్యాంటు విప్పి నా అంగాన్ని పరీక్షకు నిలుచోబెట్టొచ్చు
మన ఇంటి గోడలకు ఆకుపచ్చ రంగేసి వుంది
వేప చెట్టుకు నెలవంక పువ్వేసిన జండా ఎగురుతుంది
ఎప్పుడైనా వాళ్ళు మన వాడల్ని,
ఇళ్ళని వెతుక్కుంటూ రావచ్చు?!!
ఏదెప్పుడైనా జరగొచ్చు!
నువ్వు, పిల్లలు జాగ్రత్త
నేను బజారులో ఉన్నాను
రావచ్చు రాకపోవచ్చు
నా కోసం కంచంలో అన్నం పెట్టి ఎదురుచూడకు
నీ కలలు ఎప్పుడైనా కల్లలైపోవచ్చు
నీ చేతి గాజులు ఎప్పుడైనా పగిలిపోవచ్చు
నా అంతిమ యాత్ర సరంజామా
అల్మారాలో భద్రంగానే దాచే వుంచాను
ఈ దేశం వాణ్ణి కానని ప్రకటిస్తారు
ముస్లింలను ఖననం చెయ్యడానికి
చోటులేదు తగలెయ్యమంటారు
దేశం సరిహద్దులకావల విసిరేయమంటారు
పట్టిన పట్టు విడవకుండా
నేను పుట్టిన గడ్డ మీదే నన్ను ఖననం చెరు
పిల్లలకు నా మాటగా చెప్పు
కులంగా పెరగొద్దని,
మతంగా కాకుండా
మనుషులుగా ఎదగాలని చెప్పు
చివరిగా ఇంకో మాట ఇలా కూడా చెప్పూ
నేను పోయాక ఈ మట్టిని,
ఈ దేశాన్ని అసహ్యించుకోవద్దని చెప్పు
అమ్మగా మనుషుల్ని ప్రేమించడం నేర్పించు
దేశాన్ని అమ్మగా చూస్తారు
- ఇబ్రహీం నిర్గుణ్