Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వనాథ ముప్పై కథలు రాసారని ఒక అవగాహన. వీటిలో వస్తు, శిల్ప వైవిధ్యాలు ఉన్నాయి. చక్కని అనుభూతి, అద్భుత భావన శక్తి, గాఢతలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.
'పరిపూర్తి' అనే కథలో రాధ అంధురాలు. తన బతుకు వధా. చావే శరణ్యమనుకుంది. సరిగ్గా ఆ సమయంలో చంద్రశేఖరరావు అనే యువకుడు, పట్టభద్రుడు, ధనవంతుడు ఆమె అన్నగారి స్నేహితుడు అమ్మాయి ఇంటికి వెళతాడు. ఆమెను చూస్తాడు. సంభాషిస్తాడు. అతనికి ఆమె పట్ల ఒక ఇష్టం ఏర్పడుతుంది. తన తల్లిదండ్రులకు తన మనస్సును తెలియపరచి, వారి అంగీకారంతో రాధను పెళ్లిచేసుకుంటాడు. రాధే కాక చుట్టుపక్కల వాళ్ళు ఇది ఆమెకు దక్కిన గొప్ప అదష్టంగా భావిస్తారు. అసూయ పడ్డవారూ లేకపోలేదు. చుట్టుపక్కల వాళ్ళు, ఊరంతా చంద్రశేఖరం అందగాడని అనటం విని, తను అంతటి అందగత్తె కాదన్న వాస్తవం స్ఫురణతో ఒక రకమైన ఆత్మ న్యూనతకు లోనవుతుంది. చంద్రశేఖరం ఎంతగా నచ్చచెప్పినా వినదు. సరిగ్గా అదే సమయంలో ఆమె గర్భిణి అవుతుంది. కొన్ని నెలలైన తరువాత ఒక మగ పిల్లవాణ్ని కంటుంది. ఒక సందర్భంలో రాధ భర్తను పిల్లవాడెలా ఉన్నాడని ప్రశ్నిస్తుంది. దానికామె భర్త మూడుమూర్తులా ఆమెలాగానే ఉన్నాడని, వాడి కళ్ళు ఆమె కళ్ళులా ఉన్నాయని అంటాడు. ఇది ఆమెకు అంతులేని ఆనందాన్నిస్తుంది. భగవంతుడు ఈ బిడ్డనివ్వటం ద్వారా తన లోపాన్ని సరిదిద్దినట్టుగా తోస్తుంది.
ఈ కథకున్న పీఠికలోనే ముఖ్య పాత్ర చంద్రశేఖరం స్థిర చిత్తాన్ని, మంచితనానికి అతనిచ్చే విలువను, అతని ఆదర్శ వైఖరిని విశ్వనాథ మనకు తేట చేస్తారు.
కొడుకు చక్కని వ్యక్తిత్వాన్ని హర్షించి గౌరవించే తల్లిదండ్రులు మనకు పరిచయమవుతారు. ఒక పల్లెటూరిలో స్నేహుతుణ్ణి కలిసి, అతని చెల్లెలి అందానికి ఆకర్షితుడవుతాడు. ఇది కేవలం ఆకర్షణ కాదు. ఒక అవగాహనతో, ఆలోచన పిదప ఏర్పడ్డ అభిప్రాయం. అతనికి సంకల్పానికి ధతి వుంది. అందుకే అతని తల్లిదండ్రులు అతని మనస్సు తెలుసుకుని, దాన్ని స్వాగతించారు. వివాహనంతరం ఆ దంపతుల మధ్య సాగిన సంభాషణలు అతని మానసిక పరిపక్వతను, తన శారీరక అవయవ లోపంతో మానసికంగా కుంగిపోయే భార్యను ఓదారుస్తూ సహనంతో ఆమెలో ఉత్సాహం నింపే ఓ అద్భుత మనస్తత్వ శాస్త్రవేత్తను చూస్తాం. భార్యాభర్తల మధ్య ఉండే శంగారాన్ని, ఎంత లలితంగా, హద్యంగా తగిన నిష్పత్తిలో విశ్వనాథ అద్భుత దశ్యమానం విస్మయమే. దంపతుల మధ్య ఉండవలసిన అవగాహన, ప్రేమ ఎంత చక్కగా, హుందాగా ఉండాలో ఈ చిన్ని కథలో చూపారు.
