Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిత్య చేతనంతో మెసిలే సీనియర్ రచయిత్రి, కవయిత్రి, విమర్శకురాలు జ్వలిత సాహితీ లోకానికి ఓ బృహద్గ్రంథాన్ని అందించారు. ఇటీవలే ఆవిష్కృతమైన ఈ గ్రంథం పేరు మల్లెసాల. అనాదిగా చేతివృత్తులే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న బహుజనుల కథలను సేకరించిన ఈ కథా సంపుటి ఒక వెయ్యి నూటా డెబ్భై రెండు పేజీలుగా రూపు సంతరించుకుంది. జ్వలిత సంపాదకురాలిగా వ్యవహరిస్తూ 139 మంది రచయితలను సమన్వయపరిచి ఈ సంకలనం తీసుకురావడం విశేషం. బహుజన రచయితలే సంకలనంలో పాల్పంచుకోవడం మరో విశేషం.
ఉత్పత్తి కులాలన్నింటినీ శూద్ర కులాలుగా పరిణామం చెందడం, ఆ శూద్ర కులాలే కులవృత్తులు కావడం, కుల వృత్తులకు పర్యాయపదంగా చేతివృత్తులు అనే మాట ఉనికిలోకి రావడం, ఆ తరువాత ఆధునిక ప్రజాస్వామ్యంలో అవికాస్తా వెనుకబడిన తరగతులుగా వర్గీకరణకు గురవడం, ఆ తరువాత బహుజనవాదం వైపుకు పయనించడం... ఇలా పరిణామక్రమం ఎంతో ఉంది. చేతి వృత్తులు పతనమవుతున్న తీరుతెన్నులు, జీవనపోరాటాలు వంటి ఎన్నో అంశాలను కథావస్తువులుగా మలిచి రచయితలు కథలను అందించారు. ఎన్నో ఏండ్లుగా కథలు రాస్తున్న సీనియర్ కథకులనుంచి ఇప్పుడిప్పుడే రాస్తున్న నూతన తరం వరకూ సంకలనం కాన్సెప్ట్ పట్ల సానుకూలత వ్యక్తం చేసిన వారందరి నుంచీ కథలు సేకరించారు జ్వలిత. స్వతహాగా ఉపాధ్యాయురాలు కావడంతో క్రమశిక్షణతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సఫలం చేయడంలో కృతకృత్యులయ్యారు.
వ్యవసాయం, పశుపోషణ, బీసీ, ఎస్సీ కులాల్లో తరతరాలుగా అవలంబించిన ఎన్నో వృత్తులు ఈ సంకలనంలో చోటు దక్కించుకున్నాయి. అంతరించిపోతూ నేటి తరానికి అసలే తెలియని చేనేత, కుమ్మరి, కమ్మరి, చాకలి వంటి వృత్తులకు చెందిన కథలు బహుచక్కగా ఇమిడిపోయాయి. ఇంకా దళితులు, దళిత ఆశ్రిత జాతులు, సంచార కులాలు, బీసీ ఆశ్రిత కులాలపై వచ్చిన ఏకైక సమగ్ర సంకలనం మల్లెసాల అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఈ గ్రంథానికి రాసిన ముందుమాటలో అభివర్ణించడం పుస్తకం వైవిష్ట్యాన్ని తెలియజేస్తుంది.
పల్లె పట్టులకు ప్రాణంపోసేవి చేతివృత్తులే అని తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక మహాకవి దాశరథి పురస్కార గ్రహీత, అభిన పోతన బిరుదాంకితులు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య తన ముందుమాటలో ప్రస్తావించారు. చెప్పులు కుట్టడం, ఇళ్లు నిర్మించడం, కమ్మరం, కుమ్మరం, వడ్రంగి, నగలు చేయటం, బట్టలు కుట్టడం, గీత గీయటం, బట్టలు ఉతకటం, క్షవరం చేయటం వంటి వృత్తులు అనేక రూపాలు సంతరిం చుకుని ఉనికిలో ఉన్నాయని ప్రస్తావిం చారు. వీటితో పాటు ఇప్పటికీ కొన్ని గ్రామాలలో బుట్టలు అల్లేవారూ కనిపిస్తున్నారని వాటిని సంరక్షించుకునే అవసరం ఎంతైనా ఉందని కర్తవ్యబోధ చేశారు.
నూటా ముప్ఫై తొమ్మిది మంది కథకులు రాసిన కథలు మనువాదంపై మందుపాతరలు అని గర్జించారు ప్రముఖ చారిత్రక పరిశోధకులు, వ్యాసకర్త, జర్నలిస్ట్ సంగిశెట్టి శ్రీనివాస్. వర్ణవ్యవస్థ పుట్టుకొచ్చిన నాటి నుంచి బ్రాహ్మణేతరుల స్థితిగతులను ప్రస్తావించిన ముందుమాట ఆలోచింపజేసేదిగా ఉంది. పీడన, పీడకులు, పీడితుల మధ్య తేడాలను సుస్పష్టంగా వర్ణించారు. అలాగే ప్రముఖ రచయిత, సామాజిక తత్వవేత్త, తెలంగాణ రాష్ట్ర తొలి బిసి కమీషన్ అధ్యక్షులు బి.ఎస్.రాములు తన ముందుమాటలో జ్వలిత ఎన్నో కథలను ఎక్కడెక్కడి నుంచో జల్లెడపట్టి తీసుకొచ్చారని, అయినప్పటికీ ఇంకా ఎందరో మిగిలే ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఇటువంటి సరికొత్త సంకలనాలు ఏటా తీసుకువస్తుంటే మిగతావారిని కలుపుకునే అవకాశం ఉంటుందని ఆకాంక్షంచారు.
కథల సమగ్రతపై ప్రముఖ రచయిత్రి, ప్రరవే జాతీయ కార్యదర్శి కాత్యాయనీ విద్మహే గుణాత్మక విశ్లేషణ చేశారు. తెలంగాణ ఉద్యమకర్త, సీనియర్ రచయిత్రి తిరునగరి దేవకీదేవి తన విశ్లేషణలో కథలను, చేతివృత్తులను ప్రస్తావిస్తూ వాటిలోకి పెట్టుబడిదారీ విధానం అడుగుపెట్టిన తీరు, ఆ తరువాత వచ్చిన మార్పులను చక్కగా విశ్లేషించారు. ప్రతి వ్యాసం దేనికదే ప్రత్యేకతను నిలుపు కుంటూ చేతి వృత్తులపై బిన్నకోణాలను ఆవిష్కరిస్తుంది.
మల్లెసాల అనే శతాధిక చేతివృత్తికారుల పుస్తకం తరతరాల జీవనసమరాన్ని చిత్రించిం దని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎస్.రఘు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చివరగా సంకలనం సంపాదకులు జ్వలిత రాసుకున్న తన మనసులో మాటను మల్లెసాల నుంచి మహాయాత్రగా మలిచారు. 139మంది కథకులలో 88 మంది రచయితలు, 51 మంది కథయిత్రులు ఉండడం అంటే 36.7శాతం మంది రచయిత్రులు సామాజిక స్థితి, వృత్తి చైతన్యంతో ఉన్నారని వివరించారు. కథల సేకరణ అనే బృహత్తర బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్న తీరును, అందులోని సాధకబాధకాలు, మల్లెసాల నామకరణం వెనుక ఉన్న కారణాలు తదితర అనేక విశేషాలను పుస్తకంలో వెల్లడించారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక గా నిలిచే ఈ పుస్తకం పాఠకులను ఉవ్విళ్లూరించే ఎన్నో అద్భుతమైన కథలతో కూడినది అని చెప్పవచ్చు.
- నస్రీన్ ఖాన్
9652432981