Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ యక్షగాన రచయితలు, నాటకకారులలో చెప్పకోదగ్గవారు పనస హనుమద్ధాసు. జానపద కవి కూడా. సజీవమైన ప్రజలభాషలో జానపద కళా రూపాలైన యక్షగానాలను రాశారు. సరస శృంగార కోలాట కీర్తనలను రాశారు. భక్తిరస పూర్ణమైన భజన కీర్తనలను రాశారు. అద్భుతమైన తన గాన వాహినిలో సుమారు ఆరున్నర దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలను ఓలలాడించిన యక్షగాన సృజనశీలి పనస హనుమద్ధాసు.
హనుమద్ధాసు క్రీ.శ 1904 పిబ్రవరి 25న రామవ్వ - లక్ష్మయ్య దంపతులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా యెల్లారెడ్డిపేట మండలంలోని మానేరు ఒడ్డునగల సింగారం గ్రామంలో జన్మించారు.
వీరిది సామాన్య కుటుంబం. ఇమ్మడిశెట్టి గోత్రం. ఇంటిపేరు పనస. పనస వారు, రుంజువారు విశ్వబ్రాహ్మల పేరు చెప్పి తమ తెలివితేటలతో వారిని మెప్పించి యాచించి బతికేవారు. లక్ష్మయ్య కుటుంబం కొన్ని రోజులు నల్లగొండ జిల్లా భువనగిరి ముత్తారెడ్డి గూడెంలో జీవనం సాగించింది. హనుమద్ధాసు బాల్యంలో అనేక కష్టాలుపడ్డాడు.
హనుమద్ధాసు అబ్దుల్ కరీం దగ్గర చదువుకున్నారు. కరీంది బండలింగంపల్లి. హనుమద్ధాసుది సింగారం. ఈ రెండు ఊర్ల మధ్య రెండు కిలోమీటర్ల దూరం మానేరు వాగు పారుతుంది. హనుమద్ధాసు తండ్రి లక్ష్మయ్యకు కరీంకు మంచి స్నేహం. హనుమద్ధాసు కుటుంబం గురించి తెలుసు కావున కరీం ఒక్క రూపాయి తీసుకోకుండానే చదువు చెప్పాడు. మూడేండ్లు హనుమద్ధాసు నేర్చుకున్నాడు. పెద్ద బాలశిక్ష, గణితం, శతకాలు, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, వైద్యం నేర్చకున్నారు. అబ్దుల్ కరీం బంగారం పని, వెండిపని, కంచరి పని, వడ్లపని, చిత్రకారి పనులు నేర్చుకున్నాడు. రాత్రి వేళల్లో పురాణ పఠనం చేసేవారడు. హరికథా గానం చేసేవాడు. గురువు విద్యలు శిష్యుడు ఒంట పట్టించుకున్నాడు. అట్లాంటి ఆదర్శమూర్తికి ప్రియమైన శిష్యుడు హనుమద్ధాసు.
అప్పుడు వారి గ్రామంలో కోలల వెంకన్న కోలు నేర్పుతుండేవాడు. అప్పటికే భజన సమాజాల్లో హనుమద్ధాసు పాల్గొంటున్నాడు. గాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు. కోలల వెంకన్న వద్ద కోలు వేయడం నేర్చుకున్నాడు. కోలలు వేయడంలో తెలివి సాధించాడు. ఏకసంతాగ్రాహి కావడంతో గురువులు ఏం చెప్పినా వెంటనే పట్టేసేవాడు.
ఏకసంతాగ్రాహి కావడంతో పాండిత్యం సంపాదిం చాడు. ఆశువుగా కవిత్వం అల్లాడు. యక్ష గానాలను నేర్చుకుని నటుడయ్యాడు. కోలాట కీర్తనలను రాస్తూ ''రుక్మాంగద'' నాటకం రాసి బండలింగంపల్లి గ్రామానికి అంకితం చేశాడు. చోళభూపతి విశ్వకర్మ యక్షగానం రాసి ఎల్లారెడ్డిపేటకు అంకితం ఇచ్చాడు. కేవలం 20 ఏండ్ల వయస్సులోనే కోలల పంతులుగా యక్షగాన రచయితగా, నటునిగా, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పేరు సంపాదించారు.
