Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పునరుజ్జీవన ఉద్యమానికి 19వ శతాబ్దం కేంద్ర బిందువు. ఇది ప్రాచీన ఆధునిక భావాల మధ్య ఘర్షణకు సమరక్షేత్రం. స్వాతంత్య్ర పోరాట ఆదిఘట్టాల అవతరణకు ఒక మహా వేదిక. సంస్కరణ వాదుల ఉద్యమాల మూలంగా హిందూ మతం, సమాజం సంఘర్షణకు లోనవుతున్న కాలం కూడా.
దేవేంద్రనాథ్ టాగోర్ రూపంలో ఒక తత్వవేత్త, ఒక సంస్కరణ వాది, ఒక జమీందారు యజమానిగా ఉన్న గొప్ప ఇంటి వారసుడుగా రవీంద్రనాథ్ టాగోర్ (1861 - 1941) జన్మించాడు. ఈ సంక్లిష్ట వాతావరణంలో క్రమక్రమంగా భారతీయ ఆత్మ ఆయన అనుభవంలోకి వచ్చింది. ఈ ఆత్మను ఆవిష్కరిస్తూ చేసిన రచనల మూలంగా చిత్రలేఖన కళా సృజనల మూలంగా, సంగీత కృతులను ఆవిష్కరిస్తూ చేసిన రచనల మూలంగా సమకాలికులెవరూ అందుకోలేని వ్యక్తిత్వాన్ని సాధించాడు టాగోర్. 'గీతాంజలి' కి వచ్చిన నోబెల్ (1913) బహుమతి, అనితర సాధ్యమైన విశ్వభారతి (1921) సంస్థ ఆయనను మహా వ్యక్తిని చేశాయి. రెండు దేశాల జాతీయ గీతాల కవిగా కూడా అరుదైన కీర్తిని గడించాడు.
ప్రముఖ రచయిత చింతపట్ల సుదర్శన్ టాగోర్ కథలలోంచి పదహారింటిని తెలుగులోకి అనువదించి 'శిలావిలాపం' పేరిట ప్రచురించారు. రచయితతో అనువాదకుని ప్రయాణం ఎప్పుడూ ఆసక్తిదాయకంగా ఉంటుంది. పాఠకుడి కంటే ఎక్కువగా అనువాదకుడే మూల రచనతో సాన్నిహిత్యం నెరపవలసి ఉంటుంది. ప్రతి మాటను, ప్రతి వాక్యాన్ని, ప్రతి పాత్రనూ, ప్రతి సంఘటనను అనువాదకుడు పలకరించుకుంటూ ముందుకు సాగవలసి ఉంటుంది. రంగూ, రుచీ, వాసన పసిగడుతూ మూల భాషలో ఉన్న ప్రపంచాన్ని లక్ష్య భాషలో సృజిస్తూ సాగవలసి ఉంటుంది. సాధారణార్థంలో అనువాదం చేయటం వేరు, మూలంలోని ప్రాణశక్తిని ఊపిరిగా పీల్చుకుంటూ పున:సృజన చేయటం వేరు. చింతపట్ల సుదర్శన్ ఆంగ్ల ఉపన్యాసకుడిగా పని చేసిన వారు. అన్ని ప్రక్రియలను అనువాదం చేసినవార. మిల్టన్ 'ప్యారడైజ్ లాస్ట్'ను, జేమ్స్ జాయిస్ 'ఏ పోర్ట్రెట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ యాజ్ యె యంగ్ మాన్' హరివంశ రారు బచ్చన్ 'మధుశాల'- ఇంకా చాలా రచనలను తెనిగించిన అనుభవం ఉంది. ఆ శక్తియుక్తులు పునాదిగా ఆయన టాగోర్ రాసిన 16 కథలను ఆంగ్ల మాధ్యమం ద్వారా తెలుగులోకి అనువదించారు. ఒకటి రెండు సందర్భాలలో తప్ప తక్కిన సందర్భాలలో అనువాదం సాఫీగా సాగింది. మూలంలోని సంక్లిష్ట వాక్యాలను తెలుగులో సరళ వాక్యాలుగా మార్చటంలో, అవసరమైన చోట వాక్యాల క్రమంలో కొద్దిగా కొద్దిపాటి మార్పులు చేయటంలో, అక్కడి జాతీయాలను, సాంస్కృతిక సందర్భాలను మనకు దగ్గరి జాతీయాలుగా, సాంస్కృతిక సందర్భాలుగా మార్చటం వంటివి కనిపిస్తాయి. పాఠకుణ్ణి బాగా ఆకర్షించేది సుదర్శన్ సజీవమైన ధారాళమైన తెలుగు భాష. సంక్షిప్తీకరణ కూడా అక్కడక్కడ కనిపిస్తుంది.
టాగోర్ కథల్లో పునరుజ్జీవన కాలం నాటి సమాజం కనిపిస్తుంది. 'పరిత్యాగం' కథను చూడండి. కథానాయకుడు ఒక యువతిని బాగా ఇష్టపడతాడు. కథానాయకుని తండ్రి మీద పగ తీర్చుకోవాలనుకున్న ఒక పెద్ద మనిషి ఆ యువతి బ్రాహ్మణేతర కులాన్ని, బాల వితంతువు అన్న నిజాన్ని దాచి బ్రాహ్మణుడైన కథానాకునికిచ్చి పెళ్ళి జరిపిస్తాడు. బ్రాహ్మణులలో కులం పట్టింపు తీవ్రంగా ఉన్న రోజులవి. నిజం నిదానంగా తెలుస్తుంది. మొదట్లో తాను మోసపోయానని భావించిన యువకుడు తన తండ్రి మూలంగా సంఘర్షణకు గురవుతాడు. కాని పునరుజ్జీవన ఉద్యమ ప్రభావం వల్ల యువకులలో వితంతు వివాహాల పట్ల సానుకూల వైఖరి, కులాతీత దృష్టి ఏర్పడున్న సంధి కాలం కావటం వల్ల కథానాయకుడు తండ్రిని ఎదిరించడానికి, కాపురం నిలబెట్టుకోవడానికి స్థిరనిర్షయం తీసుకుంటాడు. మానసిక సంఘర్షణను గొప్పగా చిత్రించిన కథ ఇది.
కథా రచయితగా అట్టడుగు జీవితానికి దగ్గరగా ఉన్నప్పుడే జీవిత చిత్రణ సజావుగా సాగుంతుంది. ఇందుకు 'యజమాని కొడుకు' అన్న కథ మంచి ఉదాహరణ. యజమాని చిన్నారి కొడుకు బాగోగులు చూసుకునే నౌకరు రామ్చరణ్. క్షణికమైన అజాగ్రత్త వల్ల ప్రమాదవశాత్తు పిల్లవాడు నదిలో మునిగి చనిపోతాడు. తల్లిదండ్రులు నౌకరే ఏదో చేశాడని అనుమానిస్తారు. నౌకరు తన ఊరికి వచ్చేస్తాడు. తన పిల్లవాణ్ణి ధనవంతుని పిల్లవాడిగానే పన్నెండేండ్లు పెంచుతాడు. చదివిస్తాడు. పాత యజమాని దగ్గరకు వచ్చి పిల్లవాడు వాళ్ళ కొడుకేనని తానే చనిపోయినట్లు అబద్దమాడానని చెప్పి అప్పగిస్తాడు. వాళ్ళు నమ్మకపోవటానికి కారణమేమీ కనిపించదు. ఆ పిల్ల వాణ్ణి స్వీకరిస్తారు. కాని నౌకరును మాత్రం పిల్లవాడితో ఉండటానికి వీలులేదని వెళ్ళగొడతారు. నిజానికి నౌకరు తన కొడుకును వాళ్ళ కొడుకని చెప్పి ఇవ్వటం ఒక త్యాగం. తన కొడుకు ధనవంతునికొడుకుగా 'డీక్లాసై' పెరుగుతూ ఉండటాన్ని కళ్ళారా చూడాలని, ఆ తర్వాతి పెంపకంలో వాడికి తన సేవలందించి సంతృప్తి చెందాలని కోరుకుంటాడు. కాని అతడా ఇంటినుండే బహిష్కృతుడవుతాడు. నౌకరు యజమానిని నమ్మాడు. ఇది శ్రామిక వర్గ స్వభావం. కాని యజమాని నౌకరును నమ్మలేదు. ఇది భూస్వామి స్వభావం. నౌకరు అబద్ధం అనే పునాది మీద తన శేష జీవితం గడపాలనుకోవటాన్ని టాగోర్ సమర్థించక పోవటం ఈ కథలోని మరో కోణం. దీంతో వేలాది మంది అనాథలలో ఒక అనాథగా నౌకరు మిగిలి పోతాడు. ఈ కథలోని నాటకీయ శిల్పం ప్రశంసనీయం. ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టిన టాగోర్ శ్రమజీవి మనస్తత్వాన్ని నిరూపించే కథలు రాయటం గమనార్హం.
'కాబూలీవాలా' కథలో ఐదేళ్ళ అల్లరిపిల్ల మినీ తండ్రి దగ్గర కూచుని 'మోకాళ్ళ మీద చేతులు చరుస్తూ 'కాళ్ళా గజ్జా' ఆడుకోసాగింది.' అంటున్నారు అనువాదకుడు. ఇది మన తెలుగింటి ఆడపిల్లలు ఆడుకునే ఆట. ఇట్లాంటి చేర్పులు మార్పులతో అనువాదానికి తెలుగుదనం అబ్బుతుంది. కథ చివరలో చాలా ఏళ్ళ ఎడబాటు తర్వాత కాబూలీవాలా తన ఊరు వెళ్ళి మినీ లాగే పెళ్ళీడు వచ్చిన సొంత బిడ్డను చూసి ఆనందించటం న్యాయమనుకుంటాడు రచయిత. మినీ పెళ్ళి ఖర్చు కోసం కేటాయించిన డబ్బులోంచి కొంత తీసి ఇస్తాడు. అనుకోని ఖర్చు మూలంగా పెళ్ళికి కరెంటు దీపాలంకరణ చేయించలేకపోతాడు. ఇక్కడ వెలుగవలసిన దీపాలు కాబూలీవాలా ఇంట్లో వెలుగుతాయన్నది ధ్వని. ఇదీ విశ్వకవి శిల్పం! 'గీతాంజలి'కి మార్మిక భక్తి ప్రాణ ప్రదమైతే, కథలకు వాస్తవికత పట్టుగొమ్మ. వీటి వస్తు శిల్పాలు ప్రత్యేకంగా చర్చనీయాంశాలు.
- అమ్మంగి వేణుగోపాల్, 9441054637