Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పద్మశ్రీ' రేకందార్ (బాబ్జి)నాగేశ్వరరావు
దక్షిణ భారత నాటకరంగానికి మకుటాయ మానంగా 130 సంవత్సరాలుగా వెలుగొందుతున్న ఏకైక సంస్థ సురభి నాటక మండలి. వినోద విజ్ఞానాన్ని అందించే గొప్ప నాటక సంఘం సురభి. దాదాపు 137 సంవత్సరాల కిందట వనారస గోవిందరావు సారధ్యంలో ఈ సంస్థ ఆవిర్భవించింది. సురభి ఉమ్మడి కుటుంబంలో రేకందార్ కుటుంబం ఒకటి. శ్రీ వేంకటేశ్వర నాట్యమండలి స్థాపకుడు, సంస్థకు తొలిగా 'పద్మశ్రీ' పురస్కారాన్ని అందుకొన్న నట - దర్శక ప్రయోక్త రేకందార్ నాగేశ్వరరావు (బాబ్జీ). తన 73వ ఏట జీవిత రంగస్థలం నుండి 9జూన్ 2022 న నిష్క్రమించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలోని సురభి గ్రామంలో ఓ భూస్వామి ఇంట పెళ్ళి సందర్భంలో వారి ప్రదర్శన ప్రారంభమైంది.
తెలుగు నాట వివిధ ప్రాంతాల్లో సురభి కుటుంబాలు... అద్భుతంగా చక్కటి సీనరీ సెట్టింగ్‌లతో, మిరుమిట్లు గొలిపే లైటింగ్, డి.జె.సౌండ్ సిస్టమ్ తలదన్నే శ్రావ్యమైన సంగీతంతో సురభి నాటకాలు సాగేవి. మహారాష్ట్ర నుంచి వలసవచ్చి ఆంధ్రలో పలు ప్రాంతాల్లో వీరు స్థిరపడి ప్రదర్శనలిస్తూ వృత్తి నాటక జీవనం సాగించేవారు. ఇప్పుడు వీరిలో డాక్టరేట్స్, ఇంజనీర్స్, ఉద్యోగస్తులు ఉన్నారు. 1949లో విజయనగరం జిల్లా గణపతి నగరంలో రేకందార్ నాగేశ్వరరావు జన్మించారు. తన నాల్గవ యేటనే నాటక రంగ అరగ్రేటం చేసారు.
శ్రీరామ, శ్రీకృష్ణ, వీరబ్రహ్మం, నక్షత్రక, కార్యవర్థి మొదలైన పాత్రల్లో నాగేశ్వరరావు జీవించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సురభి సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర నాట్యమండలికి 42 సంవత్సరాలుగా కార్యదర్శిగా పనిచేసారు. దాదాపు 77 సంవత్సరాల చరిత్ర గల సంస్థ. నాగేశ్వరరావు దార్శనిక ప్రతిభకు శ్రీరామరాజ్యం, శ్రీకృష్ణ లీలలు, వీరబ్రహ్మం, బాల నాగమ్మ, జై పాతాళభైరవి లాంటి నాటకాలు గీటురాయిగా నిలుస్తాయి. సురభి నాటకం పిల్లల్ని - పెద్దల్ని బాగా అలరిస్తుంది. తొలినాళ్ళలో తెలంగాణ వాసి చందాల కేశవదాసు సురభి సంస్థకు నాటకాలు, పాటలు,పద్యాలు రాసారు. సురభి వందేళ్ళ ప్రస్థానం తరువాత 6, 7 సంస్థలకే పరిమితమైన రోజుల్లో బి.వి.కారంత్ మార్గదర్శనంలో డైరెక్షన్లో పునర్జీవించి రాజధానిలో పాదం మోపాయి. కె.వి.రమణాచారి, కె.శోభానాయుడు లాంటి వారి కృషితో కూకట్‌పల్లిలో సురభి కాలనీ ఏర్పడటం, లలిత కళా తోరణంలో ప్రదర్శనశాల ఏర్పడటం జరిగాయి.
రసరంజని సంఘం లాంటి సంస్థల తోడ్పాటు... వారి చరిత్రను పుస్తకంగా తేవడం గొప్ప విషయాలు. హరిశ్చంద్ర, లవకుశ, మాయాబజార్, అనసూయ, వీరబ్రహ్మంగారి చరిత్ర, బాలనాగమ్మ, చింతామణి, బొబ్బిలి యుద్ధం, రంగూన్ రౌడి లాంటి నాటకాలు మన హైదరబాద్‌లో సురభి సంస్థలు అద్భుతంగా ప్రదర్శించేవి. వనస్థలిపురం, నాంపల్లి, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో సురభి నాటకాలు నేటికీ ప్రదర్శింపబడుతూనే వున్నాయి. వీటి ప్రదర్శనల వెనుక అద్భుత కృషి రేకందర్ నాగేశ్వరరావుదే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కొక్క నాటకంలో దాదాపు 70 మంది కళాకారులు, 3 నుంచి 4 గంటల సేపు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తారు. ''ఆంధ్రనాటక కళాపరిషత్'' ఆవిర్భావంలోనూ సురభి కృషి ఉంది (వనారస గోవిందరావు).
సురభి రేకందర్ నాగేశ్వరరావు నేతృత్వంలో 150 మంది కళాకారుల బృందం ఫ్రాన్స్‌లో 60 రోజుల పాటు నాటకాలు ప్రదర్శించి- తెలుగు నాటకాన్ని అంతర్జాతీయ వేదికలపై అద్భుత కవాతు చేయించిన కళారంగ ఋషి రేకందర్ నాగేశ్వరరావు.్ణ బాబ్జీగా ప్రఖ్యాతులైరి.
సురభిలోని శ్రీ వేంకటేశ్వర నాట్యమండలికి 42 సంవత్సరాలు కార్యదర్శిగా, సురభి ఫెడరేషన్ ఉమ్మడి బ్యానర్ అయిన ''సురభి నాటక కళా సంఘా''నికి 34 సంవత్సరాలు కార్యదర్శిగా సేవలందించిన నాగేశ్వరరావు ను 2011లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ''విశిష్ట అవార్డ్'' ఇచ్చి సత్కరించింది. 2013లో భారత ప్రభుత్వం 'పద్మశ్రీ'తో సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం ప్రదానం చేసింది. అలాగే బళ్ళారి రాఘవ అవార్డ్ అందుకున్నారు బాబ్జి. పలు సాంస్కృతిక సంస్థల పురస్కారాలు పొందారు. సురభి నాగేశ్వరరావు అకాలమృతి సురభి నాటక సంస్థలకేగాక, యావత్ తెలుగు నాటక రంగానికి తీవ్రలోటు. ఆ నట దర్శక ప్రయోక్తకు కళాంజలులు.
- తంగిరాల చక్రవర్తి, 9393804472