కోలాటాలు, యక్షగానాలు నేర్పుతూ కామారెడ్డితో పాటు చుట్టుపక్కల ఊర్లకు వెళ్లాడు. పాండవారణ్య నాటకం రాసి ఉప్పలవాయి గ్రామానికి, మధుసేన నాటకం రాసి సదాశివ నగర్ ఊరుకు, శకుంతల నాటకం రామేశ్వరంపల్లికి బాలనాటకం మాణిక్ బండారు ఊరుకు, హనుమధ్రామ సంగ్రామం గోసాన్ పల్లికి అంకితమిచ్చాడు. 31 యక్షగాన నాటకాలును 25కు పైగా ఇతర రచనలను చేశారు. పాండవ అరణ్యవాసం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర మహత్మ్యం, అనసూయ, శ్రీ బాలరాజు, బొబ్బిలి, అల్లీరాణి పరిణయం, గుణసుంధరి, బలుగూరి కొండయ్య, చంద్రకాంత మహారాజు, శకుంతల యక్షగానం, కాంబోజరాజు చరిత్ర నాటకమే కాకుండా జానపద గేయాల పుస్తకాలు 5, భజన కీర్తనల పుస్తకాలు 5, బతుకమ్మ పాటలు 7, మంగళ హారతుల పుస్తకాలు 2 శతకాలు 3, కథ 1, జీవిత చరిత్ర వీలునామా 1, వైద్య గ్రంథం 1 మొత్తం 25 పుస్తకాలు రాశాడు.
హనమద్దాసు రచనలు చేసినప్పటికీని నాదేమి ఘనత లేదంటాడు. కవులకు నమస్కరించాడు. ఒక పద్యంలో ఇలా చెప్పాడు.
''కతి యొనర్చి రెండు వింశతులు వాణి
కరుణతోగాని నాదేమి ఘనతలేదు
తప్పులున్నను మన్నించి చెప్పరయ్య
కవికులనుజేతు నా నమస్కారమెప్పుడు''
ఈ విధంగా తనకు చాలా పేరు వచ్చిందనీ మరొక పద్యంలో చెప్పాడు.
రాగలక్షణమేమి రాదు ఈనాటికి
పాటకుండను పేరు ప్రభలమాయె
వైద్యశాస్త్రమేమి వల్లించకున్నను
ఘనవైద్యుడను పేరుగాంచినాను
ఛందో వ్యాకరణముల్ చదువను కావ్యాలు
కవియను ఘనతను గాంచినాను''
హనుమద్ధాసు స్వయంగానే సంగీత పరిజ్ఞానం సంపాదించాడు. ఆదితాళం, ఆట, ఏక, రూపక, జల్వ, త్రిపుట, జంపె తాళాలు, బైరవి రాగం, మోహనరాగంతో రచనలు చేశాడు. అలాగే మహాకీర్తిని పొందినప్పటికీ పేదరికం వెంటాడిందన్నాడు. అయినా కలిమి లేములు వస్తూ పోతుంటాయన్నాడు. వేదాంతాన్ని ఒక పద్యంలో చెప్పాడు.
''జనని గర్భము నుండి జననమొందిన నుండి
సుఖకాలమును జూడనైతి
చిన్నతనమునతల్లి నన్ను బెంచిననాడు
నిరుపేదతనముతో నిలిచినాము''
కురుక్షేత్రం నాటకంలో హనుమద్ధాసు సులభమైన పదాలతో చక్కగా పద్యాలు రాశాడు. శ్రీ కష్ణుడు రాయ భారానికి వెళ్లినప్పుడు ధర్మరాజు తన మనోగతాన్ని తెలుపుతున్న సందర్భంలో ఒక పద్యంలో ఇలా ఉంది.
''యేకంబుగా భూమి యేలుచునున్నట్టి
తల్లిదండ్రికి ప్రణమిల్లితనుము
వనవాస అజ్ఞాతవాసంబు గడిపియు
పడరాని యిడుములంబడితిమనుము
తనగౌరవము నిల్పి ధరణి పాలించిన
పాండుభూపతి పాలు పంచుమనుము
పరులబోధలు విని పాండవేయులతోడ
కయ్యంబు బూనంగ గాదటనుము
గానమాపాలుమాకివ్వఘనమటనుము
కోర్కెమీరంగ తమ్ముని కొడుకులనుము
ఐదుగురికైదు గ్రామంబులడిగితనుము
ప్రకటబలులము వేణుగోపాలవినుము
హనుమద్ధాసు వృత్త, జాతి, ఉపజాతులకు చెందిన ఛందస్సులో రాశాడు. అలాగే ఉపమ, రూపక, ఉత్ప్రేక్ష, శ్లేష, అర్థాంతర, అంత్యానుప్రాసం మొదలగు అనేక అలంకారాల నుపయోగించాడు. చాయి మీద దండకం రాశాడు.