'నీ ఋణం తీర్చుకున్నా' కథ... ఇద్దరు ఆప్త మిత్రులు సూర్యనారాయణ, వేంకటేశ్వరరావు కుటుంబాల మధ్య ాగే ఓ అద్భుత కథ. వీరిలో వేంకటేశ్వరావు దంపతులకు ఒక మగపిల్లవాడు. వాడే కష్ణమూర్తి. సూర్యనారాయణకు పిల్లలు లేరు. ఇక కష్ణమూరి వీళ్లిటింట్లోనే. ఎంత ముద్దు చేస్తారో! వాడే వారి జీవితం . అలా ఆనందవాహినిలా సాగే వారి జీవితంలో ఓ అనూహ్యమైన సంఘటన. పిల్లవాడికి జబ్బు చేసి కన్నుమూస్తాడు. గుండెలవిసిపోయేలా ఏడుస్తారు సూర్యనారాయణ దంపతులు. వేంకటేశ్వరరావు, అనసూయలకు కబురు పంపుతారు. వాళ్ళు సూర్యాస్తామ యమవుతున్నా రాలేదు. ఊరి పెద్దలు, సూర్యనారాయణ బంధువులు ఆ లేతదేహాన్ని పారవేసి వస్తారు. మీనాక్షి ఊరి బయటదాకా బిగ్గరగా ఏడుస్తూ వెళుతుంది. సూర్య నారాయణ ఈ లోకంలోనే లేడు. వేంకటేశ్వరరావు రావటం తోనే ఆవురావురామని గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తాడు. ఇక మీనాక్షయితే అనసూయ కాళ్ళ మీద పడుతుంది. గుండెల్ని చీల్చే హదయవిదారక సన్నివేశం. చివరకు వెంకటేశ్వరరావు ఏడుస్తూ, ''నా బిడ్డను నేను చూడకుండా ఎందుకు పారేశావు. నువ్వెడవు. నా బిడ్డను పారేసేందుకు? నా బిడ్డడు...'' అంటూ కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నాడు. మత్యువు సైతం బావురుమనే దశ్యం. రెండు కుటుంబాల మధ్య ఓ స్మశాన నిశ్శబ్దం. రెండు సంవత్సరాలు కాల చక్రగతిలో కలసిపోయాయి. వేంకటేశ్వరరావు దంపతులకు ఒక ఆడబిడ్డ. ఆ శిశువు ఆలనాపాలనలో వారి శోకం సమసిపోయింది. మూడు సంవత్సరాల కాలం పట్టింది వేంకటే శ్వరరావు దంపతులకు తమ ఆప్త కుటుంబాన్ని పలుకరించేటందుకు. మనసు కుదురుకున్న వెంకటేశ్వరరావు తన మిత్రుడ్ని తన ఇంటిలోని ఒక భాగంలో ఉండేటట్లు చేసాడు. ఈలోపు మీనాక్షి తల్లికాబోతున్న వార్త . పుట్టిన పిల్లవాడు కషమూర్తి పోలికే. కష్ణావధానులని పేరు పెట్టారు. కానీ వాడిని పెంచే విషయంలో శ్రద్ధలేదు. వాడికి మూడేడ్ల వయస్సులో జబ్బు చేసి, విగతజీవుడవుతాడు. దేనికి చలించని సూర్య నారాయణ ఆ పసి దేహాన్ని పారవేయటానికి ఉద్యుక్తుడవుతుంటే, సూర్య నారాయణ ఏడుస్తూ, ఏదో స్ఫూరించినవాడై, ''...వేంకటేశ్వర రావు! తీసుకువెళ్ళు నాయన! నీ చేతులారా పారేసిరా! పిల్లవాణ్ణి గట్టిగా ఎదురురొమ్మున అదుముకో. గట్టిగా పట్టుకో! జారి పోతాడేమో సుమా ! నీ పిల్లవాడ్ని నేను దాచేసానా? ఇదిగో! వాడే వీడు నీ పిల్లవాడ్ని నీకిచ్చాను. నాయనా! నీ ఇష్టం. నీవు ఏం చేసుకుంటావో నీ ఋణం తీర్చుకున్నా? ప్రపంచం స్థాణువయ్యే దశ్యం కదూ! మనసుపొరల్లో ఘనీభవించిన దుఃఖం కరగి మాటల ఝరీపాతమైన సందర్భమది. ఎంతటి మనస్తత్వ చిత్రణ. గొప్ప కథకు ఇంతకన్నా ఉదాహరణ ఉంటుందా!! విశ్వకథా చక్రవర్తి, ఫ్రెంచి దేశస్తుడైన మపసా 'నెక్లెస్' కథకు తక్కువ కాని, రవ్వింత ఎక్కువుగా తోచే కథ విశ్వనాథ వారి 'నీ ఋణం తీర్చుకున్నా?'. విశ్వనాథ సత్యనారాయణ గారిని గొప్ప కథకుడిగా ఒప్పుకోవటానికి మనసొప్పని వారికి, తటాయించే వారికి ఈ కథ ఒక్కటి చాలదూ వారి కథా విరాట్రూపం అనుభూతిలోకి తెచ్చుకుని, అంగీకరించటానికి!
- బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు