Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకాలపు ప్రపంచ ప్రఖ్యాత రంగస్థల స్రష్ట పీటర్ బ్రూక్ (97) ఈ నెల 2న పారిస్లో అస్తమించారు. 1925లో లండన్లో జన్మించిన ఈ విశ్వనాటక కర్తకు మన భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు బహూకరించిన విషయం విదితమే. మన ఇతిహాస కావ్యం మహాభారతాన్ని ఆయన పన్నెండు గంటల నాటక రాజంగా 1985లోనే మలిచాడు. ఇందుకోసం ఎనిమిదేండ్ల పాటు కఠోర శ్రమ చేసాడు. ఫ్రెంచ్ రచయితలు జాన్క్లాడ్ కారియేం, మేరి హెలియన్ల సహకారం తీసుకున్నాడు. సంస్కృత పండితుల్ని కలిసి కావ్య పరమార్థాన్ని అనుభూత సహితం గావించడానికి ఓ ప్రయోక్తగా అహర్నిశలు శ్రమించాడు.
ఆయన సారధ్యంలో పదహారు దేశాల నటీనట బృందం జాతి, మత, ప్రాంత, భాషావైషమ్యాలు అధిగమించి ఈ నాటక ప్రదర్శనలకు పాటు పడింది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు పర్యటించిన ఈ బృందం 1985లో ముంబై నగరానికి వచ్చి ప్రదర్శించింది. నలుపు తెలుపు చామనచాయ, గోధుమ వర్ణ దేహాలతో, నిరాడంబర ఆహార్యంతో ఓ అద్భుత దృశ్య కావ్యంగా కనువిందు చేసిన ఆ ప్రదర్శన ప్రేక్షకుల మదిలో సజీవంగా నిలిచిపోయింది.
మహాభారత స్థాయిని కుదించాడని, తత్వసారాన్ని తస్కరిస్తున్నాడని బ్రూక్పై నాడు చేసిన కువిమర్శలన్నీ పూర్వ పక్షం అయినాయి. కథానాయకి ద్రౌపది పాత్రలో మన భారతీయురాలు మల్లికా సారాబారు నటించడం మరో విశేషం.
'లోకంలో లేనిది భారతంలో లేదు. భారతంలో లేనిది లోకంలో కానరాదు' అన్న నానుడి అందరికీ తెలిసిందే. పండిత పామర నోట ఓ ధర్మశాస్త్రంగా విరాజిల్లింది మహాభారతం.
మానవ స్వభావాలు, స్పందనలు, అంతరంగాలు, ప్రవృత్తులు, భావోద్వేగాలు ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతం లోనైనా ఒక్కటిగానే ఉంటాయి. సభ్య నాగరిక ప్రాపంచిక సమాజం, సజావుగా సుఖ శాంతులతో జీవించాలంటే లౌక్యంతో కూడిన సామరస్య సహజీవనం అనివార్యమనే సత్యాన్ని 'మహాభారతం' బోధిస్తుంది. బహుశా ఈ సూత్రమే బ్రూక్ను ఆకర్షించి ఉంటుంది. కనుకనే ప్రపంచ యవనికపై ఓ తిరుగులేని ప్రపంచ కావ్యంగా మహాభారతాన్ని ఆవిష్కరించాడనేది విజ్ఞుల అభిప్రాయం.
'మానవ జీవితంలోని ఏ ఖాళీ స్థలాన్నైనా (ఎమ్టీ స్పేస్) నేను గ్రహించి రంగస్థల మాద్యమం ద్వారా దానికి పూరించడానికి ప్రయత్నిస్తాను. అందుకే దానిని నేను సమస్తం భరించే రంగస్థలంగా భావిస్తాను. ఒక మనిషి రంగస్థలంపై తనదైన ఖాళీ ప్రదేశంలో నటిస్తుంటాడు. ప్రేక్షకుడు అది గమని స్తుంటాడు. ఆ అంతరాన్ని సమర్థవంతంగా పూరించడమే అభినయం లేదా రంగస్థల కళాకారుని కర్తవ్యం అని విశదపరుస్తాడు బ్రూక్.
రంగస్థలంపై ఈ 'ఖాళీ స్థలం' సిద్ధాంతాన్ని 1968లో ఆయన ప్రతిపాదించాడు.
'బాహ్య పరిస్థితులను రంగస్థలంపై ప్రదర్శించినపుడు యథాతథంగా ఎప్పుడూ ప్రదర్శితం కావు. అంతిమంగా అంతరంగ చేతనే ప్రదర్శితమవుతుంది. అదే సమిష్టితత్వంగా రంగరించి వ్యక్తం అవుతుంది. ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. సమ్మోహితులను గావిస్తుంది. నైరూప్యంగా కూడా' అని రంగస్థల మార్మికశక్తిని అభివర్ణిస్తాడు.
షేక్స్ఫియర్ నాటకాలతో సహా ఎన్నో కావ్యాలను బ్రూక్ తనదైన శైలిలో దృశ్యబంధం చేశాడు. మానవ జీవిత లోతులను శోధించాలనే సత్యాన్వేషణ ఉంటుంది ఆ ప్రదర్శనల్లో.
12వ శతాబ్దానికి చెందిన ఓ పర్షియన్ కవిత ఆధారంగా 'విహంగ సదస్సు' అను నాటకాన్ని ఆఫ్రికాలో ప్రదర్శించినపుడు వారికది కొత్తగా, వింతగా అన్పించలేదు. వారి దైనందిన జీవితంలో భాగంగానే దానిని తిలకించారు. అదే ప్రేరణ 'మహాభారతం' నాటకానికి అని అప్పట్లో ఆయన తెలిపారు. రంగస్థలం విశ్వజనీనమేనన్న సత్యాన్ని ఆయన నిత్యం వక్కాణిస్తాడు.
మనుషులను అర్థం చేసుకోవడం అర్థవంతమైన జీవితం గడిపేలా మానవులను తీర్చిదిద్దడం రంగస్థలం బాధ్యతగా బ్రూక్ భావిస్తాడు.
భారతంలో ఓ ఘట్టం.. ఓ నిశ్చల తటాకంలో నీరు త్రాగేందుకు యక్షుడు, ధర్మరాజుకు అనుమతిస్తూనే ఓ ప్రశ్నను సంధిస్తాడు. 'ఈ ప్రపంచం మనగలగడానికి కారణం ఏమిటి?' అంటే - దోసిలితో నీరు 'పట్టి 'ప్రేమ' అని సమాధానమిస్తాడు. మనిషికి మనిషికి, ప్రాణికి ప్రాణికి, ఇంకా చెప్పాలంటే ప్రాణికి - ప్రకృతికి మధ్య నుండే బంధం ప్రేమ అని చెప్పకనే చెప్పింది ఈ ఘట్టం.
అమెరికా వియత్నాంపై యుద్ధ దాడులు జరిపిన అనంతరం మానవాళికి యుద్ధం అనివార్యం కాదు' అనే తత్వాన్ని తెలిపేందుకు మహాభారతాన్ని ఎంచుకున్నట్టు బ్రూక్ తెలిపాడు. యుద్ధాలు జరుగుతాయి. అమాయకులు అసహాయకులు బలైపోతారు. చాలామంది ప్రేక్షక పాత్ర వహిస్తారు. ఆ ప్రేక్షక పాత్ర సరైనదా? కాదా? అనే ప్రశ్న బ్రూక్ నాటకం చూసే ప్రేక్షకుల హృదయాలపై కూడా తారట్లాడుతుంది. అదే బ్రూక్ గొప్పతనం!
- కె.శాంతారావు 9959745723