అతనికి బాలనాగమ్మ నాటకమంటే అభిమానం. ఈ నాటకంలో ఫకీరు పాత్ర అంటే ఇష్టం. ఈ పాత్రను పోషించేటప్పుడు తనకు తెలిసిన టక్కులు టమారాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవాడు. ఆ కాలంలో మాదిగ చిందులు, దాసరులు, ఎర్రగొల్లలు, శారదకాండ్రు మొదలగువారు పెద్ద పెద్ద ఊర్లను కేంద్రాలుగా చేసుకుని నాటకాలు ఆడేవారు. ఆకాలంలో సురభినాటక కంపెనీ వారు కూడా నెలల తరబడి ఆడేవారు. ఆ స్ఫూర్తితో పెద్దపెద్ద గ్రామాల్లో హనుమద్ధాసు నాటక ప్రదర్శనలు చేయించేవాడు.
కోలల పంతులు నుంచి నటుడుగా, రచయితగా, ప్రయోక్తగా మారాడు. కోలల పంతులుగా ఎంతో మంది శిష్యులను తయారు చేశాడు. తాను స్వయంగా నటునిగా పాల్గొన్నాడు. ప్రదర్శనలిచ్చాడు. అనుకున్నది సాధించాలన్న మనస్తత్వం కలవాడు. నటనలో పట్టు సాధించాడు. పెద్ద చదువులు చదువకున్న వీధిబడిలో తన గురువు కరీంవద్ద నేర్చుకున్న కొద్దిపాటి చదువుతో తాను ప్రతిభకు పదునుపెట్టాడు.
హనుమద్ధాసు రాసిన నాటకాలు అటు కరీంనగర్ జిల్లా, ఇటు నిజమాద్ జిల్లా,మెదక్ జిల్లాలతోపాటు తెలుగు సమాజంలో ప్రదర్షించబడ్డాయి. ఈయనకు ఎక్కువ పేరు తెచ్చిన నాటకం బాలనాగమ్మ. తర్వాత హనుమధ్రామసంగ్రామం, బొబ్బిలి యుద్ధం, వెంకటేశ్వర మహాత్మ్యం పేరు తెచ్చిపెట్టాయి. ఇవి ఆనాడు ప్రదర్షింపబడని ఊర్లు లేవంటే ఆశ్చర్యం. బాలనాగమ్మ నాటకాన్ని పుస్తకరూపంలో చూసిన కొందరు సినీ ప్రముఖులు కారులో యెల్లారెడ్డిపల్లెకు వచ్చి హనుమద్ధాసును తమతో తీసుకెళ్లారనీ అంటారు. ఆ సినీ ప్రముఖులు హనమద్దాసుతో చేసుకున్న ఒప్పంద వివరాలు తెలియరాలేదు.
1984లో నిజమాబాదులో కోలాట ప్రదర్శన చేయిస్తుండగా వద్ధాప్యంలో ఉన్న హనుమద్ధాసు కార్యదీక్షను చూసిన నటరాజ రామకృష్ణ ప్రశంసించారు. తన పలుకుబడితో వత్తి కళాకారులకిచ్చే పెన్షన్ మంజూరు చేయించారు. హనుమద్ధాసు మరణించే వరకు పెన్షన్ పొందారు. పనస హనుమద్ధాసు ప్రతిభను, కళను, రచనాశక్తిని చూసిన చాట్ల నర్సయ్య, రచయిత, తెలుగు ఉపన్యాసకులు ''పనస హనుమద్ధాసు రచనలు- పరిశీలన'' అను అంశంపై ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ రుక్నోద్దీన్ పర్యవేక్షణలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆ తర్వాత పుస్తకాలు ప్రచురించి ఆవిష్కరించి హనుమద్ధాసు కళాకృషికి పట్టం కట్టారు. అలాగే ఆయన పుట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా, యెల్లారెడ్డిపేట మండలం, సింగారం గ్రామంలో రచయిత డాక్టర్ వాసరవేణి పర్శరాములు సూచనతో గ్రంథాలయంకు 'పనస హనుమద్ధాసు గ్రంథాలయం' అని గ్రామ ప్రజలు నామకరణం చేసి గౌరవించారు. తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు డా.వాసరవేణి పర్శరాములు హనుమద్ధాసు జయంతి, వర్ధంతి నిర్వహిస్తూ గౌరవిస్తున్నారు. సెమినార్ నిర్వహించారు.
హనమద్దాసుగారి జీవితంలో 65 ఏండ్లకు పైగా సాహిత్య, సాంస్కృతిక, నాటక రంగానికి సేవ చేశాడు. అదే సమయంలో వైద్యం చేశాడు. సమాజసేవలో తనవంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించారు. ఎనభై ఏండ్లకు పైగా సంపూర్ణ జీవితం గడిపిన హనుమద్ధాసు 1985 జనవరి 2న అయిలాపూర్లోని తన ఇంటిలో మరణించాడు. తెలంగాణలో చెర్వరాల భాగయ్య తర్వాత యక్షగానాలను రచించిన నాటక రచయితగా పేరుగాంచాడు. హనుమద్ధాసు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.
- వాసరవేణి పర్శరాములు
9492193437