Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యకాంక్షతో శత్రు రాజ్యాన్ని జయించే యుద్ధం కాదిది. ఈ యుద్ధం మెతుకు యుద్ధం బతుకు యుద్ధం కల్లుగీత యుద్ధం. దాపగత్తి మారగత్తి చలకత్తి, తాళ్ళని, నెర్సుకోల, కొయ్య, దోనిబల్ల, మోకుని భుజాన్నేసుకొని యుద్ధవీరుడిలా కల్లుగీత వృత్తిదారుడు పొద్దున్నే ఈదుల్లకు భయలు దేరుతడు. చెట్టునే నిచ్చెన చేసుకొని తొడలు కోసుకుపోయినా, బొట్టు కింద పోకుండా ఆకాశం నుంచి కల్లు కుండను దింపి మనకందించిన గొప్ప గీతా కావ్యకారుడు ఈ రాఘవేంద్ర.
గౌడ వృత్తిలో జన్మించిన ఈ రాఘవేంద్ర తన అనుభవాలను అక్షరాలుగా మదించి ఒక దీర్ఘకావ్యంగా అందించారు. ఈ కావ్యంలో కళ్ళముందు కదులాడే పదునైన వాక్యాలు,కంటతడి పెట్టించే వాక్యాలు , మనల్ని ఆలోచింపచేసే వాక్యాలు, పేదరికంపై ముసురుకున్న బాధల ఇతివృత్తాలు, లొట్టినిండా కల్లున్నా కుండల బువ్వలేని తీరులు, ఎక్సైజ్ పోలీసులు జరిపే దాడుల దాష్టికాలు ఒకటేమిటి ఎన్నెన్నో బతుకు చిత్రాల్ని ఒక దీర్ఘకావ్యంగా మలుచడం ఒక యుద్ధమే...
బతుకే ఒక యుద్ధమైతే బతుకు బాధలను కావ్యంగా మలుచడం యుద్ధమే... నేను ఆరు దీర్ఘకావ్యాలు రాసిన అనుభవంతో ఆ బాధతెలిసిన వాడిగా, నా వృత్తి మీద నేనొక దీర్ఘకావ్యం రాసిన అనుభవంతో వృత్తిమీద ఒక దీర్ఘకావ్యంగా రాయడానికి వచ్చే ప్రసవ వేదనంతా నాకు తెలుసు. ఒక దీర్ఘకావ్యం రాయాలంటే విత్తనమంత తపస్సు, చెట్టంత దీక్షలా బతుకు జీవదారల్ని సిరాచేసి ఒకొక్క కల్లుముంతలా ఒకొక్క వాక్యాన్ని తాటి ముంజల్లా ఈత పండ్ల గెలల్లా దీర్ఘ కావ్యంగా అందించారు.
పోశమ్మకైనా పోతరాజుకైనా ఏ దేవరకైనా కల్లుతో సాక పోస్తరు. దేవుడికైనా మనిషికైనా మర్యాద కల్లే ప్రదానం. కల్లు లేకపోతే కాళ్ళాడని పరిస్థితి. దేవర తలుపు తెరువని ఆందోళన. పగలే మబ్బులు కమ్మిన చీకటి పండుగలు పెండిళ్లు సావు పుట్టుకలలో పంచాయతీలు, సంతోషాలు, దుఖాలలో మనషితో మనిషి పంచుకునే దుఖాన్ని మరిచిపోవడానికి చేదు బాపుకుంటరు. మనిషిని గౌరవించాలంటే కల్లే ఒక ప్రదాన విందు. తాటిచెట్టు తల్లిలాంటిది ఈతచెట్టు ఇల్లు లాంటిదన్న ప్రతీతి! అన్న వాక్యమే సమాజం గౌడన్నల సంబంధాలని, ఊరిలో ప్రతి వత్తితో పెనేసుకున్న సందర్భాన్ని కవిత్వం చేశాడు. ఇందులో మనం మరిచిపోయిన పదాలెన్నో మనకు గుర్తుచేశాడు ఆ కమ్మని రుచుల పదాలు చూడండి.....
కల్లంగడి, పోతచెట్టు, ఈతచెట్టు, పరుపుతాడు, పండుతాడు, ఊడిగచెట్టు, కుంకుమచెట్టు, విషముష్టి చిల్లంచెట్టు, మసికట్టి, తీడుకోల, పిల్లబద్ద, కనికరాళ్లు, గుగ్గుళ్లు, శాకనా కమ్మని వత్తిపదబందాలెన్నో, తెలియని పదాలెన్నో ఈత గెలలా కావ్యంనిండా కాసినవి. ఇవన్నీ మనకు నిఘంటువులలో దొరుకవు. మన తరువాతి తరానికి ఈ పదాలన్ని తెలుపాల్సిన అవసరం ఉంది.
ఇన్నాళ్లు గౌడన్నలు వొంపిన కమ్మని కల్లును తాగారు. ఇప్పుడు ఒక గౌండ్ల బిడ్డ రాఘవేందర్ రాసిన కవిత్వాన్ని చదివితే కల్లు దాగినంత తప్తినియ్యడమే గాక కల్లుబొట్టులో దాగిన చెమటబొట్ల చేదుల్ని, పెత్తందారుల ఆగడాలు చెట్టు పన్ను,గీత పన్ను రుసుంలు, ఆబ్కారీ వేదింపులు కల్లమ్మే కష్టాలు మనకు సుర్రుమనిపిస్తయి. కల్లంచులబువ్వ అంటే కల్లు అమ్మితే వచ్చే పైసలే బువ్వగా మారుతది దానినే ''కల్లంచుల బువ్వ''అంటరని నేనుకుంటున్నాను. ఈ కావ్యం చదువుతూ పోతే అడవికి పోయి కట్టెల్ని కొట్టుకొచ్చినంత బాధలు, రైతు పంటను ఇంటికి తెచ్చినంత తండ్లాటలు, చెట్టు చెట్టెక్కి దిగి పురుగు బూసులను తప్పించుకొనొచ్చిన ఈతి బాధలెన్నో ఈ కావ్యం నిండా అల్లుకున్నవి. ఎంత మంచి కల్లుపోసినా నిండా తాగినంక కల్తీ కల్లంటరు గానీ, కల్తి విస్కీ అని ఎవరు అనరు అనలేరు. బ్రాందీ విస్కి పెట్టుబడిదారుడిది కల్లెమో పేద కార్మికునిది. ఇలాంటివెన్నో బాధలు మన గుండెల్ని పిండుతయి.
తాటిచెట్లు ఈతచెట్ల మద్యన అల్లుకుపోయిన గౌండ్ల జీవితాన్ని చక్కని డాక్యుమెంటరీలా రాఘవేందర్ అందించాడు. తాటికమ్మల చలువదనం ఈత జగ్గల వడిలో పెనేసుకున్న గాయాలను అక్షరీకరించిన కవిత్వ తీరు సంతోషదాయకం. అమ్మ నాన్న వెంకటలక్ష్మమ్మ, ఈడిగ కొండన్నలకు ఈ కావ్యాన్ని అంకితమిచ్చాడు.
తీడుకోలు పై నూరిన గీత కత్తిని నేను/పురిడిసిన తాడి రెక్కలకింద ఇమిడిన నా కవిత్వం/గాయపడిన గీత గుండెలపై నించి కోసుకొచ్చిన అక్షరాలు ''కల్లంచులబువ్వ''.
చెట్టుకల్లు ఎంతతాగినా మళ్ళీమళ్ళీ తాగాలనిపించినట్లుగా కల్లంచుల బువ్వ దీర్ఘకవిత ఎన్నిసార్లు చదివినా చదువాలనిపిస్తది. వృత్తి అనుభవంలోంచి వాస్తవికతను వివిధ భాగాలుగా 23 పార్శాల్ని సామాజిక తాత్వికతతో రాసిన గొప్ప కావ్యమిది. గౌండ్ల వృత్తి జీవితం మీద వచ్చిన కావ్యం. నాగన్న గౌడ్ దొప్పల్లో వొంపిన కల్లు తాగినట్లే వుంది. ఈ కావ్యంలో కవి తండ్రే కథానాయకుడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ కల్లుబొట్టును జారిపోనివ్వకుండా వొడిసి పట్టుకొన్నట్లు ఏ భాధను మరిచిపోకుండా ముంతలోని కల్లులా కవిత్వీకరించిన తీరు గొప్పగా ఉంది.
ఊరంతా
చప్పుడు
చెయని గువ్వే
మెలకువ రెక్కలు తెరువకముందే
కళ్లలోని నిద్రను తుడిచి
కడుపు సంచిలో ఉత్తపేగుల్ని తడుముతూ
ఈదుల్ని దారితాడుతో చేదుకుంటూ
యింటినుండి మొదలైతుంది
మా నాయన పయనం.
ఉదయాన్ని ఎంత అందంగా ఆవిష్కరించాడో చూడండి. ఊరంత నిద్రలోనే కనురెక్కలు తెరుచుకోకముందే వృత్తి ఎట్లా పొద్దెక్కుతదో బతుకు దెరువు యాతనను మన కళ్లకు కట్టినట్లుగా చూయించాడు.
నస్కుల్లనే గౌండ్లు ఈదుల్లకు పోతరు మనం లేసి కండ్లు నల్చుతుంటే పాలకుండల్లా ఎదురొస్తయి. చెట్టు చెట్టును పారిడి ఆకాశాన్కి ఎగబాకి కల్లుగీయడమంటే అదోక పెద్ద సాహాసమే. కుమ్మరి వామిలోని మట్టిని/కండ్లకద్దుకొని/తొట్టి లొట్టి ముంతల్ని/ చేతబట్టి నడిచొస్తుంటే/ కుమ్మరి కిష్టయ్య బిడ్డల్ని/ అత్తగారింటికి పంపినట్లుండేది/ పాతవన్ని విరమణపొంది/ కొత్తవాటికీ స్వాగతం పలుకుతారు/ ఇంటికొచ్చిన మర్నాడే నడుంవంచి/ మా పనిలో భాగమైతరు
బహూజన దృక్పథంతో సాగిన ఈ కవితలో బీసిల అస్తిత్వ గోసలేన్నో ఉన్నాయి. కుమ్మరి వృత్తిని తలుచుకోవడమంటే మన మూలాల్ని వెతికీ గౌరవించడం నిజంగా అభినందనీయం. తాను కుండల్ని ఇచ్చిన విధానాన్ని అత్తారింటికి పంపినట్లుండేది అనడం ఎంత ఆర్ధ్రతతో రాసిండో మనకు అర్థమైతది. ఇవ్వాళ కుమ్మరులు ఇంటింటికి కూరాడై నీళ్లపేరుపై వాకిట్ల గోళమై పెళ్లిళ్లలో అవిరేను నల్లకుండలై ప్రతి ఇంటికి కుమ్మరోల్లతో సంబంధం ఉంది. అందులో బాగంగా గీత వత్తి దారులకు కల్లుకు ముంతలై, లొట్లై, పటువలై, గీత వత్తికీ కుమ్మరి వత్తికీ విడదీయలేని సంబంధాన్ని అనుబంధాన్ని మానవ సంబంధాలను ఎంతో మాధుర్యంగా ఆవిష్కరించారు.
కావ్యం చివరలో కులవిద్యలన్నీ/ మా తాతలు ఏలిన కథలు/ మా నాయిన నడిచిన బాటలు/ నేను చెప్పుకోవడానికి మిగిలినవి కొన్ని మాటలు/ మరి/ నా బిడ్డలకు?.. ఈ వాక్యాలు చాలు గీత వత్తిదారులు సామాజికంగా రాజకీయంగా ఎంత వెనుకబడ్డారో.. మనకు అర్థమవుతవి.
రాజు కథని రాజ్య వైభవాన్ని గాదు, బండికి ఇరుసులా రాజ్యం వెలుగుకు దీపాల వొత్తులైన సామాన్యుల జీవితాలను కవితలను కథలను నవలలను మరెన్నింటినో ఆవిష్కరించాల్సిందే....
మంచి కావ్యాన్ని అందించిన కవి ఈ. రాఘవేంద్రకు నమస్కారాలు.
- వనపట్ల సుబ్బయ్య
9492765358